ఉంటే డబ్లిన్లోనే ఉండాలి….

పురాతన చర్చి శిఖరాలు, వాటి నుంచి వినిపించే శ్రావ్యమైన ధ్వనులు, మరోవైపు పచ్చదనం సముద్రంలాగా పరుచుకున్న ప్రాంతంలో నివాసం ఎంతో బాగుంటుంది. ఆ ఆనందాన్ని అందరితోనూ పంచుకుంటానటున్నారు ఐర్లాండ్‌లోని ఐబిఎం సంస్థలో హార్డ్‌వేర్‌ విభాగంలో పనిచేస్తున్న రఘు సింగమనేని. చల్లదనం, చాక్లెట్లు… అంతకన్నా ఏం కావాలి అంటూ రఘు చెబుతున్న ఐర్లాండ్‌ కబుర్లు ఆయన మాటల్లోనే……….

బాగా చదువుకుని, మంచి ఉద్యోగానుభవం ఉన్నా సరే, చేతిలో చిల్లిగవ్వలేని ఒకానొక విచిత్రమైన పరిస్థితిలో నేను ఐర్లాండ్‌ దేశంలో అడుగుపెట్టాను. పదిహేనిరవై రోజుల తర్వాత అనుకోకుండా ఒక భారతీయుడు, అందునా ఒక హైదరాబాదీ కుర్రాడు కనిపించినప్పుడు ఎంత సంతోషంగా అనిపించిందో చెప్పలేను. అప్పటిదాకా ఎలాగోలా గడుపుతున్న నేను ముందు చేసిన పనేంటో తెలుసా, అతని గదికెళ్లి అన్నం వండించుకుని తినడం!

దాదాపు పదేళ్ల నుంచీ ఐర్లాండ్‌ రాజధాని నగరమైన డబ్లిన్‌లో ఉంటున్నాను. ఐరిష్‌ ప్రజలు చాలా మంచివాళ్లు. అలా ఎందుకంటున్నానంటే నేను అంతకుముందు సింగపూర్‌లో నాలుగైదేళ్లు ఉండొచ్చాను. అక్కడ జాతి వివక్ష, రకరకాల విద్వేషాలు ఎంత ఉండేవో. అయితే ఇక్కడ పదేళ్లలో ఎప్పుడూ నాకు అలాంటి వివక్ష కనిపించలేదు. అలాంటి వాతావరణమే ఉండదసలు. మనలాగా ఇక్కడ విద్య నిర్బంధం కాదు. పద్ధతిగా స్కూలుకెళ్లి చదువుకోవడం అనేది ఉండదు. పదో తరగతి పూర్తయితే 17, 18 ఏళ్లకు ప్రభుత్వం తప్పనిసరిగా ఉద్యోగం ఇవ్వాలి. లేకపోయినా పదహారేళ్ల తర్వాత సొంతంగా బతకడానికి ఇష్టపడతారు. అలాంటివారికి సోషల్‌ వెల్ఫేర్‌ విభాగం కొంత భత్యం ఇచ్చి పోషణకు సహకరిస్తుంది. మరొకటి – ఏ పనీ ఎక్కువా తక్కువా అని ఉండదు. ఉట్టి చేతులతో చేసే ఏ పనినైనా వాళ్లు చాలా గౌరవిస్తారు. నిజానికి ఇక్కడ కార్‌ డ్రైవర్‌గానో, భవన నిర్మాణ కార్మికుడిగానో పనిచేసేవారు సాఫ్ట్‌వేర్‌ నిపుణుల కన్నా ఎక్కువ సంపాదిస్తారు. ఆధునిక పద్ధతిలో కట్టే ఇళ్లన్నిటినీ కేవలం ఐదారు మోడళ్లలోనే కడతారు. బైట మనకిష్టమైనట్టు మార్చుకోవడానికి, డి జైన్లు పెట్టడానికి వీల్లేదు. లోపల కూడా చిన్న చిన్న మార్పులకు మాత్రమే ప్లానింగ్‌ కమిషన్‌ ఆమోదం లభిస్తుంది. దుమ్మూధూళీ వంటివి ఉండవు, చల్లగా ఉంటుంది