భ్రమణకాంక్ష

ట్వైలైట్‌…. పలకడానికి ఎంతో అందంగా ఉండే ఆ పదం అనుభవానికి అదోలా ఉంటుంది. సంధ్యా సమయాలు నాలో ‘ఇదీ’ అని నిర్వచించలేని, మాటల్లో పెట్టి చెప్పలేని అస్పష్టమైన దిగులును కలిగిస్తాయి. జాతర జనసందోహంలో అల్లిబిల్లిగా తిరుగుతూ పొరపాటున అమ్మ చేతిని వదిలేసి తప్పిపోయినట్టు… హఠాత్తుగా ఆవరించిన పల్చని ఒంటరితనపు అడవిలో చిక్కుకుపోయినట్టు…! అంతలోనే ఏవో పురాతన జ్ఞాపకాలు కళ్ల ముందు ఉల్లిపొర కాగితం వెనక నుంచి మసకమసగ్గా కనిపిస్తున్నట్టు ఉంటాయి. ఒక ప్రాచీన సంగీతం చెవులకు నిశ్శబ్దంగా వినిపిస్తుంది. సాయంత్రమవుతున్నకొద్దీ ప్రకాశవంతమైన తెలుపు కరిగిపోతూ నెమ్మదిగా వెచ్చని నారింజరంగులోకీ పచ్చని పసుపులోకీ బూడిద రంగులోకీ చివరకు చిక్కటి నలుపులోకీ జారిపోతూ…. ఒకదానిలోంచి మరోదానిలోకి అలవోకగా అనువాదమయ్యే వర్ణసంచయాన్ని అదేపనిగా చూస్తున్నప్పుడు నా మనసులో ఏదో అర్థం లేని భయం రగులుకుంటుంది. అయినా సరే… అలా ఊరికే పచ్చికలో పడుకుని విశాలమైన ఆకాశం – కాంతివంతమైన నీలం నుంచి నలుపులోకి పరావర్తనమయ్యే ఆ దృశ్యాన్ని దాదాపు ప్రతిరోజూ చూడాలనుంటుంది.

‘ప్రపంచంలో చూసి తీరాల్సిన మూడొందల ప్రదేశాలు’ అంటూ ఏదో వార్తాపత్రికలోని జాబితా చూశాక నాకు ఉన్నచోట కాలు నిలవలేదు. అందులో కనీసం వందయినా చూడకపోతే నువ్వసలు మనిషివేనా అంటూ నిలదీసింది నా అంతరాత్మ. దాంతో నేను చేస్తున్న ఉద్యోగానికి కొన్ని నెలల సెలవు పెట్టేసి ప్రపంచ పర్యటనకు బయల్దేరాను. ఏదైనా ఒంటరి కావొచ్చుగానీ ప్రయాణాలెప్పుడూ ఒంటరివి కావు. ముఖ్యంగా నావి. తోడుగా బోలెడు ఆలోచనలుంటాయిగా!

