రెడీమేడ్ చపాతీ

నలుగురున్న ఇంట్లో చపాతీలను, పూరీలను తయారుచే యాలంటే పెద్ద పని. పిండి కలపాలి, వత్తాలి. ఆపై కాల్చాలి. పూరీలయితే వేయించాలి. పెద్దపెద్ద హోటళ్లలో, క్యాంటీన్లలో ఈ పని మరింత భారం కదా.
ఏదో ఒక యంత్రం పిండి కలిపి, చపాతీ, పూరీలను చేసి కాల్చడానికి రెడీగా అందిస్తే..? కలో, కోరికో కాదు. ఇప్పుడు అలాంటి యంత్రం ఉంది. వాటికి భారీ మార్కెట్ కూడా ఉందని చెప్పారు హైదరాబాద్‌కి చెందిన ప్రభాకర్. ఒక కొత్త తరహా ఆలోచనతో వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన మార్గం ఇంకొందరు ఔత్సాహికులు అనుసరించడానికి అనువుగా ఉంది.

హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి ప్రాంతంలో ఒక మలుపులో ‘ఇక్కడ వండుటకు సిద్ధంగా ఉన్న చపాతీలు, పూరీలు, జొన్నరొట్టెలు లభిస్తాయి’ అనే ప్రకటన కనిపిస్తుంది. ఒకటి రెండు రూపాయలకు మించని ధర. పరిశుభ్రమైన వాతావరణం. వెళ్లినవాళ్లు కొన్నయినా కొనుక్కురాకుండా ఉండలేరు, ఒకసారి కొన్నవాళ్లు మరోసారి వెళ్లకుండా అసలే ఉండలేరు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఉద్యోగినులు, బ్రహ్మచారులకే కాదు, గృహిణులకు కూడా ప్రభాకర్ ప్రారంభించిన చపాతీ యంత్రం ఒక ఊరటలాగా కనిపిస్తోంది. అందువల్లే ఏడాది క్రితం ప్రారంభమైన ఆయన వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది.

ఆలోచన ఎలా?
ఒక మద్యం తయారీ సంస్థ సేల్స్ రంగంలో 27 సంవత్సరాలు పనిచేసిన ప్రభాకర్ ఆ పనితో విసిగిపోయారు. ఒత్తిడివల్ల రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలూ చుట్టుముట్టాయి. ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నాడు. దేశమంతా తిరిగిన అనుభవం, కొత్తగా చెయ్యాలన్న తపన.. వీటికి ఇంటర్నెట్ పరిజ్ఞానం జోడిస్తే ‘సెమీ ఆటోమేటిక్ చపాతీ’ ఆలోచన వచ్చింది ఆయనకు. ఆ యంత్రాన్ని కొనుగోలు చేసి, తన ఆలోచనకు తగినట్టు దానిలో మార్పులుచేర్పులు చేశారు.

ఎలా తయారవుతాయి?
గోధుమపిండి, నూనె, ఉప్పు, నీటిని ఒకేసారి యంత్రంలో వెయ్యాలి. సరిగ్గా ఏడు నిమిషాల్లో పిండి కలపడం పూర్తవుతుంది. దాన్ని సిలిండర్‌లో పెట్టి హైడ్రాలిక్ ప్రెషర్‌ను ఉపయోగించినప్పుడు చపాతీలు, పూరీలు కావాల్సిన పరిమాణంలో వచ్చేస్తాయి. ఈ క్రమంలో తేమ తీసేస్తారు కనుక అవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. అందువల్లే అవి ఫ్రిజ్‌లో ఉంచితే ఆరు రోజుల వరకూ పాడవకుండా ఉంటాయి. ఇలా తయారయిన వాటిని ఇంట్లో నేరుగా వండుకోవడమే. ప్రస్తుతానికి ప్రభాకర్ వీటిని సామాన్య వినియోగదారులతో పాటు, కేటరింగ్ సంస్థలు, కర్రీపాయింట్లు, హాస్టళ్లు, సూపర్‌మార్కెట్లకు పంపిణీ చేస్తున్నారు. కిందటేడు కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వరదలు వచ్చినప్పుడు అక్కడ పంచడానికి దాతలకు తగ్గింపు ధరల్లో దాదాపు పద్దెనిమిదివేల చపాతీలను అందజేశారు.

