ఎందుకెళిపోయేవు బాబూ?

ఎన్ని చావు వార్తలని వింటాం? ఎన్ని మరణ దుఃఖాలను భరిస్తాం? ఆశయాలకోసం కొందరు, అర్థంతరంగా మరికొందరు! బతికి ఉండటమే తప్పయిపోయిందనుకునేలా ఎందుకయ్యా మమ్మల్నిలా ఏడిపిస్తారు?

‘ఇదేలే తరతరాల చరితం.. జ్వలించే జీవితాల కథనం…’ సెల్‌ మోగుతోంది. ‘బాబు ఎన్‌టీవీ’ అని రాసుకున్న ‘కాంటాక్ట్‌’ పేరు కనిపిస్తోంది. ‘బాబూ, బావున్నావా, ఏవిటి చాలా రోజుల తర్వాత ఫోను…’ నా వాగుడు నాదే. ‘నేను బాబును కాదండీ. వాళ్ల తమ్ముణ్ని. బాబు పోయాడండీ… ఊపిరితిత్తుల సమస్య…’
ఆదివారం ఉదయం కార్పెట్‌ మీద కులాసాగా కూచుని పేపర్లన్నీ చదువుతున్నవేళ వినవలసిందీ వార్తనేనా?

‘రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిదివేల మందిని వడపోసి మీ ఎనభైమందినీ బ్యాచ్‌లోకి తీసుకున్నాం’ ఒక దినపత్రిక అధిపతి తొలిరోజు మాకు చెబుతున్నప్పుడు మా నూటరవై కళ్లలో కోటి వెలుగులు. ప్రపంచం మా నూటరవై పాదాల కిందే ఉందన్నంత పొగరు. బిల్‌ క్లింటన్‌ అంటే వాడెవడు గాడిదగుడ్డు అనుకునే జ్ఞానమైన అజ్ఞానం. ‘సుంక రి బాబు, మాది వరంగల్‌ జిల్లా, ఇల్లంద గ్రామం’ అలా బాబు పరిచయం. నాకు బ్యాక్‌బెంచీ సావాసగాడు. ప్రాణస్నేహితుడని చెప్పనుగానీ ఎప్పటికప్పుడు మనసు విప్పి మాట్లాడుకునేవాళ్లం. ‘బాగా పర్ఫామ్‌ చెయ్యటం లేదని నిన్ను, నన్నూ సుదర్శన్నీ బ్యాచ్‌నుంచి తీసేస్తారట’ అన్న వార్త నవ్వుతూ ఎగురుకుంటూ వచ్చి చెప్పినవాడు. ఊరికి దూరంగా ఉన్న జర్నలిజం స్కూలుకు వెళ్లొచ్చేటప్పుడు బస్సులో ఒక సీటు అవతలో ఇవతలో అతని సీటు. శీతకాలం రాత్రి తొందరగా ముసురుకునే వేళ ఉన్న ఊపిరంతా గొంతులో నింపుకుని వరంగల్‌ జిల్లా జానపదాలు పాడేవాడు. దొరికిన బల్ల మీద తాళంగా దరువెయ్యడానికి ఎ. శ్రీనివాస్‌ ఉన్నాడుగా. కార్తీక పున్నమి వెన్నెలలో బాబు ‘మైదాకు సేతుల మావకూతురా…’ అని పాడుతుంటే పల్లెటూళ్లో బావిగట్టునే ఉన్న అనుభూతి కలిగేది. ‘అంత శ్రీకాకుళం నుంచి వచ్చి ఒక్క జానపదమన్నా రాదా నీకు’ అని ఎకసెక్కం చేస్తూనే ‘బండెనక బండిగట్టి…’ పాట నేర్పించాడు నాకు. ‘నేనే బాబుని, నాకు ఇప్పుడే పిల్లలెందు’కన్న సుంకరి బాబూ, తెలంగాణా – ఆంధ్రాలింకా విడిపోలేదు కదా, నువ్వప్పుడే మానుంచి ఎందుకు వెళిపోయేవూ?
విడిపోయి ఏడెనిమిదేళ్లు గడుస్తుంటే బాబును గుర్తుచేసుకోవడమూ కష్టమే. ‘నచ్చిన పుస్తకం గురించి చెప్పమంటే ‘నేనూ చీకటి’ అంటూ ఎంతసేపయినా మాట్లాడేవాడు కదండీ, అతనేగా’ అంటాడు అక్బర్‌ఖాన్‌. ‘వెరీ సేడ్‌’ అంటాడు సురేష్‌. ‘నామీదేమైనా కోపం ఉండేదా’ అని స్వాతి అనుమానం. ‘మనం వెళ్లేపాటికి అంతా అయిపోతుందేమో’ సుదర్శన్‌ డోలాయమానం. ‘బక్కగా ఉండేవాడు, సిగరెట్టు కాల్చేవాడు, టీబీ ఉందట, మందులవీ సరిగా తీసుకోలేదట’ మరికొందరి జ్ఞాపకం.
మృత్యువు కూడా ఒక దేవతట. ఆమె కూడా ఒక మాతృమూర్తి అట. బిడ్డలను తన దగ్గరకు ఎప్పుడు పిలిపించుకోవాలో, ఎప్పుడు తన ఒడిలోకి చేర్చుకోవాలో ఆమెకి బాగా తెలుసట. అందుకే ‘నాకు చావు రాదేమీ’ అని కోరుకున్నంత మాత్రాన రాదట. ఆవిడ కరుణించినప్పుడే వస్తుందట. ఎక్కడో చదివాను. రచయిత కల్పనకు ఆహా అనుకున్నాను. అయితే తల్లీ, మృత్యుదేవతా, మా బాబు నీకిప్పుడే ఎందుకు ముద్దొచ్చాడమ్మా? ఇంత త్వరగా అతణ్ని నీ సాన్నిధ్యానికి ఎందుకు పిలిపించావమ్మా? మూడు రోజుల ముందు అతనికి పుట్టిన పసిగుడ్డు నీకు కన్పించలేదా తల్లీ? ‘నాన్నా’ అని పిలవడం కాదుగదా, కళ్లు తెరిచి ఇంకా నాన్నను చూడకముందే పితృవియోగాన్ని ఎందుకు కల్పించావు దేవీ? ఇంకా పేరయినా పెట్టని ఆ బిడ్డకు నాన్న అని ఎవర్ని చూపించాలి? బిడ్డలను ఒళ్లోకి తీసుకోవడం నీకు తెలుసు, బావుంది. మరి ఇంకా పురిటి మంచమే దిగని ఆ పచ్చి బాలెంతరాలికి మగడి మృత్యువార్తను చేరవెయ్యడం ఎలాగో నీకు తెలుసునా?