ఎక్కడికి వెళ్లినా, ఏ విశేషాలు చూస్తున్నాఎన్నో యుగాల కిందట వేరే ఏదో రూపంలో మెసిలిన నేను ఇప్పుడిలా మనిషిలా తిరుగుతున్నాననిపించి గత జన్మల నాస్టాల్జియాలోకి జారిపోతుంటాను. ఏ సముద్రంలోని పామునో ఏ పుట్టలోని చీమనో ఏ అడవిలోని మొక్కనో ఏ పొదల్లో విరిసిన గడ్డిపువ్వునో ఏ నది అడుగున ఇసుక చాల్లోని గులకరాయినో మరి అప్పట్లో! ఈ ఊహ వచ్చినప్పుడల్లా అమితమైన పరవశమూ అదోరకమైన పల్చటి పరిమళమూ నన్ను చుట్టుముడతాయి. ఆ అభిజ్ఞాన ఫలితమేమో మరి, నాకు ఒకచోట కాలు నిలవదు. కొన్నేళ్ల క్రితం నివసించి వచ్చిన పరిసరాలంటే మనుషులకు జ్ఞాపకాల్లో తగని మక్కువ ఉన్నట్టుగానే నాకు అపారమైన నీలి జలరాశులన్నా సతత హరితారణ్యాలన్నా జనసమ్మర్దమైన మైదానాలన్నా పైపైకి రమ్మన్నట్టుండే పర్వత శ్రేణులన్నా తగని ఇష్టం. అలాంటి ప్రాంతాల్లో ఒకదాని నుంచి ఇంకోదానికి పదపదమని మనసు త్వరపెడుతుంటుంది. వాటిని గురించిన ప్రియమైన ఊహ ఒకటి లోపల పాదరస బిందువులా క్షణం నిలవకుండా అటూఇటూ ఊగుతూ సందడి చేస్తుంటుంది. ఆ ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు అప్పటి పరిచయస్తులెవరో తాము దాచుకున్న నిగూఢమైన సంగతులు నా చెవిన వేస్తున్నట్టు అనిపిస్తుంది. కొన్ని రహస్యాలను కలబోసుకున్న సంభాషణ తర్వాత స్నేహం గాఢమైనట్టు ఆయా ప్రదేశాలతో నా బంధం బలపడుతుంటుంది. అప్పుడప్పుడూ అరుదుగా మరొక మాయ కూడా…. గడచిపోయిన కాలాల్లో ఎవ్వరో ప్రేమికులు గుసగుసగా మాట్లాడుకున్న చిలిపి కబుర్లన్నీ చెవిన పడ్డట్టయి నా మొహంలోకి నవ్వు పాక్కుంటూ వస్తుంది. అందువల్లే ఒకో ప్రదేశంలో ఒక రకమైన మాదకత దానికే ప్రత్యేకమైన పరవశం నన్ను అలముకుంటాయి.
ఎందుకింత అందమైన దృశ్యాల్ని నా కంటపడేట్టు చేస్తావు ప్రభూ? ఎందుకింత అందాన్ని నా కళ్లకు కానుక చేస్తావు? నేనేం చిత్రించగలనా కవితగా రాయగలనా పాటగా పాడగలనా కథలో ఇమడ్చగలనా అందమైన అనుభవంగా మాటల్లో పెట్టి పంచుకోగలనా ఎవరితోనైనా…. ఏమీ చెయ్యలేని అశక్తత . బూడిదరంగు మెదడు పొరల్లో… జ్ఞాపకాల దొంతరల్లో…. మౌనంగా పేర్చుకోవడం తప్ప మరేమీ చేతగాని నిస్సహాయతకు ఇంత బహుమతి ఎందుకు ప్రభూ! మహాద్భుత సౌందర్యం కంటపడినప్పుడల్లా మోకాళ్ల మీద కూలబడి తల కిందకు వంచి కాస్త అటూఇటూగా ఇవే వాక్యాలనుకుంటాను. నా అద్వైతపు బతుక్కి దేవుడిని ప్రార్థించడం కూడా రాదు మరి.

ఇలాంటి సందర్భాల్లోనే నాకు నవనీతరెడ్డి గుర్తుకొస్తాడు. సింధునది ఒడ్డున ఉండనీ, పారిస్‌లో లూయిస్‌ఫిలిప్‌ను చూస్తుండనీ, మంచుకుచ్చుటోపీలు ధరించిన ఆల్ప్స్‌ పాదాల దగ్గరుండనీ… సైకత శ్రేణులు విరిసిన అండమాన్‌ బీచ్‌ అంచుల దగ్గర ఉండనీ… మాఘ పౌర్ణమినాడు హిమాలయ సోయగాన్ని చూస్తుండనీ… నేను దొంగిలించి దాచిపెట్టుకున్న అతని జీవితపు శకలం ఒకటి బరువుగా నా జేబులో మెదులుతుంటుంది.

