అమ్మ

అప్పుడెప్పుడో… చాలా రోజుల క్రితం…
ఓ… ఒకటే తుపాను. గాలి… వాన… ప్రపంచం అంతా ఆ గాలివానలో కొట్టుకుపోతున్నట్లుగా ఉంది. అలాంటి వాతావరణంలో ఒకానొక వేళ యేణ్ణర్ధం కొడుకుని ఒడిలో పెట్టుకుని ఆ తల్లివాడి వంకే ఆత్రంగా చూస్తోంది. వాడు పాలిపోయి ఉన్నాడు. వాడి కళ్లు తేలిపోయి ఉన్నాయి. శ్వాస కూడా భారంగా బాధగా తీస్తున్నాడు. ఇప్పుడో… అప్పుడోలా ఉన్నాడు. ఏ క్షణంలోనయినా చనిపోయేలా ఉన్నాడు. అంతలో ఆ ఇంటి తలుపు చప్పుడయింది. ఆ చప్పుడుకి, ఒడిలోని బిడ్డని చాప మీద పడుకోబెట్టి వెళ్లి తలుపు తెరిచిందామె. ఈదురు గాలి, వానతో పాటు ఓ ముసలి వ్యక్తి ద్వారానికి అడ్డంగా నిల్చున్న ఆ తల్లిని తోసుకుని లోనికి ప్రవేశించాడు.
చిత్రంగా ఉన్నాడతను. ఎనుబోతు చర్మాన్ని కప్పుకుని ఉన్నాడు. అతని చేతిలో ముడులు ముడులుగా ఉన్న నల్లని తాడొకటి ఉంది. ‘ఎవరు నువ్వు’ అని ఆ వ్యక్తిని అడగలేదా తల్లి. ఎవరో ముసలాడు. చలికీ, వానకి తట్టుకోలేక ఇంటి తలుపు తట్టాడు. లోపలికి వచ్చాడు.
చలికి తట్టుకోలేకపోతున్నట్లుగా వణికిపోతూ ముసలి వ్యక్తి, ఆమె బిడ్డ దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. భారంగా బాధగా తీస్తోన్న బిడ్డ శ్వాసని గమనించాడతను. సన్నగా పుల్లల్లా ఉన్న వాడి చిట్టి చేతులు ఇలా పైకిలేచి అలా పడిపోవడాన్ని కూడా గమనించాడు.
“ఏంటలా చూస్తున్నావు? వాడేం చచ్చిపోడు! వాణ్ణి ఎలాగైనా నేను బతికించుకుంటాను” అంది బిడ్డతల్లి.
“నా దేవుడు నా బిడ్డని నాకు దూరం చెయ్యడు! చెయ్యలేడు” అంది. చాలా ధైర్యంగా ఉందామె.
ఆ తల్లి మాటలకి ముసలివ్యక్తి లోలోపల నవ్వుకున్నాడు. ఆ ముసలి వ్యక్తి ఎవరోకాదు. సాక్షాత్తు యమధర్మరాజు. బిడ్డ ప్రాణాన్ని తీసుకుపోవాలనే వచ్చాడతను.
“వీడు నా ప్రాణంలో ప్రాణం”  మోకాళ్ల మీద కూర్చుని బిడ్డ మొహాన్ని ఆప్యాయంగా చేత్తో నిమిరింది. దుఃఖం ముంచుకొచ్చిందేమో! ఒక్కసారిగా ఏడవసాగింది. కన్నీళ్ళు ఆమె చెంపల మీద చారికలు కట్టాయి. గత మూడు రోజులుగా క్షణం కూడా నిద్రపోలేదామె. దాంతో నిద్ర ముంచుకు రావడంతో బరువెక్కిన కను రెప్పలను ఏడుస్తూ ఏడుస్తూనే ఇలా వాల్చి  అలా తెరిచి చూసిందో లేదో… చాప మీద బిడ్డ లేడు. వాడి దగ్గరగా కూర్చున్న ముసలి వ్యక్తీ లేడు.
“బాబు! బాబు” అంటూ గోల చేసిందామె.  బయటికి పరుగుదీసింది. హోరున వర్షం… జోరున గాలి… నేల మీద నిలదొక్కుకోలేకపోతోంది. అయినా శక్తిని కూడదీసుకుంటూ పరుగుదీస్తోంది. ఓ కొండ దగ్గరగా వచ్చిందామె. అక్కడ ఓ స్త్రీని చూసింది. ఆ స్త్రీ పొడవుగా అంతెత్తున ఉంది. నల్లని దుస్తుల్లో ఉంది.
