పాట్నూలు పాట్లేవిటో తెలుసా మీకు?

రాష్ట్రవ్యాప్తంగా చిన్నాపెద్దా ఏ పట్టణంలో చూసినా కాటన్‌ ఎక్స్‌పోలు, ప్రదర్శనలు. పండగల సమయంలో ఊపందుకున్న ఇవి వేసవి చివరివరకూ నడుస్తూనే ఉంటాయి. కొనుగోలుదారులతో అవి కళకళలాడుతూ ఉంటాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తయారయే చేనేత వస్త్రాలు లక్షల రూపాయల కొద్దీ అమ్ముడవుతూ ఉంటాయి. కొందామంటే కూడా కాటన్‌ వస్త్రాలు ఖరీదు ఎక్కువే. ఇది నాణేనికి ఒకవైపు.
పత్రికల్లో చేనేత కార్మికుల ఆత్మహత్యల వార్తలు నిత్యం దినపత్రికల్లో కనిపిస్తూనే ఉంటాయి. బతకలేక వలసదారి పట్టిన నేత పనివారి కథనాలు టీవీల్లోనూ వినిపిస్తుంటాయి. ఇది నాణేనికి మరోవైపు.
వీటిలో ఏది నిజం?
రూపాయి బిళ్ల విలువ తెలియని పసిపిల్లలకు సైతం డిమాండ్‌ – సప్లై సూత్రం తెలుసు. మరి నూలు వస్త్రాలకు ఇంత డిమాండ్‌ ఇంత ఉన్నా, వాటిని రూపొందించే చేనేత కార్మికుల కడుపులు నిండడం లేదెందుకని? ఇది తెలుసుకుందామనే శ్రీకాకుళం జిల్లాలో పాట్నూలు నేతకు పెట్టింది పేరయిన ‘బొంతలకోడూరు’ గ్రామంలో పర్యటించాం.