వేల ఏళ్లుగా ప్రకృతి సహజమైన ఏ అన్వేషణలోనో సాగిపోయే నిత్య పథికుణ్ని నేను. కాలు కదపని విశ్వవిహారి నవనీతరెడ్డి. తమలో నిండిన భ్రమణకాంక్షను మా హృదయాలెప్పుడూ బాహాటంగా మాటల్లో పెట్టి కలబోసుకోలేదు. కానీ అవి నిశ్శబ్దంగా మాట్లాడుకున్నాయని మాత్రం నాకు తెలుసు. నేనా దినపత్రిక ఆఫీసులో చేరిన చాలా నెలల వరకూ హలో అంటే హలోను మించి పరిచయం పెద్దగా పెరగలేదు. అసలతని పనేమిటో, ఏం చేస్తాడో కూడా నాకు సరిగ్గా తెలీదు. అనుకోకుండా నా పక్క సీటతను రాజీనామా చేసి వెళ్లిపోతే నవనీతరెడ్డి ఆ స్థానంలోకి వచ్చాడు. ఒకరోజు ఆఫీసులో అడుగుపెట్టేసరికి అతను కంప్యూటర్‌లో ఏవో ఫోటోలు చూస్తూ కనిపించాడు.
‘గుడ్మాణింగ్‌.. ఏవిటి చూస్తున్నారు..’
‘హ… హ… కెన్యా శివారు ప్రాంతాల ఫోటోలండీ. అక్కడ కూడా మనలానే మట్టిరోడ్లు, సంత.. కాబేజీలు అచ్చు మనవాటిలానే ఉన్నాయండీ, అరటి పళ్లు కూడా. మనుషులు మన గిరిజనుల్లానే లేరూ? పిల్లలు చూడండి చీవిడి ముక్కులూ సగంసగం బట్టలూ…’
ఇష్టమైన తిండి పదార్థమేదో దొరికిన పసిబాలుడిలా వెలుగుతున్న ముఖంతో అతనలా చెప్పుకుపోతూనే ఉన్నాడు… క్లిక్‌ చేస్తూ ఫోటోల్ని చూపిస్తూనే ఉన్నాడు… ఆ క్షణాన గమనించాను నేను… అతనిలోని ఒక రహస్య దీప్తిని…! అది నాలోని దేంతోనో కలిసి స్నేహం చిగురించడాన్ని!!
నెమ్మదిగా నవనీతరెడ్డి పట్ల నా ఆసక్తి పెరిగింది. పనుల మధ్య విరామాల్లో అతనితో మాట్లాడటం, గమనించడం నిత్యకృత్యమయింది.
సాధారణంగా అందరూ విసుక్కునే విషయాలంటే అతనికి నవ్వులాట. దానికి ఫక్తు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు అతను మరి. ‘ఛ.. ఉక్క వేడి చెమట.. దరిద్రం ఈ వేసవి… ఎప్పుడు వానలు పడతాయో…’ అని ఎవరైనా తిట్టుకుంటే నవనీతరెడ్డి గుసగుసగా నవ్వేవాడు. ‘వేసవినలా తిట్టుకుంటాడేవిటండీ ఆయన? మల్లెపూలూ మావిడిపళ్లూ దొరికే దీకాలంలోనే కాదూ…? వేసవి మధ్యాహ్నాలు ఎంత ప్రకాశవంతంగా ఉంటాయో…’ అనేవాడు. ‘అబ్బ వానలు చంపేస్తున్నాయి. వెధవ బురదాబాడీ. సవ్యంగా ఇంటికెళతామో లేదా ఏ మ్యాన్‌హోల్లో పడతామో భయం….’ అని భద్రలోకపు జీవులు విసుక్కుంటున్నప్పుడు ఇతను ‘చినుకులా రాలి… వరదలై పొంగి నీ ప్రేమా నా ప్రేమా’లాంటి పాటలు లోగొంతుకలో పాడుకుంటూ కిటికీలోంచి నవ్వు మొహంతో బైటికి చూస్తుంటాడు. గతంలో భూమ్మీద ఎప్పుడూ వాన చినుకన్నది పడలేదేమో… లేదా ఇతనెప్పుడూ వానను చూడలేదేమో అన్నంత దీక్షగా చూస్తాడు వర్షాన్ని. సరిగ్గా మబ్బులు దట్టంగా కమ్మి ఠప్‌ మంటూ చినుకులు పడటం మొదలవగానే బైక్‌ స్టార్ట్‌ చేస్తుంటాడు. ఓసారి ఉండబట్టలేక అడిగాను కూడా. కాస్త ముందోవెనుకో వెళ్లొచ్చుగా, అలా వానలో తడుస్తూ వెళ్లడం ఎందుకూ – అని.
‘చిన్నప్పుడు మా అమ్మ తడవనిచ్చేది కాదండీ. టీనేజీలో ఆస్మా ఉండేది, చల్లదనం ఒంటికి సరిపడేది కాదు. ఇక పెద్దయ్యాక ఆఫీసులో కుర్చీకి అంటుకుపోవడమే. నాకేమో వర్షంలో తడవడం చాలా ఇష్టం. అలాగని ఇప్పుడు బైటికెళ్లి నిల్చోవడమో, అపార్ట్‌మెంట్లో టెర్రస్‌మీదకు వెళ్లడమో చేస్తే జనాలంతా వింతగా చూడరూ? సినిమాల్లో అయితే పాటందుకుంటారు గానీ బైట పిచ్చాడనుకోరూ? అందుకని సరిగ్గా వాన పడే సమయానికి బయల్దేరతానన్నమాట… ఎవరికీ చెప్పకండి నా రహస్యం’ అని నవ్వేశాడు.
‘సెలెబ్రేటింగ్‌ ఎ సీజన్‌’ అనేదానికి నిలువెత్తు నిదర్శనంలా ఉండే నవనీతరెడ్డికి ప్రయాణాలంటే సరదా. కొత్త ప్రదేశాలంటే అమితమైన ఆసక్తి. పత్రికలో వారంవారం వచ్చే ట్రావెలాగ్‌ శీర్షికను అతనే చూసేవాడు. పాఠకులు తమ ప్రయాణ అనుభవాలను రాసి పంపే ఉత్తరాలను వడపొయ్యడం, ప్రతి వారం ఒక కొత్త ప్రదేశాన్ని పరిచయం చెయ్యడం అతని విధి. మూమూలు సబెడిటర్లయితే వచ్చినవాటిల్లో ఒకదాన్ని ఎంచుకుని టైప్‌ చేసి అచ్చుకిచ్చేస్తారు. ఇతను మాత్రం ముందు ఆ వారం ఎంచుకున్న ఉత్తరంలో ప్రదేశం గురించి ఇంటర్నెట్‌ అంతా గాలించి క్షుణ్ణంగా సమాచారాన్ని తెలుసుకుంటాడు. వాళ్లు రకరకాల్లో పోజుల్లో దిగినవిగాక మరిన్ని ఫోటోల్ని సంపాదిస్తాడు. శ్రద్ధగా ఆర్టికల్‌ను ఒకటికి రెండుసార్లు తిరగరాసి, దిద్ది అచ్చుకిస్తాడు. ప్రయాణ అనుభవాలను ‘ఇక్కడ ఎక్కాం, అక్కడ దిగాం… ఫలానా చోటికి వెళ్లాం, అక్కడ తిండి ఒంటికి పళ్లేదు…’ ఈ ధోరణిలో రాసేవాళ్లంటే అతనికి చిరాకు. ‘పర్యటన వేరు, ప్రయాణం వేరు. వీళ్లకీ తేడా ఎప్పుడు తెలుస్తుందో అని విసుక్కునేవాడు. ‘వెళ్లిన ప్రాంతం గురించి పూర్తిగా తెలుసుకుని, విశేషాలన్నీ చూడాలనుకునేవారు చాలా తక్కువ. ఇలా హడావుడిగా ఏదో చూశాం అంటే చూశాం అన్నట్టుగా వెళ్లొచ్చేవాళ్లే ఎక్కువమంది..’ అని నొచ్చుకుంటూనే ‘ఎన్ని చెప్పండి, ప్రయాణం చాలా జ్ఞానాన్నిస్తుంది. పక్కన జారిపోయే దృశ్యాలు పాత జ్ఞాపకాలను కలియబెడుతుంటే – రంగులరాట్నంలో చెక్క గుర్రం మీద ఎక్కి కూచుని  గిర్రున తిరుగుతున్నట్టుంది…’ అంటున్నప్పుడు అతనిలోని భావ తీవ్రతకు ఆశ్చర్యంగా ఉండేది, ఏవో కథల్లోలా ఆ వాక్యాలనలా అలవోకగా మాట్లాడుతుంటే ముచ్చటగా కూడా.

