నాటకాల నాయుడిగారి కుటుంబం

కుటుంబమంతా కలిసి నాటక ప్రదర్శనలిచ్చే… ఈ వాక్యం పూర్తవకముందే ‘సురభి’ అనే మాట మీ మదిలో మెదులుతుంది. కానీ అపర సురభి అనదగ్గ కుటుంబం విశాఖపట్నంలో మరొకటి ఉంది. ‘రంగు మా రక్తంలో ఉంది’ అని గర్వంగా చెప్పగలిగిన శ్రీసాయి కళానికేతన్‌ బీవీఏ నాయుడి కుటుంబానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఇప్పటికి 200 నెలలుగా నెలలో ప్రతి రెండో శుక్రవారం ఇక్కడి ప్రేమసమాజంలో ఉచితంగా పౌరాణిక /పద్య నాటకాలను ప్రదర్శిస్తోంది ఆ కుటుంబం. ఒక్క నెల కూడా అంతరాయం లేకుండా దీనిని నిర్వహిస్తున్న బీవీయే నాయుడి కుటుంబాన్ని పలకరిస్తే ఆశ్చర్యకరమైన ఎన్నో సంగతులు తెలుస్తాయి. ఈ నెలతో రెండు వందల ప్రదర్శనలు పూర్తి చేసిన వారి గురించి తెలుసుకుంటున్నప్పుడు, వారి జ్ఞాపకాలు పంచుకుంటున్నప్పుడు నాటకం చూడ్డం కన్నా గొప్పదైన అనుభూతి కలుగుతుంది.

ఐదువేల సార్లు దుర్యోధనుడిగా నటించిన అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకున్న బీవీఏ నాయుడు కుటుంబమంతా నాటకరంగంలోనే ఉంది. ఆయన తండ్రి, మేనమామలు, చిన్నాన్నలు అందరికీ పౌరాణిక నాటకాలంటే మహాప్రీతి. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఓవీపేటలో పుట్టిపెరిగిన నాయుడికి వాళ్లు ఉగ్గుపాలతో నేర్పింది పద్యనాటకాన్నే. చిన్నప్పుడే రాగయుక్తంగా తప్పుల్లేకుండా పద్యాలు పాడటం నేర్చుకున్న ఆయన నెమ్మదిగా తన కళకు మెరుగులు దిద్దుకున్నారు. బీవీఏ నాయుడు తమ్ముళ్లు రామచంద్రంనాయుడు, బి.ఎ.నాయుడు కూడా ఇదే రంగంలో ఉన్నారు. సోదరులు ముగ్గురూ ప్రతిష్ఠాత్మక ‘నంది’ బహుమతులు అందుకున్నవారే. దుర్యోధనుడు, నారదుడు, కృష్ణుడు వంటి వేషాల్లో వీరున్నారంటే నాటకం భలే రక్తి కడుతుందని వీక్షకుల మాట. “పోర్టులో ముప్పయ్యేళ్లు పనిచేసేనని లెక్కేగాని, నిజానికి చేసింది పదేళ్లేనండి. మిగిలిన సమయమంతా నాటకాల్లోనే గడిచిపోయింది. కళాకారులను ప్రోత్సహించడంలో పోర్టు తర్వాతే మరే సంస్థయినా” అనే నాయుడు పీసపాటి వంటి మహామహులను సైతం తన నటనతో మెప్పించారు. చెట్టొకటీ కాయొకటీ అవుతుందా? ఆయన పెద్ద కొడుకు విజయసారధి, చిన్నబ్బాయి విజయసాయి ఇద్దరూ పౌరాణిక నాటకాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక మనవళ్లు గీతాప్రసాద్‌, గీతానాథ్‌, మనవరాళ్లు జ్యోత్స్న, పావని అందరూ పౌరాణిక పద్యాలు పాడటంలో దిట్టలే. ఆఖరికి రెండేళ్లు నిండని మరో మనవడు రితీష్‌ చంద్‌ కూడా హార్మోనియమ్‌ పెట్టెను చూడగానే బోసినోటితో ఆఁ…….. అని రాగం ఎత్తుకుని కుటుంబసభ్యులను కిలకిలా నవ్విస్తాడు. తండ్రి, పెదనాన్న గదనెలా పట్టుకుంటారో పద్యాలెలా పాడతారో చిట్టి చేతులతో అభినయించి మరీ చూపిస్తాడా బుడతడు. విజయసారధి కొడుకు గీతాప్రసాద్‌ ఇప్పటికే రంగప్రవేశం చేశాడు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ కుర్రాడు నాటకం ఉందంటే ముందే క్లాసు టీచర్‌ దగ్గర అనుమతి తీసుకుంటాడు. ఇప్పటికే బాలకృష్ణుడిగా, లోహితాస్యుడిగా రంగప్రవేశం చేసిన గీతాప్రసాద్‌కు అప్పుడే ప్రత్యేక అభిమానులు కూడా ఉన్నారు. మూడు తరాలూ ఒక వేదిక మీద అభినయిస్తుంటే చూడటం అద్భుతంగా ఉంటుందని, అలాంటి ప్రదర్శనలెప్పుడో ముందుగానే తెలుసుకుని సిద్ధమయే ప్రేక్షకులూ విశాఖలో ఉన్నారు.

