నిత్య వసంతం కేరళ కళామండలం

‘శిశిర ఋతువున చెట్లు ఆకులు రాల్చును’ అని చిన్నప్పుడు చదువుకున్న పాఠం కొబ్బరిచెట్లకు వర్తించదేమో. అందుకే కొబ్బరిచె ట్లు విరివిగా ఉండే కేరళకు ‘నిత్య వసంతం పచ్చతోరణం’ అన్న సామెత అతికినట్టు సరిపోతుందనిపించింది. ‘నేషనల్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ విమెన్‌ ఇన్‌ మీడియా’ జాతీయ సమావేశాల కోసం మన రాష్ట్రం నుంచి కేరళ (కోజికోడ్‌) వెళ్లొచ్చిన మహిళా పాత్రికేయుల బృందంలో నేనూ ఉన్నాను. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకూ సీరియస్‌ విషయాలతో నిండిన సమావేశాలు మూడు రోజుల పాటు పూర్తయిన తర్వాత ఆటవిడుపుగా ఒకరోజు ఎటైనా వెళ్లొద్దామనుకున్నాం.  ఒకవైపు నల్లని అరేబియా సముద్రం, మరోవైపు పచ్చని కొబ్బరిచెట్ల సముద్రం – రెంటిలో దేని తీరాన ప్రయాణించాలో తేల్చుకోలేక తికమకపడ్డాం అందరం. పశ్చిమ కనుమల వాలున కాఫీ టీ తోటలు, లోయల్లో కొబ్బరితోటలు అధికంగా ఉండే వయనాడ్‌ జిల్లాలో పర్యటించడానికే మొగ్గుచూపాం. మొత్తం ప్రయాణంలో మమ్మల్ని అమితంగా ఆకర్షించినదీ, కొత్త విషయాలు నేర్పించినదీ – ‘కేరళ కళామండలం’.

ముందు రోజు రాత్రే ప్రసిద్ధ నర్తకి ఉషానంజియార్‌ ప్రదర్శించిన కుటియాట్టమ్‌ను చూసిన అనుభూతి ఇంకా పల్చనవక ముందే కళామండలమ్‌లో అడుగుపెట్టడం వల్ల కేరళ సంప్రదాయ నృత్యరీతుల గురించి బాగా తెలుసుకునే అవకాశం కలిగిందుకు సంతోషంగా అనిపించింది. 2003లో కేరళ పర్యాటక శాఖతో కలిసి కళామండలం ‘గురువులతో ఒకరోజు’ (ఎ డే విత్‌ మాస్టర్స్‌) అనే ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీనిలో భాగంగా పర్యాటకులు కథాకళి, మోహినిఅట్టమ్‌, కుటియాట్టమ్‌, థుల్లల్‌, పంచవాద్యమ్‌ వంటి కేరళ సంప్రదాయ కళారూపాల చరిత్ర – అభివృద్ధి తెలుసుకోగలుగుతారు. మేం వెళ్లేసరికి ఫ్రాన్స్‌ కళాకారుల బృందానికి కథాకళిలో పాత్రపోషణ గురించి అక్కడి అధ్యాపకులు వివరిస్తున్నారు. సాధారణంగా ఉదయం తొమ్మిదిగంటలకల్లా కళామండలం ప్రాంగణానికి చేరుకున్న పర్యాటకులకు అక్కడి సీనియర్‌ విద్యార్థులు స్వాగతం పలుకుతారు. మొదట పదినిమిషాలు సంప్రదాయ కళల గురించిన ఆడియో వీడియో కార్యక్రమం ఉంటుంది. తర్వాత కుట్టాంబళమ్‌కు తీసుకెళతారు. ఇది కేరళ దేవాలయాల పద్ధతిలో నిర్మితమైన ఆడిటోరియమ్‌. అణువణువూ అద్భుతమనిపించే ఈ వేదిక స్తంభాల మీద నాట్యశాస్త్రం చెప్పిన 108 కరణ (నృత్య భంగిమ)లను చెక్కారు. రోజ్‌వుడ్‌, టేకుతో చేసిన ద్వారబంధాలు, తలుపులు సంప్రదాయ చెక్కడాలను ప్రతిబింబిస్తాయి.