ఇదిగాక ఖాళీ దొరికినప్పుడు అతను చేసే పని నాకు చాలా విడ్డూరంగా అనిపించేది. జపాన్‌ దీవులో ఆఫ్రికా అడవులో కూరగాయల మార్కెట్లో గిరిజన తండాలో గంగానది తీరాలో…. ఏదో ఒకదాన్ని ఇంటర్నెట్‌ సాయంతో చూస్తూ కూచునేవాడు. ‘రాంచ్‌’ అని కీవర్డ్‌ కొట్టి వచ్చిన వ్యవసాయ క్షేత్రాల ఫోటోలు చూస్తూ పరవశించిపోయేవాడు. ఓడరేవులో ఆగి ఉన్న పడవల వైభవం, నగరాల్లోని ఆకాశహర్మ్యాల సౌందర్యం అతన్ని ఎప్పుడూ ఆకర్షించేది కాదు. గిరిజన తండాల్లో గుమ్మాల మీద అరుగుల మీద గొంతుక్కూచున్న ముసలివాళ్ల ముఖాలను వాటిమీద ముడతలను లెక్కపెడుతున్నాడేమో అన్నంత తీక్షణంగా గమనించేవాడు. ఆదివాసీ నృత్యాలనో వాళ్లు ధరించే చిత్రవిచిత్రమైన ఆభరణాలనో వియత్నాం సముద్ర తీర జాలర్లనో ఏ యూరపు కొండల మధ్యనుంచి కనిపించే చర్చి శిఖరాలనో తదేకంగా చూసేవాడు. ఏ జాతర చిత్రాలనో చూస్తూ ‘రంగుల రాట్నం అక్కడ కూడా ఉందండీ…’ అంటూ సంబరపడుతున్నప్పుడు వెలిగిపోయే అతని మొహం చూడటం నాకో సరదా. మ్యాపులు చూస్తూ… వాటిని జూమ్‌ చేస్తూ వివిధ ప్రదేశాల గురించి తెలుసుకోవడం అతనికిష్టమైన వ్యాపకం. మరీ అంత నిత్యనైమిత్తికాలను పరస్పరం మాట్లాడుకొనేవాళ్లం కాదుగనక అతని ఇల్లెక్కడో కుటుంబమూ ఇతర వివరాలూ నాకు రేఖామాత్రంగా కూడా తెలియవు. సెలవుల్లో నేనెక్కడికయినా వెళ్లాలనుకున్నప్పుడు మాత్రం అతన్నీ రమ్మని పిలిస్తే… వెళుతున్న ప్రదేశం గురించి క్షుణ్ణంగా చెప్పేవాడుగానీ, నాతో రావడానికి అతనికె ందుకో ఎప్పుడూ కుదరలేదు.