‘ఆడ ‘ వారే తోడూనీడా

నాయుడు భార్య సీతాదేవి నిజంగా సీతాదేవే అని చెప్పుకోవాలి. ఎవ్వరు ఏ వేళకు వచ్చినా వేడిగా వండి పెట్టడం, ఎప్పుడూ విసుక్కోకపోవడమే కాదు, అనుక్షణం వెన్నంటి నిలిచి కుటుంబసభ్యులను ప్రోత్సహిస్తారామె. “ఏదో మీడియాకు చెబుతున్నానని డైలాగులు చెప్పడం కాదుగానండీ, ఆమె లేనిదే నేనిలా ఉండనండీ” అన్నారు నాయుడు. “మా కుటుంబం, మా ఆనందం, మా అభివృద్ధి – వీటికి మా అమ్మే ఆధారం” అన్నారు కొడుకులిద్దరూ ముక్తకంఠంతో. “మరీ సెప్తారీళ్లు. ఒండిపెట్టడం, నాటకాలు సూడ్డం తప్ప నా పని మరేటీ లేదు” అన్నారు సీతాదేవి నవ్వుతూ. “మా మావయ్యలు, చిన్నాన్నలు అందరూ నాటకాలు వేసేవాళ్లే. చిన్నప్పటి నుంచీ నాక్కూడా పౌరాణిక నాటకాలంటే ఇష్టం. వాటిని ప్రదర్శించమంటే మాటలు కాదని నాకు తెలుసు. అందుకని చేతనయినంత సాయం చేస్తుంటా. నేనే కాదు, మా తోడికోడళ్లూ అంతే… కుటుంబసభ్యులందరూ ఒక మాట మీదుండకపోతే ఇలాటివి చెయ్యడం కష్టం” అన్నారామె.  “నాటకాలోళ్లంటే చిన్నచూపు అప్పుడూ ఉంది, ఇప్పుడూ ఉంది. అయితే మా ఇంట్లో ఎవ్వరికీ ఎలాంటి వ్యసనాలూ లేవు. ఏ రకమైన దాపరికాలూ ఉండవు. అందరం బాబా భక్తులం. ఇక మాటనుకోడానికేటుంది?” అని తేల్చేస్తారామె. కేవలం తమ కుటుంబ ప్రదర్శనలే కాదు, ఎక్కడ పౌరాణిక నాటకాలు జరుగుతున్నాయన్నా సీతాదేవి వెళ్లి చూసొస్తుంటారు. ఇక అనూరాధ, సుజాతలయితే అత్తకు తగిన కోడళ్లు. సుజాతకు ‘హరిశ్చంద్ర’లో అడపాదడపా లోహితాస్యుడిగా నటించిన అనుభవం కూడా ఉంది. నాటకంలో అందరూ ధరించే దుస్తులను సిద్ధం చేయడం నాటకం పూర్తవగానే వాటిని ఉతికి ఆరబెట్టి మరో ప్రదర్శనకు రెడీగా ఉంచడం, ఎక్కడైనా చిరుగు పడితే కుట్టించడం వంటివి ఇంట్లో ఆడవారి బాధ్యతే. కేవలం దుస్తులే కాదు, నగలు కిరీటాలు వంటివాటిని కూడా జాగ్రత్తగా పరిశీలించడం, ప్రదర్శనలో ధరించడానికి సిద్ధంగా పెట్టడం వారే చూసుకుంటారు. “ఒక్క తెరముందుకు రాంగానండీ, తెరవెనక పనులన్నీ మావే…” అంటారు నవ్వుతూ సీతాదేవి. వాళ్ల కుమార్తె పుష్పలతకూ రాగయుక్తంగా పద్యాలాపన చేయడం, మేకప్‌ వ్యవహారాలు అన్నీ క్షుణ్ణంగా తెలుసు.

