నాతో తిరగడమే వాడికి ఎడ్యుకేషన్‌

బాల్య జ్ఞాపకాలు, తల్లిదండ్రుల గురించి ఎవరు చెబుతున్నా వినాలనే ఉంటుంది. అదికూడా ప్రముఖుల గురించి అయితే మరీ శ్రద్ధగా వింటాం. సాధారణంగా రచనల్లో, ఇతరచోట్లా అమ్మ గొప్పతనం వినిపించినంతగా నాన్న గురించిన ముచ్చట్లు రావు. ఆ లోటును పూరించే పుస్తకం ‘మా నాన్నగారు’. దాదాపు అరవైరెండు మంది తెలుగు సాహితీమూర్తుల గురించి వారి పిల్లలు చె ప్పిన కబుర్ల పుస్తకం ఇది. ద్వానాశాస్త్రి సంకలనం చేసిన ఈ పుస్తకం ఈమధ్యనే విడుదలయి పాఠకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ‘మా నాన్నగారు’ పుస్తకంలో భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గురించి వారబ్బాయి బుజ్జాయి రాసిన వ్యాసం నుంచి కొంత భాగం ఇక్కడ….

మా నాన్నగారి గురించి చెప్పాలంటే ఎన్ని రోజులైనా చాలవు, ఎన్ని పేజీలైనా రాయవచ్చు. అలాగే తండ్రిని గురించి ప్రతి కొడుక్కీ అనిపిస్తుందేమో! మా నాన్నగారంటే శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ఆయనతో 50 ఏళ్లు ఒక్క నిమిషం వదలకుండా తిరిగాను. ఇలా అంటిపెట్టుకుని తిరిగిన తండ్రీకొడుకులు చాలా అరుదనుకుంటాను.
1920 – 25 ప్రాంతంలో ఆయన ‘కృష్ణపక్షం’ మొదటి ముద్రణ వెలువడింది. భావకవిత్వ ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజులవి. ఆ రోజుల్లో ఈ కొత్త కవిత్వంలో ఉన్న గొప్పతనం, అందులో ఉన్న మెళుకువలు అందరికీ తెలియజెప్పాలని నిశ్చయించుకుని బరంపురం నుంచి బళ్లారి వరకూ సంవత్సరానికి పదకొండు నెల్లు తిరుగుతూ ప్రచారం చేసేవారు. మా నాన్న తోటి కవులందరికీ రాగయుక్తంగా పాడి వినిపించేవారు. ముందు గురజాడతో మొదలుపెట్టి రాయప్రోలు, తల్లావజ్ఘల, విశ్వనాథ, నాయని, కాటూరి, పింగళి, అడివి, నండూరి, బసవరాజు ఇలా అందరివీ మచ్చుకి ఒకటి రెండు చదివి వాటిలో ఉన్న మెళుకువలు చెబుతూ ఉపన్యాసం చేసేవారు.
1921లో అనుకుంటాను, ఆయన బియ్యే పాసయ్యారు. వెంటనే హైస్కూల్లో ఉద్యోగం ఇచ్చారు. ఒక సంవత్సరం అయ్యాక తీసేశారు. వెంటనే పెద్దాపురం స్కూల్లో ఉద్యోగం దొరికింది. వాళ్లూ ఒక సంవత్సరం అయ్యాక తీసేశారు. తక్షణం మా మేనత్త భర్త శ్రీ వింజమూరి నరసింహారావుగారు కాకినాడ మెక్లారన్‌ హైస్కూల్లో ఉద్యోగం ఇప్పించారు. అక్కడ కూడా ఒక సంవత్సరం అవగానే తీసేశారు. ఎందుకంటే భావకవిత్వ ఉద్యమం, దాని ప్రచారమే ఆయన ముఖ్య ధ్యేయం.