క్షణం కాలు నిలవని నాకు పత్రికలో డెస్కుకు అతుక్కుపోయి ఉద్యోగం చెయ్యాలంటే ఊపిరాడేది కాదు. దాన్నుంచి బయటపడే మార్గాలు వెతుకుతున్నప్పుడు అనుకోకుండా ఒక సమావేశంలో సుశీలానాయర్‌ పరిచయమయింది. ట్రావెల్‌ జర్నలిజానికి ఉన్న ఆదరణను రూపాయల్లోకీ, ఇంకా వీలయితే డాలర్లలోకీ మార్చుకోగలిగే మార్గాల గురించి నాకు వివరించిందావిడే. ఎన్నాళ్లుగానో వెతుకుతున్న ఆక్సిజన్‌ సిలిండర్‌ దొరికినట్టనిపించింది. ప్రపంచమంతా చుట్టొచ్చిన ఆవిణ్ని అరకు చూడ్డానికి రమ్మని ఆహ్వానించాను. ‘త్వరలో బాక్సైటు కోసం కొండలన్నీ తవ్వేస్తే వాలున పూచే వలిసె పూలూ ఉండవు, థింసా చూపించే గిరిజనులూ ఉండరు జాగ్రత్త’ అన్న హెచ్చరికకి బెదిరిపోయి ఆవిడ ఆంధ్రప్రదేశ్‌ ప్రయాణమయి వచ్చింది. అక్కడ ఏర్పాట్లలో సాయం చేసిన నా స్నేహితుడు శ్రీధర్‌ను ఆమెకి పరిచయం చేశాను.

