విశాఖతీరంలో ఫుట్ పాత్ క్లబ్


స్థలం : విశాఖ మ్యూజియం ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌ మీదున్న బెంచీ.
సమయం : ఉదయం ఆరున్నర, ఏడు మధ్యన
తేదీ : ప్రతిరోజూ
వయసులో పెద్దవారు… ఓపిక ఉన్నంత దూరం నడుస్తారు. తర్వాత అక్కడికి చేరుకుంటారు. అప్పుడు మొదలవుతుంది సందడి. అంత నడిచినందుకు ఆయాసం ఉండదు, ఆనందం ఉంటుంది. వాళ్ల సందడి చూసి వయసు తోకముడిచి పారిపోతోంది, అనారోగ్యం ఆ దరికి చేరకుండా తప్పించుకు తిరుగుతోంది. ఆ తతంగాన్నంతా చూడాలంటే విశాఖపట్నంలోని ‘ఫుట్‌పాత్‌ క్లబ్‌’ గురించి తెలుసుకోవాల్సిందే.

‘ఫుట్‌పాత్‌ క్లబ్‌’ సభ్యులు ఎక్కువమంది అరవై పైబడినవారే. రోజూ ఉదయం అరగంటసేపు కలుస్తారు, తర్వాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. ఆరోజు దినపత్రికల్లో, ఛానెళ్లలో వచ్చిన తాజా వార్తల గురించి మాట్లాడుకుంటారు. రాజకీయ అంశాల గురించి మాట్లాడుకుంటారేగానీ, వివాదాల మాటెత్తి పోట్లాడుకోరు. ఆర్థిక లావాదేవీల ఊసే ఉండదు. ప్రతి సభ్యుడి పుట్టినరోజునూ సరదాగా జరుపుకొంటారు. అతని జీవిత విశేషాలను క్లుప్తంగా ఒకరు చదివి వినిపిస్తారు. సాధించిన విజయాలను అందరిలోనూ నెమరువేసుకుంటారు. లయ తప్పకుండా పదకొండు చప్పట్లు కొట్టి శుభాకాంక్షలు చెబుతున్నప్పుడు బర్త్‌డే బోయ్‌ కళ్లలో ఆనందం చూడాలి తప్ప మాటల్లో చెప్పలేం.
ప్రారంభం ఇలా…
వెటరన్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు అత్తిలి పైడికొండ, గ్యాస్ ఏజెన్సీ యజమాని ముప్పిడి రంగనాయకులు, మొహ్ సిన్ ఐ బ్యాంక్ వ్యవస్థాపకులు కాశిమ్‌ మెహ్‌దీ, బిల్డర్ రామ్‌మనోహర్‌రెడ్డి వంటివారు మార్నింగ్‌ వాక్‌ తర్వాత అక్కడ కలిసి కూచునేవారు. నెమ్మదిగా ఇతరులతో చిరునవ్వుల పరిచయమైంది. అది మాటల్లోకి దిగి, రోజూ ఒకర్నొకరు చూడకపోతే వెలితిగా అనిపించినప్పుడు… అలా 1988లో ఫుట్‌పాత్‌ క్లబ్‌ పుట్టింది. ఇందులో ప్రస్తుతానికి 40 నుంచి 95 వరకూ వివిధ వయసుల వాళ్లు ఎనభైమంది వరకూ సభ్యులున్నారు. రోజూ కనీసం ముప్ఫై నలభైమంది క్రమం తప్పకుండా కలుస్తుంటారు. ఆదివారాలయితే ఎనభైమందీ వచ్చినా ఆశ్చర్యం లేదు. హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్‌ పాండురంగారావు, ఏపీ లా యూనివర్సిటీ వీసీ వై.సత్యనారాయణ, ఆంధ్రాయూనివర్సిటీ వీసీగా పనిచేసి రిటైరయిన రమణ… జాబితా చెబుతూ పోతుంటే ఈ చోటు చాలదు. ఇస్రో, ఎన్‌ఎస్‌టీఎల్‌ వంటి సంస్థల్లో పనిచేసిన శాస్తవేత్తలు, న్యాయవాదలు, వైద్యులు, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, నటులు, గాయకులు, బిల్డర్లు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, బ్యాంకు ఉద్యోగస్తులు… అబ్బో, ప్రపంచంలో ఎన్ని రకాల ఉద్యోగాలున్నాయో అన్ని రకాలమందీ ఫుట్‌పాత్‌ క్లబ్‌లో సభ్యులున్నారు. స్వాతంత్ర సమరయోధులు ఈ క్లబ్‌కు బోనస్‌ అనుకోండి.
