మువ్వల రాజు మొక్కల రారాజు

‘ఉరే మువ్వల రాజూ, నీకు రూపాన్నిచ్చి ప్రాణం పోసి ఇంత మంచి జన్మనిచ్చి పంపిస్తే, నువ్వు భూమ్మీద ఏటిసేసేవురా? అలగలగ సర్దాగా తిరిగీసొచ్చీసేవా?’ అని మీదకెళ్లేక దేవుడు అడిగితే నేనేం చెప్తానండీ? ‘సార్, రెండు మేడలు కట్టేను, నాలుగు చోట్ల జాగాలు కొన్నాను. ఏసీ కార్లోంచి కాలు కిందట్టెకుండ తిరిగీసీనం’టే బాగుంటదా… అవ న్ని పైకి తీస్కెళ్లి చూపించగలమా పోని? ‘నాలుగు మొక్కలేసేను. భూమి వేడెక్కిపోకుండ చేతి సంచీలు పంచేను, నలుగురికీ చెప్పి నా చేతనైన పని చేసేనంటే – అదెంత దర్జాగుంది? మీరే చెప్పండి?’ మువ్వల రాజు అలా అడిగేక మనం మాత్రం ఏమంటాం, ఔననక! రెండు మేడలు, ఒక ఏసీ కారుకన్నా ఆయన చేస్తున్న పనే విలువైనదని ఈలోగా మన మనసు కూడా లోపల్నుంచి చప్పట్లు కొడుతుంటుంది. ఇప్పటికి దారికొచ్చావు అన్నట్టు విశాఖపట్నం చుట్టుపక్కల కొన్ని వందల చెట్లు కూడా అంగీకారంగా తలలూపుతాయి. అవెందుకు ఊపాయో తెలుసుకోవద్దా మనం!

మన అందర్లాగే మువ్వల రాజు కూడా చిన్నప్పుడు గౌతమబుద్ధుడి కథ విన్నారు. ఐదో తరగతిలో ‘అశోకుడు బాటలకిరువైపులా చెట్లు నాటించెను’ అని చరిత్ర చదువుకున్నారు. ‘దేవుడు అన్ని సంపదలనిచ్చినా, ఒక రాజయి.. మొత్తం అంతా విడిచిపెట్టీసి ఇతరుల కష్టాలకు కారణమేంటని శోధించడానికి వెళ్లిపోయేడు చూడండి, అది చదివి బుద్ధుడి భక్తుడయిపోయేనండి నేను. అశోకుడు కూడా ఆయన భక్తుడే. అలాగని ఆయనేం పూజలూపునస్కారాలూ చెయ్యలేదు. పదిమందికీ ఉపయోగపడే పనులు చేశాడు.

బుద్ధుడి పేరుమీద నూతులు తవ్వించేడు, సత్రాలు కట్టించేడు. నేను చేసేది కూడా అలా అందరికీ మేలు చేసేది కావాలి అని ఆనాడే నిర్ణయించుకున్నాను. నేను కూడ పెద్దయ్యాక మొక్కలు నాటాలనుకున్నాను’ అని చెప్పిన రాజు మాటల మనిషి కాదు, చేతల మనిషి. విశాఖలో పలు ప్రాంతాల్లో ఆయన నాటిన మొక్కలు చెట్లుగా ఎదిగి పదిమందికి నీడనిస్తున్నాయి. ఇంటిముందరి జాగా, బడి, గుడి, మసీదు, చర్చి… ఎక్కడైనా సరే ఆయన స్వయంగా మొక్కలు తీసుకొచ్చి నాటుతారు. ‘నాటండయ్యా బాబూ అని ఎదుటివారి చేతికి మొక్కనిచ్చేస్తే ఫ్రీగా వచ్చిందికదాని పారేసేవాళ్లే ఎక్కువండీ. అందువల్ల నేనే స్వయంగా నాటుతాను. దాని పోషణ మాత్రం అక్కడివాళ్లకు అప్పజెబుతాను..’ అనే రాజు ఆ పనికి పదిహేను రోజులకోసారి తన సమయాన్ని కేటాయిస్తుంటారు.