“ఇదిగో! నా బాబుని ఎత్తుకుని ఇటెవరైనా ఓ ముసలి వ్యక్తి వెళ్లడం నువ్వు చూశావా?” నల్లని దుస్తుల స్త్రీని అడిగింది తల్లి.
“చూశాను” అందా స్త్రీ. “ఆ ముసలి వ్యక్తి ఎవరనుకున్నావు” అడి గింది.
“ఎవరు?”
“ఆ ముసలి వ్యక్తి యమధర్మరాజు. చచ్చిన నీ బిడ్డను తీసుకుని యమధర్మరాజు ఇప్పుడు వీస్తోన్న ఈ చలిగాలి కన్నా వేగంగా వెళ్లిపోయాడు. అతన్ని నువ్వు కలుసుకోవడం అసాధ్యం. పైగా తీసుకున్న ప్రాణాన్ని తిరిగి ఇవ్వడం… జరగదు” అంది  స్త్రీ.
“ఎందుకు జరగదు? అతను ఎటు వెళ్లాడు? ఇటేనా! ఈ దారంటే వెళ్లాడా?” అడిగింది తల్లి.
“ఏ దారి అన్నది నేను చెప్పాలంటే నువ్వో పని చెయ్యాలి”
“చెప్పు! ఏం చెయ్యాలి”
“నీ బాబుని నిద్ర పుచ్చడానికి జో కొడుతూ నువ్వు పాడిన పాటలన్నీ ఇప్పుడు పాడాలి” అందా స్త్రీ.
“నీ గొంతులో నీ గుండె పలుకుతుంది. బాధగా భయంగా బలే ఉంటుందది. కన్నీటితో నువ్వు పాడే పాట నన్ను చుట్టుకున్న చీకటిని కరిగించేట్టుగా ఉంటుంది. అసలు… నేనెవరో నీకింతకి తెలుసా?” అడిగింది.
“తెలీదు” అందా తల్లి.
“నన్ను ‘రాత్రి’ అంటారు” చెప్పిందా స్త్రీ.
“అలాగా?” అని ఆశ్చర్యపోయి రాత్రి కోరినట్టుగానే ఆ తల్లి పాటలు పాడింది. పాటలన్నీ విని ఆనందించిన రాత్రి-
“యమధర్మరాజు వెళ్లింది ఇటు” అంటూ దారి చూపించింది.  ఆ దారంట పరుగు పరుగున బయల్దేరిందామె. దారంతా చెట్లూ, పుట్టలు. అడవిమయంగా ఉంది. పరుగుదీస్తోందామె. పరుగుదీస్తూ పరుగుదీస్తూ ఓ చోట ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే… ఆగిన చోటు మూడు రాదారుల కూడలిగా ఉంది. అందులో ఏ దారిన పోవాలో తెలీకుండా ఉందామెకు. అప్పుడు అటుగా చూసింది. ముళ్లడొంక బ్రహ్మజెముడు కన్పించింది. చిన్న ఆకుగానీ, చిన్నిపువ్వుగానీ లేవు దానికి. అంతటా ముళ్లే ఉన్నాయి. చలికీ, వానకి వణికిపోతోందది.
“ఇదిగో! ఓ చిన్న బాబుని తీసుకుని యమధర్మరాజు ఈ దారుల్లో ఏదారంట వెళ్లిందీ నువ్వు చూశావా?” బ్రహ్మజెముణ్ణి అడిగిందా తల్లి.
“చూశాను” అంది బ్రహ్మజెముడు.
“ఎటు వెళ్లిందీ చెప్పవా” ప్రాధేయపడింది.
“చెప్పాలంటే నువ్వు నాకో చిన్న సాయం చెయ్యాలి”
“చెప్పు! ఏం చెయ్యమంటావ్‌ ” అడిగింది తల్లి.
