కోవెల వీధి నుంచి కార్పోరేట్ ప్రపంచంలోకి

చెన్నై అమ్మన్‌ కోవెల వీధి ఇంటి నెంబరు 32లో నివసించే యువతి దమయంతి. వయసు పాతిక నిండిపోతున్న ఆమెకు తగిన వరుణ్ని చూసి పెళ్లి చెయ్యాలనుకుంటారు తల్లిదండ్రులు. దానికి భిన్నంగా కార్పొరేట్‌ ప్రపంచంలో చలాకీ అమ్మాయిగా తనను తాను ఊహించుకుంటూ ఉంటుంది దమయంతి. ఈ కథాంశంతో నిరుపమ సుబ్రమణియన్‌ రాసిన ‘కీప్‌ ది ఛేంజ్‌’ పుస్తకం చదువుతున్నప్పుడు మనల్ని మనం అందులో చూసుకుంటాం. యువ పాఠకులను ఉర్రూతలూగించే కథ, సరదాగా సాగే కథనం ఉన్న ఈ నవల నుంచి కొంత భాగం…

డియర్‌ విక్‌,
అంతరంగ శాంతి, ఆధ్యాత్మిక సమతౌల్యాలను పొందడానికి నువ్వు క్రోచెట్‌ అల్లికల క్లాసుల్లో చేరావా? కొత్త తరహా ధ్యాన పద్ధతుల్లో ఇదొకటనుకుంటాను. ఈరోజుల్లో ఒత్తిడి త గ్గించడానికి, ధ్యానం అంటూ ఏవేవో చేస్తున్నారు. ‘శాంతి కోసం బంగాళదుంపల తొక్క తియ్యడం’ ‘ఆధ్యాత్మిక అంట్లు తోముడు’ అనే వాటికన్నా ‘ప్రశాంతతకు క్రోచెట్‌’ మంచిదేమోలే.

నా సంగతంటావా, అటు పని, ఇటు జీవితం రెండూ కొంత కాలంగా బోరు కొట్టేస్తున్నాయి. ఇంతకాలానికి ఈ కార్పొరేట్‌ సొరంగానికి అవతల కాస్త కాంతి కనిపిస్తోంది. శిక్షణ కార్యక్రమానికి హరీష్‌ నా పేరు పంపించాడు. ‘ఫస్ట్‌ గ్లోబల్‌ ఎసెన్షియెల్స్‌ (ఎఫ్‌జిఈ)’ అనే మూడు రోజుల ట్రైనింగ్‌ ఇది. మామూలుగా అయితే బ్యాంకులో ఆర్నెల్లపాటు పనిచేసి కన్ఫమ్‌ అయినవాళ్లనే ఇలాంటి కార్యక్రమాలకు పంపిస్తారు. కానీ అందులో పాల్గొనాల్సిన ఒకరు మానెయ్యడంతో హరీష్‌ నన్ను పంపిస్తున్నాడు. కార్పొరేట్‌ ప్రపంచంలో ఇప్పుడిప్పుడే అడుగు పెడుతున్న నావంటివాళ్లకిది ఉపయోగపడుతుందని ఆయన చెప్పాడు. దానర్థం నన్ను కన్ఫమ్‌ చేస్తున్నట్టే అనుకుంటా. ఇలాంటిదే మరో కార్యక్రమానికి జిమ్మీ డిసెంబర్‌లో వెళతాడు. మేమిద్దరం ఒకేసారి ఆఫీసులో అందుబాటులో లేకుండా పోతే ఎలా? హుర్రే.. జిమ్మీ కన్నా  నేనెక్కువన్నమాట. మొత్తానికి మూడు రోజుల పాటు గోవాలో గడపబోతున్నా!!

