మొఘలులపై మరో పుస్తకం

1530 సంవత్సరం, ఉత్తర భారతంలోని ఆగ్రా… మొఘలుల చరిత్రలో రెండో చక్రవర్తిగా అప్పుడే కొత్తగా సింహాసనాధీశుడైన హుమయూన్‌ అదృష్టవంతుడనే చె ప్పుకోవాలి. కైబర్‌ కనుమల నుంచీ దక్షిణంగా కొన్ని వేల మైళ్ల విస్తారమైన సామ్రాజ్యం, సంపద, వైభవం ఉట్టిపడే రాజ్యాన్ని అతని తండ్రి బాబర్‌ హుమయూన్‌కు అప్పగించి పోయాడు. దాన్ని నిలుపుకోవడం అతనికి శక్తికి మించిన పనయింది. హుమయూన్‌ శక్తిసామర్థ్యాల మీద పెద్ద నమ్మకంలేని సవతి సోదరులు పోరుకు తెగబడ్డారు. ఆనాటి చరిత్రను కళ్లకు కట్టినట్టు వర్ణించే నవల ‘ఎంపైర్‌ ఆఫ్‌ ది మొఘల్‌ బ్రదర్స్‌ ఎట్‌ వార్‌’. తొలి నవల ‘రెయిడర్స్‌ ఫ్రమ్‌ నార్త్‌’తో పేరు తెచ్చుకున్న అలెక్స్‌ రూథర్‌ఫర్డ్‌ మలి నవలే ఇది. దీన్నుంచి కొన్ని ఆసక్తికరమైన భాగాల అనువాదం…

