మట్టి లేకుండానే మొక్కలు పెంచండి

పిచ్చుకగూళ్లలా ఉండే ఫ్లాట్లు, జైలుఊచల్లా గ్రిల్స్‌ పెట్టిన బాల్కనీలు… వీటిలో మొక్కలను పెంచడం ఎలా సాధ్యం? సరే, ఉండేది ఇండివిడ్యువల్‌ ఇల్లే అనుకుందాం. అప్పుడు మాత్రం నాలుగు రకాల మొక్కలు పెంచడానికి జాగా ఏదీ? ఒకవేళ ఆశ కొద్దీ మొక్కలు పెట్టినా, వాటికి రోజూ నీళ్లు పోయాలి, పురుగూపుట్రా పట్టకుండా చూసుకోవాలి. వాటిని వదిలి నాలుగైదు రోజులు ఎటైనా వెళ్లాలంటే ఎండిపోతాయేమోననే భయం. ఇంత చాకిరీ ఎందుకని చాలామంది మొక్కలు పెట్టుకోవడమే మానేస్తారు. ఇప్పుడా భయాలన్నీ అవసరం లేదంటూ మట్టికి చక్కని ప్రత్యామ్నాయంగా మన ముందుకు వచ్చింది కోకోపీట్‌. దీంతో మీరు మట్టి లేకుండానే మొక్కలు పెంచొచ్చు. నమ్మలేకపోతున్నారా, ఇది చదవండి.

మహానగరాల్లోనే కాదు, ఒక మోస్తరు పట్టణాల్లో కూడా ఇంట్లో మొక్కలు పెంచే పరిస్థితి లేదు. అసలే స్థలం కరువు, ఆపై పనిభారం. జీవిక కోసం ఉరుకులుపరుగులే అందరికీ. అలాగని గ్రామాల వైపు ఆశగా చూడటానికీ లేదు. పల్లెల్లో కూడా ఇదివరకటిలా సారవంతమైనమట్టి లభించడం లేదు. ఇంటి పెరట్లోనే బెండ, బీర, కాకర వంటి కూరగాయలు పెంచే పద్ధతి క్రమంగా అంతర్ధానమైపోతోంది. అలాగే ఇంటి ముందు కనకాంబరం, చామంతి వంటి పూలమొక్కలు కనిపించడం ఇప్పుడు అరుదయిపోతోంది. ‘కిచెన్‌ గార్డెన్‌’ అంటూ కూరగాయలు, ఆకుకూరలు వంటివి ఇంట్లోనే పెంచుకునే సంస్కృతి ఇతర దేశాల్లో విపరీతంగా విస్తరిస్తుండగా, ఎన్నో తరాలుగా మన జీవనశైలిలో భాగమైన మొక్కల పెంపకం తగ్గిపోవడం ఏమిటి? ఏం చేస్తే ఇంట్లో మొక్కలు కళకళలాడతాయి అని ఆలోచించని వారుండరేమో. అలాంటివారికి ‘కోకోపీట్‌’ వరప్రదాయిని అంటే నమ్మాల్సిందే.

సుగుణాలెన్నో…
కోకోపీట్‌ అంటే మరేం లేదు, ప్రాసెస్‌ చేసిన కొబ్బరి పీచు, పొట్టు. కొబ్బరి పీచు, కాయల మీద ఉండే పొట్టు నుంచి పొడవైన పీచు పదార్ధాన్ని తయారుచేస్తారు. దీనిలోని అత్యుత్తమ కాయిర్‌ డస్ట్‌ను ప్రత్యేక పద్ధతిలో ట్రీట్‌ చేసి కోకో కాయిర్‌ పీట్‌ను తయారు చేస్తారు. ఇది పూలపెంపకం, కూరగాయల పెంపకం, ఇతర వ్యవసాయపనుల్లో ఉపయోగకరం. దీనిలోని సుగుణాలు బోలెడు. ఇది మట్టిని కండిషన్‌ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. తన పరిమాణానికి ఎనిమిది రెట్ల తేమను తనలో నిల్వ చేసుకోగలుగుతుంది గనుక ప్రతిరోజూ నీరు పోయనవసరం లేదు.  నీడలో ఉండే మొక్కలకయితే వారం పదిరోజులకోసారి, నేరుగా ఎండలో ఉండేచోటయితే మూడు నాలుగురోజులకోసారి పోస్తే చాలు. ఎగుడుదిగుళ్లు లేకుండా సరిసమానంగా ఉండే కోకోపీట్‌ను ఎంత చిన్న కుండీలో అయినా వేసుకోవచ్చు. అంత త్వరగా పాడవదు, మొక్కల ఎదుగుదలకు బాగా సహాయపడుతుంది. దీనిలో సూక్ష్మ నాళికల  రూపంలో ఉండే మైక్రోస్పాంజ్‌ల వల్ల ఒకసారి నీళ్లు పోస్తే చాలు, దానిలోని పోషకాలను గ్రహించి ఎక్కువ కాలం నిలవ చేసుకుంటుంది. గాలి బాగా వెళ్లేలా గుల్లగా ఉంటుందిగనుక మొక్కల వేళ్లు దీనిలో బలంగా పెరుగుతాయి. కోకో కాయిర్‌ పీట్‌నే కాయిర్‌ ఫైబర్‌ పీట్‌ లేదా కాయిర్‌ డస్ట్‌ అని కూడా వ్యవహరిస్తారు.

