మదర్స్ డే వచ్చేస్తోందోచ్

ప్రతి జీవికీ రెండు కళ్లూ రెండు చెవులూ ఉంటే అమ్మలకు మాత్రం ఒళ్లంతా కళ్లే – బిడ్డలను జాగ్రత్తగా చూసుకోవడానికి! ఒళ్లంతా చెవులే – వాళ్ల ముచ్చట్లు వినడానికి. అలాంటి అమ్మ గొప్పదనం వివరించే పది కథల సమాహారమే ‘మామ్‌ అండ్‌ మీ’ పుస్తకం. పదిమంది రచయితలు రాసిన ఈ కథల్లో – పిల్లల కోసం అష్టకష్టాలూ పడి కంప్యూటర్‌ నేర్చుకున్న తల్లి, కొడుకు కోసం తాను అమితంగా ప్రేమించే కుక్కను వదులుకునున్న తల్లి, పారిపోయిన బిడ్డ కోసం అంగలార్చే తల్లి… వీళ్లే కాదు, చీటికీమాటికీ విసుక్కునే తల్లి, పిల్లలకోసం ఏమీ చెయ్యలేని నిస్సహాయమైన తల్లి – ఇలా రకరకాల అమ్మలు ఈ పుస్తకంలో కనిపిస్తారు. కేవలం పది కథలే కాకుండా, ‘మదర్స్‌ డే’ రోజున అమ్మలకు స్వయంగా మన చేత్తో చేసివ్వదగిన 25 బహుమతులు, వాటి తయారీ విధానాలు ఈ పుస్తకానికి ప్రత్యేకం. వచ్చే ఆదివారం (మే 9) మదర్స్‌ డే సందర్భంగా ‘మామ్‌ అండ్‌ మీ’ నుంచి ఒక భాగం అనువాదం ఇక్కడ…

మామ్‌ అండ్‌ మీ – 10 సూపర్‌ స్టోరీస్‌ అబౌట్‌ మామ్స్‌
పేజీలు : 124,

ధర : రూ.125.
ప్రచురణ : హాచెట్స్‌
‘పిచ్చి పిల్లాడు పీఛూ.. వెర్రాడు.. పిచ్చబ్బాయ్‌’ పిల్లలంతా అరుస్తూ పీఛూ చుట్టూ తిరుగుతూ గెంతుతున్నారు. పీఛూ మోచేతి మడతలో తన ముఖాన్ని దాచేసుకున్నాడు. కిందకి కిందకి వంగిపోయాడు. అందువల్ల తనను వెక్కిరిస్తున్నవాళ్లను సరిగ్గా చూడలేకపోయాడు. నిజానికి వాళ్లేమంటున్నారో కూడా వాడికి అర్థం కాలేదు. తనపట్ల సరిగా ప్రవర్తించడం లేదని మాత్రం అర్థమయింది.