‘పరిపాలన విధానాన్ని మార్చెయ్యాలని నేను నిర్ణయించుకున్నాను. ఇప్పుడున్న సభ నేననుకున్నట్టు లేదు’
హుమయూన్‌ సింహాసనంముందు అర్థచంద్రాకారంలో కూర్చున్న అతని ఉద్యోగులు ఆశ్చర్యంతో ఒకర్నొకరు చూసుకున్నారు. బైసంఘార్‌, కాసింల అయోమయపు చూపులు అతని దృష్టిని దాటిపోలేదు. పర్లేదు. తన ఆలోచనలు ఎంత అద్భుతంగా ఉన్నాయో త్వరలోనే వాళ్లకు అర్థం అవుతుంది. రోజువారీ రాచకార్యాల భారం వదిలాక తాను తీసుకునే నల్లమందు ప్రభావంలో వచ్చే కలలు ఇంత గొప్ప ఆలోచనల్నివ్వగలవని వాళ్లకు తెలీదుకదా. ఆ ప్రభావంతోనే తన ఆలోచనలు స్ఫటిక స్వచ్ఛతతో పరుగులు తీస్తున్నాయి. ఒక లక్ష్యం ఉన్న తన కలలు, ఆలోచనలూ నక్షత్రాల్లో రాసి పెట్టున్నాయి, అక్కణ్నుంచే వస్తున్నాయి మరి…
హుమయూన్‌ తన కుడిచేతిని పైకెత్తగానే ముదురు గోధుమ రంగు దుస్తుల్లో అక్కడే ఉన్న సన్నటి జ్యోతిష్యుడు షరాఫ్‌ ఒక భారీ పుస్తకాన్ని తీసుకొచ్చి పెట్టాడు. హుమయూన్‌ లేచి తాననుకున్న పేజీ దొరికేదాకా దాన్ని తిప్పాడు. తన పూర్వీకుడు – గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుడు – తైమూరు మునిమనవడు ఉలగ్‌బేగ్‌ గీసిన పటం కనిపించింది. గ్రహగతుల్ని వివరించే ఆ పటాన్ని చూస్తున్నప్పుడు అవి నిజంగానే తిరుగుతున్నట్టు అనిపించింది హుమయూన్‌కి. నెమ్మదిగా మొదలైన వాటి భ్రమణం వెంటనే ఊపందుకుంది… ఒకదాన్నొకటి తరుముతున్నట్టు అనిపించింది. ఒకసారి కళ్లుమూసి తెరిచి మళ్లీ చూశాడు. ఆ పటంలో నిశ్చలంగా ఉన్నాయి. గతరాత్రి తీసుకున్న నల్లమందు ప్రభావమయి ఉండాలి. సవతి తల్లి గుల్‌రుఖ్‌ తనకోసం ప్రత్యేకంగా పాళ్లు కలిపి పంపే ఈ మాదకద్రవ్యం చాలా శక్తిమంతంగా పనిచేస్తుంది. దానివల్లే అతను బారెడు పొద్దెక్కేదాకా లేవలేకపోతున్నాడు.
అకస్మాత్తుగా హుమయూన్‌కు తానున్న సభ, తనవైపే తీక్షణంగా చూస్తున్న రాజోద్యోగుల గురించి స్ఫురించింది.  వాళ్లిక్కడున్నట్టే మరిచిపోయాడు ఇంతసేపూ. తనను తాను కూడదీసుకున్నాడు. ‘మా పూర్వీకులు ఉలగ్‌ బేగ్‌ వలెనే నేను కూడా నిరంతరం సాగే గ్రహాలు, నక్షత్రాల గతుల గురించి బాగా అధ్యయనం చేశానని మీకు తెలుసు. బాగా ఆలోచించిన మీదట నేను తెలుసుకున్నదేమంటే ఆయన ప్రతిపాదనలను మించి వ్యవహరించాల్సిన సమయం ఇదే. పరిపాలనను నక్షత్రాలకు, గ్రహాలకు అనువుగా రూపొందించుకుంటే బావుంటుంది.’
తానేం మాట్లాడుతున్నాడో వాళ్లకంత బాగా అర్థం కాలేదని వాళ్లను చూసిన హుమయూన్‌కు అర్థమయింది. పాపం వాళ్లకెలా అర్థమవుతుంది? నల్లమందు ప్రభావంలో తన బుర్ర దూరతీరాలు ప్రయాణించి చూసినదేదో వాళ్లు చూడలేదుగదా! అయితేనేం, తన ప్రభుత్వంలో చెయ్యదల్చుకున్న గొప్ప అభివృద్ధి గురించి వాళ్లే ముందు తెలుసుకోవాలి.
‘గ్రహాలు, నక్షత్రాలు చాలా విషయాలను నిర్దేశిస్తాయి. మనకెన్నో విషయాలు నేర్పించే గురువులు అవి. అందువల్ల అవి చెప్పినట్టే నేను నడచుకోదల్చుకున్నాను. ఉదాహరణకు ఇవాళ ఆదివారం. నేటికి సూర్యుడు అధిపతి. సార్వభౌమత్వానికి అధిపతి అతడే. అందువల్ల నేను ప్రతి ఆదివారం పసుప్పచ్చని దుస్తులు ధరిస్తాను, రాజ్యానికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తాను. చంద్రుడు అధిపతి అయిన ప్రతి సోమవారంనాడూ ప్రశాంతతనిచ్చే ఆకుపచ్చని దుస్తులు ధరిస్తాను, విశ్రాంతి తీసుకుంటాను. కుజుడు