మళ్లీ ఎలా చూస్తాను?

బంధుత్వాలూ, పరిచయాలూ, పేగుపాశాలూ, మూలాలూ ఇంకా ఎట్సెట్రాలన్నీ   పక్కనపెట్టి మాట్లాడుకుందామనుకుంటే – అవడానికి నేనొక పిల్ల జర్నలిస్టును… ఆవిడేమో డెబ్భై దాటిన ఓ పెద్దావిడ. పేరంటారా, గంటి సుభద్రమ్మ. చదువూరాతా రాకుండా, కేవలం ప్రభుత్వ లెక్కల్లో అక్షరాస్యుల సంఖ్య పెంచడానికి మాత్ర ం ఒట్టి సంతకాన్ని నేర్చుకున్న వేలమంది గ్రామీణుల్లో ఆమె కూడా ఒకరయినందున ఏ పోస్టాఫీసులోనే పెట్టవల్సినప్పుడు ‘జి. సుద్రభమ్మ’ అని రాసి, నా వంటి పిల్లలం వేళాకోళంగా నవ్వినప్పుడు ‘అలా రాసేనంటావా, అలాగే నేర్చుకున్నానో ఏవిటో’ అంటూ తను కూడా చల్లగా నవ్విన ఆమె రూపం నా కళ్లలో అపురూపంగా అలాగే నిలిచి ఉంది. ముందు చెప్పినవన్నీ లెక్కలోకి తీసుకుంటే ఆమె నాకు అమ్మమ్మ మరి.
అలాంటి ‘అమ్మమ్మ పోయింద’ని తప్ప ఎవరికైనా ఏం చెప్పగలను? పుట్టిన పిల్లలందరికీ అమ్మమ్మలుంటారు, ఎక్కడోతప్ప సాధారణంగా ఏ అమ్మమ్మయినా మనవలను ముద్దుగా చూస్తుంది. మరి మా అమ్మమ్మ ప్రత్యేకత ఏమిటి? చిన్నప్పుడు బోలెడు జంతికలు చేగోడీలూ పెట్టిందనో, పండగలకు పట్టులంగాలు కుట్టించిందనో, పెళ్లికి జుంకాలు చేయించిందనో ఇంకా సవాలక్ష నేను గుర్తు చేసుకోవడం సరే. దాదాపు అందరికీ అమ్మమ్మలతో ఆ తరహా జ్ఞాపకాలుండటం మామూలే. ‘పేపరుకెక్కి మరీ’ మా అమ్మమ్మ గురించి చెప్పాల్సినదేముంది?

ఆవిడ ఏ ఉద్యమాల్లోనూ పాల్గొనలేదు. ‘ఫ్యూడల్‌, బ్రాహ్మినికల్‌ భావజాలం…’ ఇలాంటి పరిభాషలో ఎన్నయినా చెప్పుకోదగిన విజయనగరం జిల్లా చల్లపేట అగ్రహారంలో జీవితమంతా గడి పినా సరే, ఆమెకి అక్కడక్కడివే చాలా సంగతులు తెలియకపోవచ్చు. ఇంకా తెల్లవారకముందే నీళ్ల పొయ్యి రాజుకుందా లేదా అని చూసుకోవడంతో మొదలయ్యే దినచర్యలో – పట్టుమని యాభై కిలోమీటర్ల దూరం లేని పార్వతీపురం చుట్టుపక్కల రగులుకుంటున్న విప్లవాగ్ని ఆమెను ఏమాత్రం తాకకపోవచ్చు. ఎర్రావు ఎప్పుడీనుతుందో, రోజూ కనిపించే సుబ్బన్న పిల్లి ఇవాళ రాలేదేవిటో.. ఈ తరహా ధ్యాసలో ఉన్న గృహిణికి  తమ పొరుగునున్న అజ్జాడ అగ్రహారంవాడూ తమ శాఖవాడూ అయిన ఆదిభట్ల కైలాసం ఎగదోస్తున్న చైతన్యం గురించి అసలేమీ తెలియకపోవచ్చు. అంతోఇంతో దూరపు చుట్టవూ, తమ ఇంటి పేరే ఉన్న గంటి ప్రసాదు ఏ రకమైన పనిలో ఉన్నాడో కూడా అమ్మమ్మకి తెలియదు. అయితే ఆ స్ఫూర్తి మాత్రం ఆమెలో నిండుగా కనిపించేది. కులమతాలకు అతీతంగా తనదైన స్నేహలోకాన్ని ఏర్పాటుచేసుకోవడం, దాన్ని విస్తరించుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఊళ్లో కోమటి పిట్టమ్మ అమ్మమ్మ బెస్ట్‌ఫ్రెండ్‌. ఉన్న కొంచెం మెట్టభూమిని చూసే గంధర్వని ‘మా రైతురాలు’ అని గొప్పగా పరిచయం చేసేది. కుటుంబసభ్యుల్లా కలిసి పనిచేసిన బాంబు, వాళ్లన్న చెల్లయ్య, బాంబు కొడుకు రమేషూ, పాలేర్లు ఎండయ్య, ఆది, దూదేకుల దాదు కూతురు, కూరలమ్మే పొట్టి, కిళ్లీ కొట్టు రంగడు, బట్టలకొట్టు వీర్రాజు, టైలర్‌ అప్పారావు… అమ్మమ్మని గుర్తు చేసుకోవడం అంటే ఊరు ఊరంతటినీ గుర్తు చేసుకోవడం! పల్లెటూరి మకాం విశాఖపట్నానికి మారాక కూడా అదే ధోరణి. చాకలి పార్వతి కొడుకు పెళ్లంటే ‘ఇంకా మైకూ పాటలూ పెట్టలేదేవిటే వీళ్లు, ఇవాళ భోజనాలకి నిన్నటి నుంచీ తరుగుతున్నారు బంగాళదుంపలు.. ఇలాగయితే మూడు గంటలకు పెడతారో ఏవిటో వచ్చినవాళ్లకి తిండి…’ అని హడావుడిపడుతూ మంచి చీర కట్టుకుని తయారయి వెళ్లి ఆశీర్వదించి బహుమతులిచ్చి వచ్చేది.