గోవా వెళ్లాలని చాలా ఉబలాటపడేదాన్నిగానీ అమ్మన్‌ కోవెల వీధికి అది చాలా దూరం. మా కుటుంబం సెలవుల్ని గడిపే ప్రదేశాల జాబితాలో గోవా ఎప్పుడూ ఉండేది కాదు. ఊటీ, కొడైకెనాల్‌ వెళ్లాం, నేను మాత్రం ఢిల్లీ వరకూ వెళ్లే సాహసం చేశా. ఎక్కువగా వేసవి సెలవులకు తంజావూరు వెళ్లేవాళ్లం. మా నాన్నమ్మా తాతా అక్కడే ఉంటారు కనుక అందరం కలిసేవాళ్లం. ఢిల్లీలో ఉండే నా కజిన్లు రాధ, రమేశ్‌, కోయంబత్తూరులో ఉండే మోహిని కూడా వచ్చేవాళ్లు. ఇప్పుడంటే నాన్నమ్మ సన్‌ టీవీ సీరియల్స్‌ ఒక్కటి కూడా వదలదుగానీ ఆరోజుల్లో టీవీ ఉండేది కాదు. పిల్లలందరం చెట్లమ్మటాపుట్లమ్మటా చెల్లోపొల్లోమంటూ తిరిగేవాళ్లం. పొలం గట్లమ్మట నడవడం, మావిడి తోటల్లో ఆటలు, పొరుగునున్న కోవెల్లో కళ్లుమూసుకుని దొంగ జపాలు చెయ్యడం… ఇదే మా పని. వయసు పెరుగుతున్న కొద్దీ దొంగపోలీస్‌ వంటి ఆటల నుంచి పేకాటకు క్యారమ్‌ బోర్డుకూ ఎదిగాం. అమ్మాయిలమంతా కలిసిపోయి రమేశ్‌ను ఆటపట్టించేవాళ్లం. రమేశేమో చాలా బుద్ధిమంతుడు. ఎప్పుడూ చూసినా సైన్సు పుస్తకాలు చదువుతూ బుద్ధిగా సెలవుల్లో చెయ్యాల్సిన హోం వర్క్‌ చేసుకునేవాడు. నాకన్నా కొంచెం పెద్దది రాధ. తన బొమ్మల్ని తీసుకొచ్చేది. అందరికన్నా చిన్నదని మోహినిని ఆటల్లో అరటిపండుగా తీసేసేవాళ్లం. మట్టితో చేసిన రంగురంగుల చిన్న లక్కపిడతల్ని నాన్నమ్మ మాకోసం చేయించి ఉంచేది. మేం ఉత్తుత్తి వంటలు చేస్తూ వాటితో గంటలుగంటలు ఎలా ఆడుకునేవాళ్లమో! ఒకసారలాగే ముఖానికి రాసుకునే పౌడరును నీళ్లలో కలిపి పాయసం అని వండేశాం. రమేష్‌ దాన్ని తాగేశాడు కూడా! ఇప్పుడు తను ఎమ్‌ఐటీలో చదువుకుని విదేశాల్లో స్థిరపడ్డాడు, ఎప్పుడైనా వస్తుంటాడు. రాధేమో యేల్‌ యూనివర్సిటీలో అర్థశాస్త్రంలో పీహెచ్‌డీ చేస్తోంది. ఇద్దరూ సంప్రదాయంగా బ్రాహ్మణుల్నే పెళ్లి చేసుకున్నారు. డిగ్రీ పూర్తిచెయ్యబోతున్న మోహినిక్కూడా నాకన్నా ముందే పెళ్లయిపోతుందని అమ్మ మాటల్లో అర్థమయింది. వాళ్ల నాన్న అప్పుడే దానికి సంబంధాలు చూసేస్తున్నారు. మా ఇంట్లో నేనొక్కదాన్నే ఇలా ఉండిపోతానేమో.

సరేలే విక్‌, ఇంతకీ నేనిప్పుడు గోవా చూడబోతున్నాను. వచ్చే వారం ప్రయాణానికి మా ట్రావెల్‌ డెస్క్‌ అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. ప్రయాణానికి ఆహ్వానిస్తూ వచ్చిన ఈమెయిల్‌ను ఆఫీసులో చూశాక, ఆ రోజంతా ఏ పనీ చెయ్యలేకపోయానంటే నమ్ము! ఇరవై మందున్న జట్టులో ముంబై నుంచి వెళ్తున్న ఆరుగురం కాక మరో ఇద్దరే అమ్మాయిలు. నాకు మిగిలిన వాళ్లెవరూ తెలియదనుకో. ఆడ  మగ నిష్పత్తి బానే ఉంది. గోవాలో డోనా పిలర్‌ రిసార్టులో ఉంటాం. దానికి ప్రైవేట్‌ బీచ్‌ కూడా ఉంది. మా ట్రైనింగ్‌ వివరాలు చూస్తే ఉక్కిరిబిక్కిరిగా ఉంది. ఫస్ట్‌ గ్లోబల్‌లో పెద్ద తలకాయల ఉపన్యాసాల సీడీలు చూడటం, ఫస్ట్‌ గ్లోబల్‌ విలువలు, పనితీరు గురించి అర్థం చేసుకోవడం, రెండోరోజు కమ్యూనికేషన్‌, ప్రెజెంటేషన్‌, మూడోనాడు టీమ్‌ బిల్డింగ్‌కు కావాల్సినవి నేర్చుకోవడం. బ్యాంకు ఆర్థిక విషయాల మీద చావగొట్టేస్తారేమో అనుకున్నానుగానీ ఇవేవో కాస్త పర్లేదు. గోవా సముద్రం మీంచి వస్తున్న చల్లగాలి అప్పుడే నన్ను తాకుతోంది.

