ఏడు రంగుల వాన

ఆకాశంలో జోరుగా కమ్ముకుంటున్న మబ్బులు, హోరున కురుస్తున్న వాన – మధ్యలో కాస్త ఎడతెరిపి వచ్చినప్పుడు కనిపించి కనువిందు చేసే హరివిల్లు… ఎన్ని సమస్యలున్నా కాసేపు మైమరిచిపోయి నిలబడి చూసే దృశ్యం.. కొద్దిసేపైనా మనసులో తడితడి అనుభూతులను తవ్విపోసే చిత్రం. వంద వర్షాలు కురవొచ్చుగాక,  వెయ్యి మేఘాలు తేలిపోవచ్చుగాక… ప్రకృతి ఆవిష్కరించే అందమైన హరివిల్లు మాత్రం ఒకేఒక్కటి. ఎప్పుడైనా అరుదుగా చెరోదిక్కునా రెండు. ఏడేడు రంగుల కలబోతతో వానవిల్లు అందించే సౌందర్యం సరే, అందించే సందేశం ఏదైనా ఉందా?
లేకేం.
జీవితాన్నే ఇంద్రధనుసుగా మార్చుకోవడమెలానో అందులో రంగులు చెబుతాయి. కొంచెం ఎరుపు, కొంచెం పసుపు – కొంచెం ఇష్టం కొంచెం కష్టంలాగానే.

“వానాకాలం మొత్తం నలుపే కాకి రెక్కల్లో కారునలుపే..’ అనుకుంటే చెప్పేదేం ఉండదు. కలర్‌ థియరీ అనండి, లేదూ కలర్‌ థెరపీ అనండి, మరోటనండి – ఏడేడు వర్ణాల్లోనూ దాగిన అందాలను కథలుకథలుగా జీవితానికి అన్వయించుకుంటేనే ఆహ్లాదం.

గుమ్మాడిపువ్వు తొలి వర్ణం ఊదాపూరెక్కలపై వర్ణం
ఎరుపు, నీలాల కలయిక వల్ల ఏర్పడే ఊదా రంగు విబ్జియార్‌లో మొదటిది. ఆధ్యాత్మికత, మానవాళి పట్ల ప్రేమను ఇది సూచిస్తుంది.

