పారిస్‌లో ఒక కథ

‘ఈ నిశ్శబ్దాన్ని భరించలేను. ఏదైనా మాట్లాడు. దేనిగురించైనా సరే’ ఆమె అభ్యర్థనగా అడిగింది.
‘ఒక్క నిమిషం’
కొద్ది సేపు కణవ్‌ చేతిని తన చేతి మీద ఉండనిచ్చింది సాధవి. అది చాలా మృదువుగా ఉంది, అలాగే దృఢంగా కూడా. ఎందుకో ఆమె భరించలేకపోయింది. ‘నీకిది తగదు, నన్ను బలహీనపరచకు…’ అనే మాటలు ఆమె లోపల్లోపలే తిరిగాయి. వాటిని బైటికి అనలేదు. తన హ్యాండ్‌బ్యాగ్‌లోంచి టిష్యూ పేపర్‌ తీసుకోవాలన్న వంకతో ఆమె తన చేతిని నెమ్మదిగా వెనక్కి తీసుకుంది. తిరస్కారానికి గురయినట్టు అతను దెబ్బతిన్నట్టుగా చూశాడు.  ఆమె ముడుచుకుపోయింది. వాళ్లిద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. వాళ్లు కూచున్న చోటి నుంచి మెయిలోల్‌ శిల్పాలు కనిపిస్తున్నాయి. ఎడంవైపున్న బాతర్‌ శిల్పాన్ని చూస్తున్నారు. ఒక జపాన్‌ పర్యాటకుణ్ని అతని స్నేహితుడు ఫోటో తీస్తున్నాడు. ఆ స్త్రీ శిల్పం మీద ఎండ వెలుగు ప్రసరిస్తోంది. ఏదో తన లోకంలో తాను కలలు కంటున్నట్టున్న ఆ శిల్పం అందంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. మెయిలోల్‌ శిల్పాల్లో ఇది సాధవికెంతో నచ్చింది. తల కొద్దిగా వంచి ఎడం పక్కకు కొంచెం ఒరిగిన ఆమె తన ముందున్న దేన్నో తదేకంగా చూస్తోంది. మెయిలోల్‌ శిల్పాలకు పక్కగా గడ్డిలో ఓ యువకుడు పుస్తకాన్ని బైటికే చదువుతూ కూచున్నాడు. అతని కోలమొహం ఆకర్షణీయంగా ఉంది. అతని వీపు సంచీ అక్కడ పడేసినట్టుంది, అందులోని రాత సామగ్రి కూడా అతని చుట్టూ చిందరవందరగా ఉంది. చదువుతున్నప్పుడు అతను ఒకటిరెండుసార్లు తనలో తనే నవ్వుకున్నాడు. సాధవి అతనివైపు ఆసక్తిగా ఆలోచనతో చూసింది. కణవ్‌ ఆమె చూపును అనుసరించాడు.
‘ఏమాలోచిస్తున్నావు’ కణవ్‌ తన మామూలు స్వరంతో అడిగాడు ఆమెని.
‘ఆ కుర్రాడు ఏం చదువుతున్నాడో, అందులో అతనికేం నచ్చిందోనని’
‘వెళ్లి అడుగు…’ అల్లరిగా అన్నాడు కణవ్‌.
‘లేదు’ అంటూనే అతనివైపు తిరిగి ‘కుమారస్వామి, రెన్‌ గుయ్‌నన్‌ గురించి ఎందుకు పరిశోధిస్తున్నావో నాకెప్పుడూ నువ్వు చెప్పలేదు’ అంది సాధవి సీరియస్‌గా.
‘అదా. ఏవుందీ.. కుమారస్వామి రాసిన ద డ్యాన్స్‌ ఆఫ్‌ శివ పుస్తకం చదివాను. అందులోని రెండు వ్యాసాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అప్పుడే ఈ ఫ్రెంచ్‌ మెటాఫిజీషియన్‌తో ఆయనకున్న పరిచయం గురించి తెలిసింది. వాళ్లెప్పుడూ కలుసుకోలేదుగానీ ఉత్తరాలు రాసుకునేవారు. వాళ్లిద్దరూ ఒక ప్రత్యేకమైన ఫిలాసఫీకి చెందినవాళ్లు కనుక దానిగురించి కూడా నాకు ఆసక్తి ఉంది. ఎన్నో మార్పులు, వివాదాలు, భావోద్వేగాలు, నమ్మకాల్లో అభిప్రాయభేదాలు.. ఇన్ని నిండిన ప్రపంచంలో వాళ్లను చదవడం నాకు సంతృప్తినిచ్చేది. నాకు ఫ్రాన్స్‌ అంటే ఇష్టం. ఈ ప్రాజెక్ట్‌వల్ల నేను ఎక్కువకాలం పారిస్‌లో గడపగలుగుతాను. పైగా ఇక్కడ గుయ్‌నన్‌, కుమారస్వాముల గురించి పరిశోధనలు చేసినవాళ్లున్నారు. వాళ్లతో మాట్లాడగలను. నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా?’
‘దొరికింది’
నేరుగా ఆమెనే చూస్తూ ‘ఇప్పుడు నాదో ప్రశ్న’ అన్నాడు కణవ్‌. ‘మీ వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం కలిగించుకుంటున్నానని అనుకోకపోతే, నువ్వూ రాఘవ్‌ ఎక్కడ ఎలా కలిశారో తెలుసుకోవాలని ఉంది..’