కొండను తొలిచిన సొరంగాల్లోంచి సాగుతున్న ట్రెయిన్‌ ప్రయాణానికీ, అక్కడక్కడా పలకరిస్తున్న జలపాతాలకూ, ఆ వెలుగుచీకట్ల దోబూచులాటకు దారిపొడుగునా సంబరపడుతున్న సుశీలకు శ్రీధర్‌ అవీఇవీ విశేషాలు చెబుతుండగా మధ్యలో ఎందుకో నవనీతరెడ్డి ప్రస్తావన వచ్చింది.
“నవనీతం ముందు టూరిజమ్‌ శాఖలో ఉద్యోగం చేశాడు. అక్కడ కూడా ఇంతే ఈ మనిషి తీరు” అన్నాడు మాతో ఉన్న  శ్రీధర్‌. వాళ్లిద్దరూ చిరకాల స్నేహితులని తెలుసుగానీ టూరిజంలో సహోద్యోగులని నాకు అప్పుడే తెలిసింది!

“ప్రకృతి అంటే ఇంత తపన పడతాడా, ప్రయాణం అంటే అంత సరదానా…  విశాఖపట్నంలో అన్నేళ్లుండి అతను ఒక్కసారయినా అరకు చూళ్లేదంటే నమ్ముతావా” అని శ్రీధర్‌ అడిగినప్పుడు నిజంగానే నమ్మలేక ఇంకా ఆశ్చర్యపోయాను. అప్పటి నా భావాన్ని వర్ణించడానికి ఆశ్చర్యం కన్నా దిగ్భ్రాంతి అంటే సరిగ్గా ఉంటుందేమో. నా కళ్లలో ప్రశ్నలను గమనించి శ్రీధరే  చెప్పాడు.

“నవనీతానికి ఇవన్నీ ఇష్టమని మావంటి దగ్గర స్నేహితులకు తెలుసు. వాళ్లింట్లో తెలుసో లేదో మరి. ఇతను ప్రయాణం పెట్టుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆటంకం. ఒకసారి వాళ్లమ్మకు పక్షవాతం, మరోసారి నాన్న చనిపోవడం, ఒకసారి పిల్లల పరీక్షలు వాయిదా పడటం, మరోసారి భార్యకు కుదరకపోవడం… ఇలాంటివే. పోనీ స్నేహితులంతా కలిసి వెళదామన్నప్పుడూ అంతే. కిందటి జన్మలో త్రిలోక సంచారి అయుంటాడని మేం సరదాగా అనుకుంటుంటాం… ఏ శాపం తగిలిందో మరి, ఇల్లు ఆఫీసు తప్ప మరో లోకం ఎరగడు.. అయినా అన్ని ప్రదేశాల గురించి ఎంత తెలుసో అతనికి చూశావా..” నాకు నోట మాట రాలేదు. నేనూ నవనీతరెడ్డీ కలిసి వెళ్లాలనుకున్న చిన్నచిన్న ప్లాన్లన్నీ చిత్తవడం నాకు హఠాత్తుగా గుర్తొచ్చింది. నేనొకణ్ణే వెళ్లొచ్చి విశేషాలు చెబుతూ ఫోటోలు చూపిస్తుంటే అతను పొంగిపోవడం సినిమాలాగా నా కళ్లకు కట్టింది. సుశీలానాయర్‌ పరిచయం కాకపోతే నేనూ అలాగే ఉండిపోయేవాణ్నేమో.  ఆ ఊహే నన్ను చాలా భయపెడుతుంది. నాక్కలిగిన షాక్‌ నుంచి తేరుకుని అదేమాట పైకంటే కిటికీలోంచి బైటికి చూస్తూన్నదల్లా సుశీల మావైపు తిరిగింది. “మీ నవనీతం వంటివాళ్లు ప్రపంచంలో కోట్ల మంది ఉంటారేమో శ్రీధర్‌. చెప్పుకోదగ్గ కారణాలేవీ లేకుండానే చిన్న కోరికలు కూడా తీరనివాళ్లు… ఇంటి పక్క విశేషాలనయినా చూడలేనివాళ్లు.. మీరన్నట్టు శాపగ్రస్తులేమో మరి” అంటూ గాఢంగా నిట్టూర్చింది. ఏదో బరువయిన నిశ్శబ్దం మమ్మల్ని ఆవరించింది.

