బరువు తగ్గాలనుకుంటున్నారా?

కరీనా, ప్రితీజింటా, అనిల్‌ అంబానీ వంటి ప్రముఖుల ఫిట్‌నెస్‌ గురువుగా సుపరిచితురాలైన రుజుతా దివేకర్‌ రచయిత్రిగా మరో అవతారమెత్తి అందరి ముందుకూ వచ్చారు. ‘లూజ్‌ యువర్‌ వెయిట్‌, డోంట్‌ లూజ్‌ యువర్‌ మైండ్‌’ పుస్తకంతో మార్కెట్లోకి ప్రవేశించిన ఆమె తాజా పుస్తకం ‘విమెన్‌ అండ్‌ ద వెయిట్‌ లాస్‌ తమాషా’ ఈ నెలే విడుదల కాబోతోంది. ‘ఆహారంతో మనకు ఆరోగ్యకరమైన సంబంధం ఉండాలి..’ అని సలహానిస్తున్న రుజుతా కొత్త పుస్తకం కబుర్లు కొన్ని…

వివిధ వయసుల్లో మహిళల ఆనందం, ఆరోగ్యాల మీద చాలా శారీరక, మానసిక అంశాలు ప్రభావం చూపిస్తాయి. అలాగే మెనోపాజ్‌, థైరాయిడ్‌ వంటివాటి గురించి బోలెడన్ని అపోహలు కూడా ఉంటాయి. పోషకాహార నిపుణురాలిగా వీటన్నిటినీ శాస్త్రీయంగా వివరించాలనే సంకల్పంతో రుజుత ఈ పుస్తకానికి శ్రీకారం చుట్టారు. మరి పుస్తకం పేరేమిటి అలా ఉంది? బరువు తగ్గడానికి, చక్కగా కనిపించడానికి మహిళలు చేస్తున్న ప్రయత్నమంతా ఆమెకు తమాషాగా కనిపిస్తోందా…  “నాకు తమాషాగా అనిపించడం కాదు. నేటి సమాజం నిర్వచించిన కొలతల ప్రకారం అందంగా ఉండటానికి స్త్రీలు ఎన్ని పాట్లు పడుతున్నారో చూడండి. అకస్మాత్తుగా తిండి మానేయడం, లైపోసక్షన్లు, టమ్మీ టక్స్‌ చేయించుకోవడం, స్కీముల్లో చేరడం… ఇదంతా తమాషాగాక మరేమిటి?” అని ఎదురు ప్రశ్నిస్తున్నారు రుజుత. “నేను ఎంతమందిని చూశానో లెక్కేలేదు. ఆఖరికి తొమ్మిదిపదేళ్ల అమ్మాయి కూడా అధిక బరువును తగ్గించుకోవడం గురించే ఆలోచించడం గమనించాను. అవి నాకోరకమైన భయాన్ని కలిగిస్తాయి. నిజానికి తమ గురించి తాము ఏమీ తెలుసుకోకుండానే మహిళలు చాలామంది తక్కువగా అంచనా వేసుకోవడం ఎందుకు? సమాజం నిర్దేశించినట్టు అందంగా కనిపించాలని ఎందుకా ప్రయత్నాలు? వీటిని చూస్తుంటే నాలో అదో రకమైన నిర్వేదం కలుగుతోంది” అంటున్నారామె నిస్పృహ నిండిన స్వరంతో.