మేకప్‌ చూడాలి….
కుట్టాంబళమ్‌ తర్వాత సందర్శకులను ‘కలరి’లోకి తీసుకెళతారు. కలరి అంటే ఏదైనా విద్యలో శిక్షణనిచ్చే ప్రాంగణం అని. నృత్యానికి అనువుగా శరీరాన్ని మలచడానికి అవసరమైన వ్యాయామాలు మొదలుకొని కళ్లు, చేతులు, కాళ్లు వ్యక్తం చెయ్యాల్సిన అన్ని భావాలను ఇక్కడ నేర్పిస్తారు. కళాకారులు ఎక్కువగా రామాయణం, మహాభారతం, భాగవతాల్లోని కథాంశాలను నిశ్శబ్దంగా ముఖకవళికల ద్వారా అభినయిస్తారు కనుక, వాటికి తగిన శిక్షణ ఉంటుంది. ఇక్కడే చెండ, మద్దళమ్‌, ఇడక్క, మృదంగం వంటి వాద్యాలను కూడా నేర్పిస్తారు. ఒకో వాద్యానిదీ ఒకో ధ్వని. 12 – 16 మధ్య వయసున్న బాలబాలికలు వీటిని దీక్షగా అభ్యసిస్తుండగా చూశాం. కథాకళికి అవసరమైన గాత్రం, కర్ణాటక సంప్రదాయ సంగీతాన్ని కూడా నేర్పిస్తారు. కథాకళికి చేసే మేకప్‌ ప్రత్యేకమైనది. బాల కళాకారులు తొలిరోజుల్లో మట్టి పాత్రలమీద మేకప్‌ చెయ్యడం నేర్చుకుంటారు. అరంగేట్రం చేసిన తర్వాత వాళ్లు పూర్తిగా నర్తకులకు మేకప్‌ చేసే అర్హతను సంపాదిస్తారు. ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, తెలుపుల్లో ఉండే ముస్తాబే నాట్యంలో నవరసాలనూ పలికించడంలో కీలకం. దానికితోడు నాట్యంలో మగపాత్రలకు తెల్లటి కాగితాన్ని బియ్యపు జిగురుతో అతికిస్తారు. గ్రీన్‌ రూమ్‌లో కిందన చాపలు పరిచి ఉంటాయి. వాటిమీద వెల్లికిలా పడుకునే కళాకారులకు మేకప్‌ చెయ్యడానికి గంటలకొద్దీ సమయం పడుతుంది. దుస్తులు, ఆభరణాలు, కిరీటాలు – అన్నిటిలో భారీతనం కనిపించే కథకళి కళాకారులకు మేకప్‌ వేస్తుండగా చూడటం మన సహనానికి పరీక్ష అయినా అదో అద్భుతమైన అనుభవం. కుట్టాంబళమ్‌ వెనకాల ఆడపిల్లలకు మోహినిఅట్టమ్‌, కూచిపూడి, భరతనాట్యం నేర్పిస్తారు. మేం వెళ్లేసరికి కుట్టాంబళమ్‌లో కథకళి ప్రదర్శన జరుగుతోంది. వర్ణభరితమైన నృత్యం, వీనులవిందైన సంగీతం… వెరసి ఎంతసేపు చూసినా తనివితీరలేదు.

చరిత్ర తెలియాలి…
సంప్రదాయ నృత్యాల చరిత్రను మ్యూరల్స్‌, పెయింటింగ్స్‌ రూపంలో ప్రదర్శించే భవనం ‘నృత్యోల్‌పథి’. ఇక్కడే నాట్యంలో వివిధ పాత్రల ఆహార్యం స్పష్టంగా తెలిసేలా నిలువెత్తు ఫైబర్‌ బొమ్మలనూ పెట్టారు. మనుషులేనేమో  అన్న భ్రమ కలిగించేలా ఉంటాయి ఆ బొమ్మలు! కేరళ కళామండలాన్ని స్థాపించిన ప్రసిద్ధ కవి వల్లథోల్‌ నారాయణ మీనన్‌ నిలువెత్తు విగ్రహం దగ్గర మన టూర్‌ ఆగుతుంది. ఆసక్తిగల వారికోసం విద్యార్థులు కొన్ని హస్త ముద్రలనూ అభినయించి చూపిస్తారు. ఇదిగాక పాత ప్రాంగణంలోని బొమ్మలు, ఫోటో గ్యాలరీ అక్కడ పనిచేసిన మహామహుల గురించి,  కళామండలమ్‌ చరిత్ర గురించి వివరిస్తుంది. దగ్గర్లోనే ప్రవహించే నీల నది ఒడ్డున ఆయుర్వేద రిసార్టు కేరళ సంప్రదాయ విందు భోజనం ‘సద్య’ను వడ్డిస్తుంది. కళామండలం సందర్శన, సద్య భోజనం కేరళకు మళ్లీ మళ్లీ రావాలనిపించేలా చేస్తాయి!

కళామండలమ్‌ ఎలా మొదలైందంటే…
నీల నది ఒడ్డున ఉన్న ‘చెరుతురతి’ త్రిసూర్‌ జిల్లాలోని ఒక చిన్న ఊరు. అక్కడ జన్మించిన ప్రసిద్ధ కవి వల్లథోల్‌ నారాయణ మీనన్‌ 1930 ప్రాంతాల్లో గురుకుల పద్ధతిలో కేరళ కళామండలమ్‌ను ప్రారంభించారు. ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నా అది నేడు సందర్శకులకు విజ్ఞానదాయకంగా నిలబడిందంటే దానికి ఆయన స్థిరసంకల్పమే కారణం. ముప్ఫై ఎకరాల్లో విస్తరించిన కొత్త ప్రాంగణం పద్నాలుగు కళారూపాల్లో శిక్షణనిస్తోంది. 1990లో హైస్కూలు, డిగ్రీ తరగతులు మొదలుపెట్టారు. గ డచిన జూన్‌లో డీమ్డ్‌ యూనివర్సిటీగా రూపాంతరం చెందిన కళామండలం త్వరలోనే పీజీ, పీహెచ్‌డీ  పట్టాలూ ఇవ్వనుంది.

Advertisements

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s