రక్తంలో ఉంది రంగుప్రీతి…

“మీరు విన్నారో లేదో, ‘రంగు ప్రీతి’ అనే మాటొకటుంది. ఒకసారి ఇష్టపడి మొఖానికి రంగేసుకుని ప్రదర్శన ఇచ్చారంటే మీకా నాటకాల వ్యామోహం అంటుకుందన్నమాటే. డబ్బు పోయినా, ఆరోగ్యం లేకపోయినా, పరిస్థితులు సహకరించకున్నా సరే మీరు నాటకాలు జరిగేచోటికి చేరుకుంటారు. ఆ రంగు ప్రీతి మాకు తాతల నుంచీ రక్తంలో వస్తోంది” అంటారు నవ్వుతూ చిన్నబ్బాయి విజయ్‌సాయి. తెలుగు ఉపాధ్యాయుడిగా రెండు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఆయన కోర్టులో అటెండెంట్‌గా వచ్చిన ఉద్యోగాన్ని వదులుకున్నారు. “నాటకమే నా జీవితం. దానికి అడ్డొచ్చే ఏ పనీ చేయను. కోర్టులో ఉద్యోగమంటే 8 నుంచి 8 వరకూ ఉంటుంది. సెలవులు తక్కువ. నావల్లేం అవుతుంది?” అంటున్నారు. ‘కేవలం నాటకాల మీద మీ జీవితమంతా వెళుతుందనుకుంటున్నారా’ అని అడిగి చూడండి. “బ్రహ్మాండంగా వెళుతుంది. ప్రేక్షకులు తగ్గిపోతున్నారనేది ఒట్టి మాట. నాటకం అజరామరంగా నిలిచి ఉంటుంది” అని మెరిసే కళ్లతో చెబుతాడాయన. చిన్నబ్బాయికి వంతపాడారు నాయుడు. “మనం ఎంత నాణ్యమైన ప్రదర్శన ఇస్తున్నామన్నదాని బట్టే వచ్చే ప్రేక్షకులు, స్పందన ఉంటుంది…” అంటారాయన. ఇళ్లలో స్వచ్ఛమైన భాష మాట్లాడుతూ, తెలుగు మాధ్యమంలో చదివే రోజులు పోయాయి కదా, ఇప్పుడొస్తున్న ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్నవారు ఈ పద్యాలను అర్థం చేసుకుని ఆస్వాదించగలరా – అన్న ప్రశ్న మనలో ఉదయిస్తుంది. “భాష వేరు మీడియమ్‌ వేరు. మా తమ్ముడు ఇంగ్లిష్‌ మీడియమ్‌లోనే చదువుకున్నాడు. ఇప్పుడు మా అబ్బాయిదీ అదే దారి. అయినా వాళ్లిద్దరూ పద్యాలు బ్రహ్మాండంగా పాడతారు. మా తమ్ముడు తాను పనిచేసే పాఠశాలల పిల్లలతో లవకుశ వంటివి వేయించాడు. ఆ పిల్లలు ఎంత చక్కగా వేశారో నాటకాలు. స్కూలు పిల్లలు ఎంతో సరదాగా చూస్తారు కూడా. ఏదైనా మనం చెప్పడంలో ఉంటుందంతే. భాష సమస్య కానేకాదు” అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు విజయసారధి. “తెలుగు నాటక రంగ వైభవం తెలిసేలా, పౌరాణిక పద్యాల పట్ల ఆసక్తి పెరిగేలా విద్యార్థులకు కనీసం తర గతికొక్క పాఠ్యభాగం ఉంటే ఇంకా బాగుంటుంద”ని ఆశపడుతున్నారు నాయుడు.

అరుదైన అనుభవాలెన్నో….