సరిగా తింటే సరిగా ఉంటారు…
‘మా తిప్పలేవో మేం పడతాం. అందంగా కనిపించడానికి బరువు తగ్గడం కూడా తప్పేనా తల్లీ…’ అని మనమంటారని రుజుతకు తెలుసు. “అధిక బరువును తగ్గించుకోవడం, నాజూగ్గా అందంగా కనిపించాలని ప్రయత్నించడం తప్పేం కాదు. కానీ దాని కోసం విపరీతంగా శ్రమించడం, లేనిపోని కొలతల్లో ఆహారం తినడం అనవసరం” అని నిర్ద్వంద్వంగా చెప్పేస్తున్నారామె. ‘మరి మమ్మల్నేం చేయమంటారు’ అనడిగే వారికి ఆమె చెబుతున్నదొకటే. “మహిళలు సన్నగా ఉండటం కన్నా, ఆరోగ్యంగా ఉండటం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. తమ గురించి తాము పట్టించుకోవాలి” అని. మన దేశపు మహిళల్లో తొంభైతొమ్మిది శాతం మంది కుటుంబ అవసరాలను తీర్చాకా తమ గురించి తాము పట్టించుకుంటారు.  అందరికీ పెట్టి చివరికేది మిగిలితే అది తినడం చేస్తుంటారు. తమకు నచ్చింది తినే సౌలభ్యం, నచ్చనిది వద్దనే అవకాశం – రెండూ వాళ్లకు కరువే. సరైన పోషకాహారం తిన కపోవడం వల్ల కలిగే ఖాళీని ఏదోటి నమలడంతో భర్తీ చేస్తుంటారు. దానివల్లే వాళ్లు లావయిపోవడం, సరైన తీరులో ఉండకపోవడం జరుగుతుంటాయి. దీనివల్ల ఆత్మవిశ్వాసం లోపిస్తుంది, దాన్ని పెంచుకోవడానికి ఏదో ఒక షార్ట్‌ కట్‌ పద్ధతి వెతుకుతుంటారు. వాటన్నిటి గురించి వివరంగా తెలుసుకోవడానికి ఈ పుస్తకం పనికొస్తుంది. ఈ పుస్తకం అంతా అతివల కోసమే, మరి మగవారిలో బరువు సమస్యల గురించి రుజుతా ఏమంటున్నారు? “వాళ్లకూ బోలెడు సమస్యలున్నాయి. ఇలాంటి పుస్తకం వాళ్లకూ రావాలి. అంతవరకూ మగవాళ్లు కూడా ఈ పుస్తకాన్ని చదివి తమ జీవితాల్లోని స్త్రీల స్థితిగతుల గురించి అర్థం చేసుకుంటే బాగుంటుంది…” నవ్వేసి రుజుత ఇస్తున్న సలహా అది.
—————————————–
‘విమెన్‌ అండ్‌ వెయిట్‌ లాస్‌ తమాషా’ పుస్తకంలో ఏడో అధ్యాయంలో ‘వర్కవుట్‌ పాఠశాల’ శీర్షిక కింద రుజుతా చెబుతున్న కొన్ని సంగతులు మచ్చుకు ఇక్కడ :
‘వర్కవుట్‌’ అనే పాఠశాల ఒకటుంది, దానిలో మీరు చదువుకుంటున్నారునుకోండి. అక్కడ మీకు ఐదు ముఖ్యమైన సబ్జెక్టులుంటాయి. కార్డియో-రెస్పిరేటరీ ఫిట్‌నెస్‌, మస్కులర్‌ ఎండ్యూరెన్స్‌, మస్క్యులర్‌ స్ట్రెంథ్‌, ఫ్లెక్సిబిలిటీ, బాడీ కంపోజిషన్‌. ఫిట్‌నెస్‌కు సంబంధించిన ఈ ఐదు విషయాల గురించి తెలుసుకోకుండా మీరు ఎంతసేపు వ్యాయామాలు చేసినా, కష్టపడి ఎన్ని కాలరీలను కరిగించినా లాభం లేదు.

కార్డియో రెస్పిరేటరీ ఫిట్‌నెస్‌ : శరీరంలో అవసరమైన కణాలకు, కండరాలకు తగిన ఆక్సిజన్‌నూ, పోషకాలనూ అందించే గుండె, ఊపిరితిత్తుల సమర్థత, బలం అని దీన్ని నిర్వచించుకోవచ్చు. దీన్నే కార్డియో పల్మనరీ ఫిట్‌నెస్‌ అని కూడా వ్యవహరిస్తారు. ఉదాహరణకు మీరు  మెట్లెక్కుతున్నారనుకోండి. అప్పుడు మీ కాలి కండరాలకు రక్త ప్రసరణ, ఆక్సిజన్‌ సర ఫరా, పోషకాలు అధికంగా కావలసి ఉంటాయి. అదే సమయంలో లాక్టిక్‌ యాసిడ్‌లాంటి అక్కర్లేని పదార్థాలను శరీరం నుంచి బైటికి పంపించాల్సిన అవసరమూ ఉంటుంది.
కండరాల బలం (మస్క్యులర్‌ స్ట్రెంథ్‌) : ఒక సమయంలో ఒకటి లేదా కొన్ని కండరాల సముదాయం ఉపయోగించగలిగిన బలాన్ని కండరాల బలం అంటాం.
మస్క్యులర్‌ ఎండ్యురెన్స్‌ : కండరాలు ఒకే పనిని ఎన్నిసార్లు చెయ్యగలవనేదే మస్క్యులర్‌ ఎండ్యురెన్స్‌. ఉదాహరణకు మీరు ఫర్నిచర్‌ను ఒకచోటి నుంచి ఇంకోచోటికి మార్చడం, లడ్డూలు చెయ్యడం వంటివి చేస్తున్నప్పుడు మీ కండరాల ఎండ్యురెన్స్‌ ఎంతో తెలుస్తుంది.
ఫ్లెక్సిబిలిటీ : శరీరంలోని కీళ్లను పూర్తిగా కదిలించగలిగే సామర్థ్యం. ఉదాహరణకు క్రికెట్లో బౌలర్‌ బంతిని వెయ్యాలంటే భుజం దగ్గర కీలును పూర్తిగా కదిలించాలి.
బాడీ కంపోజిషన్‌ : మొత్తం శరీరపు బరువులో కొవ్వు బరువు ఎంతుదన్నది బాడీ కంపోజిషన్‌గా పరిగణిస్తారు. ఆడవారికి ఇది పాతికశాతంలోపే ఉండాలి. మీరు వంద కిలోల బరువున్నా సరే, కొవ్వు పాతిక కిలోలను మించకూడదు. ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే ముందు కొవ్వును తగ్గించుకోవాలి. కండరాలు, ఎముకల బరువును లీన్‌ మాస్‌ అంటారు.

