మర్చిపోయిన వాటిని గుర్తు చేసుకున్నవాళ్ళు కొందరు

హలో, మిమ్మల్నే… చిన్నప్పుడు చేతికందిన పెన్సిలో, బొగ్గు ముక్కనో పట్టుకుని గోడల మీద తోచింది తోచినట్టు గీసేశారా లేదా? రెండు కొండల మధ్య ఉదయిస్తున్న సూర్యుడు, దగ్గర్లోనే సరస్సు… ఇలాంటి బొమ్మలేవో గీసే ఉంటారు కదా. కాస్త పెద్దయ్యాక మాత్రం ఆ కళను పూర్తిగా మర్చిపోతాం. విశాఖపట్నంలోని కొందరు మాత్రం వయసును లెక్కచెయ్యకుండా తమలోని ఉత్సాహానికి పదును పెడుతున్నారు. కళాకారుడు హిమాంగ్శు శేఖర్‌ ఘోష్‌ శిష్యరికంలో తాము నేర్చుకున్న కళను ఇటీవలే రెండు రోజుల పాటు ప్రదర్శనకు పెడితే ప్రశంసల కెరటాలు వచ్చి తడిపేశాయి వాళ్లని.

డ్రాయింగ్‌ టీచర్లు బోలెడుమంది ఉంటారు, హిమాంగ్శు శేఖర్‌ మాత్రం అందర్లాంటి మనిషి కానేకాడు. బెంగాల్‌ నుంచి ఉద్యోగార్థం విశాఖనగరానికి చేరుకున్న ఆయన ఖాళీ సమయాల్లో పిల్లలకు పెయింటింగ్‌ నేర్పించడం మొదలెట్టారు. ఆయన దగ్గర చేరిన పిల్లలు చక్కగా బొమ్మలేస్తుండటం చూసి మరికొందరు వచ్చేవారు. హిమాంగ్శు నేర్పిస్తున్న పద్ధతికి ముగ్థులయి కొందరు పెద్దవాళ్లు కూడా పెయింటింగ్‌ పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. తమక్కూడా నేర్పించమని వాళ్లు అడిగినప్పుడు ఆనందంగా సరేనన్నారు హిమాంగ్శు. వారానికి రెండు రోజులు, రోజుకి మూడు గంటల చొప్పున క్లాసు. ఐదారుగురు కలిసి ఒకరింట్లో చేరితే, టీచర్‌ అక్కడికే వచ్చేస్తారు. ఇదీ వాళ్లు చేసుకున్న ఏర్పాటు. ఉదిత్‌ నంది, అనింద్య, మధుమిత, సుధ, అర్పిత, బోలక బిశ్వాస్‌, శాలిని, ప్రియతమ్‌, బిపాషా, వైష్ణవి, అభిషేక్‌, శ్రేయ, నిరుపమ, స్వాగత, ఆశిష్‌…. ఒకరూ ఇద్దరూ కాదు, మొత్తం ముప్ఫై-నలభైమంది. పదేళ్ల నుంచి నలభైఐదు వరకూ… రకరకాల వయసుల వాళ్లు. రకరకాల ఉద్యోగాలు. ఎక్కువగా హెచ్‌పీసీఎల్‌లో పనిచేసేవాళ్లే. డె బ్భయ్యేళ్ల మామ్మగారు ఒకావిడ కూడా వచ్చి నేర్చుకున్నారుగానీ, ఆరోగ్యం బాలేక మధ్యలో ఆపేశారు.
అమ్మకాలు కూడా…