కనుక వారానికి రెండుమూడు సార్లు స్నానం చేస్తారంతే. ఆడవారిని ఎంతో గొప్పగా గౌరవిస్తారు. పెళ్లి కన్నా సహజీవనం చేసే పద్ధతి ఎక్కువ. ఎక్కువమంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. పిల్లలు పుట్టాక విడిపోతే తల్లికి ఉద్యోగం లేదంటే ఆమెకి ఉచిత వసతిని కల్పిస్తుంది ప్రభుత్వం. పిల్లలకు, ఆమెకు నెలకింతని ఇస్తారు. విద్యవైద్యం అన్నీ ఉచితమే. ఉద్యోగం ఉన్నా లేకున్నా, బిడ్డ పుడితేచాలు నెలకి 160 యూరోలు ఇస్తుంది ప్రభుత్వం. అలా పదిహేడేళ్లపాటు. ఎప్పుడు ఫోన్‌ చేసినా రెండుమూడు నిమిషాల్లో పోలీస్‌, అంబులెన్స్‌ అన్నీ వచ్చేస్తాయి. పోలీస్‌ అంటే దేవుడే ఇక్కడ. మన దేశంలోలాగా కాకుండా వారంటే చాలా ఇష్టం, గౌరవం మామూలు జనాలకు. నేనుండేది ఐర్లాండ్‌ రాజధాని నగరమైన డబ్లిన్‌లోనే. ఐరిష్‌ సముద్రంలో లిఫీ నది కలిసే దగ్గర ఉంటుందీ ఊరు. మధ్య నుంచి ప్రవహించే నది ఊరిని నార్త్‌ – సౌత్‌గా విడగొడుతుంది. ఉత్తరం వైపంతా శ్రామికులు, దక్షిణాన అంతా ఎగువ మధ్య తరగతి అనే విభజన అస్పష్టంగా ఉంటుంది. నగరంలో ఎటుచూసినా పచ్చదనం తప్ప మరొకటి కనిపించదంటే నమ్మాల్సిందే. ఊరుఊరంతా పచ్చటి తివాచీ పరిచినట్టుగా ఉంటుంది. పార్కులు, మైదానాలు, పంటపొలాలు…. భూమ్మీద ఆకుపచ్చ రంగంతా అక్కడే పులిమేశాడా దేవుడు అన్నట్టుంటాయి. కౌన్సిల్‌ ప్రతియేటా ఐదువేల చెట్లను నాటుతుంది, మూడున్నరవేల ఎకరాలకు పైగా స్థలంలోని పార్కుల సంరక్షణ చేస్తుంటుంది. దేశంలోని ముఖ్య పట్టణాలు కార్క్‌, గాల్‌వే, వాటర్‌ఫోర్డ్‌ వంటివాటిలాగానే డబ్లిన్‌లో పరిపాలన సాగించేది అక్కడి సిటీ కౌన్సిల్‌. మినిస్టర్లుంటారు. నిత్యజీవితంలో అవినీతి ఎక్కడా ఉండదు. పెద్దపెద్ద వైట్‌ కాలర్‌ నేరాలు జరుగుతుంటాయి. మీకో విచిత్రం చెప్పనా, ఐర్లాండ్‌ అనగానే ఇంగ్లిష్‌ దేశమనుకుంటారు చాలామంది. కానీ కాదు. బ్రిటిష్‌ వారి పాలనలో ఉండటం వల్ల వారికీ మనలాగానే ఇంగ్లిష్‌ పరిచయం ఉంది. ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌’గా గుర్తింపు తెచ్చుకోవడానికి ఈ దేశం కూడా ఎంతో కష్టపడింది. మనకన్నా ఎక్కువగా వారు బ్రిటిష్‌వారిని అసహ్యించుకుంటారు. వాళ్ల పేరెత్తితే రక్తం మరిగిపోతుంది ఐరిష్‌ జనానికి. వందల ఏళ్ల పాటు సాగిన బ్రిటిష్‌ పాలనలో ఐరిష్‌ మాట్లాడితే నాలుక తెగ్గోసేవారట. అందువల్ల ఎక్కువమందికి ఇంగ్లిష్‌ వచ్చు. మాట్లాడలేకపోయినా అర్థమవుతుంది. కానీ వాళ్లకు అదంటే అసహ్యం. తూర్పు యూరోపియన్‌ దేశాల నుంచి ఏడాదికి సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు రెండు మూడు నెలల పాటు తమ ప్రాజెక్టు వర్క్‌ చేయడానికి, ఇంగ్లిష్‌ నేర్చుకోవడానికి ఐర్లాండ్‌కు వస్తుంటారు. మొత్తం తెలుగు జనాభా పదివేలకు పైనే ఉంటుంది. ఇండి యన్‌ స్టోర్లున్నాయి. మొన్నమొన్నటి వరకూ మామూలు బియ్యం దొరికేవి కావు. దాంతో బాస్మతి తినేవాళ్లం. ఇప్పుడు కర్నూలు సోనామసూరి దొరుకుతున్నాయి. 20 కిలోల బస్తా 36 యూరోలు పడుతుంది. బాస్మతి అయితే 30 -32యూరోలే. ఇక ఐదారేళ్ల నుంచీ పప్పులు ఉప్పులు పచ్చళ్లు ఆవాలు జీలకర్ర ఒకటేమిటి అన్నీ దొరుకుతున్నాయి. కందిపప్పు రెండు కిలోల ప్యాక్‌ ఐదు యూరోలుంటుంది. మన స్వీట్లన్నీ దొరుకుతాయి. బోలెడన్ని ఇండియన్‌ రెస్టారెంట్లున్నాయి. పాకిస్తాన్‌ వాళ్లు మొదలెట్టినవి కూడా ఇండియన్‌ పేర్లే ఉంటాయి. వాటినీ ఇండియన్‌ రెస్టారెంట్లే అంటారు. ఈమధ్యే ఒక టిఫిన్‌ సెంటర్‌ ప్రారంభించారు. ఒక మసాలా దోశ 4.99యూరోలు. ఇడ్లీ సాంబార్‌ 2.99 అలా ఉంది. తెలుగువాళ్లం కలిసినప్పుడు సినిమాల గురించి మాట్లాడుకుంటాం. హీరోలకు ప్రత్యేకంగా అభిమానులున్నారు. రెండు ఇస్కాన్‌ శ్రీకృష్ణ దేవాలయాలున్నాయి. మాకు దగ్గరలో వినాయకుడి గుడి ఉంది. అందరూ ‘బీర’కాయలే… పురాతన కెథెడ్రల్‌ చ ర్చి శిఖరాలు, భవనాలు ఇక్కడ కనువిందు చేస్తూ ఉంటాయి. పబ్‌లు, బార్ల వైభవం అయితే ఇక మాటల్లో చెప్పలేం. ఇక్కడివారికి తాగడానికి ఓ కారణం అవసరం లేదు. సరదాగా చెప్పాలంటే – ఆనందం, విచారం దేన్ని వ్యక్తం చేయడానికైనా వాళ్లు తాగుతారు. మగవాళ్ల కన్నా ఆడవాళ్లే ఎక్కువ తాగుతారు. ఆనందమో విచారమో ఏదీ లేని సాదా స్థితిని వ్యక్తం చేయడానికీ తాగక తప్పదన్నట్టుంటారు. ఇక తిరగడం అంటే వీరికి ఎంత ఇష్టమో. పర్యాటక ప్రాంతాల అందాన్ని ఆస్వాదించడానికి మైళ్లకుమైళ్లు నడుస్తుంటారు. సాకర్‌, ర గ్బీ ఆటలు ఇక్కడి వారికి చాలా ఇష్టం. వాటిని చూడటానికి ఎంత ప్రయాస అయినా వెళతారు. ఐర్లాండ్‌లో బెట్టింగ్‌ చట్టబద్ధమే. దానివల్ల గుర్రప్పందాలు, గ్రేహౌండ్‌ డాగ్‌ రేసింగ్స్‌ వంటివి