‘పిల్లలూ, అల్లరి ఆపండి. మీచోటికి వెళ్లి కూచోండి’ ఉపాధ్యాయిని గద్దించింది. ఎవరి స్థానానికి వాళ్లు వెళ్లిపోయారు. పీఛూ దగ్గరగా వెళ్లి నిల్చుని ఆమె ‘నేనిచ్చిన రంగుసుద్దముక్కనేం చేశావో చెప్పు…’ అని గట్టిగా అడిగింది. ఆమె స్వరం తీవ్రంగా ఉంది. అది అతన్ని బిగుసుకుపోయేలా చేసింది.
‘వాడు దాన్ని తినేశాడు టీచర్‌ – నేను చూశాను’ వెనకనుంచి ఎవరో చెప్పారు.
‘తెలివితక్కువగా మాట్లాడకు. పిచ్చాళ్లే అలా తింటారు..’ అందామె. ఆ మాటనడమే తప్పయింది. ‘పిచ్చి పిల్లాడు పీఛూ.. వెర్రాడు.. పిచ్చబ్బాయ్‌’ పిల్లలు మళ్లీ అందుకున్నారు.
‘సైలెన్స్‌’ టీచర్‌ గద్దించింది.
‘వాడికి పిచ్చి టీచర్‌, మా అమ్మ చెప్పింది – అతనికి పిచ్చని’ ఎవరో అన్నారు.
నేల మీద మూటలాగా బిగుసుకుపోయిన పీఛూని విడదియ్యాలని ప్రయత్నించింది టీచర్‌. ఎనిమిదేళ్ల వయసే అయినా బరువుగా ఉన్న వాడిని కదపలేకపోయిందామె. రంగు సుద్దముక్క కోసం అతని జేబుల్లో వెతికింది. ‘రాళ్లేంటీ?’ పీఛూ కొత్త స్కూలు యూనిఫామ్‌ జేబుల్లోంచి బయటపడినవి గులకరాళ్లే. అవి అతనికెంతో విలువైనవి. ఆమెకవి అంతగా నచ్చలేదని ఆమె గొంతు వింటూనే పీఛూ గ్రహించగలిగాడు. ‘లేదు.. లేదు..’ అని గొణుక్కుంటూనే నేల మీద పడిపోయిన వాటిని చేత్తో ఓ కుప్పగా చేసే ప్రయత్నంలో పడ్డాడు.
‘లే, నిలబడి ఆ రంగు సుద్దముక్కనేం చేశావో చెప్పు..’ గద్దించింది టీచర్‌. ‘వాడు దాన్ని తినేశాడు టీచర్‌. అతని నోరు చూడండి ఎర్రగా ఎలా ఉందో..’ ఎవరో చెప్పారు.
టీచర్‌ పీఛూ భుజాలు పట్టుకుని విసురుగా కదిపింది. చేతుల వంక చూసి అలాగే వదిలేసింది. దాంతో పీఛూ మళ్లీ నేల మీద మూటలా ఉండిపోయాడు. సరిగ్గా అప్పుడే వాళ్లమ్మ వాణ్ని చూసింది. మధ్యాహ్నం ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిందామె. టీచర్‌తో చాలాసేపు మాట్లాడిన తర్వాత వాణ్ని లేపి నడిపించుకుంటూ తీసుకెళ్లింది. వాళ్లిద్దరూ మాట్లాడుతున్నప్పుడు అమ్మ గొంతులో వేదన ఆ అబ్బాయికి తెలిసింది.
పీఛూకి స్కూల్లో అదే మొదటి రోజు. అదే ఆఖరుది కూడా. అందరిలాగే అతను ఉదయం కొత్త బట్టలు వేసుకుంటున్నప్పుడు చాలా సరదా పడ్డాడు. ఇప్పుడు అదంతా బెడిసిపోయిందని వాడికెలాగో అర్థమైపోయింది. రంగు సుద్ద ముక్కను నములుతున్నప్పుడు కారిన చొంగతో వాడి తెల్లటి కొత్త చొక్కా మీద ఎర్రటి చారిక ఏర్పడింది. స్కూలు వాణ్ని గెంటేసింది.
