బియ్యాన్ని తయారుచెయ్యగలిగిన కంపెనీ ఉందా?

రైతుల కోసం ఇన్ని వేల కోట్ల రూపాయలు సబ్సిడీలు, రుణమాఫీలు ఇచ్చామని ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయిగానీ సగటు రైతు కుటుంబ ఆదాయం నెలకి 1700 రూపాయలేనని మీకు తెలుసా? ఇలాంటి వాస్తవాల్ని అందరికీ తెలియజెప్పడానికి, రైతు సంక్షేమంలోనే దేశక్షేమం ఉందని నచ్చజెప్పడానికి ‘రైతు స్వరాజ్య యాత్ర’ జరుగుతోంది. అక్టోబర్‌ రెండున గుజరాత్‌ సబర్మతిలోని గాంధీ ఆశ్రమంలో మొదలైన ఈ యాత్ర గడచిన వారం రోజులుగా మన రాష్ట్రంలో తిరుగుతోంది. 20 రాష్ట్రాలు… 20 వేల కిలోమీటర్లు… 71 రోజుల పాటు జరిగే యాత్ర డిసెంబర్‌ పదకొండున ఢిల్లీకి చేరుతుంది. విశాఖపట్నం చేరి ఒరిస్సాకు వెళ్లబోయే ముందు ‘రైతు స్వరాజ్య యాత్ర‘లో పాల్గొంటున్న కొందర్ని పలకరిస్తే ఏం చెప్పారంటే…….

అన్నాన్ని తయారుచెయ్యగలిగిన కంపెనీ ఉందా?
‘‘నా పేరు గజానన్‌ ఓంకార్‌ హర్ని. నేను మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందిన అకోలా జిల్లా రైతును. మీకు తెలుసా, ఇప్పటికీ మా ప్రాంతంలో రోజుకు కనీసం పద్దెనిమిదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక్క మాదగ్గరే కాదు గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, గోవా, కర్ణాటక… మొత్తం దేశమంతా పరిస్థితి ఇలాగే ఉండటం చూస్తుంటే చాలా బాధగా ఉంది. కానీ దీన్ని మార్చడం మన చేతుల్లోనే ఉంది. నిజానికి రైతుల ఆత్మహత్యలు తమకు తాము చేసుకుంటున్నవి కానేకావు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాల్లో లోపాల వల్ల జరుగుతున్నవి. అంటే ప్రభుత్వం చేస్తున్న హత్యలవి. ఇదే వాదనతో మేం మహరాష్ట్ర ప్రభుత్వం మీద కేసు వెయ్యదల్చుకున్నాంగానీ మా ప్రయత్నాలను నీరుగార్చేశారు. ప్రభుత్వాలు ఇస్తున్న ప్యాకేజిలు, నష్టపరిహారాలు కూడా నిజమైన రైతుల వరకూ రావడం లేదు. అలాగే బ్యాంకులు రుణాలను మాఫీ చేస్తున్నామంటాయి, అవికూడా మాదాకా రావు. అన్నీ అధికారులు, దళారుల జేబులు నింపడానికే సరిపోతున్నాయి. మీకో ఉదాహరణ చెప్పనా దేశమంతా సోయా ఉత్పత్తులకు ఇంత డిమాండ్‌ ఉందికదా – మా చుట్టుపక్కల గ్రామాల్లో సోయాబీన్స్‌ ఎక్కువ పండిస్తాం. మొన్న దీపావళి తర్వాత పంటను అమ్ముదామని తీసుకెళితే దుకాణాలన్నిటినీ మూసేశారు. కొంటామన్న ఒకరోఇద్దరో వర్తకులు కూడా నాలుగో వంతు ధరకు అమ్మమని అడిగారు. ఇక ఓపిక నశించిన మావాళ్లు గొడవకు దిగారు. పరిస్థితి ఇలా ఉంటే రైతులు ఏం పండిస్తారు? విత్తనాలు, పురుగుమందుల సంస్థలకు, బహుళజాతి కంపెనీలకు ఇస్తున్న రాయితీలు, కల్పిస్తున్న సదుపాయాలు నేరుగా రైతులకే ఇస్తే పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంటుంది. ఏ కంపెనీ కూడా బియ్యం గింజను, అన్నాన్ని తయారుచెయ్యలేదు. అది గుర్తుపెట్టుకోవాలి మనమంతా.’’