ఒక పెద్ద పరిశ్రమగా వర్థిల్లుతున్నాయి. మీకో విషయం చెప్పనా, వాళ్లు వేడిగా ఆహారం తిననే తినరు. కారం అస్సలు తినరు. బ్రెడ్‌, శాండ్‌విచ్‌ వంటివే తింటారు. పచ్చికూరల సలాడ్లు, పచ్చిపాలు…. అన్నీ పచ్చివే ఇష్టం. నేనో స్నేహితుణ్ని ఇంటికి భోజనానికి పిలిచాను. అతను వెళుతూ ఏమన్నాడంటే – ’42ఏళ్ల జీవితంలో ఇదే మొదటిసారి నేను వేడిగా ఆహారం తినడం…’ అని! రోజుకు మూడు నాలుగు రకాల పళ్లు తింటారు. ఇక చాక్లెట్లకయితే లెక్కేలేదు. మొత్తమ్మీద ఆహారం తక్కువగా ఎక్కువసార్లు తింటారు. మతం పట్ల పెద్ద పట్టింపు ఉండదు. దేవుణ్ని తిట్టినా ఏమీ అనుకోరు. క్రిస్మస్‌ గొప్పగా చేసుకుంటారు. అదిగాక సెయింట్‌ పాట్రిక్స్‌ డేను ఘనంగా చేసుకుంటారు. సాధారణంగా దానధర్మాలు ఎక్కువగా చేస్తారు. తోటి మనిషికి ఎంతయినా సాయం చేస్తారు. సునామీ వచ్చినప్పుడు చూడాలి… మాకు బయట విపరీతమైన మంచు, వాన భారీగా కురుస్తోంది. అయినా సునామీ బాధితులకు సాయం చేయడానికి క్రెడిట్‌ డెబిట్‌ కార్డులు, డబ్బులు పట్టుకొని క్యూలలో నిల్చున్నారు సాయం చేయడం కోసం. పచ్చని పర్యాటకం… ఏడాదికి 9-10 మిలియన్ల మంది పర్యాటకులు ఐర్లాండ్‌కు వస్తుంటారని అంచనా. వాళ్ల వల్ల సుమారు 2 బిలియన్‌ యూరోల వ్యాపారం జరుగుతుంది. ఐర్లాండ్‌ జనాభాలో ఎక్కువమందికి వ్యవసాయమే ప్రధాన వృత్తి. తర్వాత పాల పరిశ్రమ, చాక్లెట్ల ఉత్పత్తి. ముల్లంగి, బార్లీ, ఆలూదుంపలు, ఎర్ర దుంపలు, గోధుమ – విరివిగా పండే పంటలు. బీఫ్‌, పాల ఉత్పత్తులయితే పొంగిపొర్లుతూ ఉంటాయి. వేసవిలో 16-17 గంటలు వెలుగుంటుంది. శీతకాలంలో అలాగే చీకటి ఉంటుంది. వాటి ప్రకారం పనిపాటలకు సమయాన్ని అడ్జెస్ట్‌ చేసుకుంటాం. మా ఊళ్లోని డబ్లిన్‌ కేజిల్‌ చూసి తీరవలసిన ప్రదేశం. నార్మన్ల దండయాత్ర తర్వాత మరెవరికీ అవకాశం ఇవ్వకూడదని గొప్ప పటిష్ఠంగా 1230లో నిర్మించారా కోటను. స్పైర్‌ ఆఫ్‌ డబ్లిన్‌ (మాన్యుమెంట్‌ ఆఫ్‌ లైట్‌) కూడా తప్పక చూడాల్సిన ప్రదేశమే. చారిత్రక ప్రాధాన్యం దృష్ట్యా చూసినా, ప్రస్తుత కాలంలో విద్య, కళలు, ఆర్థికవ్యవస్థలకు కేంద్రంగా చూసినా ఐర్లాండ్‌లో డబ్లిన్‌ ప్రాధాన్యం చాలా ఉంది.

2 thoughts on “ఉంటే డబ్లిన్లోనే ఉండాలి….

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s