కళారత్న రాగతి పండరి


రాగతి పండరి – మహిళాకార్టూనిస్టుగా చిరపరిచితురాలయిన ఆమె మొదటి కార్టూన్‌ 1972లో ఎనిమిదేళ్ల బాలికగా ఉన్నప్పుడు ఆంధ్ర జ్యోతి వారపత్రికలో అచ్చయింది. అప్పటినుంచీ నవ్వుల పువ్వులను వెదజల్లుతూ ఎంతోమంది అభిమానులను మూటగట్టుకున్న ఆమె ఇప్పుడు అందుకోబోతున్న ‘కళారత్న’ అవార్డు ద్వారా మరోసారి వార్తల్లోకొచ్చారు. విశాఖపట్నంలో పుట్టి పెరిగిన రాగతి పండరి ఇంటర్వ్యూ…..

* మీలాగా పేరు తెచ్చుకున్న మహిళా కార్టూనిస్టులు పెద్దగా కనిపించరెందుకని?
– కార్టూన్లు వేసే ఆడవాళ్లే అతి తక్కువమంది. అందులోనూ కొందరు కొన్నాళ్లు వేసి మానేస్తుంటారు. ఏదయినా నిలకడగా కొన్నేళ్ల పాటు చేస్తేనే కదా పదిమందికీ తెలిసేది. కనిపించే కొన్ని పేర్లలో కూడా ఆడపేర్లతో వేసే మగవాళ్లే ఉంటారు. అయినా ఇప్పుడు కార్టూన్లకు చోటెక్కడుంది?

* ఒకప్పటికన్నా ఇప్పుడు వార, పక్ష పత్రికల సంఖ్య, సర్క్యులేషన్‌ పెరిగింది. మరి కార్టూన్లకు చోటు లేదంటూ మీరు బాధపడటం ఏమిటి?
– మీరన్నట్టు సంఖ్య పెరిగిన మాట నిజమే. అయితే కార్టూన్ల జాగాను సినిమా వార్తలు ఆక్రమిస్తున్నాయి. నేను కార్టూన్లు వేయడం మొదలెట్టినప్పటి నుంచీ చాలా కాలం పాటు వాటికి చాలా ప్రాముఖ్యత ఉండేది. కార్టూన్‌ కథలు, సింగిల్‌ పేజీ కార్టూన్లు… ఇలా. రాజకీయ’చెద’రంగం, ఇద్దరమ్మాయిలు, చెవిలోపువ్వు వంటి శీర్షికలను నేను ఏళ్లకేళ్లూ నడపగలిగానంటే అప్పట్లో ఆదరణ ఉండబట్టేగా. దీపావళి వంటి పండగల ప్రత్యేక సంచికల్లో ముందు కార్టూన్లే వేసేవారు. పాఠకులూ వాటికోసమే ఎదురుచూసేవారు. టీవీ వచ్చాక కార్టూన్లకు ఆదరణ తగ్గిందనే అనిపిస్తోంది.

* పండగ వాతావరణాన్ని కార్టూన్లే ఎక్కువ ప్రతిఫలిస్తాయని మీరు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అన్నేళ్లపాటు పండగలకు ప్రత్యేకంగా బొమ్మలు వెయ్యడంలో బోరనిపించలేదా?
– ప్రతి ఏడూ దీపావళి, సంక్రాంతి వంటి పండగలన్నీ ఒక సమయంలోనే వస్తాయి. మనం వాటిని చేసుకునే తీరులోనూ పెద్ద తేడా ఏం ఉండదు. కానీ గమనించి చూస్తే ప్రతిఏటా ఏదో ఓ మార్పుంటుంది. ఒక ట్రెండుంటుంది. రాష్ట్రంలో, దేశంలో కొన్ని రకాల పరిస్థితులుంటాయి. వాటిని ఒడిసిపట్టుకుని కార్టూన్‌ వేసినప్పుడు సామాజిక, ఆర్థిక అంశాలన్నీ వాటిలో ప్రతిఫలిస్తాయి. అలాంటివాటిని జాగ్రత్తగా పరిశీలించడంవల్ల నాకెప్పుడూ బోర్‌ కొట్టలేదు. పైగా పండగలప్పుడు ప్రత్యేకంగా ఏం వెయ్యాలీ అని ఆలోచించడం సరదాగా ఉంటుంది. పండగ పిండివంటలకో ప్రత్యేకత ఉంటుంది. మరి పండగ పత్రికలకో కళ లేకపోతే ఎలా? ముఖచిత్రం, కథనాలు, కార్టూన్లు… అన్నీ విభిన్నంగా ఉండాల్సిందే.