గోవా బీచ్‌లో నేనెలా ఉంటానంటే : ఒక అద్భుతమైన బికినీ టాప్‌, దానికి మ్యాచింగ్‌ నల్లటి సారంగ్‌ వేసుకుని వెన్నెల్లో హిప్పీలా సంతోషంగా డ్యాన్స్‌ చేస్తుంటా. ఒకవైపు మంచి పాటలు, మరోవైపు సముద్రపు అలల చప్పుడు.. అక్కడ నేను ఒకచేతిలో వైన్‌ గ్లాస్‌ పట్టుకుని నవ్వుతుంటా… చాలా అందంగా మంచి కండలున్న యువకుడు వచ్చి నాతో డ్యాన్స్‌ చేస్తాడు. నన్ను దగ్గరగా లాక్కుని ‘నువ్వేనా ఎఫ్‌జీఈ నుంచి వచ్చింది’ అనడుగుతాడు.

నేను ఈమెయిల్‌ చూస్తుంటే జిమ్మీ వచ్చి నా కంప్యూటర్‌లోకి తొంగిచూస్తున్నాడు. అలా చెయ్యొద్దని చెబితే ‘ఆ.. నీకేదో గొప్ప ముఖ్యమైన మెయిల్స్‌ వస్తున్నట్టు…’ అని గేలిచేస్తాడు. దురదృష్టవశాత్తూ అది నిజమేలే. వేరే ఎవ్వరూ చూడకూడని మెయిల్స్‌ నాకేం రావు నిజానికి. అలా వస్తున్నట్టు నేనే కాస్త నటిస్తుంటాను.జిమ్మీ గోవా చాలాసార్లే వెళ్లాడట. వాళ్ల ఫేమిలీ ఫ్రెండొకరికి అక్కడ పెద్ద బంగళా కూడా ఉందట. వచ్చేసారి తను వెళ్లేప్పుడు ఎఫ్‌జీఈ కార్యక్రమం ఇప్పటి కన్నా అందమైన ప్రదేశంలో జరగాలని జిమ్మీ ఆశపడుతున్నాడు. నా మొహానికి గోవానే పెద్ద అందమైన ప్రదేశం. నాకెంత ఉత్సాహంగా ఉందంటే మా అమ్మానాన్నలకు వెంటనే ప్రయాణం గురించి చెప్పెయ్యాలనిపించింది.
‘గోవానా? ప్రస్తుతం గోవా అంత మంచి ప్రదేశం కాదనుకుంటాను. పర్యాటకులను చంపేస్తున్నారట అక్కడ’ అంది అమ్మ.
నా లోపలి గొంతు : ‘సోమవారం ఉదయం మన మౌంట్‌ రోడ్డెంత భద్రమైనదో గోవా కూడా అంతే మంచిదమ్మా…’
నేను : ‘లేదమ్మా.. అది మంచి ప్రదేశమే…’
అమ్మ : ‘గోవాలో తెగ తాగుతారని విన్నాను. నువ్వు అలాంటి పనులేం చెయ్యకు…’
లోపలి గొంతు : ‘సారీ అమ్మా. అక్కడేం దొరికితే వాటిని నేను రుచి చూడొద్దా.. ఉదయం కాఫీకి బదులు కాస్త వైన్‌ తాగుదామనుకుంటున్నా…’
నేను : ‘సరేనమ్మా’
అమ్మ : ‘నువ్వు బైట మాట్లాడేప్పుడు జాగ్రత్త. అక్కడ కొందరు నానా చెత్తా అమ్ముతుంటారు. అవి చాలా ప్రమాదకరం…’
లోపలి గొంతు : ‘నువ్వు చెబుతున్నది మత్తుపదార్థాల గురించే కదా. గోవాలో మూడు రోజులున్నంత మాత్రాన మాదక ద్రవ్యాలకు బానిసనయిపోతానా…?’
నేను : ‘లేదమ్మా…’
అమ్మ : ‘ఏమిటీ?’
నేను : ‘లేదమ్మా.. అలాంటి వాటితో నేను జాగ్రత్తగా ఉంటానnటున్నా..’
అమ్మ : ‘చూడు దమయంతీ అక్కడ పిచ్చిపిచ్చి పనులేం చెయ్యకు. ఆఫీసయితే జాగ్రత్తగానే ఉంటుందనుకో…’
లోపలి గొంతు : ‘గోవా వెళ్లగానే నేను పిచ్చెక్కిపోతాను, మొట్టమొదట ఎవడు కనిపిస్తే వాడితో వెళ్లిపోతాను….’
నేను : ‘నేను జాగ్రత్తగానే ఉంటానమ్మా.. ఉంటానేం..’
ఫోను పెట్టేశాను. సారీ అమ్మా. ఇది జీవితంలో నా మొదటి హాలీడే. నేను ఎప్పట్నుంచో చెయ్యదలుచుకున్నవన్నీ చెయ్యకుండా దాన్ని చెడగొట్టుకుంటానా?
ప్రేమతో
నీ దమయంతి.
———————————–
కీప్‌ ది ఛేంజ్‌
పేజీలు : 358 వెల : రూ. 199.
ప్రచురణ : హార్పర్‌ కొలిన్స్‌

One thought on “కోవెల వీధి నుంచి కార్పోరేట్ ప్రపంచంలోకి

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s