గుడ్ జాబ్ పుష్పాంజలి గారూ…

దేశంలో పశువుల వైద్యురాలిగా పట్టానందుకున్న మొట్టమొదటి మహిళ ఎవరో తెలుసా?
–  డాక్టర్‌ సక్కుబాయి రామచంద్రన్‌.
మొదటి వైద్యురాలు ఎవరు?
– ముత్తులక్ష్మిరెడ్డి. 1907లో వైద్య కళాశాలలో అడుగుపెట్టిన తొలి మహిళ ఆమే. మొదటి మహిళా హౌస్‌సర్జన్‌, బ్రిటిష్‌ ఇండియాలో మొదటి లెజిస్లేటర్‌.. ఇలా చాలావాటిలో ‘తొలి’ మహిళ ఆవిడే.
వీళ్లేకాదు, గజ ఈతరాలు నిషామిల్లెట్‌, సామాజిక శాస్త్రవేత్త – ఉద్యమకారిణి రోహిణి రెడ్డి, ఫిట్‌నెస్‌ నిపుణురాలు వనితా అశోక్‌, మార్షల్‌ ఆర్ట్స్‌లో ఆరితేరిన వందనారావు, కాఫీ టేస్టర్‌ సునళినీ మీనన్‌, గ్రాఫిక్స్‌ డిజైనర్‌ సుజాతా కేశవన్‌ గుహ… ఇలాంటి ఎంతోమంది విజేతలైన బెంగుళూరు మహిళల గురించి తెలియజేసే పుస్తకం ‘డి ఫ్యాక్టో’. దీనికి రూపకల్పన చేసింది కూడా ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిని అయిన మహిళే. బెంగుళూరులో ఆర్కిటెక్ట్‌గా, బిల్డర్‌గా, వ్యాపారవేత్తగా రాణిస్తున్న పుష్పాంజలిరెడ్డి యాభయ్యేళ్ల వయసులో కూడా పది కిలోమీటర్ల మారథాన్‌ పరుగుకు రెడీ. ఆమె రచించిన ఈ పుస్తకానికి ఇప్పుడు బోలెడంత జనాదరణ లభిస్తున్న సందర్భంగా పుష్పాంజలిరెడ్డితో టెలిఫోన్‌లో జరిపిన మాటామంతీ వివరాలు…

‘ఈ తరహా పుస్తకం తీసుకురావడం సాధ్యమేనా, అసలు తగినంత సమాచారం దొరుకుతుందా’ అని మొదట్లో చాలామంది సందేహపడేవాళ్లు. ఎందుకొచ్చిన తంటాలు నీకు అంటూ ఇంట్లోనూ పెద్దగా ప్రోత్సాహమివ్వలేదు. నెమ్మదిగా నా ఆలోచనను అందరూ అర్థం చేసుకొన్న తర్వాత దారి సులువయింది..’అన్నారు పుష్పాంజలి తొలినాటి ఇబ్బందులను గుర్తుచేసుకుంటూ.  ప్రస్తుతానికి పుస్తకంలో బెంగుళూరుకు సంబంధించిన విశేషాలనే గుదిగుచ్చారు. ‘డి ఫ్యాక్టో’లో ఎక్కువమందిని ఆకట్టుకున్నది ‘ఫేమస్‌ ఫస్ట్‌’ విభాగం. ‘నాకు వ్యక్తిగతంగా కూడా నచ్చింది ఇదే. ఈ విభాగంలో అవరోధాలను అధిగమించి మొట్టమొదటిగా ఒక స్థానాన్ని అందుకున్న అతివల గురించి రాశాను. తమ కాళ్ల మీద తాము నిలబడి, సవాళ్లతో కూడిన వృత్తివ్యాపారాల్లోకి మహిళలు రావడం రోజురోజుకీ పెరుగుతోంది. ఆడ మావ టులు, అపరాధపరిశోధకులు, పైలెట్లు, ఆటోడ్రైవర్లు, పురోహితులు… ఎందరో కనిపిస్తున్నారు. ఆడవారు తల్చుకుంటే చెయ్యలేనిది లేదన్న మాటను నిరూపిస్తున్నారు. అటువంటివారి గురించి చెబుతూ మరికొందరు అమ్మాయిలకు స్ఫూర్తినివ్వడానికే నేనీ పుస్తకం రాశాను. అమ్మాయిల కలలు భారీగా ఉండాలి, వాటిని నిజం చేసుకోవడానికి వాళ్లు అంతే కృషి చెయ్యాలి. నా పుస్తకం కేవలం విజయాలను స్ఫూర్తిదాయకంగా వర్ణించి ఊరుకోదు. విజేతలు ఎన్ని కష్టనష్టాలను ఎదుర్కొన్నారో ఎంతెంత కష్టమైన ప్రయాణాలను చేశారో కూడా వివరిస్తుంది. అపారమైన అవకాశాలను అందుకోవడానికి కృషి చేస్తున్న అమ్మాయిలకు అవి చాలా ప్రేరణనిస్తాయి..” అంటున్న పుష్పాంజలి ‘డి ఫ్యాక్టో’ లో వేరే విభాగాలు కూడా ఉన్నాయి.