* మీరు జయదేవ్‌గారికి ఏకలవ్య శిష్యులయినట్టే, మీకూ శిష్యులున్నారా?
– ఏమో నాకంతగా తెలీదు. ఒకప్పుడు అభిమానులు బోలెడన్ని ఉత్తరాలు రాసేవారు. ర చయితలు, రచయిత్రులకు కాకుండా కార్టూనిస్టులకు కూడా అంతమంది అభిమానులుంటారని నాకు తెలియని వయసది. అభినందనలు, ప్రశంసలకు ధన్యవాదాలు చెప్పి ఊరుకునేదాన్ని. కొందరు కలం స్నేహాన్ని కోరుకునేవారు. అలాంటివేమీ ఇష్టం లేక కొనసాగించేదాన్ని కాదు. ఇప్పటికీ అంతే. నన్ను చూడాలనుకునేవారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఇంటికొస్తారు. నేను గడపదాటి ఎక్కడికైనా వెళ్లడం అరుదు.

* సాధారణంగా గడపలేకపోవడం వల్ల వెళ్లరా?
– అంగవైకల్యం వల్ల సభలు సమావేశాలకు దూరంగా ఉంటాను. నావల్ల ఇంకొకరికి ఇబ్బంది కలిగించడం ఎందుకని. నన్ను చూసి నేనెప్పుడూ బాధపడను. ఇంకెవరయినా బాధపడటం లేదా ఆశ్చర్యంగా చూడటం నాకు నచ్చదు. అందుకే ఎక్కడకూ వెళ్లను. నాది నాలుగ్గోడల ప్రపంచం అనుకోండి. ఇప్పుడు టీవీ వచ్చాక సమస్త విషయాలూ ఇంట్లోనే తెలుస్తున్నాయి. అయినా లోకంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లోపం ఉంటుంది. కొందరిది బయటకు కనిపిస్తుంది, కొందరిది కనిపించదు అంతే. యానిమేషన్‌, కంప్యూటర్‌ నేర్చుకోలేకపోయాననే వెలితి మాత్రం ఉంది. ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుకోవాలనే నేను కార్టూన్లు వేస్తాను. వ్యంగ్యంలో హేళన లేకుండా చూసుకుంటా. అదే సమయంలో చూసినవారిలో ఏదైనా ఆలోచన రేకెత్తేలా ఉండాలని, సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటాను. అదే నా ఫిలాసఫీ.

* బాధపడిన సందర్భాలు…
– వ్యక్తిగతంగా ఏమీ లేవు. అయితే సమాజాన్ని పరిశీలిస్తున్నప్పుడు ధరల పెరుగుదల, లక్షల కోట్ల కుంభకోణాలు ఇవన్నీ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. రాష్ట్రం ఎటుపోతోందీ అనుకుంటాను. అసలు మోసం, లంచగొండితనం లేని చోటు లేనేలేదనిపిస్తోంది. ఇదిగాక యువతీయువకుల తీరు చాలా బాధ కలిగిస్తుంది. ఎవరికి వాళ్లు తమను తాము హీరో హీరోయిన్లం అనుకుంటూ ప్రవర్తించడం వల్ల దుర్ఘటనలు జరుగుతున్నాయి.

* ‘కళారత్న’ అవార్డు రావడం…
– గొప్ప సంతోషంగా ఉంది. అవార్డులూరివార్డులూ కొత్తని కాదు. కానీ మన ప్రభుత్వం అన్ని రకాల కళాకారుల్నీ గుర్తించిందిగానీ, కార్టూనిస్టులను గుర్తించలేదని బాధగా ఉండేది నాకు. ‘కళారత్న’తో అది తీరిపోయింది. పైగా దాన్ని మొదటిసారి నాకే ఇవ్వడం గర్వంగా ఉంది.
—————————-
ఫోటోలు : వై. రామకృష్ణ

8 thoughts on “కళారత్న రాగతి పండరి

 1. ముగ్గుల గురించి సంక్రాంతి సమయంలోనూ, టపాసుల గురించి దీపావళి సమయంలోనూ రాగతి పండరి వేసే కార్టూన్లు బాగుండేవి.