“ఈ చలికి, వానకీ నేను తట్టుకోలేకపోతున్నాను. చచ్చిపోతానేమో అనిపిస్తోంది. అందుకని నువ్వు నన్ను గట్టిగా నీ గుండెలకు అదుముకో! కౌగిలించుకో! కాస్తంత వెచ్చదనాన్ని నా కందించి నన్ను కాపాడు! అప్పుడు నేను తప్పకుండా ఏ దారంట యమధర్మరాజు వెళ్లిందీ చెప్తాను” అంది బ్రహ్మజెముడు. బ్రహ్మజెముడు మాట పూర్తికానేలేదు. ఆ బ్రహ్మజెముణ్ణి నిలువునా కౌగిలించుకుందా తల్లి. గుండెల కదుముకుంది. బ్రహ్మజెముడు తొందరగా వేడెక్కాలని ఆ తల్లి తపన. ఆ తపనలో బ్రహ్మజెముడు ముళ్ళు ఆమె గుండెల్లోకి దిగబడినా, ధారలై రక్తం కారుతున్నా పట్టించుకోలేదామె. బ్రహ్మజెముడు ఆమె రక్తంతో నిండుగా తడిసిపోయింది. తడిసిన మరుక్షణం అది మల్లె గుబురులా మారిపోయింది. ఆకులతో అలరారింది. పువ్వులతో పండిపోయింది. ముళ్ళ డొంక తను. మల్లె గుబురు కావడం మహత్తనుకుంటూ మురిసిపోయి-
“ఇదిగో! ఈ దారిలోనే యమధర్మరాజు నీ బిడ్డను తీసుకుపోయాడు” అని చెప్పి పరవశించిపోయింది. బిడ్డకోసం పరుగుదీసింది తల్లి. పరుగుదీసి పరుగుదీసి ఓ సరస్సు దగ్గరగా వచ్చింది. బ్రహ్మజెముడు చెప్పిన దారంట ఇంకా ప్రయాణించాలంటే ఇప్పుడీ సరస్సును దాటాల్సి ఉందామె. దాటేందుకు అక్కడ ఏ సౌకర్యమూ లేదు. సరస్సునంతా తాగేస్తే!? అనుకుందామె. అంతలోనే అది అసాధ్యం అనుకుంది. ఏమిచ్చి ఈ సరస్సును దాటగలను అనుకుంటూ… ఏదీ అంతుచిక్కక ఏడుస్తూ కూర్చుంది. అప్పుడామె కన్నీటిబొట్లు సరస్సులోపడి ముత్యాలు అయ్యాయి. అందుకు కృతజ్ఞతగా ఆ సరస్సు ఆమెను అందుకుని, తన తరంగాల మీద కూర్చుండ బెట్టుకుని ఆ దరి నుంచి ఈ దరికి చేర్చింది. ‘వెళ్ళిరా’ అన్నట్టుగా వెన్నుతట్టి వెనుతిరిగింది. ముందుకి పరుగెత్తిందామె. చాలా దూరం పరుగుదీసి పరుగుదీసి, తర్వాత దారి కానరాక ఏడుస్తూ నిల్చుంది. ఆమె నిల్చున్న చోటునే అటుగా ఓ పెద్ద భ వంతి ఉంది.
“యమధర్మరాజు నీకు కనిపించడం, నీ బాబు నీకు దక్కడం అసాధ్యంగాని, నువ్వెలా వచ్చావిక్కడికి? ఈ దారెలా నీకు తెలిసింది?” అన్న మాటలు వినిపించడంతో అటుగా చూసింది. ఆ మాటలంటూన్నది ఓ నడివయసు స్త్రీ! ఆమె దగ్గరగా నడిచిందా తల్లి. ఆ స్త్రీ బూడిద రాసుకున్నట్టుగా ఉంది. తెల్లగా పండిపోయిన జుత్తుతో ఉంది.
“ఆ దేవుడు చెబితే వచ్చాను నువ్వుకూడా నాకు దేవుడితో సమానమే! చెప్పు! నా బాబుని నువ్వు  చూశావా? యమధర్మరాజుని చూశావా?” గగ్గోలుగా అడిగిందా తల్లి.
“చూశాను” అందా స్త్రీ.
“అదిగో అటు చూడు! ఆ పెద్ద భవంతి. అందులో చనిపోయిన నీ పిల్లాడితోపాటు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళెవరూ అక్కడ మనుషుల్లా ఉండరు. ఓ చెట్టులా ఉంటారు. చెట్టు కొమ్మలా ఉంటారు. ఆకులా ఉంటారు. పువ్వులా ఉంటారు. చిత్రంగా గుండె లయతో ఉంటారు. నీ కొడుకు గుండె లయ నీకు తెలుసా? తెలిస్తే వెళ్ళి వెతుక్కో! అయితే ఇదంతా నీకు నేను చెప్పినందుగ్గాను నువ్వు నాకు ఏమివ్వగలవ్‌” అడిగిందా స్త్రీ.
“నీకేం కావాలి” అడిగిందామె.