అత్యుత్తమ నూలు, అతి సన్నని దారం, గొప్ప చేనేత – వెరసి పాట్నూలు వస్త్రం. శీతకాలంలో వెచ్చదనాన్ని, వేసవిలో చల్లదనాన్నీ ఇచ్చే పాట్నూలు తయారీకి శ్రీకాకుళం జిల్లా పుట్టినిల్లు. కేవలం పాట్నూలు నేత ఆధారంగా చుట్టుపక్కల అరవై ఊళ్లకు అప్పులివ్వగలిగిన వైభవోజ్వల మహాయుగాన్ని చూసిన బొంతలకోడూరు వంటి పల్లెటూళ్లు నేడు వల్లకాటి అధ్వాన్నశకంలో, అప్పుల ఊబిలో, వలసల విషవలయంలో కూరుకుపోతున్నాయి. అలాగని పాట్నూలు ప్రభ ఏమాత్రమయినా తగ్గిందనుకుంటే పొరపాటే. మీటరు ఆరొందల నుంచి వెయ్యి రూపాయల వరకూ ఉండే పాట్నూలు లేదా ఖాదీ వస్త్రాన్ని కోటీశ్వరులే కొనగలరు తప్ప సామాన్యుడు కన్నెత్తయినా చూడలేడు. మొన్నీమధ్యే మన రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కు బహుమతిగా ఇవ్వడానికి తగిన చీరలను మంత్రి గీతారెడ్డి స్వయంగా వచ్చి ఎంచుకుని మరీ తీసుకెళ్లారు! ఇదొక్కటే ఉదాహరణ కాదు, మహాత్మాగాంధీ నుంచి ఎందరెందరో ప్రముఖులు ఇక్కడ పనితనాన్ని ప్రత్యేకంగా ప్రశసించినవారే. ఇప్పటికీ దేశవ్యాప్తంగా రాజకీయ నేతలకు ప్రియమైనవి ఇక్కడ తయారయే పాట్నూలు దుస్తులే. “బొంతలకోడూరు చేనేతను అధ్యయనం చేసిరమ్మని గాంధీగారు ఆయన మనవణ్ని ఇక్కడకు పంపారంటేనే మీకు దీని ప్రభ అర్థమవుతుంది. అయితే మాస్టర్‌ వీవర్స్‌ పేరుతో రంగప్రవేశం చేసిన పెట్టుబడిదారులు, పాట్నూలు, ఖాదీ స్వచ్ఛతను రకరకాల మార్గాల్లో క ల్తీ చేసిన వ్యాపారులు, కాసిని డబ్బులకు ఆశపడి కూర్చున్న కొమ్మనే నరుకున్న నేతన్నలు, బకాయిలను సకాలంలో చెల్లించని బోర్డులు, వాటికి వెన్నుదన్నయిన నేతలు – ఒకరాఇద్దరా, కర్ణుడి చావులాగా ఖాదీ చావుకు కారణమయింది సవాలక్షమంది” అంటారు వడగ విశ్వేశ్వర్రావు. మండల అభివృద్ధి అధికారిగా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్న ఆయన ఆ సామాజిక వర్గానికే చెందినవారు, తమ రంగంలో వస్తున్న మార్పులను సునిశితంగా గమనిస్తున్నవారు. “ఇదిగాక చేనేత పనివారు ‘కళాకారులు’ కాదు, ‘నైపుణ్యం కలిగిన పనివారు మాత్రమే’ అన్న ప్రభుత్వ నిబంధనల వివరణ వారి జీవితాల్లో వెలుగును హరించింది. అందే ఏ కొద్దిపాటి సాయమో వారికి అందకుండా చేసింది. మా ఊరి చేనేతకారులు అగ్గిపెట్టెలో చీరను పెట్టడం నా చిన్నప్పుడు స్వయంగా చూశాను” అంటున్నారాయన. రహదారి, సమాచార సౌకర్యాలుండటంతో బొంతలకోడూరుకు కాస్త దూరంలో ఉన్న పొందూరు చేనేత ఖ్యాతి అంతర్జాతీయంగా విస్తరించింది, అవి లేని గ్రామాలు క్రమంగా కొడిగట్టిన దీపాలయ్యాయి. బొంతలకోడూరునే ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడున్న చేనేత సహకార సంఘంలో 130 మంది ఉంటే ఇప్పుడున్నది  20 మందే. అందులోనూ పనిచేస్తున్నవి పదమూడు మగ్గాలే. ఒకప్పుడు మొత్తం రెండొందల పైచిలుకు చేనేత కుటుంబాలతో కళకళలాడిన ఆ ఊరునొదిలేసి కనీసం 60-70 కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌ వంటి నగరాల్లో భవన నిర్మాణ కూలీలుగా మారినవారు కొందరైతే గుజరాత్‌లోని సూరత్‌, ముంబైలకు చేరి రిలయెన్స్‌ వంటి బడా సంస్థల మిల్లుల్లో కార్మికులుగా చేరినవారు మరికొందరు. ప్రస్తుతానికి బొంతలకోడూరు ఊళ్లో ఉంటూ ప్రతిరోజూ శ్రీకాకుళం, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు ఉపాధి కోసం అప్‌ అండ్‌ డౌన్‌ చేసేవారు వందమందికి పైగానే ఉన్నారు.