వీళ్ల తీరే వేరు
ఫుట్‌పాత్‌ క్లబ్‌ పేరుకు తగినట్టే వాళ్ల సమావేశాలన్నీ ఫుట్‌పాత్‌మీదే నడుస్తుంటాయి. బీచ్‌ రోడ్‌లో ఉన్న అద్భుతమైన శిల్పాలను చెక్కిన శిల్పులయినా, యూనివర్సిటీలో రిటైరయిన వీసీ అయినా… ఎవరినైనా అక్కడికే పిలిచి సన్మానాలు చేస్తారు క్లబ్‌ సభ్యులు. అలాగని విసుగెత్తించే పొడుగాటి ప్రసంగాలూ, పట్టు శాలువాలూ ఏమీ ఉండవు. పూలమాలతోనో, బొకేతోనో సత్కరించడం, వారి కృషి గురించి అభిమానంగా నాలుగుమాటలు చెప్పుకోవడం, ఆరోగ్యానికి మంచి చేసే ఏ లెమన్‌ టీనో అందరూ కలిసి సేవించడం. అంతే. ఎప్పటికీ గుర్తుండిపోయే సన్మానాలవి. క్లబ్‌ సభ్యులందరూ ఆర్థికంగా పెద్ద ఇబ్బందులున్న వారేం కాదు. ఎక్కువమంది పిల్లలు చాలామంది విదేశాల్లో స్థిరపడినవారే. దానివల్ల సమాజానికి మేలు చేసే పనుల్లో ముందుంటారు ఈ సీనియర్‌ సిటిజన్లందరూ. ఎప్పటికప్పుడు రామకృష్ణ మిషన్‌, పాపాహోమ్‌ వంటివాటికి చేతనైన సాయం చేస్తుంటారు.
ఎన్నెన్నో సరదాలు…
ఉదయాన్నే కలుసుకుని విడిపోవడమే కాదు – అప్పుడప్పుడు కుటుంబాలతో సహా పిక్నిక్కులకెళ్లడం, పార్టీలు చేసుకోవడం ఫుట్‌పాత్‌ క్లబ్‌ సభ్యుల ఆనంద రహస్యం అని ‘నవ్య’ జరిపిన పరిశోధనలో వెల్లడయింది. ఆ పిక్నిక్కుల్లో చూడాలి వీళ్ల అల్లరి. ఆటలు, పాటలు, డ్యాన్సులు…. అందరూ చిన్నపిల్లలయిపోతారంతే. రాజమండ్రి నుంచి బయల్దేరి లాంచిలో భద్రాచలం వరకూ వాళ్లు వెళుతున్నప్పుడు ఆ సందడికి అంత ప్రాచీనమైన గోదావరే తన వయసు మరిచిపోయిందని చెప్పుకోవడం ‘నవ్య’ చెవిన పడింది. దెబ్బకి భద్రాద్రి రామయ్యకూడా ఫుట్‌పాత్‌ క్లబ్‌ సభ్యుడయిపోదామనుకున్నాట్టగానీ సీతమ్మ ‘చాల్లెండి సంబరం, ఇంకా భక్తులొస్తారు. వాళ్లకు నేనేం చెప్పను? ఇక్కడే ఉండండి…’ అని చెయ్యి పట్టుకు ఆపేసిందట ఆయన్ని. అరసవల్లి, గంగవరం, పుణ్యగిరి, స్టీల్‌ప్లాంట్‌, దేవీపురం… విశాఖ చుట్టుపక్కల ఈ సీనియర్‌ సిటిజన్స్‌ అడుగుపెట్టని సందర్శనీయ స్థలం ఉందేమో వెతకండి. ఈ క్లబ్‌ పిక్కిక్కుల రైలుకు ఇంజన్‌ రిటైర్డ్‌ ఎస్పీ పి.సత్యనారాయణ. కావలసివన్నీ సమకూర్చే బాధ్యత ఎక్కువసార్లు ఆయనే తీసుకుంటారు. ఇవిగాక నెలలో కనీసం నలుగురైదుగురి పుట్టినరోజులో, పెళ్లిరోజులో జరుగుతాయా… అవన్నీ వేడుకలే క్లబ్‌లో. అయితే దేనిలోనూ అట్టహాసం ఉండదు. ఆనంద హాసమే వాళ్లందరూ పంచుకునే ఆస్తి. వీళ్ల వరస చూస్తుంటే మనకూ ఆ ఆస్తిలో కాసింత వాటా కావాలనిపిస్తోంది కదూ. లాంగ్‌లివ్‌ ఫుట్‌పాత్‌ క్లబ్‌.