కిటుకులు తెలియాలి..
ప్రభాకర్ యంత్రం గంటకు నాలుగువందల చపాతీలను తయారుచెయ్యగలదు. కాని ఇప్పటికైతే రోజుకు రెండువేల చపాతీలు, పూరీలు అమ్ముడుపోతున్నాయి. దీనిమీద ప్రభాకర్ కాకుండా ముగ్గురు మహిళలు, ఒక సూపర్ వైజర్ ఉపాధి పొందుతున్నారు. ‘పెద్ద ఉద్యోగాన్ని వదిలేసి, రొట్టెలమ్ముకోవడం ఏమిట’ని ప్రభాకర్‌ను చాలామందే నిరుత్సాహపరిచారట. వ్యాపారం ప్రారంభించిన కొత్తలో సరిగా కుదరక చాలా పిండి వృధా అయిపోయి నష్టం వచ్చేదట. నాలుగయిదు నెలలయితేగానీ ఆ పనిలో చేయి తిరగలేదు. ‘చపాతీ, పూరీల పిండి సరిగా కలపడం అనుభవాన్ని బట్టే ఉంటుంది. దానికితోడు వాతావరణాన్ని అనుసరించి కూడా ఉంటుంది. హైదరాబాద్ వంటి పొడి వాతావరణంలో పాళ్లు కలిపినట్టు విశాఖపట్నం వంటి సముద్రతీర ప్రాంతాల్లో కలపడానికి కుదరదు.. అది చెయ్యగాచెయ్యగా వస్తుంది’ అని చెబుతున్న ప్రభాకర్ ప్రభుత్వ సంస్థ అయిన ‘డైరెక్టరేట్ ఆఫ్ షోర్‌గమ్’తో (షోర్‌గమ్ అంటే జొన్నలు) ఒప్పందం కుదుర్చుకున్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం ఆ సంస్థ రాగులు, జొన్నలను కలిపి తయారు చేసిన పిండిని ప్రభాకర్‌కు ఇస్తే, ఆయన దాంతో రోజుకు ఐదొందల చపాతీలను తయారు చేస్తున్నారు. ఆ సంస్థే ‘వేగన్’ అనే పేరుతో వాటిని సూపర్‌మార్కెట్లలో అమ్ముతోంది. సుమారు ఆరులక్షల రూపాయల దాకా పెట్టుబడి అవసరమయ్యే ఈ వ్యాపారాన్ని రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల్లో ప్రారంభించాలనుకునే ఉత్సాహం ఉన్నవారికి తాను స్వయంగా శిక్షణనిస్తానంటున్నారు ప్రభాకర్. ఈ మాత్రం ఊతమిస్తే ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఇక ఆగుతారా? ఇకముందు చాలాచోట్ల రెడీ టు కుక్ చపాతీలు, పూరీలూ దర్శనమిస్తాయేమో!  (ప్రభాకర్ సెల్ నెంబర్ : 98480 72133)

5 thoughts on “రెడీమేడ్ చపాతీ

  1. ఎప్పుడో 70 ప్రాంతాలలోనే, ఈ చపాతి, పూరి ప్రెస్‌లు వచ్చినవి. కాని ఇలా “వాణిజ్యం” కొరకు కాదు. గృహిణులకు అలసట లేకుండా చేసేవి. ఉత్తర భారత దేశం నుండి దిగుమతి అయ్యేవి.

    ప్రభాకర్ లాంటి వారు నేడు యువత కి అవసరం. తెలుగు వారు ఉద్యోగాల కోసం వెతుక్కోకుండా, ఉద్యోగాలు , ఉపాధి కల్పించే దిశగా ప్రయాణం చేయ్యాలి.

  2. wow, thats a very good idea…..అబ్బ, ఇలా రెడీమేడ్ గా దొరికితే అంతకన్నా ఇంకేం కావలి, హాయిగా కొనేసుకుని ఇంట్లో వండేసుకోవచ్చు, ప్రాణం సుఖంగా ఉంటుంది. ప్రభాకర్ గారికి బోలెడు థాంక్సులు. ఈ విషయం రాసినందుకు మీకూ ధన్యవాదములు.

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s