అందరూ పనిచేసినా కడుపు నిండదు
శ్రీకాకుళం జిల్లాలో 6558మంది చేనేతకారులున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2932 చేతి మగ్గాలు, 57 మరమగ్గాలు పనిచేస్తున్నాయి. ఉన్న 42 సహకార సంఘాల్లో సభ్యులయిన చేనేతకారులు 5381. ఖాదీ బోర్డు, ఆప్కోల అమ్మకాలు లక్షల రూపాయల్లోనే. “ఆప్కో వంటి సంస్థలు పండగలప్పుడు డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. అది వినియోగదారుడికి లాభం చేకూరుస్తుంది. అమ్మకాలు పెరిగి సంస్థలూ లాభపడతాయి. మరి చేనేతకారుడికి ప్రత్యేకంగా బోనస్‌లవంటివి ఏమీ దక్కటం లేదే…” అన్నది విశ్వేశ్వరరావు వంటివారి వాదన. అదీ నిజమే. నేత కార్మికుడు సన్నటి పాట్నూలు బట్ట పదిమీటర్లు నెయ్యడానికి రెండు మూడు రోజులు పడుతుంది. అదికూడా, అతనికి ఇంటిల్లిపాదీ సహకరిస్తేనే. అలాకాకుండా ఒక్కమనిషే చిలపలు చేసుకోవడం, దారాలు సర్దుకోవడం నుంచి అన్నీ అమర్చుకోవడం చేసుకుంటే అదే బట్ట నెయ్యడానికి ఐదారు రోజులు పడుతుంది. మీటరు బట్ట నేసినందుకు 90రూపాయలు కూలి లభిస్తుంది. ఒకవేళ ఇంట్లోవాళ్లు కాకుండా బయటివారు సాయం చేస్తే ఆమేరకు వారికి కూలి ఇచ్చుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఉపాధికోసం చేనేత కుటుంబాల్లో ఎదిగిన యువకులు పొట్టచేతపట్టుకుని దగ్గర్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నాలకు చేరుతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళంలోని లాడ్జీల్లో బోయ్‌లుగా, ఎలక్ట్రిక్‌ పనులు, సైకిల్‌ రిపేర్‌ , ట్రాక్టర్‌ రిపేర్లు, బైకు రిపేర్లు, ప్లంబింగ్‌, మోటర్‌ రిపేర్‌ వంటి పనుల్లో చేరుతున్నారు. అటువంటి వాళ్లు కూడా ఉదయం వెళ్లి రాత్రికి సైకిళ్ల మీద తిరిగి వస్తుంటారు. “వెయ్యి పోగులు ఒక పోవు. వంద పోవులు ఒక కట్టు. పది కట్లు ఒక చిలప. అది పాతిక రూపాయలు పడతాది. అదే నూరోకౌంటయితే ముప్ఫై రూపాయలు. దానికి రోజంతా పని చెయ్యాలి. ‘ఒకరోజు పత్తి ఏరాలి, నిడాలి, నిడిచి పింజెట్టి, పడుదీసి ఏకులు చుడితే మర్నాడు చిలప రెడీ అవుతది… అదైనా ఇప్పుడిలాటి ధరలిచ్చేరుగనక. ముందయితే ఇంత పనిసేసినా పది రూపాయలు ఒచ్చీవే కావు…” అంటుందా గ్రామస్తురాలు సూర్యకాంతం. “ఆడపిల్లకు పెళ్లి సేసేం, ఇక్కడున్నప్పుడు ఆయమ్మికూడా నూలొడికీది. అత్తారింట్లో అందరూ సుట్టలు సేస్తారు, మా పాపా అదే సేస్తంది. మా పిల్లడు సికాకుళం లాడ్జీల్లంట బోయిస్‌గా వున్నడు. అక్కడే ఉంటాడు, ఎప్పుడైన వస్తాడు” – సూర్యకాంతమో మరొకరో – పేర్లు మారొచ్చు. కథ మారదు. అది కేవలం బొంతలకోడూరు కథ మాత్రమే కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది చేనేత కుటుంబాల వ్యథ. పనిచెయ్యగలిగే సామర్థ్యం, నైపుణ్యం ఉన్నాసరే చేతినిండా పనిలేక, ఉన్నది కిట్టుబాటు కాక ఖాళీగా కూర్చుంటున్న మహిళల బాధ.