స్కూలు అంకం అంతటితో ముగిసిపోయినా, పీఛూ తన కొత్త యూనిఫాం వేసుకోవడం మాత్రం మానలేదు. దాంతోనే వాడు పక్షులను పట్టుకునే ఆటలో ములిగిపోయేవాడు. శిథిలమైపోతున్న భవనంలో మెట్ల కిందన చిన్న గదిలో వాళ్లమ్మ నివాసం. ఎదురుగా కడుతున్న భవనం దగ్గర ఇసుకలో గులకరాళ్లను వెతుక్కోవడం వాడికిష్టమైన వ్యాపకం. నున్నటి రాయేదైనా దొరికినప్పుడు వాడు దాన్ని అదే పనిగా తన చేతుల్లో తిప్పుతూ ఉండేవాడు లేదా తన ముఖానికేసి రుద్దుకునేవాడు. పని ముగించుకుని వాళ్లమ్మ రాగానే పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెని చుట్టేసి రాళ్లను ఆమె ముఖానికేసి రుద్ది, నచ్చాయో లేదోనన్నట్టు చూసేవాడు. గులకరాళ్లంటే పీఛూకి చాలా ఇష్టం. తల్లి పాత హ్యాండ్‌బ్యాగ్‌ నిండా వాటిని నింపేసేవాడు. కొన్ని చాలా ప్రేమతో బహుమతిగా ఇచ్చినవి. కొన్ని తనకు సంతోషం కలిగినప్పుడు ఇచ్చినవి. కొన్ని ఆమెను ఏడిపించినందుకు ‘సారీ’ చెబుతున్నట్టు ఇచ్చినవి. ఎక్కువభాగం ఆమె బాధతో, కోపంతో, నిస్సహాయతలో ఏడుస్తున్నప్పుడు ఇచ్చినవే.
పీఛూ వాళ్లమ్మ కార్పొరేషన్‌ ఆఫీసులో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసేది. అది వాళ్లింటికి దగ్గరే కావడంతో మధ్యలో వచ్చి వాడికింత తిండి పెట్టేసి, అవసరమైతే కాస్త శుభ్రం చేసి, బాత్‌రూమ్‌కు పంపి మళ్లీ గదికి తాళం వేసేసేది. కొడుక్కి మూడేళ్ల వయసున్నప్పుడే ఆమె భర్త వీళ్లిద్దర్నీ విడిచిపెట్టేసి వెళ్లిపోయాడు. పీఛూ వాళ్లమ్మకు వాడికేమైనా చెప్పి నేర్పించేంత ఖాళీ ఉండేది కాదు. మెట్లమీంచి వెళ్లే ఇరుగుపొరుగులతో ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు ఆమె గొంతు చాలా బాధగా ఉండేది. ‘నా ఖర్మ ఎట్లా కాలిందో చూడండి. మొగుడేమో వదిలేసిపోయాడు, నన్ను ముసలితనంలో చూడటానికి ఈ వెర్రికొడుకొకడు…’ అంటూ సాగేది. వాడు మాత్రం ఇసుకలో గులకరాళ్ల వేట సాగిస్తూ పరమ సంతోషంగా ఉండే వాడు. తోటిపిల్లలు స్కూలుకెళుతున్నప్పుడు వాడు తలెత్తి చూసేవాడు కాదు. వాళ్లు మాత్రం ‘పిచ్చి పీఛూ, మాతో వస్తావా, నీకు టీచర్‌ తినడానికి రంగుసుద్దముక్కలిస్తుంది…’ అంటూ వేళాకోళం చేసేవారు. రాత్రి పూట ట్రక్కులు వచ్చి మరింత ఇసుకను అక్కడ పోస్తున్న శబ్దాన్ని వాడు జాగ్రత్తగా వినేవాడు.
‘ఈ ఇసకనంతా ఎవరిలా రోడ్డు మీద పోసింది..’ స్వరం వినిపించిన వైపు చూశాడు వాడు. చక్రాల కుర్చీలో ఒక స్త్రీ. ఆ ఇసుకలో ఆమె చక్రాలు కూరుకుపోయాయి.. వాటిని తొయ్యలేక ఆమె అవస్థ పడుతోంది. ‘నాక్కొంచెం సాయం చెయ్యి..’ ఆమె అడిగింది. నోరు తెరుచుకుని పళ్ల మధ్య నాలుకను నొక్కి పెట్టి నవ్వుతున్న వాడేమీ మాట్లాడలేదు.
‘వాడికి బుర్ర సరిగా లేదు..’ వెనకనుంచి వచ్చిన వాళ్లమ్మ చెప్పింది. ఆ పెద్దావిడకు చక్రాల కుర్చీ ముందుకు కదలడంలో సాయం చేసింది.

(మార్గరెట్‌ భట్టీ రాసిన ‘పీఛు’ కథ నుంచి కొంత భాగం ఇది.)

Advertisements

One thought on “మదర్స్ డే వచ్చేస్తోందోచ్

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s