‘అదా. హైదరాబాద్‌లో ఇద్దరికీ తెలిసిన స్నేహితుల ఇంట్లో కలిశాం. రాఘవ్‌  కుటుంబం చెన్నైనుంచి అక్కడకు వచ్చారు. ఆ సాయంత్రం నేనూ అతనూ చాలా సరదాగా మాట్లాడుకున్నాం. అతనక్కడ పది రోజులున్నాడు. మావాళ్లిల్లు అక్కడికి దగ్గరే కనుక ఏదో ఒక కారణంతో అతను ప్రతి రోజూ మా ఇంటికొచ్చేవాడు. చాలా శ్రద్ధ ఉన్నవాడు, సరదా మనిషి. నేను అతన్ని ఇష్టపడేదాన్ని. తర్వాత అతనికి మెదక్‌ జిల్లాలో పోస్టింగ్‌. కాస్త ఖాళీ దొరికినప్పుడల్లా నన్ను చూడటానికి వచ్చేవాడు. ఏడాది పరిచయం తర్వాత చివరికి ఒకరోజు అతను పెళ్లి ప్రతిపాదన తెచ్చేసరికి నేను వెంటనే ఒప్పేసుకున్నాను. నేను ఉత్తరప్రదేశ్‌ బ్రాహ్మణుల అమ్మాయిని అయినా రాఘవ్‌ వాళ్లింట్లో పెద్దగా అభ్యంతరపెట్టలేదు. వాళ్లు ఉత్తరాదిన చాలా కాలం ఉండొచ్చినవాళ్లే. అందుకని’ అంటూ ఆమె సాలోచనగా చూసింది. ‘చాలా, నీ ప్రశ్నకు సమాధానం దొరికినట్టేనా’ అంది.
‘ప్రేమపూర్వక స్నేహం అన్నమాట. ప్రేమవ్యవహారం కాదు. అలా అనుకోవచ్చా?’ అడుగుతూ నవ్వాడతను.
‘నిజంగా నీకు దీనికి సమాధానం కావాలా? నే చెప్పేతీరాలా’
‘లేదు’
‘నేను నిన్నొకటి అడగొచ్చా’
‘పర్లేదనిపించే ప్రశ్న అయితే అడుగు’ అన్నాడతను నవ్వుతూ.
‘కణవ్‌, నీ వివాహబంధం చెడిపోయిందని నాకు తెలుసు. నువ్వు మరో బంధం కోసం చూస్తున్నావనీ తెలుసు. కానీ పెళ్లి గురించి నువ్వేమనుకుంటున్నావో తెలుసుకోవాలనిపిస్తోంది..’ అంది సాధవి అతని మొహంలోకి చూస్తూ , ధైర్యంగా.
ఆమె సరదాగా అడగలేదని అర్థమయింది. ‘విచ్ఛిన్నమైపోయిన చాలా వివాహబంధాల్ని నేను చూశాను. అందుకే  నాకు అసలు పెళ్లంటే నమ్మకం లేదు. బలంగా పాతుకుపోయి అదో సిద్ధాంతంగా చెలామణీ అయిపోయే వ్యవస్థలంటే నాకు ఇష్టం ఉండదు. అవి ఎదుగుదలనూ మార్పునూ అడ్డుకుంటాయి..’
‘కానీ అలా పటిష్టంగా ఉండేవే సమాజానికి స్థిరత్వాన్నిస్తాయి. పెళ్లి భద్రతనూ స్థిరత్వాన్నీ ఇస్తుంది.’
‘కావొచ్చు. నా విషయంలో కాదు. ఒక నిర్జీవమైన రొటీన్‌లో పడిపోవడం, దాన్నుంచి వచ్చే మొనాటనీ అంటే నాకు భయం. ఏదో సౌలభ్యం కోసం ఇద్దరు మనుషులు బతుకీడ్చటం అంటే చిరాకు. లేదా ఇద్దరూ ఒకరికొకరు బాగా అలవాటు పడిపోయి, ఆ రొటీన్ని ఇబ్బంది పెట్టేవేవీ రాకుండా చూసుకోవడం అన్నా చిరాకే.’
‘కానీ అది ఏ బంధంలోనైనా జరగొచ్చు. వైవాహిక బంధమే కానవసరం లేదు. బంధాన్ని జాగ్రత్తగా నిలుపుకోవడానికి శ్రద్ధ పెట్టాలి’ అందామె సీరియస్‌గా, అతనివైపు కాస్త అయోమయంగా చూస్తూ.
‘నిజమే. పెళ్లంటేనే ఎక్కువ బాధ్యత. కుటుంబం, పిల్లలు, బంధువులు… చివరికి మనిషికి తనదైన సమయం, చోటూ ఉండవు’
‘ఇది చాలా స్వార్థంగా అనిపిస్తోంది’
‘అవును – కాదు. నాకు పాఠాలు చెప్పడం, చదవడం, రాయడం, నా పరిశోధన అంటే ఇష్టం. మరోసారి పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. నా సమయం, స్పేస్‌ను హరించే దేనికీ రెడీగా లేను. ఒక మహిళతో బంధం వరకూ మంచిదే. అదెప్పుడు జరిగితే అప్పుడే జరగనీ. భవిష్యత్తులో ఎప్పుడో అలాంటి బంధం ఏర్పడితే ఎలా ఉంటుంది, దాని పర్యవసానాలు ఏమిటన్నది ఆలోచించటం లేదు. దానికన్నా మనిషిగా ఎదగడమే ముఖ్యం..’
‘ఇలాంటి బంధాల్లో చాలా అనిశ్చితి, అభద్రత, బాధ ఉంటాయి…’
‘అది దేనిలోనయినా ఉండొచ్చు. వైవాహిక బంధంలో కూడా భాగస్వామి మన అంచనాలకు తగినట్టు లేకపోతేనో, మోసం చేస్తేనో బాధ కలుగుతుంది. ఏమంటావు’
————————