ఫోటోలు : వై. రామకృష్ణ

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
శ్యామ్‌ తులసీదాస్‌ గెహనీ 1946లో పాకిస్తాన్‌లోని కరాచీలో పుట్టి పెరిగారు. దేశవిభజన తర్వాత ముంబైకొచ్చి స్థిరపడి, మర్చంట్‌ నేవీలో ఇంజినీర్‌గా పనిచేసిన ఆయన పదవీ విరమణ తర్వాత ఐదేళ్లుగా విశాఖలో స్థిరపడ్డారు. ఒకసారి ఆయన అనారోగ్యం పాలయినప్పుడు ఎస్పీ సత్యనారాయణ స్పందించి సాయం చేశారు. అలా ఫుట్‌పాత్‌ క్లబ్‌లో సభ్యులైన శ్యామ్‌గెహనీ దానికి వీరాభిమాని. క్లబ్‌కు రాకుండా ఒక్కరోజు కూడా ఉండలేనంటున్న ఆయన ‘జీవితం అంటే ఏమిటో ఇక్కడే తెలిసింది..’ అన్నారు ఆ్రర్దంగా.

అద్వానీ ఇక్కడే ఉన్నారు…
క్లబ్‌ తరఫున మాట్లాడటానికి ఒక అధికార ప్రతినిధి ఉంటారు. ప్రస్తుతం ఆ పనిని నిర్వహిస్తున్నది షిప్‌యార్డ్‌లో పనిచేసి రిటైరయిన నాగభూషణరావు. క్లబ్‌ ‘కుర్రాళ్ల’ందరూ ఆయన్ని సరదాగా ‘అద్వానీగారూ…’ అంటుంటారు. ఆయన చూడటానికి అలానే ఉండటం, అనర్గళంగా మాట్లాడటం అందుకు కారణాలేమో మరి. ప్రధాని మన్మోహన్‌, జార్జి ఫెర్నాండెజ్‌ వంటి నాయకులతో అతి సన్నిహితంగా గడిపిన ఆయన వాటిని తల్చుకుని నిజంగా అద్వానీలాగే ఫీలవుతుంటారు. షిప్‌యార్డులో ట్రేడ్‌ యూనియన్లు నడిపిన అనుభవం ఉందేమో- ప్రతిదాన్నీ ముందుండి నడిపిస్తుంటారు.

“మా సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉందని తెలిస్తే చాలు, వెంటనే ఓ ఇరవైముప్ఫైమంది వెళ్లి పలకరించి వస్తాం. అది చాలదా -వెంటనే కోలుకోవడానికి? నాకోసం ఇంతమంది ఉన్నారన్న భావనే గొప్ప బలాన్నిచ్చే టానిక్‌.”
– కాశిమ్‌ మెహ్‌దీ

“ఏదో పనిపడి వేరే ఎక్కడికైనా పదిరోజులు వెళ్లినా, ఎంత త్వరగా తిరిగి వచ్చేస్తామనే ఆలోచిస్తుంటాం. ఇంట్లో పనుల వల్ల వరసగా రెండు రోజులు రాలేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. మళ్లీ క్లబ్‌ సభ్యులను కలిస్తే ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది.”
– ప్రకాశరావు

ఏవైనా సమస్యలు ఎదురయినప్పుడు మనస్సు అలజడిగా ఉంటుంది. ఉదయం ఇక్కడికొచ్చి అందర్నీ కలిస్తే చాలు, మనసు తేలికపడుతుంది. చాలామంది సీనియర్‌ సిటిజన్లే కనుక మన సమస్య చెబితే ఏదో సలహా చెబుతారు. చాలాసార్లు అవి పనికొస్తాయి.
– కృష్ణమూర్తి

నేనీమధ్యనే చేరానిందులో. ప్రతి ఉదయం శుభోదయంలాగా అనిపిస్తోంది.
– యామల సత్యనారాయణ

Advertisements

4 thoughts on “విశాఖతీరంలో ఫుట్ పాత్ క్లబ్

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s