మూడేళ్ల క్రితం పెన్సిల్‌ చేతబట్టిన విశాఖ బృందం ‘బ్రష్‌ అండ్‌ పేలెట్‌ ‘ అనే పేరు పెట్టుకుంది. ‘బాగుంద’న్న ప్రశంసే కదా ఎవరికైనా ఉత్సాహాన్నిచ్చేది. ఇదే ఆలోచించి హిమాంగ్శు శేఖర్‌ తన విద్యార్థుల ప్రతిభను పదిమందికీ చాటాలనుకున్నారు. గే ట్‌ వే హోటల్లో రెండు రోజుల పాటు సాగిన ప్రదర్శనకు రంగం సిద్ధం చేశారు. హెచ్‌పీసీఎల్‌ విశాఖ రిఫైనరీ, రామకృష్ణ మిషన్‌ ఆశ్రమ్‌ తోడ్పాటునిచ్చాయి. మొత్తం 200 పెయింటింగులు – వాటర్‌ కలర్స్‌, ఆయిల్‌ పెయింటింగ్స్‌, కలర్‌ పెన్సిల్స్‌, క్రేయాన్స్‌, చార్‌కోల్‌… అన్నీ అక్కడ కొలువుదీరాయి. ప్రదర్శన ఏర్పాటు చేశారు, ఆహ్వానాలు పంచారు, ఆర్టిస్టులంతా ఒక పక్కగా నిల్చున్నారు. అందరికీ ఒకటే ఆతృత. సందర్శకులు ఎందరొస్తారు? వచ్చినవాళ్లు ఏమంటారు? నెమ్మదిగా ఒక్కొక్కరే రావడం మొదలయింది. నిశ్శబ్దంగా చూస్తున్నారు. హాలంతా కలియదిరుగుతున్నారు. కళాకారుల గుండె నిమిషానికి 72 కన్నా ఎక్కువసార్లు కొట్టుకోవడం మొదలయింది. దీనంతటికీ మూలమయిన హిమాంగ్శు చేతులు వెనకపెట్టుకొని పచార్లు చేస్తూ అందర్నీ పరికిస్తున్నారు. మధ్యాహ్నానికల్లా ప్రశంసల జల్లు మొదలయింది. సాయంత్రానికది జల్లయింది. మర్నాటికి ఎడతెగని వర్షంగా మారింది. పన్నెండేళ్ల బిపాషా నుంచి, నలభైమూడేళ్ల ఉదిత్‌ నంది వరకూ… అందరిలోనూ హర్షం. కేవలం ‘బాగుంద ‘న్న పొగడ్తలే కాదు, రెండు రోజుల్లో సుమారు ముప్ఫై పెయింటింగులు అమ్ముడయ్యాయి కూడా. దాంతో ఔత్సాహిక కళాకారుల ఆనందం సముద్రమంత అయిపోయింది. ఎవరిని పలకరించినా వాళ్ల కళ్లల్లోని మెరుపు.. మనసులోని హుషారు ముఖమ్మీద ప్రతిఫలించాయి. ‘ఎన్నెన్నో వర్ణాలు అన్నిట్లో అందాలు’ అని ఆస్వాదిస్తూ బతుకును వర్ణమయం చేసుకుంటున్నారు వీళ్లంతా. వాళ్లకే కాదు, మీకూ ఇలా చెయ్యాలనే ఉంది కదా… మీ ఊళ్లోనూ హిమాంగ్శు శేఖర్‌ వంటి ఆర్ట్‌ టీచర్లు ఉండే ఉంటారు. చెయ్యాల్సిందంతా ఒకటే, వాళ్లను వెతికి పట్టుకోవడం. మీ పిల్లలకు డ్రాయింగులు నేర్పిస్తున్న అలాంటి మాస్టర్ల దగ్గరకు వెళ్లి, ‘మాకూ నేర్పించండి సార్‌…’ అని అడగటం. సిగ్గు పడకుండా, మొహాన్ని మొహమాటం వెనుక దాచుకోకుండా ఆ మాటను అడిగేయండి, ముందుకు అడుగు వెయ్యండి. కలర్‌ఫుల్‌ జీవితం ప్రాప్తిరస్తు.

One thought on “మర్చిపోయిన వాటిని గుర్తు చేసుకున్నవాళ్ళు కొందరు

  1. “బ్రష్ అండ్ పెలెట్” హిమాంగ్శు శేఖర్‌ ని మెచ్చుకోవాలి. కళాకారులని తయారుచెయ్యడమే కాక వారికి ఆత్మస్థయిర్యాన్ని కూడా ఇచ్చే కళని నేర్పాడు. వారి ఏవైనా స్వచ్చంద సంస్థకి కూడా బొమ్మలు వేసిపెట్టండం లాంటిది చేస్తున్నారా?

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s