నీలాకాశంలో నీటి మేఘం ఒకటి బరువుగా కదులుతూ వెళుతోంది. అందులోని చిట్టిచిట్టి నీటి చుక్కలన్నిటికీ ఒకటే తొందరగా ఉంది. ఎప్పుడెప్పుడు వాన పడుతుందా అని అవి ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే మేఘం నుంచి దూకి భూమ్మీదకు టప్‌మంటూ పడే ఆ క్షణం అంటే వాటికి చాలా ఇష్టం మరి. ఒకరోజు నీటిమేఘం మరింత నల్లగా, బరువుగా మారింది. నీటి బిందువులకు వానగా పడబోతున్నామని అర్థమైపోయి తెగ సంబర పడిపోయాయి. మేఘాలు ఢీకొట్టి ఉరుముల శబ్దం మొదలయ్యాక మెరుపుల వెలుగులో అవి తాము ఒక్కొక్కటీ ఎక్కడెక్కడ పడాలో నిర్ణయించుకునేందుకు సమావేశమయ్యాయి. అన్నిటికన్నా పెద్ద చినుకు కింద పార్కులో కూచున్న ఒక మనిషిని చూపెట్టి ‘నేను ఇతని ముక్కు మీద పడతా’నంటూ వె ళ్లి అలాగే పడింది. మిగిలిన చినుకులన్నీ అది చూసి అల్లరిగా నవ్వాయి.  మరొక  చినుకు ఒక అందమైన స్త్రీ మేకప్‌ మీద పడి కొంటెగా దాన్ని తుడిచేసింది. అలాగే మిగిలినవన్నీ పేపర్లు చదువుతున్న మనుషుల మీదా పరుగెడుతున్న కుక్కల మీదా పడి అల్లరి పెట్టాయి. తర్వాత చిన్న చినుకుల వంతొచ్చింది. అవి జట్లుజట్లుగా విడిపోయాయి. ఒక జట్టు చీమల పుట్టమీద పడి దాన్ని కూల్చేసింది. చీమలన్నీ శాపనార్థాలు పెట్టాయి. మరోజట్టు ఒక చిన్నపిల్లాడి పీచుమిఠాయి మీద పడి దాన్ని కరిగించేయడంతో ఆ పిల్లాడు ఏడుపందుకున్నాడు. ఇవన్నీ ఇలా అల్లరి చేస్తుంటే ఒక చిన్న వానబిందువుల జట్టుకిలా కొంటెపనులు చెయ్యాలని లేదు. ‘మనం ఏదైనా ఉపయోగపడే పని చేద్దాం. చూడండి… భూమ్మీద ఎవరికైనా మన అవసరం ఉందేమో..’ అవి కిందకి చూస్తే ఒకబ్బాయి ఐస్‌క్రీమ్‌ తింటూ కనిపించాడు. మరోకుటుంబం నవ్వుతూ పిక్‌నిక్‌ చేసుకుంటోంది. మరోచోట పెళ్లి సందడి హోరెత్తుతోంది. వాళ్లెవ్వరికీ అప్పుడు వాన పడటం ఇష్టం లేదు. అందుకని వాళ్లను ఇబ్బంది పెట్టడం ఈ చినుకుల జట్టుకూ ఇష్టం లేదు. అప్పుడు ఆ జట్టులో అన్నిటికన్నా బుల్లి చినుక్కి ఒక చిన్న పువ్వు కనిపించింది. బహుశా నిన్నోమొన్నో వికసించిన అందమైన పసుప్పచ్చని పువ్వు అది. నీరందక  తల వేలాడేసేసింది. బుల్లి చినుకు తన జట్టందర్నీ కేకేసింది. ‘చూడండర్రా… ఆ చిన్న పువ్వుకు మన అవసరం ఉంది…’ అని అరిచింది. అన్నీ కలిసికట్టుగా కిందకి దూకబోతుంటే మిగిలినవి నవ్వాయి. ‘వెళ్లండి వెళ్లండి… ఇంత బుద్ధిమంతులు మాకు అవసరం లేదులే. మళ్లీ వాన చినుకులయి పైకి రాకండి…’ అన్నాయి. బుల్లి చినుకులు మాత్రం తాము అనుకున్నది చేసి చూపెట్టాయి. వాటి స్నేహానికి చిట్టిపువ్వులో  పసుపు వర్ణం నిండుగా చేరింది. కళకళ్లాడింది. మళ్లీ ఎండకాసేప్పుడు సూర్యుణ్ని అడిగి బుల్లి చినుకులన్నీ ఒక జట్టుగా పెద్ద మేఘంగా తయారయ్యాయి. అల్లరి చినుకులను తమ జట్టులో కలుపుకోలేదవి. ఎప్పుడూ తమ అవసరం ఉన్న చేలమీదా పూలమీదా కురుస్తూ సంతోషాన్ని కలిగిస్తూ తాము సంతోషంగా ఉన్నాయి. అవి వచ్చినప్పుడే స్వాగతం చెబుతూ విత్తనాలు మొలకెత్తుతాయి.