“తుమ్మెద రెక్కల్లాంటి నీ నల్లని జుత్తు నాకు కావాలి! ఇస్తావా”
“తీస్కో” అందామె. అంతే! పండిపోయిన తెల్లని స్త్రీ జట్టు తల్లికొచ్చి, ఆ తల్లి నిగనిగలాడే నల్లని జుత్తు ఆ స్త్రీ సొంతమయ్యింది. దాంతో-
“రా! నీ బాబుని నువ్వు వెతుక్కుందూగాని” అని తనతోపాటుగా ఆమెను భవంతిలోనికి తీసుకొచ్చింది స్త్రీ. భవంతి అంతా చిన్న పెద్దా చెట్లతో, మొక్కలతో దట్టంగా ఉంది. కొన్ని చెట్లు కాయలతో పండ్లతో చక్కగా ఉన్నాయి. మరికొన్ని చెట్లు కొమ్మలు కోల్పోయి, బెరడులు వూడొచ్చి అసహ్యంగా ఉన్నాయి. మొక్కలు కూడా అంతే! కొన్ని మొక్కలు చూడముచ్చటగా ఉంటే, మరికొన్ని మొక్కలు వాడిపోయి, వడలిపోయి ఉన్నాయి. కొమ్మకి ఉన్న పువ్వులు కొన్ని ఎండిపోయాయి. కొన్ని విచ్చుకుని నవ్వుతున్నట్టుగా ఉన్నాయి. చెట్లని పట్టించుకోలేదామె. తనబిడ్డ అంత పెద్దవాడేం కాదు. మొక్కల్ని కూడా పట్టించుకోలేదు.. కోట్ల పువ్వుల్లో కూడా కొడుకు పువ్వును తల్లి గుర్తించగలదు. ఆ అవకాశం ఒక్క తల్లికే ఉంది.
“ఇదిగో… ఇది… ఈ పువ్వు… వీడు నా బాబు” ఆనందంతో గట్టిగా అరిచింది తల్లి. ఏ పువ్వునయితే తన కొడుకంటూ తల్లి చెప్పిందో ఆ పువ్వు తెల్లతెల్లగా ఉండి, కొంచెం వాడిపోయి ఉంది. ప్రేమగా ఆత్రంగా దాన్ని అందుకోబోయిందా తల్లి. “వద్దు” గట్టిగా అరిచింది తల్లితో కూడా వచ్చిన స్త్రీ. “మా రాజు యమధర్మరాజు వస్తున్నాడు. పద” అంటూ తల్లి రెక్క పుచ్చుకుని స్త్రీ వెనక్కి లాగబోయేంతలో చల్లని గాలి.. ఎముకల్ని కొరికే చలిగాలి అక్కడికి ఒక్కసారిగా ప్రవేశించింది. ఆ గాలి యమధర్మరాజు. ఆ సంగతి తల్లి తెసుకోగలిగింది.
“నువ్వెలా వచ్చావిక్కడికి? నాకన్నా వేగంగా ఎలా వచ్చావు?” యమధర్మరాజు అడిగాడు.
“నేను తల్లిని ప్రభూ” అందామె.
“తల్లి” అని ‘చాల్లే’ అన్నట్టుగా నవ్వుతూ ఆమె బిడ్డనుకుంటున్న పువ్వుని తెంపబోయాడు. అడ్డుకుందామె. పువ్వు చుట్టూ చేతులుంచి యమధర్మరాజుని నిరోధించింది.
“తప్పు! నువ్విలా నన్ను అడ్డుకోకూడదు. నా పని నన్ను చేసుకోనీ” అన్నాడు యమధర్మరాజు.
“పైగా నీకు తెలియని విషయం ఒకటుంది. వీళ్లెవరూ… అంటే ఈ చెట్లు, పువ్వులూ ఇవేవీ ఇక్కడ ఉండవు. ఇది మజిలీ మాత్రమే! ఇవన్నీ త్వరలో మళ్ళీ జన్మిస్తాయి. అందాలు ఆనందాలు సొంతం చేసుకుంటాయి. ఇది  దైవనిర్ణయం” అన్నాడు మళ్లీ.
“నా బిడ్డ నాకు కావాలి” రోదించిందా తల్లి.
“నీ బిడ్డ నీకు కావాలి అంటే… ఇంకో స్త్రీ నీలాగే తల్లి ప్రేమకి నోచుకోకూడదని నీ ఉద్దేశమా” అడిగాడు యమధర్మరాజు.
“తల్లి ప్రేమని నువ్వు రుచి చూసినట్టుగానే మరో స్త్రీ కూడా రుచి చూడాలిగా! అందుకే నీ బిడ్డని నీకు దూరం చేశాం. రేపు ఇదే బిడ్డ ఇంకో తల్లికడుపున జన్మిస్తాడు. అర్థం చేసుకో” అన్నాడు మళ్ళీ.