  ఇలాంటి వారి గురించి మరికొన్ని వ్యక్తిగత వివరాలు (ఏం చేస్తున్నారు? ఫామిలీ..వారసత్వం..ఇలా) తెలుసుకోవాలని పాఠకులకు ఆసక్తి ఉంటుంది. అవి కూడా ఇస్తే బాగుండేది కదా అరుణా!

 2. సుజాత గారూ,
  రాగతి పండరి గారికి చిన్నప్పుడే పోలియో సోకడం వల్ల నడవలేరు. లేచి నిలబడ్డానికైనా మరొకరి సాయం అవసరం. ఆమె గడపదాటి బైటకు వెళ్లడం అరుదు. ఉద్యోగం ఏమీ చేయడం లేదు. పెళ్లికాలేదు. నలుగురు అక్కచెల్లెళ్లు, ఒక అన్నయ్య. అన్నయ్య వదినల కుటుంబంతోనే ఉంటారు పండరి, ఆమె అక్క రాగతి రమ. రాగతి రమగారు విశాఖలోనే కాలేజీ లెక్చరర్గా పని చేస్తారు. కథలు రాస్తుంటారు.
  వివిధ సందర్భాల్లో రాగతి పండరి ఇంటర్వూలు, ఆమె చెప్పిన సంగతులు, ఆత్మకథలోంచి కొన్ని భాగాలు….. ఇలా ప్రతిదాన్నీ ఏదోక పత్రిక ప్రచురించింది. 2003 సెప్టెంబరులో ఆంధ్రజ్యోతి నవ్య మొత్తం పేజీ నిండా ఆమె ఇంటర్వ్యూనే. దాదాపుగా ఆమె వ్యక్తిగత వివరాలు అందరికీ తెలిసినవేనేమో అన్న భావన కలిగింది. అందుకనే నేను వాటి జోలికి పెద్దగా వెళ్లలేదు. ఈసారి ఈ ఇంటర్వ్యూ ప్రచురణకు స్థలాభావం సమస్య ఒకటి. అదండీ సంగతి.

 3. Wow..రాగతి పండరి గారే!! నాకు వీరి కార్టూన్లు చిన్నప్పుడు చాలా సుపరిచితం. కార్టూన్లల్లో ఈవిడది ప్రత్యేకమైన శైలి. వీరి కార్టూన్ల కోసం నేను ఎదురుచూడకపోయినా, వీరి బొమ్మలు చూడగానే గుర్తుపట్టేవాణ్ణి. కొన్ని రాజకీయ చురకలు బాగా పేలేవి.

  కానీ తన లైఫ్ గురించి చూసి కొంచెం బాధ కలిగింది

  చాలా చిన్నప్పటినించి గుర్తు ఉండటం వల్ల, 1972 కి ఎనిమిదేళ్ళే అంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ ఇంటర్నెట్ మరియు తెలుగు బ్లాగుల పుణ్యమా అని, చిన్నతనం నించీ ఎరిగున్న రచయితల గురించి వివరాలు చాలా తెలుస్తున్నాయి. కల్పనా రెంటాల, కిరణ్ ప్రభ, మాలతి గారూ..వీళ్లంతా నేను చిన్నప్పట్నించీ చదూతున్న వాళ్ళే.

  ఏదేమయినా ఇంటర్నెట్ రచయితకీ, పాఠకుడికీ మద్యనున్న దూరాన్ని తీసేసినందుకు నాకు చాలా సంతోషం.

  పోతే అరుణ గారూ, మీరు బ్లాగు లోకంలో ఉన్నారా!! చాలా సంతోషం. మీరు బ్లాగు తీసేసి అప్పుడప్పుడు పుస్తకం.నెట్ లో తప్పితే ఎక్కడా కనిపించట్లేదనుకున్నా.

  • కుమార్ గారూ, మీరెందుకో కనిపించటం లేదని నేనూ అనుకున్నా. మిమ్మల్నిక్కడ చూడటం సంతోషంగా ఉంది. అవును, ఇంటర్నెట్ రచయితలు పాఠకుల మధ్య దూరాన్ని తగ్గించింది.

 4. నేను కూడా రాగతిపండరిగారి కార్టూన్లు చూస్తూ చదువుతూ పెరిగినవాణ్ణే! ఆ బొమ్మల్లో ఉండే ఒక విలక్షణత వల్లన అవి బాగా గుర్తుండిపోయాయి. పండగ కార్టూన్లకి పండరిగారు పెట్టింది పేరు! ఆవిడ ఇంటర్వ్యూ ఇక్కడ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s