మయూర గళమేవర్ణం…
అనంతం, జ్ఞానం వంటివాటిని సూచిస్తుంది ముదురు నీలం రంగు. అప్పటివరకూ మామూలుగా ఉన్న ఆకాశం క్షణంలో ఎన్ని రంగుల్ని మార్చుకుంటుందో, మబ్బుల్లో ఎన్ని రంగుల నీలాలున్నాయో ఎలా లెక్కపెట్టగలం? కురవకముందో నీలం, కురిసే మేఘానిదో నీలం, సాగిపోయే మబ్బుతల్లిది మరో నీలం. అన్నిటినీ ఆస్వాదించాలంటే ఋతుపవనాలు అడుగుపెట్టే కేరళకు వెళ్లాల్సిందే. ముదురు నీలపు మేఘాన్నుంచి నేలను తాకే తొలి వర్షపు చుక్కను తాకి పరవశించాంటే తప్పదు మరి. మన దేశానికి సంబంధించినంత వరకూ పర్యాటకులకు పశ్చిమ కనుమల్లో ఋతుపవనాన్ని చూడటం అందమైన అనుభవం అనే చెబుతారు అందరూ. అక్కడ కాదంటారా, మీ ఇష్టం. అస్సాం దగ్గర హిమాలయాల పాదాల దగ్గరో, మహారాష్ట్రలోని సాత్పురా పర్వత శ్రేణిలోనో, మన విశాఖపట్నం దగ్గర తూర్పు కనుమల్లోనో.. ఎన్నిలేవు? చెప్పొచ్చేదేమింటంటే వర్షానికీ, కొండకీ ఏదో బంధుత్వం. దాన్ని ఉపయోగించుకుని ప్రకృతితో మనమూ చుట్టరికం కలుపుకోవాలంతే.

అలలే లేని సాగర వర్ణం మొయిలే లేని అంబర వర్ణం…
అవును… ప్రకృతిని సూచించే లేత నీలం రంగు అవగాహన, శాంతి, విశ్రాంతి తదితరాలను సూచిస్తుంది. వాన వెలిసిన తర్వాత నిర్మలమైన ఆకాశాన్ని చూస్తున్నప్పుడు ఎప్పటెప్పటివో ఆప్యాయతలు గుర్తుకొస్తాయి.

“కిటికీలోంచి వర్షపు జల్లు కొడుతున్నప్పుడు అప్రయత్నంగా నేను లోతైన ఆలోచనల్లోకి జారుకుంటాను. ఒక్కొక్క వర్షం ఒకొక్కలాంటి ఆలోచనను కలిగిస్తుంది. ఒకసారి చాలా ఆనందాన్ని గుర్తు చేస్తే, మరోసారి బాగా బాధపెట్టేవి గుర్తుకొస్తుంటాయి. సందర్భమేదైనా వర్షం పడుతున్నప్పుడల్లా మా నాన్న తప్పకుండా గుర్తొస్తుంటారు.

తల్లిదండ్రులకు వేల కిలోమీటర్ల దూరాన స్థిరపడ్డాం కనుక ఏడాదికోసారి మా ఊరు తప్పనిసరిగా వెళ్లి వాళ్లను చూసిరావాలనే నియమం పెట్టుకున్నా. ఒకసారి ఆయనకు ఒంట్లో అస్సలు బాగాలేదు. మేం బయల్దేరి వెళ్లే లోపల ఆయన కొంత కోలుకున్నారు. ఇంట్లో అడుగుపెట్టేసరికి కాస్త నవ్వుతూ తిరుగుతున్న మనిషిని చూస్తే చాలా సంతోషమనిపించింది. మాలాగే మా చెల్లి, తమ్ముడు, మేనత్త, బాబాయిలు కూడా కుటుంబాలతో రావడంతో ఇల్లంతా కళకళ్లాడుతూ ఒకరకమైన పండగ వాతావరణం వచ్చేసింది. రెండురోజులు సరదాగా గడిపిన తర్వాత ఒకొక్కరూ వెళ్లిపోవడం మొదలయింది. చివరగా నేను ‘వెళ్లొస్తా నాన్నా’ అన్నప్పుడు మాత్రం నాన్న లేచి నా చెయ్యి పట్టుకున్నారు, దగ్గరగా వచ్చి హత్తుకుని ‘జాగ్రత్త నాన్నా’ అన్నారు. ఎప్పుడూ లేదు అలా. ఆయన కళ్లలో కళ్లు పెట్టి చూస్తే సన్నని నీటితెర ఇద్దరికీ మధ్య మసగ్గా అడ్డు పడింది. నాన్న పోయిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఎందుకో వాన పడుతున్నప్పుడు అదే నీటి తెర గుర్తొస్తుంది. ‘జాగ్రత్త నాన్నా’ అంటున్న ఆయన ఆప్యాయత నిండిన చూపు గుర్తొస్తుంది. మామధ్య ఆప్యాయత నిండిన సంఘటనలు ఎన్నున్నా ఆ క్షణమే నాకెంతో అపురూపం” అంటారొక నడివయస్కుడు.

తొలితొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే నీ చిరునవ్వు పచ్చదనమే
పసుపు, నీలం కలిస్తే ఏర్పడే ఆకుపచ్చ హరివిల్లుకు మధ్య భాగంలో ఉంటుంది. సౌభ్రాతృత్వం, నిలకడైన స్థితి, పెరుగుదల, మంచి ఆరోగ్యాలను సూచిస్తుంది ఆకుపచ్చ రంగు. ఆకాశ గంగ పెంకితనంగా దూకుతున్నప్పుడు భూమాత పచ్చ తివాచీ పరిచి అక్కున చేర్చుకుంటుంది. పొలాల్లో పనులు మొదలవుతాయి. జీవకోటికింత ఆహారాన్ని అందించే పనుల్లో ప్రకృతి బిజీ అయిపోతుంది. కవి తిలక్‌ భాషలో చెప్పాలంటే ‘జలజలమని కురిసింది వాన.. జాల్వారింది అమృతంపు సోన..’ అప్పుడు ‘అరటితోట నడుం చుట్టి వంపు తిరిగింది కాలువ…’ అవునుమరి, చేలకు నీళ్లందించాల్సిన బరువుబాధ్యతలు వాటిమీద ఉన్నాయి కదా. చిటపట చినుకులు పడుతూ ఉంటే వానలో తడవడం గొప్ప అనుభూతి. పెద్దయిపోతేనేం, మరొక్కసారి నిష్పూచీగా తడిసి చూడండి.

కాంచనాల జిలుగు పచ్చ కొండబంతి గోరంత పచ్చ
ఉదయిస్తున్న సూర్యుడి రంగులో భాగమైన పసుపు సజీవ స్పందనను, శక్తినీ సూచిస్తుంది. ఆలోచనల్లో స్వచ్ఛత, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపకరిస్తుంది.