బతుకు దారెటు?
ఊరికి వచ్చే ఆర్టీసీ బస్సు సర్వీస్‌ ఆగిపోవడంతో ఇంటర్మీడియెట్‌ పాసయిన లీలావతి చదువూ ఆగిపోయింది. ‘ఇదిగో ఇలంటివి పది చిలపలు పడితె ఐదు రూపాయలు కూలొస్తది. అదికూడ ఇప్పుడు కూలి పెరిగిందిగనక. అంతకుముందయితె పది చిలపలు చుడితె రెండ్రూపాయలు వచ్చేవి. ఈటికోసం రోజంత పనిసెయ్యాలి. ఏం బతుకులండివి?’ అని అడిగి ఎటో దూరంగా చూస్తుంది లీలావతి తల్లి. ‘అలగని ఊరొదిలీసి, ఈ పనొగ్గీసి ఎటైన ఎలిపోదుమంటె ఏటెలిపోతం? ఎంత సర్దుకుందుమన్న ఇంటద్దెలవీ వెయ్యీపదిహేనొందలకి తక్కువలేవు. ఏటిసేసి అన్ని డబ్బులు తెస్తం? మనకేటి రాబడి? పట్నాలకెల్లి పనిసెయ్యడానికి మాకేటొచ్చు? ఆ వెయ్యీ ఇక్కడ సంపాయిస్తే తినొచ్చు. మా పిల్లలకున్నపాటి సదువులూ మాకులేవు. మాకిద్దరు కొడుకులు, ఒకడు కారు షోరూమ్‌లో సేస్తన్నడు. ఆడికెంతా అంటే రెండోమూడో వేలొస్తయి. ఆడికిద్దరు పిల్లలు. మరి మేవెలగ ఆడిమీద ఉండిపోతం? మా సిన్నోడు ఐటీఐ సదివి కరెంటు పనిలోనున్నడు. ఇదిగొ, ఈ పిల్లకు పెళ్లిసేసి ఎవులసేతిలోనైన పెట్టేస్తే మా బరువు దిగిపోద్ది. టీచరు ట్రయినింగయిన సెప్పిద్దుమనే అనుకున్నంగని, ఊళ్లోకి బస్సే రాకపోతె సికాకుళం ఎలగెల్తదని ఇంట్లోనే ఉంచీసేం’ అని చెప్పే ఆమెకు భవిష్యత్తు మీద భరోసా కల్పించేదెలా?
—————————————
“నాకు తెలిసి పుట్టి పెరిగిన దగ్గర్నుంచి ఇదే పని చేస్తున్నాం. నేను ఏడో తరగతి చదివి మానేశాను. ఇప్పుడు దుప్పటికి 22రూపాయల కూలి వస్తోంది. ఓపికను బట్టి, నైపుణ్యాన్ని బట్టి రోజుకు తక్కువలో తక్కువ ఒకటి నేస్తాం, ఎక్కువంటే నాలుగు నెయ్యగలం. మేం సాధారణంగా మూడు చేస్తాం. ముడిసరుకంతా వాళ్లే (ఖాదీబోర్డు) ఇచ్చి వెళతారు. ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిదికి వస్తాం, సాయంత్రం ఐదున్నర, ఆరుగంటలకు ఇంటికెళతాం. ఈ పని కిట్టుబాటు కాకపోవడం వల్ల మా ఆయన ఈ ఊళ్లోనే సైకిల్‌ మెకానిగ్గా పనిచేస్తున్నారు. ఇద్దరు పిల్లలు చిన్నవాళ్లు – ఇక్కడే ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతున్నారు. అదుగో అక్కడ గుళ్లీలు చేస్తోందే ఆ పనికయితే గుళ్లికి రెండున్నర రూపాయల చొప్పున ఇస్తారు. ఒక మనిషి రోజుకు పదోపదిహేను గుళ్లిలు చుడతారు.”
– గుంటుకు దేవి
“ఈ దుప్పట్ల పని వచ్చి ఏడాదవుతోంది. ఉదయాన్నే వస్తే మూడు దుప్పట్లు చెయ్యగలం. కొంచెం లేటయినా రెండుకు మించి చెయ్యలేం. పదిహేను రోజులకోసారి సూపర్‌వైజరు వచ్చి మేం నేసిన బట్టను సరిచూసుకుని డబ్బులిచ్చి వెళతారు. దుప్పటి అంటే రెండున్నర మీటర్లు. ఇచ్చిన సరుకు, నేతలో నాణ్యత అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో జాగ్రత్తగా చూసుకుంటారు. తూకం రాకపోతే ఇరవై రూపాయలే ఇస్తారు.”
– ఎం. మహలక్ష్మి
“చిన్నప్పటి నుంచి నేత పని తప్ప మరొకటి తెలియదు. ఈ సొసైటీ పెట్టి ఏడాదయిందేమో. ఈ దుప్పట్ల నేత మాకసలు తెలియదు. ఇది కొంచెం ముతక నేత. దీన్ని నేర్పించడానికి ప్రత్యేకంగా కొన్ని రోజులు శిక్షణనిచ్చారు. అంతకుముందు మేం నేసిన చీరలు, పంచెలను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంత సన్నటి నేత పని అది. మగ్గాల్లో తగువులు, ఇతర  కారణాల వల్ల ఇప్పుడు ఊళ్లో అవి నేసేవారే లేరు.”
– దండా ద్రాక్షాయణి

Advertisements

2 thoughts on “పాట్నూలు పాట్లేవిటో తెలుసా మీకు?

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s