ఇంతలో 1931లో నేను పుట్టాను. దానితో ఆయన ప్రచారానికి అంతరాయం కలిగింది. లేకలేక కొడుకు పుట్టడంతో ఊళ్లు తిరగడం మానేసి ఇంటిపట్టునే ఉండేవారు. ఇంతలో శ్రీ రఘుపతి వేంకటరత్నం నాయుడుగారు (మా నాన్నగారి గురువులు) మా నాన్నగారికి కబురుపెట్టి “ఉద్యోగం అదీ లేకుండా ఇలా కూర్చుంటావేమిటి? ఇప్పుడు నీకు కొడుకు కూడా పుట్టాడు, బాధ్యతలు పెరిగాయి. కాకినాడ కాలేజీలో తెలుగు ఉపాధ్యాయుడిగా చేరు. కాని నెలకు 40 రూపాయలు మాత్రమే జీతం” అన్నారాయన. తెలుగు పండితుడిగా చేరడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ, జీతం విషయంలోనే కొంచెం అభ్యంతరం అన్నారుట మా నాన్నగారు.
‘అదేమిటి?’ నాయుడుగారు అడిగారు.
‘నేను మొదట పిఠాపురం స్కూల్లో చేరినప్పుడు నా జీతం 70 రూపాయలు. పెద్దాపురంలో 60 రూపాయలు. కాకినాడ మెక్లారన్‌ హైస్కూల్లో 50 రూపాయలిచ్చారు’ అన్నారు.
‘అవును నిజమే, 40 రూపాయలు తక్కువే’ అన్నారు నాయుడుగారు.
‘అదికాదు నా సందేహం. సంవత్సరానికి పది రూపాయలు తగ్గుతూ వచ్చింది కదా, మధ్యలో అయిదారేళ్లు ఉద్యోగం లేకుండా ఉన్నాను. కాబట్టి నేనే కాలేజీవారికి 30 రూపాయలు ఇవ్వవలసి వస్తుంద’ని మా నాన్న చలోక్తిగా అన్నారట, నాయుడుగారు విరగబడి నవ్వారట.
కాకినాడ కాలేజీలో చేరారు. బుద్ధిగా మూడు నాలుగేళ్లు ఉద్యోగానికి వెళ్లారు. కారణం నన్ను వదలలేక. ఇంతలో నాకు నాలుగేళ్లు వచ్చాయి. ఇంక ఫరవాలేదనుకుని నన్ను వెంటపెట్టుకుని మళ్లీ సభలకీ సమావేశాలకి బయలుదేరారు. ఒకసారి వాళ్ల గురువుగారు ఇలా అన్నారు – ‘శాస్త్రీ, నువ్వు పాలివ్వడం తప్ప నీ కొడుక్కి అన్నీ చేస్తున్నావ’ని, చలోక్తిగా.
ఆ రోజుల్లో మా నాన్నగారి ఉపన్యాసం అంటే వేలమంది వచ్చి రెండుమూడు గంటలు కదలకుండా కవిత్వంలాంటి విషయం మీద ఆయన మాట్లాడుతుంటే వినేవారు. కారణం – ఒక పాటో పద్యమో పాడి దాని అర్థం చెబుతూ మధ్యలో పిట్టకథలు చెబుతుంటే మంత్రముగ్థులై వినేవారు. 1936లో అనుకుంటాను, శ్రీశ్రీగారు మా నాన్న ఉపన్యాసం విశాఖపట్నంలో ఏర్పాటుచేశారు. దానికి నాన్న నన్ను వెంటపెట్టుకుని వెళ్లారు. ఆ ఊళ్లో పెద్ద హాల్లో పెద్ద సభ. హాలంతా కిటకిటలాడుతూ నిండిపోయింది. నన్ను మొదటివరసలో కూర్చోపెట్టారు. ఉపన్యాసం మొదలుపెట్టారు. అరగంటైంది, ఆపలేదు. నాకు బోర్‌ కొట్టేస్తోంది. మరో అరగంటైంది. జనం చప్పట్లు కొడుతూ వింటున్నారు. ఇంక ఈ ఉపన్యాసం ఈ రోజు ఆపరేమో అని నాకు భయం పట్టుకుంది. చటుక్కున నేను కుర్చీలో నిలబడి ‘ఇంక ఆపు’ అన్నాను. అనేసరికి మా నాన్నగారు ‘ఇంక నా ఉపన్యాసం మానేస్తున్నాను, మా అబ్బాయి ఆపెయ్యమంటున్నాడు’ అన్నారు. జనం అంతా ‘వీల్లేదు, మీరు మాట్లాడాలి’ అని గోల చేశారు. ఇంతలో శ్రీశ్రీగారు నన్ను ఎత్తుకుని బైటికి తీసుకువెళ్లి, బజార్లో బిస్కట్లూ అవీ కొనిపెట్టి నన్ను ఎంటర్‌టెయిన్‌ చేశారు. అప్పుడే ఆయనతో పరిచయం అయింది. శ్రీశ్రీ అని నాకు పలకక, శీనూ శీనూ అని ఆయన్ని పిలిచేవాణ్ని.