ట్రావెల్‌ జర్నలిస్టుగా నేను ఊళ్లూదేశాలూ తరచూ తిరిగే ఉద్యోగంలోకి  మారిపోతున్నప్పుడు నవనీతరెడ్డి కళ్లలో మెరుపు అంతాఇంతా కాదు. ఆ మెరుపే నేను ఏ కొత్త ప్రదేశంలో ఉన్నా నన్ను వెంటాడుతుంటుంది. ‘కోయీ వాదా నహీ కియా లేకిన్‌ క్యోం తేరా ఇంతెజార్‌ రెహతా హై….’ గుల్జార్‌ పాట ప్రశ్నగా నా చెవుల్లో మార్మోగుతూ ఉంటుంది. నేనిప్పుడు తిరుగుతున్నప్రాంతాలన్నీ గత జన్మల్లో నవనీతరెడ్డి తిరిగే ఉంటాడు. అందుకేనేమో ఈ ప్రదేశాలన్నీ ఈ జన్మలో అతని రాక కోసం ఎదురుచూస్తున్నట్టుంటాయి. ఇక్కడికి రావాలని అతనూ అక్కడ ఎదురుచూస్తుంటాడు. ఏ ఖండంలోనయినా, ఎంత మారుమూల దేశంలోనయినా పువ్వుల మీద వాలుతూ ఝుమ్మనే తేనెటీగల్ని చూసినప్పుడు, పచ్చిక చిగుళ్ల మీద నిలిచి మెరవనా వద్దా అని సంశయిస్తున్న హిమబిందువును గమనించినప్పుడు, పాయలుగా జారే జలపాతపు హోరును వింటున్నప్పుడు – నాకు నవనీతరెడ్డే గుర్తుకొస్తాడు! భ్రమణ కాంక్ష అణువణువునా నిండిన శాపగ్రస్తుడొకడు!!

(మే నెల పాలపిట్ట పత్రికలో ప్రచురితమయిన కథ)

Advertisements

14 thoughts on “భ్రమణకాంక్ష

 1. గంగి గోవు పాలల్లా ,ఉప్మా లో జీడి పప్పులా
  గంజాయి బ్లాగుల మద్య తులసి వనం లా
  అరుణోదయం లో ఉషా కాంతుల్లా అప్పుడప్పుడు వచ్చే మీ కధలు
  మనసు పొరల్లో నిద్ర పోతున్న భావాల్ని తట్టి లేపుతాయి .
  వ్యక్త పరచ డానికి మీరు కేవలం సెల్లు దూరమే
  అయినా పని వత్తిడిలో అదికూడా భారమే
  మీరే ఎప్పుడన్నా పని బడి చేస్తారని
  చకోర పక్షి లా ఎదురు చూస్తూ వుంటాను
  కొన్ని భావాలూ మనసులో నిక్షిప్తం చేసుకుంటేనే బావుంటాయి అనుకుంటూ ఊరుకుంటాను .

 2. కొద్దిసేపు అలా నిశ్శబ్దంగా కూర్చున్నాను. కొంత టైము పట్టింది, మరలా ఇంకోసారి చదివాను. చక్కటి వ్యక్తీకరణ.

 3. మీ కథల్లోని ఆద్రత నాకెప్పుడూ నచ్చే విషయం. పాత్రల బౌతిక ప్రవర్తనలు కాక మానసిక లోతుల్ని సృశించే శైలి ఈ మధ్యకాలంలో చాలా అరుదు. అది మీకుంది.

