ఏమాయ ప్రేమాయెనో…..

ఎందుకో ఒక మనిషి మీకు నచ్చుతారు. ఎక్కడో చూడగానే, లేదా ఒక మాట వినగానే. అదెందుకో మీకే ఎప్పటికీ అర్థం కాదు. ఒకవేళ అయినా ఇంకొకరికి అర్థమయేలా మాటల్లో పెట్టి అస్సలు చెప్పలేరు. ‘అర్రె ఈ మనసనేది యాడికెల్లుంటదన్నా…’ అని జుట్టు పీక్కోవడం తప్ప మరేం చెయ్యాలో తోచదు. అటువంటిదొక అనుభవం జీవితంలో ఉంటే ‘బ్రిడ్జెస్ ఆఫ్ మేడిసన్ కౌంటీ’ నవల మీకోసమే.

1965. అయోవాలోని మేడిసన్ కౌంటీ. శుద్ధ పల్లెటూరు. జాన్సన్ పిల్లలూ అయోవా సంతకెళితే నలభై ఐదేళ్ల ఫ్రాన్సెస్కా ఒక్కతే ఇంట్లో ఉంది. అకస్మాత్తుగా మధ్యాహ్నం పూట ఒకాయన వచ్చాడు. పేరు రాబర్ట్ కింకెయిడట, ఫోటోగ్రాఫరట. నేషనల్ జాగ్రఫిక్ మ్యాగజీన్ కోసం పనిచేస్తున్నాడట, అయోవాలోని మేడిసన్ కౌంటీలోని కొన్ని బ్రిడ్జిలను ఫోటోలు తీసుకోవడానికని వచ్చాడు. రోజ్మాండ్ బ్రిడ్జికి దారి అడిగాడు. తనతో పాటు వెళ్లి చూపిస్తే సరిపోతుందనిపించింది ప్రాన్సెస్కాకి. వెళ్లింది. చూపులు కలిశాయి, మాటలు కలిశాయి. సీతాకోకచిలుకలేవో లోపల ఎగురుతున్నట్టు అనిపించిందామెకి. అతనికీ అలానే అనిపించింది. తర్వాత నాలుగు రోజులూ వాళ్లు కలిసే ఉన్నారు.

నాలుగు రోజుల్లో ఏం జరిగింది? గడుస్తున్న ప్రతి క్షణమూ అపురూపం అయింది, చూసుకున్న ప్రతి చూపూ వాళ్లకే అర్థమైన మాటలేవో మాట్లాడింది, మాట్లాడుకున్న ప్రతి మాటా ఏదో ఆత్మీయతను ప్రసరింపజేసింది, చేస్తున్న ప్రతి పనీ తేలిగ్గా అనిపించింది, ప్రతి స్పర్శా ఆత్మానందాన్ని అందించింది. నాలుగు రోజుల్లో దొరికిన పెన్నిధి. సరే నషేకీ రాత్ ఢల్ గయీ, విడిపోవాల్సిన రోజు వచ్చేసింది. ఇద్దరూ వెళ్లిపోతే దివ్యమైన ప్రేమ ప్రపంచాన్ని ఏలుకోవచ్చు. ఆ నమ్మకం ఇద్దరిలోనూ ఉంది. మరింకేమిటి? కుటుంబం – మరీ ముఖ్యంగా పిల్లల పట్ల నెరవేర్చవల్సిన బాధ్యత ఫ్రాన్సెస్కాను వెనక్కిలాగింది. అతనేమో అక్కడ ఉండలేడు. మరయితే ఏం చేశారు? మూడునాళ్ల పాటు మూటగట్టుకున్న ప్రేమను వాళ్లు తర్వాత విడివిడిగా బతికిన 22ఏళ్ల పాటు ఒక గుప్త నిధిలాగా దాచుకున్నారు. ముందు రిచర్డ్ జాన్సన్ చనిపోయాడు. కొన్నాళ్లకు రాబర్ట్ కూడా లేడన్న విషయం ఫ్రానీకి తెలిసింది. బతికినన్నాళ్లూ బతికి ఆమె కూడా చనిపోయింది. అయితే ఆత్మికమైన తన ప్రణయాన్ని తనలోనే దాచుకోవాలనుకోలేదు. మూడు డైరీల్లో అప్పుడు గడిచిన ప్రతి క్షణాన్నీ, ప్రతి భావోద్వేగాన్నీ అక్షరబద్ధం చేసింది. ఫ్రానీ మరణం తర్వాత వాటిని ఎదిగిన ఆమె పిల్లలు చూశారు. ఆమె అడిగినట్టు రాబర్ట్ చితాభస్మాన్ని కలిపిన నదిలోనే ఆమెదీ కలపాలా, లేదా తండ్రి పక్కన సమాధి నిర్మించాలా? వాళ్లలో ద్వైదీభావం. చివరకు తల్లి ప్రేమను అర్థం చేసుకున్నారు వాళ్లు.