సైన్యాధిపతి. అతడు చూసే మంగళవారాలన్నిటా నేను ఎర్రని దుస్తులు ధరించి యుద్ధం, న్యాయం సంబంధిత అంశాలను పర్యవే క్షిస్తాను. ప్రధానమైన తీర్పులన్నీ ఆరోజే. మంచివారికి బహుమానాలు అందించడానికి కోశా«ధికారి సిద్ధంగా ఉంటారు, అలాగే నేరస్తులకు శిక్షలు అమలుచెయ్యడానికి ఎర్రటి గొడ్డలి పట్టుకున్న తలారులు నా సింహాసనం వద్దనే సిద్ధంగా ఉంటారు. శనిగ్రహం చూసే శనివారం, గురువు అధిపతియైన గురువారాల్లో మతం, అధ్యయనం అంశాలను చూస్తాను. బుధుడు అధిపతియైన బుధవారాల్లో  గాఢమైన ఊదారంగును ధరించి సంతోషకరమైనవాటిపై పరిపాలన సాగుతుంది. చక్కని నీలాన్ని ధరించిన శుక్రవారాలు మాత్రం ఏ అంశమైనా చర్చకు రావొచ్చు. నా సభాభవనం బయట ఉన్న ఢంకాను మోగించి స్త్రీలు పురుషులు, పేదాగొప్పా తారతమ్యాలేం లేకుండా ఎవరైనా సరే నేరుగా నన్ను కలిసి వారి ఆలోచనలను విన్నవించుకోవచ్చు. తగిన న్యాయం పొందవచ్చు.’
ఊపిరి తీసుకోవడానికన్నట్టు హుమయూన్‌ కాస్త ఆగాడు. అప్పటివరకూ ఆయన చెబుతున్న విషయాలను చకచకా సభావ్యవహారాల పుస్తకంలో నమోదు చేస్తున్న కాసిం కూడా కాస్త ఆగాడు. హుమయూన్‌ ఆలోచనలేమిటో అర్థం కాక రాజోద్యోగులు ఒకర్నొకరు అయోమయంగా చూసుకున్నారు. యాంత్రికంగా సాగే గ్రహగ తుల్లో పరిపాలన మార్గాలు రాసి ఉండటమేమిటో, అవి అలాగే క్రమపద్ధతిలో సాగడం ఏమిటో వాళ్లకేమీ అవగతం కాలే దు. ఒకటిరెండు క్షణాల తర్వాత హుమయూన్‌ కొనసాగించాడు.
‘అగ్ని, వాయువు, నీరు, భూమి అనే నాలుగు అంశాల ఆధారంగా నా ప్రభుత్వ కార్యాలయాలను కూడా పునర్‌ వ్యవస్థీకరించాలనుకుంటున్నాను. అగ్ని కార్యాలయం సైనిక పద్ధతులను పర్యవేక్షిస్తుంది. వాయు కార్యాలయం రాజ వంటశాల, దుస్తులు మొదలైనవాటిని చూసుకుంటుంది. రాజ్యంలోని నదులు, కాలువల వంటివన్నీ నీటి శాఖ చూసుకుంటే భూమి శాఖ వ్యవసాయం, తత్సంబంధ నిధుల వ్యవహారాలను చూస్తుంది. ఇకపై ప్రతి చర్యా గ్రహగతుల ఆధారంగా జరుగుతుంది. నా ఉద్యోగులైన మీకు కూడా వాటి ఆధారంగానే స్థానాలు నిర్ణయిస్తాం. ఉద్యోగుల్లో మూడు రకాలుంటారని గ్రహాలు చెబుతున్నాయి. ఆలోచనాపరులైన అధికారులు, సైన్యాధ్యక్షులు మొదటి తరగతికి చెందినవారు. సామ్రాజ్యం సుభిక్షంగా ఉండటానికి మరో రెండు వర్గాలు అవసరం. మతాధికారులు, వేదాంతులు, జ్యోతిష్యులు మొదలైనవారంతా రెండో వర్గం. ఆకాశాన్ని నక్షత్రాలు అలంకరించినట్టుగా మన జీవితాల్ని అలంకరించే కవులు, రచయితలు, గాయకులు, నాట్యకారులు, కళాకారులంతా మూడో వర్గం. ఒకో వర్గమూ పన్నెండు స్థాయులుగా ఉంటుంది. ప్రతిదానిలోనూ ఉన్నత -మధ్య – అధమ – అనే మూడు తరగతులుంటాయి. ఎవరెవరు ఏ విభాగంలో ఉండాలో నేను మళ్లీ ఆలోచించి చెబుతాను. ప్రస్తుతానికి ఇక దయచేయండి. నేను చాలా విషయాలు ఆలోచించుకోవాలి.’
ఉద్యోగులంతా వెళ్లిపోయిన తర్వాత హుమయూన్‌ ఉలగ్‌బేగ్‌ పత్రాలను తదేక దీక్షతో పరిశీలించడం మొదలెట్టాడు. అలా ఎన్ని గంటలు గడిచాయో అతనికే తెలియదు. సూర్యకాంతి అంతా క్షీణించిన తర్వాత నల్లమందూ మద్యం అతనికి గుర్తొచ్చి తన అంతఃపురం వైపు వడివడిగా అడుగులు వేశాడు.

పుస్తకం వివరాలు :
ఎంపైర్‌ ఆఫ్‌ ది మొఘల్‌ బ్రదర్స్‌ ఎట్‌ వార్‌
రచయిత : అలెక్స్‌ రూథర్‌ఫర్డ్‌

ప్రచురణ : హేచెట్‌ ఇండియా
పేజీలు : 436, ధర : 495రూ.

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s