హోలీ హో భాయ్‌


మొన్న హోలీ పున్నమి రోజు సూపర్‌ మూన్‌ హడావుడి ఒకవైపు. సునామీ వస్తుందేమోనన్న అపోహలు మరొకవైపు. వీటిమధ్య తడబడుతూ విశాఖపట్నం రామకృష్ణా బీచ్‌కు వెళితే అంతా ఆశ్చర్యమే. పాదాల కింద నలుగుతున్నది సముద్రపు ఇసుక కాదేమో, రాజస్థాన్‌ ఎడారి ఇసుకేమో అని సందేహం. నిజంగా నేనున్నది తెలుగునాటనేనా, ఆంధ్రజ్యోతి ఆఫీసు దగ్గర ఆటో ఎక్కితే అరగంటలో అచ్చంగా రాజస్థాన్‌  థార్‌ ఎడారి సమీపంలోని గ్రామంలో దిగడం సాధ్యమేనా… ఏమీ అర్థం కాలేదు.

హోలీ రోజు మనం రకరకాల రంగులను పూసుకుంటాంగానీ, ఆ పున్నమి సాయంత్రం విశాఖపట్నం బీచ్‌ అంతా రాజస్థాన్‌ రంగులను పులుముకుంటుందని మీకు తెలుసా? రాజస్థాన్‌  నుంచి వృత్తివ్యాపారాల కోసం నగరానికి వలస వచ్చినవారు, ఎన్నో ఏళ్లుగా స్థిరపడిన వారు – ఎందరో హోలీ పౌర్ణమి సాయంత్రం కుటుంబాలతో సహా బీచ్‌కు చేరుకుంటారు. ఉన్న చెత్తను గబగబా ఏరి పారేస్తారు. ఇసుకలో ఒకచోట నీళ్ల కళ్లాపి జల్లి, రంగులతో ముగ్గులు పెట్టి ఎండుకట్టెలతో పెద్ద నెగడును సిద్ధం చేస్తారు. దానిమధ్యలో ఒక పచ్చటి కొమ్మను గుచ్చుతారు. సాయంత్రం ఆరు దాటుతుండగానే పిల్లాపెద్దా అందరూ బిలబిలా వస్తారు. ఆడవారి చేతుల్లో పూజాద్రవ్యాలున్న పళ్లేలు. పిల్లల చేతుల్లో మన భోగి దండల్లాంటి పిడకల దండలు. మరికొందరి చేతుల్లో రంగులు. మగవారందరూ గోధుమ కంకుల దుబ్బులు గుచ్చిన కర్ర లు పట్టుకొస్తారు. యువకులంతా పొడుగుపాటి బూందీ చట్రాలు, చిన్న స్టీలు బకెట్లు పట్టుకొని వచ్చేస్తారు. అందరూ చుట్టూ చేరి చీకటి పడగానే నెగడును వెలిగిస్తారు. పెద్ద మంటలు ఎగసిపడతాయి. స్త్రీలంతా అగ్నిహోత్రుడికి పూజలు చేసి బర్ఫీలు, తియ్యటి పదార్థాలను నైవేద్యంగా పెడతారు. పిల్లలు తాము తెచ్చిన దండలను మంటల్లో వేసి దండాలు పెట్టుకుంటారు. ఈలోగా యువకులు పోటీలు పడి జాగ్రత్తగా మధ్యలో ఉన్న ఆకుపచ్చటి కొమ్మను బైటికి లాగేస్తారు. మగవాళ్ల చేతిలో ఉన్న కర్రలకు కాస్త నిప్పు సెగ తగిలేలా నెగడు దగ్గరగా పెడతారు. అరగంట, గంటపాటు నెగడు పూర్తిస్థాయిలో మండి కాస్త తగ్గుముఖం పడుతుండగానే తాము తెచ్చిన బూందీ చట్రాల వంటివాటితో నిప్పులను లాగి వెంట తెచ్చుకున్న స్టీలు బకెట్లలో వేసుకుంటారు. వాటి మీద అప్పడాలు కాల్చుకుని తాము తిని తమవారికి ప్రసాదంలాగా పంచిపెడతారు.