ఆవిడేవీ పదవులు నిర్వహించలేదు, పేరుకి ‘బుగత’మ్మేగాని పేరుకున్న ఐశ్వర్యం ఏమీ లేదు. అందువల్ల ఆమె వారసత్వంగా మాకూ ఏమీ రాలేదు, రాదు. ‘మనకి ఈ జన్మలో దేవుడు కొంచెం ఇచ్చేడంటే దానర్థం మనం తోచినంత ఎదుటివాళ్లకు ఇవ్వాలనే. నీకు జీతం ఎన్ని వేలయితే నాకెందుకు, ఇంద ఈ రెండొందలూ తీసుకుని గాజులు వేయించుకో’ అంటూ ఇంటికొచ్చిన ఆడామగా, పిల్లాపెద్దా అందరికీ ఏదోకటి ఇచ్చిపంపే అమ్మమ్మ మాకందరికీ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ ట్రెయినర్‌. ‘ఆడపిల్లలకు చదువు, ఉద్యోగం అవసరం. జీతం పెరిగిందా, అయితే కారు కొనుక్కో. కార్లో అయితే ఎండకెండకుండా వానకు తడవకుండా వెళ్లిరావొచ్చు..’ ‘ నువ్వు ప్రేమనుకుంటావు, మగవాడు కోరికనుకుంటాడు. నువ్వు స్నేహంగా మాట్లాడతావు, అవతలివాడు అపార్థం చేసుకుంటాడు’ – సంక్రాంతికి బొబ్బట్లు చేస్తున్నప్పుడో, దసరా సెలవుల్లో పాతికముప్ఫై మంది ఉదయాన్నే కూచుని బాదం ఆకుల్లో ఉప్మా తింటున్నప్పుడో, వేసవి రాత్రి వరసగా మంచాలేసుకుని నడివాకిట్లో పడుకోబోతూ డిస్కషన్లు పెట్టుకున్నప్పుడో… అమ్మమ్మ మాటలు అవి. టీనేజీ పిల్లలకు అమ్మానాన్నలు చెప్పడానికి వెనకముందాడే ఎన్నో విషయాలను అమ్మమ్మ సూటిగా స్పష్టంగా చెప్పేసేది.

