ఆలివర్‌ డైరీ నుంచి…

 పిల్లల కోసం రాసినవే అయినా పెద్దవాళ్లనూ కదలకుండా చదివించగలవు రస్కిన్‌ బాండ్‌ రచనలు. అలాంటిదే ఇప్పుడు కొత్తగా వచ్చిన ‘మిస్టర్‌ ఆలివర్స్‌ డైరీ’ అలాంటి పుస్తకమే. ఆలివర్‌ సిమ్లాలోని ఒక మగపిల్లల పాఠశాలలో ఉపాధ్యాయుడు. వాళ్లందరి అల్లరి, వయొలిన్‌ వాయించుకుంటూ కూచునే హెడ్‌మాస్టర్‌, ఇతర టీచర్ల నిర్వాకాలు, పొరుగునే ఉన్న ఆడపిల్లల బడి… వీటన్నిటి గురించి ఆలివర్‌ తన డైరీలో రాసుకున్న రాతలివి. రస్కిన్‌ బాండ్‌ శైలి పాఠకుల మీద నవ్వులు చిలకరిస్తుంది. వాటి నుంచి కొంత భాగం ఇక్కడ…

మార్చి 10

ఇద్దరబ్బాయిలు స్కూల్‌నుంచి పారిపోయారు. ఎప్పట్లాగానే వాళ్లను వెతికి తీసుకొచ్చే పని నాకే పడింది. హెడ్‌మాస్టారికేమో తన కార్యాలయాన్నీ వయొలిన్నీ వదిలి వెళ్లటమంటే చిరాకు. జూనియర్‌ టీచర్లకు బాధ్యత లేదు. లేడీ టీచర్లను నమ్మలేం. అందుకే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు నన్నే పట్టుకుంటారు ప్రధానోపాధ్యాయులు. పారిపోయినవాళ్లు – దేవీందర్‌ సింగ్‌, హృదయ్‌ గుప్తా. ఇద్దరూ నాలుగో తరగతిలో చేరిన కొత్త అబ్బాయిలు. పట్టుమని పదేళ్లుండవు. ఎంత సాహసమో. ఇంకా చీకటి విడకముందు… ఉదయం ఐదింటికి అలా పారిపోయినట్టు తెలిసింది. వాళ్లు బస్టాండుకు వెళ్లి కల్కాకు వెళ్లే మొట్టమొదటి బస్సు ఎక్కేసి ఉంటారు. నేనో టాక్సీ తీసుకుని బయల్దేరితే ఆ బస్సును దాటి వెళ్లిపోయి సోలన్‌ దగ్గర ఆగితే అందులోంచి వాళ్లు దిగుతారు. కానీ సిమ్లా దాటగానే మా టాక్సీ టైర్‌ తుస్సుమంది. చూస్తే డ్రైవర్‌ మరో టైరును ఉంచుకోలేదు. దాంతో అక్కడే ఓ గంటపాటు ఉండిపోక తప్పలేదు. అతని స్నేహితుడొచ్చి మరో టైరును ఇచ్చేదాకా. మేం సోలన్‌ వెళ్లేసరికి బస్సు వెళ్లిపోయింది. మధ్నాహ్నం కల్కా దగ్గర దాన్ని పట్టుకోగలిగాం. ప్రయాణికులు దిగే బస్టాపులో నిల్చున్నాను. నేనూహించినట్టే అందరితో పాటూ ఈ పిల్లలిద్దరూ దిగారు. నేను ఎదురుపడేసరికి ఇద్దరూ దొంగచూపులు చూసుకున్నారు. అదృష్టవశాత్తు వాళ్లు నన్ను చూస్తూనే పరుగందుకోలేదు. అలాచేస్తే కల్కా బజారుల్లోనూ సందుగొందుల్లోనూ పరుగెత్తలేక నేను సచ్చేవాణ్ని. బాగా నవ్వు మొహం పెట్టి ‘ప్రయాణం బాగా జరిగిందా’ అనడిగాను వాళ్లిద్దర్నీ. ‘యస్సర్‌’ అన్నాడు దే వీందర్‌. ‘నో సర్‌’ అన్నాడు హృదయ్‌. ‘ఆకలిగా ఉన్నారేమో కదా…’ ‘యస్సర్‌’ అన్నారిద్దరూ. ‘మరి ఉదయం బ్రేక్‌ఫ్రాస్ట్‌ ఎగ్గొట్టేశారు. బ్రేక్‌ఫాస్ట్‌ చాలా ముఖ్యమైనది. ఏరోజూ అలా చెయ్యకూడదు..’ ‘కానీ మంచి బ్రేక్‌ఫాస్ట్‌ ఎప్పుడూ ఉండదు..’ అన్నాడు హృదయ్‌. ‘మధ్నాహ్నం, రాత్రి భోజనం కూడా…’ అందుకున్నాడు దేవీందర్‌. ‘వాళ్లు పెట్టే మాంసం గట్టిగా ఉంటుంది, చపాతీలు సాగుతుంటాయి…’ ‘దంతాలకు మంచిది’ అన్నాను. ‘పప్పేమో నీళ్లలాగే ఉంటుంది..’ చెప్పాడు హృదయ్‌. ‘దానిగురించి నేనేం చెయ్యగలనో చూస్తాను. ఇప్పటికైతే నాతోపాటూ టిఫిన్‌ తినండి. తర్వాత మనం మళ్లీ స్కూలుకెళ్దాం..’ అన్నాను. స్టేషన్‌లో ఉన్న రెస్టారెంట్‌కు వాళ్లిద్దర్నీ తీసుకెళ్లి బాగా తిండి పెట్టించాను. స్కూల్లో పెట్టే తిండి కన్నా అదేమంత గొప్పగా లేదు. అందుకని వాళ్లు తినగలిగినన్ని గులాబ్‌ జాముల్ని తినమని పెట్టించాను. సుబ్బరంగా లాగించేసి తిరుగు ప్రయాణంలో కొంచెం ఇబ్బంది పడ్డారు ఇద్దరూ. ఆ శిక్ష చాలు వాళ్లకి. ఒక చిన్న ఉపన్యాసం, ఒక వార్నింగు చాలునని ప్రధానోపాధ్యాయుడికి చెప్పి పెట్టాను. ఆయన కూడా సరేనన్నారు. తల్లిదండ్రులకు చెప్పి పెద్ద రభస చెయ్యడం ఎందుకనుకున్నాం. స్కూల్లో అందరికీ వీళ్లు పారిపోవడం గురించి తె లిసిపోయింది. రెండ్రోజుల పాటు వీళ్లిద్దరూ పెద్ద హీరోలయిపోయారు. మర్నాడు భోజనంలో ప్రత్యేకంగా గులాబ్‌జాములు చెయ్యమని మా వంటాయనకు చెప్పాను. దేవీందర్‌, హృదయ్‌ – ఇద్దరూ వాళ్లకు వడ్డించిన వాటిని ముట్టుకోలేదు! ‘ఆకలిగా లేదేంటర్రా పిల్లలూ’ అనడిగాను. బలహీన మైన చిరునవ్వొకటి ఇద్దరి నుంచీ సమాధానంగా వచ్చింది.