  ప్రయాణమనే ఆలోచననే జీవించే నవనీత్, నిజజీవితంలోభ్రమణశాపగ్రస్తుడనే ఎరుక ఒక్కసారిగా షాక్ ఇవ్వడంతో పాటూ, నన్నో ప్రయాణం చెయ్యడానికి పురిగొల్పింది. నాలాంటి పాఠకులెందరో! It is influencing individuals. అంతకంటే సార్థకత కథకు ఏముంటుంది?

 4. అరుణగారు..
  చక్కని స్క్రీన్ ప్లేతో కూడిన కథ.
  “…. గడచిపోయిన కాలాల్లో ఎవ్వరో ప్రేమికులు గుసగుసగా మాట్లాడుకున్న చిలిపి కబుర్లన్నీ చెవిన పడ్డట్టయి నా మొహంలోకి నవ్వు పాక్కుంటూ వస్తుంది.” ఈ ఫీలింగ్ చాలా సెన్సిబుల్ గా అనిపించింది….
  మరిన్ని ఆశిస్తూ… – నేనో..!

 5. First of all i want to thank Mr. Mahesh Garu, who suggested me to read this story. i like this story very much. “It is influencing individuals” The words are 100% true. అరుణిమ garu it’s an wonder full post. “మాఘ పౌర్ణమినాడు హిమాలయ సోయగాన్ని చూస్తుండనీ” while i am reading this words, i went in to a great visualization. this story give a lot pleasure to me, once again thanks to అరుణిమ.
  Balaji Sanala

 6. రవిగారూ, మీరు కవిగారు అయిపోతున్నారులా ఉంది. 🙂
  సునీతగారూ, మహేశ్ గారూ, రాజేశ్ గారూ, బాలాజీ గారూ, శారద గారూ,
  మీ అభిమానానికి కృతజ్ఞతలు. భ్రమణ కాంక్ష దాదాపు అందరిలోనూ ఉంటుందనుకుంటా. దాన్ని గుర్తుకు తెస్తే ఈ కథ సార్థకమయినట్టే.

 7. మీ కథ చాలా బాగుంది. రచనా శైలి చాలా బాగుంది. మీ శైలి చివరిదాకా చదివించింది. ఇలాంటి మంచి కథలు మీ నుంచి మరిన్ని రావాలని…

 8. సూటిగా చెప్పాలంటే ఇట్లాంటి కథలు రాసే వాళ్ళంటే కోపం. భ్రమణంలో బతుకు వెతుక్కుంటున్నవాళ్ళకీ, భ్రమణంలోనే బతుకు గడిచిపోతున్నవారికీ, హృదయం మూలల్లో దాక్కున్న చమ్మని బయటకి తీసుకొస్తాయి మీ కథలు. గుండె చిక్కబడుతుంది. కంటి మీదకొచ్చిన నీటిపొర, కాళ్ళనాపేస్తుంది. అందుకు సంతోషమే. కాని కాటి దాకా నడవాలంటే మళ్ళీ కాళ్ళాడించాల్సిందే. అదవ్వాలంటే తడిని పిండి బయటకి పంపాలి, ఆ ప్రక్రియలో ఉన్న పెయిన్ ని అనుభవంలోకి తీసుకొస్తాయి కాబట్టే నాక్కోపం.

 9. హాశ్చర్యంగా ఉంది..మీ అలమరలో టెల్గూ పుస్కకాలు కనబడటం లేదే. అంత చక్కగా తెలుగులో వ్రాసినందుకు అభినందనలు అందుకొండి.

 10. హ్మ్..యెంత చక్కగా వ్రాసారు.అలా నవనీత రెడ్డి గారు మా కాళ్ళ ముందు కదలాదినట్లే
  అనిపించింది.అలా ప్రయాణం చెయ్య లేని వాళ్ళలో కొంత వరకు నేను కూడా ఉన్నాను.
  కాని వసతులు ఉంటాయి అంటే కొంత వరకు వీలు చేసుకుంటాను

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s