40 ఏళ్ల క్రితం ఆమె ఒక్కరే

ఏ అమ్మాయిని పలకరించినా ‘ఇంజినీరింగ్‌ చదువుతున్నా’ అని చెబుతున్న రోజులివి. నలభయ్యేళ్ల క్రితం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కాలేజీలో చేరిన మొట్టమొదటి విద్యార్థిని కె. రాజరాజేశ్వరి తన అనుభవాలను చెబుతున్నప్పుడు వింటుంటే అబ్బురంగా అనిపిస్తుంది. బ్యాచ్‌లో ఏకైక అమ్మాయిగా చేరిన ఆమె ప్రస్తుతం తాను చదువుకున్న కాలేజీలోనే ప్రొఫెసర్‌గా ఎదిగారు. వెలుగుతున్న దీపమే మరిన్ని దీపాలను వెలిగించగలదన్న మాటను నిజం చేస్తూ ఇంకొందరు మహిళలు శాస్త్రవేత్తలుగా రూపొందేలా సహకరిస్తున్న రాజరాజేశ్వరితో ఇంటర్వ్యూ…

* మీరు చేరినప్పటికీ ఇప్పటికీ ఇంజినీరింగ్‌ విద్యలో తేడాలు…
– నేను 71లో ఇంజినీరింగ్‌లో చేరినప్పుడు అది ఐదేళ్ల కోర్సు. ఇంటర్మీడియెట్‌ మార్కుల ఆధారంగానే సీటు ఇచ్చేవారు. మేం చేరిన తర్వాతే ఏయూ కాలేజీలో ఈసీఈ ఏర్పడింది. కంప్యూటర్స్‌ వచ్చింది 80లో. నేను జేఎన్‌టీయూ కాకినాడలో లెక్చరర్‌గా చేసి మళ్లీ ఏయూకు వచ్చేశాను. 1992లో పీహెచ్‌డీ పట్టానందుకున్నా. అప్పట్లో మేం క్లాసుకు పన్నెండు లేదా పదిహేను మంది ఉండేవాళ్లం. అందరివీ పేర్లు, కుటుంబనేపథ్యాలు, బలాబలాలు అన్నీ అధ్యాపకులకు తెలిసేవి. మరి ఇప్పుడు? క్లాసుకు నలభై, యాభైమంది కూడా ఉంటున్నారు. దానివల్ల విద్యలో నాణ్యత తగ్గిపోతోందన్న మాట వినిపిస్తోంది.

* క్లాసులో ఒకే అమ్మాయిగా ఉండటంలోని సాధకబాధకాలు…
– నాకేం తేడా/అసౌకర్యం తెలిసేది కాదు. తోటి విద్యార్థులు కూడా స్నేహంగానే ఉండేవారు. ఇప్పట్లాగా జెరాక్సు సౌలభ్యం ఉండేది కాదు, పుస్తకాలు ఏవంటే అవి మార్కెట్లో దొరికేవికాదు. అందువల్ల పుస్తకాలు, నోట్సులు ఏవైనా పేపర్లు కావాలంటే ఇచ్చిపుచ్చుకునేవాళ్లం. చాలా ముఖ్యమైదయితే మాత్రం ఇచ్చేవారు కాదు- ఎందుకంటే మార్కుల కోసం గట్టి పోటీ ఉండేది. అధ్యాపకుల్లో ఎక్కువమంది ప్రోత్సహించేవారు, ఒకరోఇద్దరో మాత్రం ‘ఆడపిల్లకు ఇంజినీరింగ్‌ అవసరమా..’ అన్నట్టు చూసేవారు. కొంచెం ఇబ్బంది పెట్టేవారు. నా తర్వాత రెండేళ్లకు యూనివర్సిటీలో మరో అమ్మాయి చేరింది.

* ఇన్నేళ్ల కెరీర్‌లో విసుగొచ్చిన సందర్భాలేమైనా ఉన్నాయా?
– పెద్దగా లేవు. కానీ ఎమ్‌టెక్‌ వారికి పాఠ్యపుస్తకాలను రాస్తున్నప్పుడు మాత్రం సగం అయ్యాక విసుగొచ్చేస్తుంది. ముందుకు వెళ్లాలనిపించదు, అలాగని పూర్తిగా వదిలెయ్యలేం. ఎందుకు మొదలెట్టానురా బాబూ అనిపిస్తుందిగానీ పూర్తయ్యాక చూసుకుంటే సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషం కోసమే సిగ్నల్స్‌ అండ్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రానిక్‌ డివైజెస్‌ అండ్‌ సర్క్యూట్స్‌ అనే రెండు పుస్తకాలు రాశాను. అవి ఎంటెక్‌ వారికి పాఠ్యపుస్తకాలు.

* గొప్ప ఆనందాన్నిచ్చిన సందర్భాలు…
– నా చేతుల మీదుగా పన్నెండుమంది పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు. ప్రస్తుతం మరో నలుగురు చేస్తున్నారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో నేను ఎక్స్‌పర్ట్‌ మెంబర్‌ను. ‘విమెన్‌ సైంటిస్ట్‌ స్కీమ్‌’ కింద నా ఆధ్వర్యంలో ముగ్గురు మహిళలు రానున్న మూడేళ్లలో తమ ప్రాజెక్టులు పూర్తిచేస్తారు. జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని వందకు పైగా పేపర్లు ప్రచురించి ఉంటాను. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజినీర్స్‌ ఫెలోను కూడా. ఇవిగాక ఇవన్నీ వృత్తిపరంగా ఎంతో సంతృప్తినిచ్చే విషయాలే.

* మీరు బోధనలో కాకుండా ప్రైవేటు సంస్థల్లో చేరి ఉంటే…
– పైన చెప్పాను చూడండి, అదంతా నేను కూడగట్టుకున్న మేథోపరమైన ఆస్తి. ఏ కంపెనీలోనో ఇంజినీర్‌గా చేరితే సంపాదన ఇంతకన్న మెరుగ్గా ఉండేదేమోగానీ, ఈ రకమైన ఆస్తి సంపాదించగలిగేదాన్నేనా? ఒక అకడ మీషియన్‌గా నేను సాధించినదాన్ని చూసుకున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.

Advertisements

5 thoughts on “40 ఏళ్ల క్రితం ఆమె ఒక్కరే

  1. రాజరాజేశ్వరి గారు అన్నమాట అక్షర సత్యం. ఒక అకడ మీషియన్‌కి కలిగే తృప్తి ఉద్యోగారిత్యా సంపాదించిన ఆస్థితో రాదు. అలాగని అందరూ రాజరాజేశ్వరి గారి లాగా అలోచించరు. ప్రస్తుత విద్యారంగంలో ఉన్న పరిస్థితులలో మనకి కావాల్సింది – వీరిలాంటి ఆదర్శనీయ ఉపాధ్యాయులు..మరీ ప్రత్యేకంగా ఇంజినీరింగ్, వైద్య శాస్త్ర రంగంలో!

    • ఏడాదికోసారి అమెరికా వెళుతుంటానని ఆమె అన్నారు. నెవాడా యూనివర్సిటీలో మంచి పరిచయాలున్నాయి ఆమెకు. మీ సంగతి గుర్తు చేస్తాను.

  2. I am a proud student of Prof. Raja Rajeswari not so long ago. I cant forget the way we used to gel with the professors. I still credit my Engg days as the Golden Days of my Life. A perfect blend of Knowledge, Friendship and Joy defines Engineering for me.

    – Nanda Kishore (Class of 2001 – 2005)

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s