అడవికి ఆనుకుని నివసిస్తున్న వడ్రంగి ఇంటిని ఇల్లనలేం. చిన్న గుడిసె. అదీ ఇద్దరంటే ఇద్దరు మనుషులకు కనాకష్టంగా సరిపోయేది. కటిక చీకటి… వర్షం హోరుమని కురుస్తోంది. ఉన్నదేదో తిని పడుకున్న వడ్రంగి దంపతులకు తలుపు మీద ఎవరో తడుతున్న చప్పుడు వినిపించింది. తామిద్దరమే సర్దుకుని పడుకుంటే, మరొకరికి చోటెక్కడిది? వండ్రంగి భార్యకు తలుపు తియ్యడం ఇష్టం లేదు. ‘మనిద్దరం పడుకోగలిగిన జాగాలో మరో మనిషి కనీసం కూచోగలడులే. తియ్యి..’ అన్నాడు ఇంటాయన. తలుపు తియ్యగానే బాగా తడిసి వణికిపోతున్న అతిథి లోపలికొచ్చాడు. అంత చలి, వర్షంనుంచి తలదాచుకునే జాగానిచ్చినందుకు వాళ్లిద్దరికీ కృతజ్ఞతలు చెపుతూ కూచున్నాడాయన. ఏదో మాట్లాడుకుంటూండగా మరోసారి తలుపు చప్పుడయింది. ‘తలుపు తియ్యండి…’ గడప పక్కనే కూచున్న అతిథితో అన్నాడు గృహస్థు. ‘చోటెక్కడుంది… మనం ముగ్గుర ం కూచోడమే కష్టంగా ఉంది..’ అంటున్న అతిథితో ‘మీరు నా భార్యలాగానే ఆలోచిస్తున్నారు. మేం అలా అనుకుంటే, ఈపాటి మీరే కౄరజంతువుకో ఆహారమైపోయేవారు. దయచేసి మరో మనిషిని లోనికి రానివ్వండి..’ అన్నాడు వడ్రంగి. ఇంకొకాయన లోపలికి వచ్చి, ఆమాత్రం తలదాచుకోను నీడ దొరికినందుకు పొంగిపోయాడు. నలుగురూ పక్కపక్కనే కూచుని పిచ్చాపాటీ మాట్లాడుతుండగా తలుపు మీద ఏదో చప్పుడయింది. తీస్తానన్న వడ్రంగిని మిగిలిన ముగ్గురూ వారించారు. ‘నాకిన్నాళ్లూ సేవచేసిన గాడిద అది. దాన్ని వానలో నానిపోనివ్వను’ అంటూ దాన్ని కూడా లోపలికి రానిచ్చాడు. ఇప్పుడు నలుగురూ దాని చుట్టూ గుండ్రంగా నిలబడ్డారు.
సంతోషమో, సంపదో – ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం అద్భుతమైన పని. ఏమీ లేదే అనుకోండి, అప్పుడు కూడా పంచుకోడానికి ఏదోకటి ఉంటుంది. ‘షేరింగ్‌ ఈజ్‌ కేరింగ్‌’ అంటే వేరే ఏం లేదు. అదే ఈ సూఫీ కథ.

మసకే పడితే మరకత వర్ణం అందంచందం అలిగిన వర్ణం
ఎరుపు, పసుపుల మిశ్రమంగా ఏర్పడే కాషాయం శక్తి, జ్ఞానాలకు సూచిక. ఆలోచనామగ్నత, నిమయానుసార ప్రవర్తననూ ఇచ్చే ఈ రంగు మనుషుల సృజనాత్మకతకూ, జీవితంలో సమతౌల్యానికీ దోహదపడుతుంది.