మరోసారి ఇలాగే భీమవరంలో ఉపన్యాసం ఏర్పాటు చేశారు. మా నాన్నగారు మాట్లాడటం మొదలుపెట్టారు. కొంతసేపయ్యాక ఇంక ఉపన్యాసం ఆపు అన్నాను. ఆయన మానేశారు. వేదిక మీద శ్రీ విశ్వనాథగారున్నారు. ఆయనకి ఎంతో కోపం వచ్చింది. ఆయన లేచి ఇలా అన్నారు – ‘ఇద్దరు కుర్ర కుంకలు ఈ ఆంధ్రదేశాన్ని ఏలేస్తున్నారు. వీడొకడు, మా గురువుగారి కొడుకొకడు’ అని. గురువుగారి కొడుకంటే శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారి కొడుకు.
ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, నాలుగో ఏట నుంచీ, ఒక్క క్షణం ఆయన నన్ను వదలలేదు. స్కూలుక్కూడా పంపలేదు. ఇలా తిప్పుకోవడంవల్ల ఆయన తోటి కవులందరితోటి, నాకు చాలా దగ్గర బంధం ఏర్పడింది. శ్రీ శివశంకరశాస్త్రిని బాబయ్యగారని పిలిచేవాడిని. శ్రీ విశ్వనాథగారిని పెద్దనాన్నగారని, బాపిరాజుగారిని బందరు బాబయ్య అని పిలిచేవాణ్ని. ఒక్క బాపిరాజుగారినే నువ్వని సంబోధించేవాడిని, కారణం ఆయన అంత చనువు ఇచ్చేశారు. ఆయన తన వొళ్లో నన్ను కూచోపెట్టుకుని బొమ్మలు వేసేవారు. అందుకే కాబోలు నాకు బొమ్మలు వెయ్యడం వచ్చింది. మా కుటుంబంలో నాకు ముందు చిత్రకారులెవరూ లేరు. అందరూ కవులు, పండితులే. ఇంక కాటూరివారినీ నండూరువారినీ మామయ్య అని పిలిచేవాడిని. ఎందుకంటే వారిని మా నాన్నగారు ‘బావా’ అని పిలిచేవారు. ఆ రోజులు తలుచుకుంటే ఎన్ని జ్ఞాపకాలో వస్తున్నాయి.
ఆ రోజుల్లో మా కుటుంబం, మా మేనత్తగారి కుటుంబం ఒకే ఇంట్లో ఉండేవాళ్లం. ప్రతిరోజూ ఒక కవి సమ్మేళనం మా ఇంట్లో. కాకినాడకి కవులు పండితులు ఎవరు వచ్చినా మా ఇంట్లోనే దిగేవారు. ప్రతిరోజూ ఒక గానకచేరీయో ఒక కవి సమ్మేళనమో ఒక నాటకమో ఇలా నా చిన్నతనం గడిచిపోయింది. ఇంతలో మా నాన్నగారి మేనకోడళ్లు అనసూయా సీతా బాగా పాడ్డం మొదలుపెట్టారు. మా నాన్నగారు ఆయన పాటలు, తోటి కవుల పాటలూ వీళ్లిద్దరి చేతా పాడించేవారు. మధ్యమధ్యలో ఆ పాట గురించీ, దాన్ని రాసిన కవి గురించీ చెప్పేవారు.ఆ రోజుల్లో ఆంధ్రదేశంలో ఎక్కుడ ఏ సభ జరిగినా మా నాన్నగారి ఉపన్యాసం, అనసూయా సీతల పాట లేకుండా ఉండేది కాదు. నెలకు 20 రోజులు ఏదో ఒక ఊళ్లో సభనో సమావేశమనో తిరిగేవాళ్లం. ఇలా ఆయనతో తిరుగుతూ ఉంటే నాకు స్కూలికి వెళ్లే వయసు దాటిపోయింది. మా నాన్నగారి ఆప్తులు కొందరు ఆయనతో దెబ్బలాడేవారు. కొడుకుని ఇలా కూడా తిప్పుకుని చదువుసంధ్యలు లేకుండా పాడుచేస్తున్నావు. వాడి కెరీర్‌ అంతా చెడగొడుతున్నావని. ‘నాతో తిరగడమే వాడికి ఎడ్యుకేషన్‌’ అనేవారు మా నాన్నగారు. నిజంగా అదే నా ఎడ్యుకేషన్‌ అయింది.

————————–

పుస్తకం వివరాలు :

 మా నాన్నగారు (కీర్తిశేషులైన అరవైరెండుమంది సాహితీ ప్రముఖుల జీవిత విధానాలు)
పేజీలు : 379, వెల : రూ. 400
ప్రతులకు : విశాలాంధ్ర అన్ని శాఖలూ.

Advertisements

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s