పౌరాణిక నాటకాల పట్ల ఇంత మక్కువ ఉండటం సరే. రెండు వందల నెలలు అంటే – దాదాపు పదహారేళ్లకు పైగా నిర్విఘ్నంగా నాటకాలు ప్రదర్శించడం అయ్యేపనేనా? “అవుతుంది. మనం ప్రయత్నించాలి, స్వామి దీవించాలి. అంతే” అంటారు నాయుడు దృఢంగా. ప్రేమసమాజంలో ప్రతీనెలా ప్రదర్శించే సాయికళానికేతన్‌వారి నాటకాలు ఠంచనుగా ఆరింటికి మొదలయి, తొమ్మిదిన్నరకల్లా ముగుస్తాయి. ఏడాదికి ఆరేడు నెలల పాటు స్పాన్సరర్లు దొరుకుతారు. మిగిలిన ప్రదర్శనలకు ఈ కుటుంబమే తంటాలు పడుతుంది. “రిటైరయిన కొత్తలో పెన్షనంతా దానికే దాచిపెట్టేవారు. ఇప్పటికీ అంతే. ప్రదర్శన అయ్యే వరకూ ఎప్పుడే అవసరం వస్తుందో అని కాస్త డబ్బు తీసి పక్కకు పెడతాం. ఆయన చేతినున్న ఉంగారాలు అప్పటికప్పుడు పద్దుపెట్టీసిన రోజులెన్నో” అంటూ చెప్పుకొచ్చారు సీతాదేవి. “నా డబ్బే అని కాదండి. నాటకం వెయ్యడానికి వచ్చిన ఆర్టిస్టులు, డైరెక్టర్లు మా ఇబ్బందిని గమనించి మెళ్లో గొలుసో, చేతిలో డబ్బో ఇచ్చేసి నడిపించమన్న సందర్భాలెన్నో ఉన్నాయి…” అంటూ గుర్తుచేసుకున్నారు నాయుడు. తన స్నేహితులు గంటా అప్పలనాయుడు, చౌదరి అప్పారావుల సాయం లేకపోతే మాత్రం తమ సంస్థ ఇలా నడిచేది కాదని ఆయన చెబుతుంటే చిన్నబ్బాయి అందుకున్నాడు. “మొన్న డిసెంబర్‌ ఆరున ఉదయాన్నే నాన్నకు హార్ట్‌ అటాక్‌ వచ్చింది. ఆరోజే ప్రేమసమాజంలో మా ప్రదర్శన. అది ఆగిపోతుందేమోనని ఆయన గుండెలో నొప్పిగా ఉందన్న విషయం మాకెవ్వరికీ చెప్పడానికే ఇష్టపడలేదు. మేమే బలవంతంగా ఆయనని హాస్పిటల్లో చేర్పించి సాయంత్రం నాటకం వేశాం…” అని విజయ్‌సాయి చెబుతున్నప్పుడు ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. ఇన్నేళ్ల వారి ప్రయాణంలో ఇలాంటి అనుభవాలు బోలెడు. “వందో ప్రదర్శన సందర్భంగా అనుకుంటాను… కాకినాడ దగ్గరనుంచి ఒక ఆర్టిస్టు వచ్చారు. మధ్యాహ్నం మాతోపాటే భోంచేశారు, రాత్రి ప్రదర్శన తర్వాత అకస్మాత్తుగా విరుచుకుపడిపోయారు. చూస్తే ప్రాణం పోయింది. ఎలాగోలా టాక్సీ చేయించి వాళ్లూరికి తీసుకెళితే అక్కడ ఆయన కుటుంబం గొడవ. ఆయనకిద్దరు భార్యలని అప్పుడే తెలిసింది. వాళ్లు మేమే ఏదో చేశామని ఆరోపించి మమ్మల్ని నిర్బంధించేశారు. మనిషిగా తీసుకెళ్లినవాళ్లు శవంగా అప్పజెప్తారా అని కొట్టబోయారు కూడా. మాకే మో మర్నాడు విశాఖలో చంద్రబాబునాయుడిగారి ముందు మరో ప్రదర్శన ఉంది. వీళ్లు చూస్తే వదిలేట్టు లేరు. చివరకు అక్కడి పెద్ద మనుషులు కలగజేసుకుని – వాళ్లు మంచివాళ్లు గనుక టాక్సీ చేయించి మరీ శవాన్ని మీకప్పజెప్పేరు. కేవలం కబురు చేసి ఊరుకుంటే ఏం చేసేవారని గద్దించి మమ్మల్ని విడిపించి పంపించారు. ఆ గొడవతో రాత్రంతా నిద్ర లేకపోయినా సాయంత్రానికి ఊరు చేరుకుని ప్రదర్శనకు సిద్ధమయ్యాం” అంటూ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు నాయుడు. “ఒకసారి శ్రీకాకుళం జిల్లాలో నాటకం వేస్తుండగా మా చిన్నాన్నకు హార్టెటాక్‌ వచ్చింది. ప్రదర్శన చూడటానికి ఒకాయన విశాఖ నుంచి కార్లో వచ్చారు. ఆయన్ని బతిమాలి వెంటనే చిన్నాన్నను హాస్పిటల్‌కు తరలించాం. గండం గడిచిందనుకోండి. మరోసారి రాజమండ్రి దగ్గర వేదిక కిందన ఇనపచట్రం, మెట్లు ఉన్నాయి. ఎలెక్ట్రీషియన్‌ నిర్లక్ష ం వల్ల వాటికి షాక్కొడుతోంది. మాకెవరికీ తెలీదు. అర్థరాత్రి నాటకం అయ్యాక వేదిక దిగబోయిన నాన్నగారికి షాక్కొడితే అల్లంత దూరానికి పడ్డారు. ఇక అయిపోయినట్లే అనుకున్నాం. ఎలాగోలా వైద్యుడి దగ్గరకు తీసుకె ళ్లాం. అయితే ఉదయం ఇంటికొచ్చాక ‘నాన్నగారు ఎక్కడ్రా’ అని అమ్మడిగితే ఏం చెప్పాలో తెలీక తల్లడిల్లిపోయాం….” అని కొడుకు చెబుతుంటే నాయుడు తలమీద పడిన లోతైన గాయపు గుర్తులు చూపించారు. సాధారణంగా పౌరాణిక నాటకాలు రాత్రి పూటే జరుగుతాయి. ఇలాంటి షాకులో, పురుగూపుట్రో ఏమున్నా తెలీదు. తిండి మాట సరే, తిరుగు ప్రయాణానికి నానా తిప్పలూ పడాల్సిందే. మధ్యలో ఎవరైనా మానేసినా, రాలేకపోయినా అంతా రసాభాసే. అన్నిటినీ ఎదిరించి సంకల్పబలంతో ముందుకు సాగుతున్న నాయుడి కుటుంబాన్ని శభాషనకుండా ఉండగలమా?