‘ఇది గుడా, మసీదా అని నేనేం చూడను. ఎందుకంటే అన్ని మతాలూ చెప్పేదొకటే. బి గుడ్, డూ గుడ్ అని. ఎవరు చెప్పినా అదే. సేవ. మంచిగా ఉండు, మంచి చెయ్యి. దాన్నొదిలీసి పూజలూ వ్రతాలూ అంటే నేను వ్యతిరేకం. నువ్వు 5 రూపాయలు పెట్టి కొబ్బరికాయ కొట్టే బదులు ఎన్ని హాస్పటళ్లలో కనీసం బ్రెడ్డుకు నోచుకోని రోగులున్నారు, వాళ్లకి ఓ కొబ్బరి బోండాన్నిస్తే మంచిది కదా..’ అనే రాజు ఇంట్లో వినాయకచవితికి మట్టి బొమ్మనే పెడతారు, దాన్ని కూడా నిమజ్జనం చెయ్యరు. మూడు నాలుగేళ్ల తర్వాత అది పాడైపోతే పూలమొక్కల దగ్గర మట్టిలో కలిపేస్తారు.

‘మొక్కల్లో మంచివీచెడ్డవీ అనేం ఉండవండి. అలా అనుకోవడం మూఢనమ్మకం అంతే. ఒకసారి మా ఇంట్లో గోరింట మొక్కను నాటుతుంటే మా పొరుగావిడ అది ఇంట్లో పెంచడం మంచిది కాదని అన్నారు. నేనేం పట్టించుకోకుండా వేశాను. ఇప్పుడు అది పెద్దయ్యాక మా కాలనీలో ఆడపిల్లలు వచ్చి గోరింటాకు కోసుకుని వెళుతుంటారు. ఆవిడ కూడా వచ్చింది. కోసుకోవద్దని చెప్పేశాను. ఆ మొక్క మంచిది కాదని అన్న మనిషికి దాన్నుపయోగించుకునే హక్కుండదు కదండీ…’ అని ఆయన అంటున్నప్పుడు నిజమే అనిపిస్తుంది.

గుడ్డ సంచులూ, పేపరు గ్లాసులూ
పాలిథిన్ వినియోగాన్ని తగ్గించడానికి వస్త్రంతో చేసిన చేతి సంచులను కనిపించినవారికల్లా ఇస్తుంటారు మువ్వల రాజు. ‘జార్ఖండ్‌లో ఒక మిల్లు కేవలం ఈ సంచీల కోసమే వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. మా ఇరుగింటివాళ్లు అక్కడికి వెళ్లినప్పుడు చెప్పి తెప్పించుకుంటాను. ఎవరిచేతిలో పాలిథిన్ బ్యాగ్ కనిపించినా వెంటనే ఇది ఇచ్చి వాడమని చెబుతాను. చెప్పడం ఇష్టం లేదుగానండీ, ఒకో సంచీ 35 రూపాయలు. ఐదో పదో అనుకునో, ఇంట్లోని పాత చీరముక్కలతో కుట్టించేననుకునో కొందరు రెండుమూడు అడుగుతుంటారు. అయినా వాడుకుంటారు కదాని ఇస్తుంటా…’ అని చెప్పిన రాజు కులం పిక్నిక్కులకెళ్లరు. మాంసాహారాన్ని ముట్టరు.