“నువ్వు చేసుకున్న పాపానికి నీకింతే ప్రాప్తి! జబ్బు బిడ్డగా నీకు పుట్టి, పాపం! ఈ చిన్ని ప్రాణం నానా కష్టాలూ పడింది. రేపు నిండు నూరేళ్ళూ బతకడానికి ఏ తల్లి కడుపున పుట్టబోతున్నాడో! ఆ దృశ్యం చూస్తావా? నీ బిడ్డ భవిష్యత్తు చూస్తావా?” అడిగాడు యమధర్మరాజు
“చూస్తాను” అంది ఆశగా ఆ తల్లి.
“అయితే చూడు” అంటూ పువ్వుకి అడ్డంగా నిల్చున్న తల్లిని తప్పించి, పువ్వుని తెంచి అక్కడ ఉన్న నేల బావిలో గిరాటేశాడు యమధర్మరాజు. “బాబూ” అంటూ ఆత్రంగా ఆదుర్దాగా బావిలోకి తొంగి చూసిందా తల్లి. బావిలో బిడ్డ అందంగా ఉన్నాడు. ఎవరో పెద్దింటి తల్లి పొత్తిళ్ళలో ఉన్నాడు. నవ్వుతున్నాడు. ఆ చిన్ని కళ్ళల్లో ఎంత వెలుగో! ఆ చిట్టి చేతుల్లో ఎంత విరుపో…  ఆనందపడిందా తల్లి.
“చాలు! నా బాబు చల్లగా ఉన్నాడు. చక్కగా ఉన్నాడు” అందామె.
“నా బాబు ఇలాగే ఉండాలి! ఎప్పటికీ… ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నా బాధ నాదే! నా ఏడుపు నాదే! ఇవేవీ వాడికి ఉండకూడదు” అంది.
“యమధర్మరాజు బావిలోని పువ్వును అందుకుని శూన్యంలో నిలిపాడు. ప్రయాణించసాగిందది. ఆ పువ్వు కనుమరుగయ్యేంత వరకు ఆనందబాష్పాలతో చూస్తూనే ఉందా తల్లి. పువ్వు అదృశ్యమయిపోయింది. తల్లి, తల్లి ప్రేమ మాత్రం తరతరాలుగా యుగయుగాలుగా అలాగే ఉండిపోయాయి.

——————————————————————————————–
చందమామలో అవ్వా కుందేలూ వంటి కథలు ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక భాషల్లో విస్తారంగా ఉన్నాయి. అవి పిల్లలనే కాదు, పెద్దవాళ్లను సైతం మరో లోకంలోకి తీసుకెళ్లగలవు. అటువంటి కథలను  తేటతెలుగులో అందిస్తున్నారు ఏఎన్ జగన్నాథ శర్మ.  కిందటేడు ఆంధ్రజ్యోతి ‘నవ్య’ వారపత్రికలో ఆయన నిర్వహించిన ‘పాలపిట్ట కథలు’ శీర్షికలో ఇలాంటి కథలు బోలెడు. ప్రస్తుతం నవ్య ప్రధాన సంపాదకులుగా పనిచేస్తున్న ఆయన ఇటీవలే వాటిని ‘పాలపిట్ట’ పుస్తకంగా తీసుకొచ్చారు. అందులోనిదే ఈ కథ. తప్పక చదవదగిన పుస్తకం.

(దీన్ని ఈ బ్లాగులో ప్రచురించడానికి అనుమతి ఇచ్చిన జగన్నాథశర్మగారికి ధన్యవాదాలు)

పాలపిట్ట (ప్రపంచ జానపద కథలు)
ఎ.ఎన్‌. జగన్నాథ శర్మ
పేజీలు : 1/4 సైజులో 150, వెల : రూ90
ప్రతులకు: రాష్ట్రవ్యాప్తంగా విశాలాంధ్ర వారి అన్ని శాఖలు

One thought on “అమ్మ

  1. పాలపిట్ట కథా సంపుటం పరిచయం బాగుంది. అమ్మ కథ ఆ సంపుటిలొ ఉన్న గొప్ప కథలలో ఒకటి. మీ బ్లాగు రూపు రేఖలు నా బ్లాగులాగానే ఉండడం కాకతాళీయ మయినా, సరదా వేసింది. నా బ్లాగ్ కథ మంజరి. లింక్ http://pantulajogarao.blogspot.co

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s