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్‌ పట్టభద్రురాలయిన ప్రీతి ఐసోల తొలి నవల ‘సీ పారిస్‌ ఫర్‌ మీ’. ఫ్రాన్స్‌, ఐవరీకోస్ట్‌, సిరియా, హంగరీ వంటి దేశాలు తిరిగిన రచయిత్రి అనుభవం నవలలో ప్రతిఫలిస్తూ దీన్ని తొలి రచనగా అనిపించనివ్వదు.  ఈ నెలే విడుదలయిన ఈ పుస్తకం చదువ రులను ఆకట్టుకుంటోంది. దాని నుంచి కొంత భాగం అనువాదం ఇది.

పుస్తకం గురించి :

‘సీ ద పారిస్‌ ఫర్‌ మీ’ నవల ఇతివృత్తం – సాధవి అనే వివాహిత పారిస్‌లో కలిసిన పరిశోధకుడు కణవ్‌ వైపు ఆకర్షితం కావడం. సంప్రదాయంగా పెరిగి బాగా చదువుకున్న తెలివయిన మహిళ సాధవి. ఒక వ్యక్తిగా తనను పరిపూర్ణం చేసేవాటి గురించి పారిస్‌ వచ్చేవరకూ ఆమె ఆలోచించనేలేదు. పరిచయమైన  ప్రదేశాల నుంచి దూరంగా వచ్చేశాక, ఆ ఆలోచనలో ఉన్న సాధవికి కణవ్‌తో అయిన పరిచయం ఏ మలుపులు తిరిగిందన్నదే కథాంశం. వర్ణనలతో పారిస్‌ను కళ్లకు కట్టినట్టు చూపించే ఈ నవల సింపుల్‌ ఇంగ్లిష్‌లో సాఫీగా చదివిస్తుంది.

పెంగ్విన్‌ ప్రచురణ
పేజీలు : 290, ధర : రూ. 299.

Advertisements

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s