ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట

 ‘హింద్‌ దేశ్‌ కే నివాసీ సభీ జన్‌ ఏక్‌ హై… రంగ్‌ రూప్‌ వేష్‌ భాషా చాహే అనేక్‌ హై… హై హై హై హై హై…..’ ఈ హైలు అనంతంగా సాగుతున్నాయి, తర్వాత చరణం ఏమిటో ఎంతాలోచించినా గుర్తురాలేదు. వేసుకున్న గౌను నడుము దగ్గరున్న రెండు ఊలు కుచ్చులు నా చేతిలో ఊరికే నలిగిపోతున్నాయి.

 ‘పర్లేదు పాపా పాడు…’

ఎంతసేపని ప్రోత్సహిస్తారు?

 ‘వచ్చేసారి బా పాడమ్మా…’ అని ఇంకోరు ఎత్తుకుని స్టేజీ దించేశారు.

‘పాపకు పాటొచ్చుగానీ ఇంతమందిని చూసి బెదిరిపోయినట్టుంది..’

‘చిన్నపిల్లగదా..’

ఆ చిన్న పిల్లను నేనే. నాకు ఐదారేళ్లున్నప్పుడు మా వీధి చివర గ్రంధాలయం వార్షికోత్సవం సందర్భంగా పిల్లలకు పాటల పోటీలు నిర్వహించినప్పటి దృశ్యం ఇది. పేరు నే నిచ్చుకున్నానో, మా నాన్నిచ్చారో కూడా నాకిప్పుడు గుర్తులేదు. రేడియోలో ప్రతి ఆదివారం చిత్తరంజన్‌గారు నేర్పించే దేశభక్తి గేయాలను నేర్చుకోవడం మాత్రం కాస్త గుర్తుంది. ఆరోజు ఈమాత్రం పాడిందానికి ప్రైజులొచ్చిన వాళ్ల పేర్లు చదువుతున్నప్పుడు ‘నేనూ పాడాను కదా, నా పేరెందుకు పిలవలేదు? నాకెందుకు ప్రైజివ్వలేదు…’ అని బుడుగు మొహంతో నేను తెగ ఆశ్చర్యపోవడం మాత్రం గుర్తుంది. నాకు పాటంతా వచ్చు, అక్కడంతా పాళ్లేదుగానీ కిందకి దిగి కూచుని పాడేశాను, అటుపక్కఇటుపక్క వాళ్లు ఊరుకోమంటున్నా వినకుండా బలవంతంగా. అందుకే ఆశ్చర్యమనుకుంటా. పోటీకి, కింద పాడ్డానికి తేడా తెలిసేడిస్తేగా. ‘నేను నా సభాపిరికి ఎటుల పోగొట్టుకొంటిని..’ అని సోదాహరణముగా ఉపన్యసించడానికి కాదీ పోస్టు. ఒక పాట గురించి. అది రాసినాయన ఎవరో తెలియడం కోసం ఓ పదేళ్లు వెతకడం గురించి.

ఆరేడు క్లాసుల్లో స్కూల్లో పాడాలంటే మా అమ్మ నాకీ పాట నేర్పింది.

ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట ఎంత పరిమళమోయి ఈ తోట పూలు

 ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో ఏ స్వర్ణదీజలములీమడులకెత్తిరో

వింతవింతల జాతులీతోటలో పెరగ ఈ తోట ఏపులో ఇంత నవకము విరియ

ఏ అమృతహస్తాల ఏ సురలు సాకిరో ఏ అచ్చెరల మురువులీతీరు దిద్దిరో

ఈ పూలపాలలో ఇంత తియ్యందనము ఈ లతల పోకిళ్లకింతా వయ్యారము

 జవరాలి వలపువోలె రవిబింబ దీప్తివోలె హిమనగోన్నతివోలె ఋషివాక్కు మహిమవోలె

 నా ఎడందను లేపు నా తెలుగు తోటలో పాడుకొననిండోయి పలవింపనిండోయి…

‘హిమనగోన్నతివోలె…’ను పొరపాటునో – నోరుతిరగకో మరి నేను ‘యమునగోన్నదివోలె’గా పాడేదాన్ని. ఇంత చక్కగా గుర్తున్న పాటను రాసిందెవరు, ఎక్కడైనా వినిపిస్తుందాని పది పదిహేనేళ్లుగా  అనుకుంటున్నా. ద్వానాశాస్త్రి సంకలనం చేసిన పుస్తకం చదువుతున్నప్పుడు తెలిసింది ఈ పాటను రాసినవారు శ్రీ కందుకూరి రామభద్రరావుగారు. (పుట్టుక 31 -1-1905. తూగో జిల్లా రాజవరం గ్రామం. ఉద్యోగం ప్రధానోపాధ్యాయులు, ఆకాశవాణిలో ప్రయోక్త. రచనలు : లేమొగ్గ, తరంగిణి, వేదన, గేయమంజరి, కవితాలహరి, నివేదన (శతకం) సెర్చింగ్‌ స్ట్రెయిన్స్‌ (కవితా సంపుటి) బిరుదు : కవితల్లజ – స్వర్గస్థులు 8-10-1976) “గొల్లపాలెంలో నివసిస్తున్నప్పుడు మా నాన్నగారు తెల్లవారు జామున విద్యార్థుల్ని, ప్రజల్ని తీసుకొని ‘మేలుకొనరా భరతవీరుడా, మేలుకొనరా వినుతధీరుడా..’ అంటూ ప్రబోధ గీతాలు పాడుకుంటూ ఊరంతా తిరిగేవారు. అమ్మవారికి బలులు చేయడం అనే ఆనవాయితీని ఆయనే ఆపించారు..’ అంటూ రామభద్రరావుగారి కుమారుడు కందుకూరి పుండరీకాక్షుడు రాసిన వ్యాసం ఆ పుస్తకంలో కనిపించింది.

మళ్లీ నా సొద : రాసిందెవరో తెలిసిందిగానీ, వినడానికి ఎక్కడైనా దొరుకుతుందా? ఎవరికైనా తెలిస్తే చెప్పండి.

One thought on “ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s