ఇంకెందుకు ఆలస్యం?
కోకోపీట్‌ను తయారుచేసేప్పుడే స్టెరిలైజ్‌ చేస్తారు, వేపను వాడతారుగనుక మొక్కలకు చీడపీడలు రావు, పురుగులు పట్టవు. మట్టిలో ఉండే ఇన్ఫెక్షన్లు దీనిలో ఉండవు. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా గోల్ఫ్‌ మైదానాల నిర్మాణం, పుట్టగొడుగుల పెంపకం, వానపాముల పెంపకం, పౌల్ట్రీ పరిశ్రమ, గ్రీన్‌హౌస్‌లు, వాణిజ్యనిర్మాణాలు, గులాబీల సాగులో కోకోపీట్‌ చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కోకోపీట్‌ వేసిన కుండీల్లో విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. ఇంట్లో పెంచే పువ్వులు, కూరగాయల సాగులో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. సెల్యులోజ్‌ ఎక్కువగా ఉంటుంది కనుక దీనిలో పుట్టగొడుగులు బాగా పెరుగుతాయి. ఇండియా, శ్రీలంకల్లో తయారయ్యే కోకోపీట్‌లో మాక్రో, మైక్రో పోషకాలతో పాటు పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. మన దేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కోకోపీట్‌  తయారీ ఎక్కువ. దీన్ని తయారుచేసే పద్ధతిలోనూ పర్యావరణానికి హానిచేసే అంశాలేమీ లేవు. పైగా తయారీ దశలోనే వేపను వాడతారుగనక మొక్కలు పురుగు పట్టే సమస్యే రాదు. ఒక కేజీ కేకోపీట్‌ను నీళ్లలో తడిపితే 15 లీటర్ల తడి కోకోపీట్‌గా తయారవుతుంది. దాన్ని కుండీల్లో వేసుకోవాలి. మట్టిలో చేతులు పెట్టడానికి ఇష్టపడని చిన్నారులు కూడా కోకోపీట్‌తో తోటపని చెయ్యడానికి ముందుకొస్తారు. ఇంకెందుకు ఆలస్యం? మీకు దగ్గర్లో ఉన్న విత్తనాల దుకాణాల్లో కోకోపీట్‌ దొరుకుతోందేమో అడగండి. నచ్చిన మొక్కలను ఇంటికి తెచ్చి సంతోషంగా పెంచుకోండి.
For Reference : —– http://www.nanduagro.com

1. కోకోపీట్‌ దిమ్మను తీసుకుని సుత్తి లేదా స్కూడ్రైవర్‌ ఉపయోగించి బలం ప్రదర్శిస్తే అది రెండు పొరలుగా విడిపోతుంది.
2. అరబకెట్‌ నీటిలో ఒక పొరను పదినిమిషాల సేపు నానబెట్టాలి.
3. కుండీలో కొంత కోకోపీట్‌ను వేసి దాన్ని చేత్తో చదును చెయ్యాలి.
4. నర్సరీ నుంచి తెచ్చిన మొక్కకు ఉన్న మట్టిలో కొంత భాగాన్ని తొలగించి కుండీలో నాటుకోవాలి.
5. కోకోపీట్‌ను ఒకొక్క పొరగా నింపాలి.
6. మూడు నెలల్లో వేరు బలం పుంజుకుంటుంది, మొక్క ఏపుగా ఎదుగుతుంది.
7. ప్రతిరోజూ నీళ్లు పోయనవసరం లేదు, ఎరువులేమీ వెయ్యాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా మట్టిని మార్చనవసరమూ లేదు.
8. జీరో పర్సంట్‌ మెయింటెనెన్స్‌.

Advertisements

6 thoughts on “మట్టి లేకుండానే మొక్కలు పెంచండి

  1. వేపను వాడతారుగనుక మొక్కలకు చీడపీడలు రావు,…”
    పైగా తయారీ దశలోనే వేపను వాడతారుగనక మొక్కలు పురుగు పట్టే సమస్యే రాదు.
    ఒక సారి చెప్పిందే మళ్ళీ..?!

    ఏదొ వ్రాసి పోస్ట్ చేసేసారు..అని మీకు అనిపిస్తుందా లేదా?

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s