ఇది గొప్ప ప్రేమకథా? ఏమో. ‘‘పెళ్లయి ముత్యాల్లాంటి పిల్లలున్నాక, జాన్సన్లాంటి మంచి మొగుడున్నాక మధ్యలో ఎవడో వస్తే వాడితే ప్రేమ ఏమిటి? అది కూడా నాలుగంటే నాలుగు రోజులు. అది సరదాకాదు, దురద. ఎలాంటెలాంటి రాతలు రాస్తార్రా బాబూ ఈ రచయితలు, హవ్వ. నీతీనిజాయితీలు అసలే అంతరించిపోతున్న గుణాలయిపోతుంటే ఇంకా చెడగొట్టడానికి తగుదునమ్మా అని వీళ్లొకరు’’ అని గనక బుగ్గలు నొక్కుకుని, ముక్కు మీద వేలేసుకునే రకమయితే ఇక చెప్పడానికేం లేదు. లేదూ, ‘‘ప్రతి మనిషి మనసూ తేనెపట్టు. అందులో లెక్కలేనన్ని గదులుంటాయి. రహస్యాల మాట అటుంచండి. ఎప్పుడు ముట్టుకుంటే తేనెటీగలు ఝామ్మని లేచి కుట్టేస్తాయో ఎప్పుడు దాన్ని దులిపితే తియతియ్యని మకరందం అందుతుందో ఎవరికి తెలుసు…’’ అని నమ్ముతారా, దీన్ని చదవండి. మీరు మనసు మనిషయినా, మేథ మనిషయినా, లేదూ ‘టేకిటీజీ’ టైపయినా, ఇలాంటి ప్రేమ జీవితంలో వద్దనుకోరు. బైటికి చెప్పకపోయినా మనసులోతుల్లోనయినా ఇలా ప్రేమించబడాలనే కోరుకుంటారు. ఇదిగో మనుషుల్లోని ఈ కోరికే ఈ నవలను 1993లో అమెరికాలో బెస్ట్ సెల్లర్స్ జాబితాలో మొదటిదానిగా నిలిపింది.

జేమ్స్ వాలర్ శైలి హాయిగా ఉంటుంది, అవసరమైనంత అందంగా కవితాత్మకంగా పొందిగ్గా ఉంటుంది. ‘బ్రిడ్జెస్ ఆఫ్ మేడిసన్ కౌంటీ’ చదవడం పూర్తి చేశాక – ఆత్మను కదిలించి హృదయాన్ని వెలిగించి జననాంతర సౌహృదాన్ని తొలి చూపులో, తొలి మాటలో గుర్తు చేసిన పరిచయమేదో ఒకటి మీ మనసులో మెదులుతుంది. దేవుడంత ప్రేమ నిండిన చిరునవ్వూ, జారిపోయిన చందమామను తల్చుకుని చిన్న విషాద వీచికా – రెండూ ఏకకాలంలో మీ పెదవులమీద కదలాడతాయి. నాది పూచీ.

పీఎస్: ఇది సినిమాగా కూడా వచ్చింది. క్లింట్ ఈస్ట్ వుడ్ దర్శకత్వం, నటన. ఫ్రానీగా మెరిల్ స్ట్రీప్. సినిమా గురించి నేనేం విశ్లేషించలేనుగానీ, కొన్నిసార్లు ఫ్రానీగా ఆమె చూపెట్టిన హావభావాలు గొప్పగా అనిపించాయి.
———————–
ఈబుక్ డవున్లోడ్ ఇక్కడ

ఇదే పరిచయం పుస్తకం డాట్ నెట్ లో ఇక్కడ.

2 thoughts on “ఏమాయ ప్రేమాయెనో…..

  1. క్రెడిట్ కార్డ్ లేని వారు మీరు చూపించిన చోట ఉచితంగా ఈ బుక్‌ని డవున్‌లోడ్ చేసుకునే అవకాశం లేదు.

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s