దూరానున్న కొండల్లో భారీగా వర్షాలు పడ్డాయి. వర్షధారలన్నీ కలిసి చిన్న వాగుగా రూపు దిద్దుకున్నాయి. ఆ వాగు జలజలా పారుతూ కిందకొచ్చి చాలాదూరం ప్రయాణించాక ఎడారి ఎదురయింది. అప్పటివరకూ ఎదురైన ఎన్నో అవరోధాలను దాటి సెలయేటిగా మారిన వాగు వాటిలాగే దీన్నీ దాటేద్దాం అనుకుంది. ఆశ్చర్యం… ఎడారిలో ముందుకు దూసుకుపోతుంటే నీళ్లన్నీ ఇసుకలోకి మాయమైపోతున్నాయి. పట్టువదలకుండా సెలయేరు చూస్తున్న ప్రయత్నం చూసి అంతర్వాణి పలికింది.
‘గాలి ఎడారిని దాటగలిగినప్పుడు ప్రవాహం ఎందుకు దాటలేదు?’
‘గాలి ఎగరగలుగుతోంది. నీళ్లు ఎగరలేవుకదా..’ సెలయేరు సమాధానమిచ్చింది.
‘నువ్విప్పుడున్నట్టుగానే ప్రయత్నిస్తుంటే మాయమైపోవడమో లేదంటే బురదగా మారడమో జరుగుతుంది. గాలి సాయం తీసుకుంటే గమ్యం చేరుతావు. నువ్వు గాలిలోకి చేరిపో. అది నిన్ను ఎడారి దాటిస్తుంది’ సలహా ఇచ్చింది అంతర్వాణి. ఇసుక వంతపాడింది. ‘గాలి నిన్ను ఎడారి దాటించి అవతలివైపు వర్షమై కురుస్తుంది. నువ్వు మళ్లీ గలగలా ప్రవహించవచ్చు…’ అంది. సెలయేటికీ సలహా నచ్చలేదు. తన అస్తిత్వాన్ని వదులుకోవడం దానికి సుతరామూ ఇష్టం లేదు. పైగా కష్టపడి సంతరించుకున్న వ్యక్తిత్వాన్ని మరొకరి దగ్గరం వదులుకోవడం ఏమిటనుకుంది. అయినా అదంతా జరుగుతుందని ఎలా నమ్మడం?
‘నమ్మకం ఉంచితేనే పని జరుగుతుంది. లేదంటే నువ్విలానే ఉండిపోతావు ఎప్పటికీ’ అన్నాయి అవి రెండూ ముక్తకంఠంతో.
‘పోతేపోనీ. నేనిలానే ఉంటాను కదా. అదిచాలు..’ వాదించింది సెలయేరు.
‘లేదు. అలాక్కూడా ఉండిపోవు. నీలోని జీవరాశిని ఎండ ఆవిరిగా మార్చి మరోచోట వర్షమై కురుస్తుంది. నీలో ఏది ఎండిపోతోందో, అది ఎక్కడ చిగురిస్తోందో నీకెప్పటికీ తెలియదు. జనం నిన్ను సెలయేరనే అంటారు. కానీ నువ్వు నిన్నటి ప్రవాహానివి కావు..’
ఆమాటల్లోని తాత్వికత, వాస్తవం సెలయేటి మనసును సూటిగా తాకాయి. అంతర్వాణి చెప్పినట్టు విని అది ఎడారికవతలవైపు జీవనదిగా మారింది.
పని సాధించుకోవడానికి పట్టుదల, సహనం, నేర్పు… అన్నీ సమపాళ్లలో ఉండాలి. వాటికితోడు ఉపాయం కూడా. అదే మరో మాటలో చెప్పాలంటే సృజనాత్మకత. ఇదిగో ఈ ప్రాచీన కథలో స్పష్టమయ్యేది కూడా అదే సూత్రం.

పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబి పసి పాదం ఎర్రాని రూపం ఉడికే కోపం
తీవ్రమైన భావోద్వేగాలను సూచించే ఎరుపు శ క్తి, ఉత్సాహాలకు సూచిక. ఏ విషయం పట్ల అయినా తరగని తపన, తీవ్రమైన ప్రేమ, విజయాలను సూచిస్తుంది ఎరుపు. ప్రేమికులు ఇచ్చిపుచ్చుకునే బహుమతుల్లో సింహభాగం ఎరుపే. ప్రేమ కానుకలు అందుకున్నప్పుడు బుగ్గలు ఎరుపెక్కడం ఎంత చక్కగా తెలుస్తుందో, వ్యవహారం కాస్త అటూ ఇటూ అయినప్పుడు మొహాలు ఎర్రబడటమూ అంతే స్పష్టంగా తెలుస్తుంది. ఎర్రని వస్త్రాలు ధరించినప్పుడు పదిమందిలో ఆకర్షణీయంగా కనిపిస్తామని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. అలాకాదు, ‘విప్లవం జిందాబాద్‌’ అనాలన్నారనుకోండి, దానికీ ఎరుపు రంగు శరణు వేడాల్సిందే. ఎర్ర జెండా ఎగరెయ్యాల్సిందే. హరివిల్లులోని ఎరుపు అంత తీవ్రంగా కంటికి కనిపించడం అరుదే. కనీకనిపించని సింధూర వర్ణం మర్నాడుదయానికి స్వాగతం చెబుతుంది.

Advertisements

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s