అగ్రి’కల్చర్‌’ కాస్తా అగ్రి’బిజినెస్‌’ అయిపోతోంది…
‘‘నా పేరు అనంతు. నేను టెలికామ్‌ ఇంజినీర్‌గా స్విట్జర్లాండ్‌తో సహా పలు దేశాల్లో పనిచేశాను. నాలుగేళ్ల క్రితం చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశాను. అప్పటినుంచీ సామాజిక అంశాలపైనే దృష్టి పెట్టాను. ముఖ్యంగా వ్యవసాయం పైన. నాలాంటి ఆలోచనలే ఉన్న స్నేహితులతో కలిసి రెండేళ్ల క్రితం ‘రిస్టోర్‌’ అనే ఒక చిన్న దుకాణాన్ని ప్రారంభించాను. దీనిద్వారా నగరజీవులకు మన సంప్రదాయక వ్యవసాయ ప్రాముఖ్యత తెలియజేయాలనేది మా లక్ష్యం. రైతులతో కలిసి పనిచేస్తాం, వారు సేంద్రియ వ్యవసాయంవైపు మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తాం. చిన్న రైతులు తమ ఉత్పత్తులను మా దుకాణం ద్వారా అమ్ముకునేలా సాయపడతాం. నగరవాసులను ఒకరోజో రెండ్రోజులో రైతుల దగ్గరకు తీసుకెళతాం. వాళ్లకు ఉత్సాహముంటే పొలాల్లో పనిచేయవచ్చు కూడా. స్కూళ్లకూ, ఆఫీసులకూ వెళ్లి వ్యవసాయం ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా చెబుతుంటా. నా కార్యకలాపాల వల్ల మన దేశంలో వ్యవసాయ సంక్షోభం ఎంత తీవ్రంగా కమ్ముకుంటోందో గమనించగలుగుతున్నాను. ఒక వృత్తిగానో, జీవనోపాధిగానో, ఇష్టంగానో వ్యవసాయాన్ని కొనసాగించేవాళ్లు తగ్గిపోతున్నారు. మరోవైపు వ్యవసాయం పెరుగుతోంది, ఎక్కడంటారా, రిలయెన్స్‌, మోన్‌శాంటో వంటి సంస్థలు వేలు, లక్షల ఎకరాలను ఆక్రమిస్తున్నాయి. కంపెనీల గుత్తాధిపత్యం పెరిగిపోతే – మనకు కావలసిన పంటగాక, వాళ్లేది చెబితే అది పండించాల్సి వస్తుంది.  ఇదిలాగే కొనసాగితే భవిష్యత్‌ తరాలు చాలా నష్టపోతాయి. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో విత్తనాలను సంప్రదాయబద్ధంగా దాచేవాళ్లు నాకు తెలుసు. వాటిని ఇచ్చిపుచ్చుకోవడమే తప్ప డబ్బుకు అమ్మే ప్రసక్తి లేని ప్రదేశాలు తెలుసు. మన దేవాలయాల మీద చూడండి, కలశం కనిపిస్తుంది. వేల ఏళ్లుగా వ్యవసాయం మనకొక సంప్రదాయం. బహుళజాతి సంస్థలు దాన్ని బిజినెస్‌గా చూస్తున్నాయి. అగ్రి’కల్చర్‌’ కాస్తా అగ్రి’బిజినెస్‌’ అయిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ ఆలోచనలతో ‘రైతుల స్వరాజ్య యాత్ర’ గురించి వినగానే నేనూ అడుగులు కలిపాను. తాము వ్యవసాయం ఎందుకు చెయ్యాలో, ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో రైతులకు తెలియజెప్పాలి. ఎక్కడో ఉన్న ధృవప్రాంతాల ఎలుగుబంట్లో మరోటో అంతరించిపోతున్నాయి, కాపాడుకుందామని అందరూ మాట్లాడుకుంటారు. కానీ మనమధ్య నుంచి నిత్యావసరమైన వ్యవసాయం క్రమేణా అంతరించిపోతుంటే ఎవరూ మాట్లాడటం లేదు. అది మాట్లాడదామనే నేను ఈ యాత్రలో భాగమయ్యాను.’’