అన్నీ ముఖ్యమే..
ఒక డైరెక్టరీలాగా మలచిన ఈ పుస్తకంలో స్త్రీలు తప్పనిసరిగా తెలుసుకోవలసిన సమాచారాన్ని కొంత అందించారు పుష్పాంజలి. మహిళల కోసం పనిచేసే బోలెడన్ని సంస్థలు, వారికోసం లభ్యమయ్యే సేవల వివరాలన్నీ చేర్చి పుస్తకానికి అదనపు విలువను చేకూర్చారామె. ‘డి ఫ్యాక్టో’ పుస్తకం కోసం పుష్పాంజలి ఎంత శ్రద్ధ పెట్టారంటే, దానిలో చే ర్చిన చిట్టిపొట్టి  సంగతులు కూడా అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. ఉదాహరణకు ఇవి చూడండి.
* ధర్మవరం చేనేత కళాకారులు రూపొందించిన ‘స్వరమాధురి’ చీర దాదాపు రెండొందల పాటల్ని మైక్రోస్పీకర్ల ద్వారా పలికిస్తుంది.
* పూణెలోని ఒక సంస్థ ప్రత్యేకంగా కోర్సును రూపొందించి ఆసక్తి ఉన్న మహిళలకు పౌరోహిత్యంలో శిక్షణనిస్తోంది.
* ఆ రాష్ట్ర పర్యాటక శాఖ రూపొందించిన ‘ప్రియదర్శిని’ ప్రాజెక్టులో భాగంగా ఆడవారికి వాహనాలను నడపడంలో, విదేశీ పర్యాటకులతో వ్యవహరించేప్పుడు ఉండాల్సిన తీరుతెన్నుల్లో ప్రత్యేక శిక్షణనిస్తారు. వీటిని ఉపాధిగా మార్చుకున్న పడతులెందరో.

కృషికి తగ్గ సంతృప్తి
ఇటువంటి సమాచారాన్ని సేకరించాలంటే ఎందరో మనుషులు ఎంతో సమయాన్ని ఇతర వనరులనూ వెచ్చించి పని చేయాలి. అలాంటిది ‘డి ఫ్యాక్టో’ను ఒంటి చేత్తో తీసుకొచ్చారు పుష్పాంజలి. సమాచారాన్ని సేకరించడం, క్రోడీకరించడం, పుస్తకానికి అవసరమైన నిధులను సేకరించడం, ప్రచురణ వంటి పనులన్నిటినీ ఆమె ఒక్కరే నిర్వహించుకొచ్చారు. ‘అదేంకష్టంగా ఏమీ అనిపించలేదు, చేసిన పనికి తగిన సంతృప్తి నాకు లభించింది..’ అని చెబుతున్నారామె. ఈ పుస్తకానికి లభించిన ఆదరణ పుష్పాంజలి ఆలోచనను మరింత విస్తృతం చేసింది. వచ్చే ఏడాది విడుదల చెయ్యబోతున్న ‘డి ఫ్యాక్టో’ రెండో సంపుటి కోసం ప్రస్తుతం ఆమె జోరుగా పనిచేస్తున్నారు. వచ్చే ఏడాదికల్లా హైదరాబాద్‌, చెన్నై వంటి నగరాల్లోని మహిళల వివరాలతో విడివిడిగా పుస్తకాలను ‘ఇయర్‌బుక్‌’ మాదిరిగా తీసుకురావాలని ఆమె ఆలోచన. ఈ మారథాన్‌ రన్నర్‌ అనుకున్నదేదైనా సాధించేలాగానే కనిపిస్తున్నారు.

ఆలోచన ఎలా వచ్చిందంటే…

నాకొక శస్త్రచికిత్స అవసరమైంది. మహిళా సర్జనే చెయ్యాలని పట్టుబట్టి వెతికాను. నా అన్వేషణ ఏడాది పాటు సాగింది. ఈలోగా నా శారీరక సమస్య తీవ్రమైనా సరే, వెనక్కు తగ్గలేదు. చదువుండీ, ఇంటర్నెట్‌ వంటి సదుపాయాలన్నీ ఉన్న నాకే ఒక మహిళా సర్జన్‌ను వెతకడం అంత కష్టమైతే ఇక మామూలు ఆడవారికి అదెలా సాధ్యమవుతుంది? అదిగో, అప్పుడు తట్టిన ఆలోచనే ‘డి ఫ్యాక్టో’ పుస్తకం. విద్య, వైద్యం, వ్యాపారం, న్యాయశాస్త్రం.. ఇలా పలు రంగాల్లో సేవలందించే మహిళల ఫోన్‌ నంబర్లుంటాయి నా పుస్తకంలో. మూడొందల పేజీల ‘డి ఫ్యాక్టో’ ధర 495 రూపాయలు. వచ్చే ఏటి నుంచి ప్రకటనలు సేకరించి, పుస్తకాన్ని ఉచితంగా అందించాలని ప్రయత్నిస్తున్నా. ప్లంబర్‌, ఎలక్ట్రీషియన్‌, పోలీస్‌… ఇలా సమస్త సమాచారమూ ఉంటుంది అందులో.
– పుష్పాంజలిరెడ్డి

Advertisements

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s