ప్రభుత్వ పాఠశాలలకు సుభాష్‌చంద్రబోస్, స్వామి వివేకానంద, రాజారామ్మోహన్‌రాయ్, మహాత్మా గాంధీ వంటి మహానాయకుల పెద్దపెద్ద ఫోటోలను ఇస్తుంటారు. వారి గురించి తెలుసుకోవడం వల్ల విద్యార్థుల్లోనూ ఆ స్ఫూర్తి నిండుతుంది. వాళ్లూ మంచి మార్గంలో ప్రయాణిస్తారనేది ఆయన నమ్మకం. ఇదిగాక ఎవరింట్లో పెళ్లని తెలిసినా వెంటనే వాళ్లకు పేపరు గ్లాసులు ఇచ్చి వస్తారు. ఇంటిముందు ఎవరైనా ఫిలమెంటు బల్బులు పెడితే వాటిని తీసేసి సీఎఫ్ఎల్ బల్బును స్వయంగా బిగించి వస్తారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల పక్షులు మనలేకపోతున్నాయి, రాత్రుళ్లు వాటికి నిద్రపట్టడం లేదు. దాన్ని నియంత్రించాలంటే మనమంతా తలో చెయ్యీ వెయ్యాలి అన్నదే రాజు ఫిలాసఫీ.

అసలు చెత్త మనమే
రాజు కారుకు హారన్ ఉండదు, సైకిలుకు బెల్లుండదు. ఆయనకసలు కారున్నట్టే చుట్టుపక్కల ఎవరికీ తెలీదు. సైకిలుమీదో లేదంటే బస్సులోనో వెళ్లి పనులు చక్కబెట్టుకు వస్తుంటారాయన. దీపావళికి నూనె దీపాలు వెలిగించడం తప్ప టపాకాయలు కాల్చే అలవాటే లేదు ఆ కుటుంబానికి. ‘శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికే మా ప్రయత్నం.

పనున్నా లేకపోయినా హారన్లు కొట్టేవారికి సమాజం పట్ల బాధ్యత లేదు, దేవుడంటే భయం లేదు’ అంటున్న రాజు ఎల్ఐసీ ఏజెంటు. అయితే అలాగని ఎవరికీ చెప్పరు. ‘ఎందుకంటే మేడం, ఒకేరియాలో మొక్కలేసేవనుకోండి. ఈడు పోలసీలకోసవే ఇవన్నీ చేస్తున్నాడు – అని ఎవరైనా అనుకోవడం నాకు నచ్చదు. అసలు అదే పనిగా పాలసీల కోసం తిరగను. అదొక వ్యాపకం అంతే…’ అంటాడాయన. సెంట్ సీసాలు, గాజుల వంటివి ఇంటింటికీ, దుకాణాలకూ తిరిగి అమ్మడం ఆయన జీవనోపాధి.

లెక్కతీస్తే మొక్కలు, గుడ్డ సంచీల కోసం ఆయన నెలకు వెచ్చించే మొత్తం ఐదునుంచి పదివేల రూపాయలు! ఎవరైనా ఇవ్వబోయినా తీసుకోరట. ‘నాకు వందో వెయ్యో ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు, మీరు కూడా తోచింది చెయ్యండి’ అని నిష్కర్షగా చెబుతారు రాజు. ‘మువ్వలవానిపాలెంలో మా నాన్న ఇచ్చింది ఒక జాగా ఉంటే అందులోనే ఇల్లు కట్టేనండి. మరింకెక్కడా జాగాలు, ఇళ్లు కొనడంలాంటివి చెయ్యనండి. ఆ పద్ధతికి నేను వ్యతిరేకం. నేనే నాలుగు చోట్ల కొనేస్తే మరి మిగిలినవాళ్లు ఎక్కడ కొంటారు, ఎలా కట్టుకుంటారు. అందుకే అలాంటి పనుల జోలికి పోను’ అని సూటిగా చెప్పేసే రాజును చూసి ఎంతమంది సిగ్గుతో తలదించుకోవాలో. రాజు భార్య స్టీల్‌ప్లాంట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. వీరికో పాప. ‘మేం కావాలనే ఒకరితో ఆగిపోయాం..’ అనే ఆయన “భూమ్మీద అతి పెద్ద చెత్త పదార్థం మానవ జనాభానే. మనం తప్ప అన్నీ ప్రకృతి సమతౌల్యానికి పనికొచ్చేవే. మనిషి తనకోసం అంతా కలుషితం చేసేస్తున్నాడు” అంటే కాదనడానికి ఏముంది?


ఫోటోలు : వై. రామకృష్ణ

Advertisements

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s