ఇద్దరు పిల్లలున్న ఇళ్లలో సైతం ఎన్నో కొట్లాటలు. చిన్నప్పుడు చిన్న తగవులు, పెద్దయ్యాక ఆస్తుల కోసం. అలాంటిది పదిమంది పిల్లలు, అటూఇటూగా ఇరవైమంది మనవలకూ మధ్య ఆర్థిక విషయాలో, అంతస్తుల తేడాలో అభిప్రాయభేదాల్ని పెంచకపోవడం – అమ్మమ్మ పెంపకమే. ‘వరమున పుట్టితిన్‌ భరతవంశముజొచ్చితి…’ అని ఒక సందర్భంలో ద్రౌపది చెబుతుంది.  ఫలానా చోట పుట్టాను, ఫలానావారి కోడలిని, భర్త ఫలానా, నా కొడుకులు గొప్ప అని చెబుతూ ‘అటువంటి గొప్పదాన్ని…’ అంటుంది. తన మంచి గుణాలో పోనీ తానెందులో ప్రవీణురాలో ఒక్కముక్కా చెప్పదు. ‘స్ట్రెంత్‌ కమ్స్‌ ఫ్రమ్‌ ఫ్యామిలీ, ఫ్యామిలీ కమ్స్‌ ఫస్ట్‌…’ అని ఇవాళ వ్యక్తిత్వ వికాస నిపుణులు హోరెత్తిస్తున్న సూత్రాల్ని ద్రౌపది అప్పుడే తెలుసుకుందన్నమాట. మూడునాలుగు వందల మంది బంధుబలగం ఇవాళ మా అమ్మమ్మను తలుచుకుంటోందని తెలిసినప్పుడు… ఇప్పుడు కదా, ఆవిడా ఆ సూత్రాన్నే ఆచరణలో పెట్టిందని నాకు అర్థమయింది!

కేవలం మా అమ్మమ్మ పోయిందని కాదు నా బెంగ. మా అమ్మమ్మలాంటి బోల్డంతమంది అమ్మమ్మల కోసం. అంతరించిపోతున్న ఆ తరం విలువల గురించి… ఆ తరహా ధైర్యానికి. చివరిదశలో ఉన్న అగ్రహారాల సౌజన్యాన్ని తలుచుకుని. మనుషులను బేషరతుగా ప్రేమించే గుణం తగ్గిపోతోందని.

(నవంబరు 16న మరణించిన అమ్మమ్మకు ఇంకేమీ ఇవ్వలేక)

Advertisements

One thought on “మళ్లీ ఎలా చూస్తాను?

  1. ఆవిడ మీ అమ్మమ్మే కాదు, మా అమ్మమ్మా, అమ్మా కూడా.
    పాత పల్లెటూళ్ళ వంటిళ్ళలో అణగారిపోయిన ఆడవాళ్ళు- తెలివి తేటలూ లోకజ్ఞానమూ చాతుర్యమూ వాళ్ళ వాళ్ళ పిల్లల మనవల మనసుల్లోకి వొంపి వెళ్ళిపోయిన గొప్ప మనుషులు. ముఖ్యం బ్రాహ్మల ఇళ్ళల్లో ఆడవాళ్ళు అనామకంగా వెళ్ళిపోతారు కానీ తమ వంశంలో తమని తాము కొనసాగించుకుంటారు. మొగుళ్ళు చాదస్తులైతే, వాళ్ళు లౌకికంగా ఉండేవాళ్ళు. మొగుళ్ళు అహంకారులైతే వాళ్ళు మృదువుగా ఉండేవాళ్ళు. ఎండ కాస్తున్నపుడు జల్లు లాగా, వాన కురుస్తున్నప్పుడు గొడుగులాగా ఉండేవాళ్ళు. పండుటాకుల్లాగా ఉండేవాళ్ళు చిగురుటాకులతో పెనవేసుకుపోయి జీవితాన్ని కొనసాగించేవాళ్ళు.
    వాళ్ళు కుటుంబాన్నే ఆధారం చేసుకుని ఉండేవాళ్లంటే అందుకు కారణం గత్యంతరం లేకపోవడమే కానీ అదొక గొప్ప అని కాదు. ఆధునిక జీవితం విధించిన సమస్యలకి, సంక్షోభాలకి పరిష్కారం చెప్పలేని వాళ్ళు, కుటుంబంలోకి వెళ్లి దాక్కోమంటారు. జీవితంలోని ఒత్తిడిని కుటుంబంలో చల్లర్చుకుని తిరిగి తెల్లారి ఫ్రెష్ గా పనిలో కి రావాలన్నమాట. వ్యక్తిత్వ వికాస పండితులకి అంత విలువ గౌరవం ఇవ్వకండి. జీవితాన్ని కాచి వడపోసిన అమ్మలెక్కడ, చిట్కాలు చెప్పే బైరాగి కౌన్సిలర్స్ ఎక్కడ?
    అట్లాగే, ఆడవాళ్ళ మంచితనాన్ని అగ్రహారాలకు అంటగట్టకండి. మీ వాడే అయిన గురజాడ కన్యాశుల్కంలోని రెండు అగ్రహారాల్లోనూ ఆడవాళ్ళ మంచితనమూ అమాయకత్వమూ మగవాళ్ళ దాష్టీకమూ మూర్ఖత్వమూ స్పష్టంగా ఉంటాయి. శ్రీపాద రాసిన కథలు చూసినా సరే.

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s