బహుళ పంచమి జ్యోత్స్న బులిపించు నన్ను

మీరొప్పుకుంటారో కోరో – నూటికి తొంభైతొమ్మిది శాతం మనుషులు చందమామలేనంటాన్నేను. ఇంత దూరం నుంచి చూస్తే అంత అందంగా కనిపిస్తాడా, రకరకాలుగా కవ్విస్తాడా వేల కథలూ కవిత్వాలూ చెప్పిస్తాడా విరహాలూ ప్రేమలూ పండిస్తాడా…. తీరా దగ్గరికెళ్లి చూస్తే ఏవుంది? దుమ్మూ ధూళీ కొండలూ గుట్టలూ లోయలూ ఎండిన చారికలూ. ఇంత కష్టపడి కోట్లు గుమ్మరించి చంద్రయానాలు, దూరాభారం ప్రయాణాలు చేసి వెళితే గుక్కెడు నీళ్లయినా దక్కవు. మనుషులూ అంతే. దూరం నుంచే అందాలూఆప్యాయతలూ. దగ్గరకెళితే అంతే సంగతులు. అలాగని చందమామంటే నాకేం కోపం లేదు. ‘ఇంజ్యూరియస్‌ టూ హెల్త్‌’ అని పెట్టె మీద చదివి తాపీగా సిగరెట్టు ముట్టించేవాళ్ల వలెనే ఇవన్నీ తెలిసినా నేను ఇంత నగరంలోనూ కొంత బిజీలోనూ జాబిల్లి కోసం వెతుక్కుంటుంటాను… అంతకు ముందెప్పుడూ చూడనట్టే ప్రతి కొత్త నెలవంకనూ బాల్కనీలో నిలబడో బండి మీద ప్రయాణిస్తూనో అపురూపంగా చూస్తాను. చందమామలేనని అనుమానం ఉన్నా తారసపడిన ప్రతి కొత్త మనిషినీ స్నేహంగా చూడటం కూడా మానను.

ఇప్పుడెంతమందికి తెలుసో ఎందరు ఆచరిస్తున్నారో తెలియదుగానీ – ప్రతి పాడ్యమి రోజునా సన్నని నెలవంకను తప్పక చూడటం ఒక రివాజు. చూశాక అరచేతిని ముద్దుపెట్టుకోవడం, కట్టుకున్న చీరదో తువ్వాలుదో ఒక నూలుపోగును గాల్లోకి ఎగరేసి భక్తిగా నమస్కరించడం, కుటుంబసభ్యుల్లో ప్రియమైన ఒకరి ముఖాన్ని చూడటం దేవుడికి దండం పెట్టుకోవడం తెలుగింటి ఆచారం. దేన్ని మర్చిపోయినా దీన్ని మాత్రం ఠంచనుగా గుర్తుపెట్టుకుంటాను. ‘చంద్రుడికో నూలుపోగు’ సమర్పిస్తే మనకి కొత్తబట్టలొస్తాయన్న మూఢనమ్మకం ఇంకా పోలేదు మరి.

ప్రతి రోజూ ఒకేలా గడవనట్టే ప్రతి చంద్రుడూ ఒకేలా ఉండడు. విశాఖపట్నంలో సముద్రపు అలల మీదనుంచి ఉదయించే వసంత చంద్రుడిదొక అందం. దసరా వేషాల కోసం ఎదురుచూస్తూ డాబా మీద పడుకున్నప్పుడు తడిపేసిన శరచ్చంద్రికలు గడచిపోయిన బాల్యం. సింధూర వర్ణంలో నిండుగా పండిన చంద్రుడు, చుట్టూ మూడు వరుసల చుక్కలు, వేలి కొసల గాఢమైన నారింజ రంగు… బాగా పండిన గోరింట చేతులతో – అట్లతదియ కన్నెనోముల్లో కనిపించీ కనిపించకుండా దోబూచులాడిన ఆశ్వయుజ చంద్రిమ కౌమారం. నవవధువుగా అలంకరించి అత్తింట కొత్త గౌరవాన్నిచ్చిన మాఘ చంద్రుడు ఆల్బమ్‌లో అమరిన పదేళ్ల కిందటి జ్ఞాపకం. తల్లిగా ఒక బుల్లి చందమామను ఒడిచేర్చుకున్ననాటి ఆషాఢ వెన్నెల మరో అనుభూతి. లాలాపేట ఆకుపచ్చని దీపాల మీనార్ల మీదుగా ‘అల్లాహో అక్బర్‌’ స్వరంతో కలిసి కనిపించే ఈద్‌కాచాంద్‌ ఒక సంబరం.

కొన్ని పున్నములు వద్దు. వెన్నెల కూడా చీకటయిపోయి మనసున వెలుగన్నది లేకుండా పోయి, సాటి మనిషే ఏం హాని తలపెడతాడోనని బెంగబెంగగా బతికిన రాత్రి… ఉలికిపడుతూ గడిపిన రాత్రి- నాకేకాదు, ఎవరికీ వద్దు. కాలం కలిపేసుకున్న కొన్ని పున్నములు మాత్రం మళ్లీ కావాలి. తెల్లవారకముందు నాగావళి నీటిలో మసగ్గా కనిపించి చలిని మరిపించిన కార్తీక చంద్రుణ్ని మళ్లీ చూడాలి. ఏటిగట్ల ఇసుక  తిన్నెలను మెరిపించిన ఆ వెండి వెన్నెలలో భక్తిశ్రద్ధలతో సోమవారపు ఉపవాసాన్ని ప్రారంభించాలి. తులసికోట చుట్టూ అరటి దొన్నెల్లో నేతి దీపాలు వెలిగించి కార్తీక పున్నమి చంద్రోదయానికి స్వాగతం చెప్పిన అమ్మానాన్నమ్మల దృశ్యం పునరావృతం కావాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిబులిపించే మార్గశిర బహుళ పంచమి జ్యోత్స్న మళ్లీమళ్లీ కావాలి. సంక్రాంతి ముగ్గులు వేస్తున్నప్పుడు రాత్రంతా మంచు కిరణాలను ప్రసరించిన పౌష్య చంద్రిమ పరచుకోవాలి. వేసవి సెలవుల్లో నడివాకిట పడుకుని పిల్లలందరం దెయ్యం కథలు చెప్పుకుని భయపడి ఏడ్చినప్పుడు భరోసానిచ్చిన చందమామ మరోసారి కావాలి.

4 thoughts on “బహుళ పంచమి జ్యోత్స్న బులిపించు నన్ను

  1. Very touching. Similarity between the Moon and humans is great. I agree with you, I am not familiar with typing in telugu.. please don’t mond.

  2. Yentha baagaa rasaaru arunaa… Naa tholi katha acchulo vacchinappu naatho maatlaadina sneha poornima meere,chandruni Meeda koodaa neeti chelamaluntaayi mee laagaa .abburangaa, hataathgaa dorukuthaayi meeru dorikinatlu.

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s