మిస్టర్‌ ఆలివర్స్‌ డైరీ

 పేజీలు : 121, ధర : రూ. 150. ప్రచుర ణ : పెంగ్విన్‌

2 thoughts on “ఆలివర్‌ డైరీ నుంచి…

  1. మంచి పరిచయం చేశారు. ఈ చిన్న కథనం ద్వారా అందరి బాల్యాన్ని గుర్తు తెచ్చారు. కారణం ఏదైనా కాని, మా చిన్నప్పుడు పల్లెల్లో ఎవరైనా బడికి ఎగ్గొడితే మాస్టారు పరుగెత్తడం కాక గుమ్మటాల్లో ఉండే పిల్లలను ఇద్దరిని ముగ్గురిని పంపి ఎగ్గొట్టిన వారిని పట్టుకు రమ్మని పురమాయించేవారు. తప్పించుకోడానికి, పట్టుకోవడానికి మధ్య జరిగే ఆ వేటలో, పరుగుపందెంలో దొరికితే పట్టుకున్న వాళ్లు హీరోలు, పట్టుకోలేకపోతే దొరకనివాళ్లు హీరోలు. ఖర్మగాలిదొరికితే మాత్రం వాళ్ల పని ఆరోజు అయిపోయినట్లే.

    ఈ కథలోని టీచర్ చాలా మంచోడిలా ఉన్నాడు. తిండి పెట్టి మరీ పిల్లలను సుతిమెత్తగా దండించాడు. జీవితాంతం మర్చిపోలేని దండన. చాలా బాగుంది. రస్కిన్ బాండ్.. చందమామ రస్కిన్ బాండ్ కాకపోతే మరెవరు రాయగలరు ఇంత కమ్మగా…

    మీకు అభినందనలు.
    రాజు.
    చందమామ

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s