రైతులు ముష్టివారయిపోతున్నారు…
‘‘నా పేరు సవిత. ఒరిస్సా మెహర్‌భంజ్‌ జిల్లాలో సామాజిక సేవికగా పనిచేస్తున్నా. మూడేళ్లుగా రైతులు ఆదివాసీలతో కలిసి పనిచేయడం వల్ల వాళ్ల స్థితిగతులు నాకు అర్థమయ్యాయి. ఆంధ్ర, మహారాష్ట్రల్లో మాదిరిగానే మా రాష్ట్రంలోనూ రైతుల ఆత్మహత్యలు అధికంగానే జరుగుతున్నాయి. కేవలం చనిపోతున్న రైతుల గురించే లెక్కలు చెబుతున్నారుగానీ, రైతు మరణం వల్ల నాశనమైపోతున్న కుటుంబాలు, సామాజిక వ్యవస్థ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. నీరు, భూమి, విత్తనాల మీద రైతులకే అధికారం ఉంటే ఈ పరిస్థితి రాదు. అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, అవి పండాలంటే ఎక్కువ నీరు, నీటికోసం కరెంటు, వాటికోసం అప్పులు – ఇలా రైతులు ఒక విషవలయంలో కూరుకుపోతున్నారు. మా దగ్గర హైవేల మీద, బస్టాండుల్లో, రైల్వేస్టేషన్లలో ముష్టెత్తుకుని జీవించే స్థాయికి దిగజారిపోయారు. మరోవైపు ప్రభుత్వాలు ఆదివాసీలకు తెలియకుండా వారి ప్రాంతాలను ఆక్రమించి పెద్దపెద్ద కంపెనీలకు కట్టబెట్టేస్తోంది. ఉన్నచోటిని ఖాళీ చేయించి ఎక్కడో ఐదారు డిస్మిళ్ల జాగా ఇస్తోంది. (100 డిస్మిళ్లు = 1 ఎకరం) దానిలో కేవలం రెండు గదుల చిన్న ఇల్లు కట్టుకోవడం సాధ్యపడుతుంది. మరి వీళ్లతో తీసుకెళ్లిన మేకనో, ఆవునో, గొర్రెనో ఎక్కడ కట్టుకోవాలి? ఆ ఇంట్లో నలుగురు మనుషులు ఉండటమే అసాధ్యం. అడవిలో దొరికే కాయపండూ తిని లాక్కొచ్చే మనుషులు అక్కడ ఏం తిని బతుకుతారు? ఏం పని చేస్తారు? రెండుమూడేళ్లుగా మా రాష్ట్రంలో పునరావాసం జరుగుతున్న తీరు ఇదే. ఈ యాత్రలో పాల్గొంటే ఇలాంటివాటిని ఎలా ఎదుర్కోవాలో, ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది కదా.’’

ఈ బానిసత్వం మనకెందుకు?
‘‘నా పేరు విజయ్‌. గుజరాత్‌లోని స్వరాజ్‌ యూనివర్సిటీలో చదువుతున్నా. అలాఅని అక్కడ పుస్తకాలు, పెద్ద భవంతులు, లైబ్రరీలు ఉంటాయనుకుంటే పొరపాటే. అక్కడ అవేం ఉండవు. పొలమే మా తరగతి, రైతులే మా అధ్యాపకులు. నేను ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం మీద దృష్టి పెట్టాను. నాతో చదివేవాళ్లలో కొందరికి నీటి యాజమాన్యం పట్ల మక్కువ. ఇంకొంద రు రైతులకు కంప్యూటర్‌ విజ్ఞానాన్ని అందించాలనుకుంటారు. యూనివర్సిటీలో మేమంతా కలిసి నేర్చుకుంటాం అన్నమాట. నిజానికి మాది మహారాష్ట్ర అయినా మా ఊళ్లో నేను చేసే బిజినెస్‌ నాకంత నచ్చక నేను గుజరాత్‌ వె ళ్లాను. ఈ యాత్ర అక్టోబర్‌ రెండున సబర్మతిలో మొదలయినప్పుడు నేను, మా స్నేహితుడు దీనిలో కలిశాం. ఇన్ని ప్రాంతాలు తిరుగుతుంటే దేశం విత్తన బానిసత్వంలోకి ఎలా వెళ్లిపోతోందో అర్థమయింది. దీన్ని ఎదుర్కోవడానికి ఏదోకటి చేస్తాం.’’

One thought on “బియ్యాన్ని తయారుచెయ్యగలిగిన కంపెనీ ఉందా?

  1. తెలుగు పత్రికలద్వార కాని ప్రసార మాధ్యమల ద్వారా కాని ఈ యాత్ర గురించి తెలియలేదు. పాలగుమ్మి సాయినాథ్ రైతుల వ్యథల మీద ఆంగ్ల పత్రికలలో వ్రాయడం ద్వార వారి ఇబ్బందులు తెలుస్తున్నవి. రైతులకు జరుగుతున్న దాఋణమైన అన్యాయం ఇది. అలాగని అందరు రైతులని ఒకే గాట కట్టలేము.

    నేటి యువత ఉద్యోగాలమీద చూపిస్తున్న ఆసక్తిని వ్యవసాయం మీద చూపించవచ్చు. స్వతంత్రంగా తమకాళ్ళ మీద తాము నిలబడుతూ, పదిమందికి సహాయం చేయవచ్చు. యువతని ఆ దిశగా ప్రోత్సహించడానికి తగిన ప్రచారం, కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంది.

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s