———————————-

పురాణాలే జాతికి బలం

నాటక ప్రదర్శన చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మరి నాయుడు ఉచిత ప్రదర్శనలెందుకు ఇస్తున్నట్టు? “చుట్టుపక్కల పల్లెటూళ్ల జనాలు పదో ఇరవయ్యో బస్సు చార్జీలు పెట్టుకుని రావడమే ఎక్కువ. అలా వచ్చి టికెట్టు కొనడానికి డబ్బులేక పౌరాణిక నాటకానికి సామాన్యులు దూరం కాకూడదు. అందుకనే మేం నెలకో ప్రదర్శన ఉచితంగానే ఇస్తాం. ఎవ్వరయినా రావొచ్చ”నే నాయుణ్ని ‘ఐదువేల సార్లు దుర్యోధనుడిగా వేషం వేశారుకదా, ఎప్పుడూ బోర్‌ కొట్టదా’ అని అడిగిచూడండి… “మీకు తెలుసో లేదో చదువు దినకొత్త అని సామెతుంది. మీరు చిన్నప్పుడు సోషలో సైన్సో పాఠాలు చదివి వందకు తొంభై మార్కులు సంపాదించి ఉంటారు కదా, ఇప్పుడు అడిగితే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? చెప్పలేరు. రోజూ చదివితేనే చదువు. ఇన్నేళ్లలో బోర్‌ కొట్టలేదు సరికదా, ఇప్పుడు కూడా ప్రదర్శనకు వెళ్లేముందు డైలాగులొకసారి మనసులోనే మననం చేసుకుంటాను. దుర్యోధనుడంటే నాయుడే అన్న పేరును నిలబెట్టుకోవాలంటే తప్పదు మరి” అంటారాయన. ఇంతకీ పౌరాణిక నాటకాలే ఎందుకు? సాంఘిక నాటకాలెందుకు వేయకూడదు? “అవి కూడా వేశాం. రావిశాస్త్రి ‘నిజం’ నాటికలో వందసార్లు పాల్గొన్నాను. కానీ పౌరాణిక నాటకాల్లో నీతి సూటిగా ఉంటుంది. నాటి మహాపురుషులను, ధర్మాన్ని గుర్తు చేసుకోవడం వల్ల నేటి జనాల్లో ధర్మం నిలబడుతుంది. ధర్మం ఉంటేనే జాతికి బలం” అని సూటిగా చెబుతున్నారు నాయుడు.

3 thoughts on “నాటకాల నాయుడిగారి కుటుంబం

  1. నాటాకరంగానికి ఇలాంటి అంకిత స్వభావులున్నంత కాలం, నాయుడు గారి లాంటి వారు, వారి అభిమానులు అజరామరంగా “ఉంటారు”.

  2. proud to be say Mr.Naidu as Duryodhana charector. All the Best & God Blesses to Mr.Naidu’s Family.
    M.P.Naidu
    parvathipuram

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s