ఇప్పుడిక ఈ కథలో నీతేమిటంటే – ఫిట్‌నెస్‌లో భాగంగా మొదటి నాలుగు అంశాల్లో మీరు అభివృద్ధి చెందితే అది ఐదో అంశమ్మీద మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ఐదు అంశాల గురించి అర్థం చేసుకుని పని చెయ్యడం మొదలుపెడితే మొత్తమ్మీద ఆరోగ్యం బాగుంటుంది. హాయిగా ఉన్నామనే భావన పెరుగుతుంది. మీ కినెస్థటిక్‌ ఇంటెలిజెన్స్‌ పెరుగుతుంది. మీ రూపం చక్కగా తయారవుతుంది. హార్మోనుల సమతౌల్యం, మూడ్స్‌ స్థిరంగా ఉండటం, ఎప్పుడూ మనసులో హాయిగా ఉండటం – ఇవన్నీ సాధ్యపడతాయి. చాలా వెయిట్‌ లాస్‌ కార్యక్రమాల వల్ల పైవన్నీ కుదరవు. అందువల్లే ఈ పుస్తకానికి నేను ‘వెయిట్‌ లాస్‌ తమాషా’ అని పేరు పెట్టాను. ఎక్కువమంది శరీరం చుట్టుకొలత ఇంచీల్లో తగ్గించుకోవడానికి, తూకం యంత్రంలో ముల్లు కిందకి జరగడం మీద మాత్రమే దృష్టి పెడతారు. పైన చెప్పిన ఐదు అంశాల్లో అభివృద్ధి లేకుండా బరువు తగ్గడం అనేది కేవలం తమాషా, జోకు, శుద్ధ టైమ్‌ వేస్ట్‌, డబ్బులు వృధా. ‘రెండు నెలల్లో ఐదు కిలోలు’ ‘పదిహేను కిలోలకు డబ్బు కడితే మూడు కిలోలు ఫ్రీగా తగ్గండి’ ‘ఏడు వారాల్లో తొమ్మిది కిలోలు తగ్గండి’ వంటి ప్రకటనలు చూసినప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? ఇది నా మోకాళ్లను బలోపేతం చేస్తుందా, ఎముకల సాంద్రత పెంచుతుందా, చర్మాన్ని నునుపుగా మారుస్తుందా, జుట్టును ఒత్తుగా మారుస్తుందా, మెదడును చల్లగా ఉంచుతుందా వంటి ప్రశ్నలు అడగనే అడగం. సరైన ప్రశ్నలు అడక్కుండా రాజకీయ నాయకులను ఎన్నుకున్నట్టే ఉంటుంది ఈ వ్యవహారం కూడా. ఈ ఐదు అంశాల గురించి పట్టించుకోవలసింది కేవలం క్రీడాకారులు, ప్రముఖులు, సినిమా తారలు మాత్రమే కాదు.

పుస్తకం : విమెన్‌ అండ్‌ వెయిట్‌ లాస్‌ తమాషా
పేజీలు : 200
వెస్ట్‌లాండ్‌ లిమిటెడ్‌ పబ్లిషర్స్‌
రచయిత్రి : రుజుతా దివేకర్‌

One thought on “బరువు తగ్గాలనుకుంటున్నారా?

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s