రింగురింగుల పొగలాగా కంటికి కనిపించకుండా మనసును ఆవరించుకుంటున్న దిగులును మౌనంగా భరించడం తప్ప మేమేం చెయ్యగలం బాబూ? సిగరెట్‌… యూ బ్లడీ రాస్కెల్‌… ఐ హేట్‌ యూ! నువ్వు తగలబడుతూ ఇంతమందిని తగలబెడతావా? ఇదే నా శాపనార్థం, ఇదే నా హృదయపూర్వకమైన కోరిక. నువ్వు చచ్చిపో. చచ్చిపో.

4 thoughts on “ఎందుకెళిపోయేవు బాబూ?

  1. “సిగరెట్‌… యూ బ్లడీ రాస్కెల్‌… ఐ హేట్‌ యూ! నువ్వు తగలబడుతూ ఇంతమందిని తగలబెడతావా? ఇదే నా శాపనార్థం, ఇదే నా హృదయపూర్వకమైన కోరిక. నువ్వు చచ్చిపో. చచ్చిపో.”

    సిగరెట్ ……… నీతో పాటు తాగుడు , జూదం మిగతా అన్ని దురలవాట్లనూ నీకు తోడుగా తీసుకుని మరి చచ్చిపో…

    అరుణగారు హృదయం చెమ్మగిలింది. కంట నీరు తెప్పించారు.

  2. కల్పనగారూ, మీ అభిమానానికి ధన్యవాదాలు. వర్డ్ ప్రెస్ లో వ్యాఖ్యాతల ఐపీలు, ప్రదేశాలు తెలుస్తాయని ఇందులోకి మారానండీ. బ్లాగ్ స్పాటులో అటువంటి సౌకర్యం లేనందున చాలా ఇబ్బందులు పడ్డాను. మీకు తెలియనిదేముంది? పత్రికలో రాతలను భద్రపరుచుకోవడానికి ఒక మాధ్యమం కావాలి కూడాను.

  3. బావుంది మీ కొత్త బ్లాగు. మీ శైలి కూడా చిక్కపడుతోంది.
    సిగరెట్లు కాల్చినన్నాళ్ళూ ఎప్పుడో ఒకప్పుడు చావక తప్పదుకదా అనుకొనేవాడిని – అదెలానూ తప్పదు. కానీ, నీరసంగా, ఊపిరితిత్తుల్లో గాలాడక, ఆకలి సగం చచ్చి, అనారోగ్యంతో మాత్రం బతకనక్కరలేదు. మానగలిగేవాళ్లందరూ మానడమే అన్నిరకాల మంచిది.

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s