అందరినీ కలవడమే వేడుక
హిరణ్యకశిపుడికి హోలిక అనే సోదరి ఉండేదట. మంటల్లో పడేసినా కాలిపోని వరం ఆమె సొంతం. కొడుకు ప్రహ్లాదుడు హరినామస్మరణ ఎంతకూ మానకపోయేసరికి అతన్ని పట్టుకొని మంటల్లో దూకమని హోలికను అన్నగారు హిరణ్యకశిపుడు ఆదేశించాడు. అయితే విచిత్రంగా హోలిక కాలిబూడిదయిపోతే పసివాడు ప్రహ్లాదుడు క్షేమంగా బయటపడ్డాడట. ఇదే రాజస్థానీయులు వేసే హోలీ మంటలోని అంతరార్థం. మధ్యలో పాతిన ఆకుపచ్చని కొమ్మ ప్రహ్లాదుడికి సంకేతం. అందుకే దాన్ని యువకులు బైటికి లాగేసి రక్షిస్తారు. ప్రహ్లాదుడి క్షేమం కోసమే అతివల పూజలు. ప్రహ్లాదుడు బైట పడగానే నోరు తీపి చేసుకునేది ఆ ఆనందానికే . మరి ఆ నిప్పుల మీద అప్పడాలు కాల్చుకుని తినడం ఏమిటి? “ఉత్తరాదిన చలిగాలులు హోలీ వరకూ ఉంటాయి. ఆ శీతల వాతావరణం వల్ల జనాల్లో గొంతు, శ్వాస సంబంధ ఇబ్బందులు వస్తుంటాయి. దాన్ని పోగొట్టడానికి ఈ నిప్పుల మీద మిరియాలు నిండిన అప్పడాలను కాల్చుకుని తినడాలు, పంచిపెట్టడాలూనూ” స్వచ్ఛమైన తెలుగులో చెప్పారు – స్థానికంగా పావ్‌భాజీ బండి నడుపుతున్న జగదల్‌. మరి కర్రకు చుట్టిన కంకుల మాటేమిటి? “గోధుమ కంకులు, ఆకుపచ్చ బఠానీల కొమ్మలను కర్రకు కట్టి తీసుకొస్తాం. ఈ వేడి సెగలో కాల్చి దాన్ని ఇంట్లో పూజగదిలో పెట్టుకుంటాం. ఈ గోధుమ గింజల్లాగా, ఆకుపచ్చని బఠానీల్లాగా సంతానం, సంపద వృద్ధి చెందుతాయని మా విశ్వాసం. ఈ కర్ర ఇలాగే ఏడాది పాటు ఉంటుంది. ఇది ఉన్న ఇంట్లోకి ఏ దుష్టశక్తులూ రావు” అని చెప్పుకొచ్చారు భగవాన్‌దాస్‌ బైశ్య. ఆయన విశాఖలో లైట్ల దుకాణం నడుపుతున్నారు. ఈ వేడుక కోసం ఆయన గోధుమ కంకులను ఏకంగా ఒరిస్సాలోని కటక్‌ నుంచి తెప్పించారు! “ఈ నెగడు మంటలు ఎటువైపు వెళుతున్నాయో పరిశీలించి ఆదిక్కున పంటలు బాగా పండతాయని నమ్ముతాం మేం” అంటూ వివరించారు హిరావత్‌. ఆయన కుటుంబం రాజస్థాన్‌ నుంచి వచ్చేసి యాభయ్యేళ్లు దాటిపోయింది. “మాకన్నా ముందు వచ్చినవారిని, ఈమధ్యనే వచ్చిన వారినీ అందరినీ ఇక్కడ కలవొచ్చు. పలకరించడానికి ఇంటింటికీ వెళ్లడం అయ్యే పని కాదుగదా…” అంటూ చెప్పుకొచ్చారు హిరావత్‌. తమ స్వగ్రామాల సమాచారం, తమవారి బాగోగుల గురించి కనుక్కోవడం, పాత పరిచయస్తులను పలకరించుకోవడం… ఒకటేమిటి, హోలీ పున్నమి సాయంత్రం వాళ్లంతా ఇక్కడ కలవడంలో ఎన్నో విశేషాలు. పూజ అని కాకపోయినా మాతృభూమికి ఎంతో దూరంలో తమవాళ్లన్న వారిని ఒక్కచోట కలుసుకోవడానికి ఎక్కువమందికి ఇదొక సందర్భం.

హోలీ హో భాయ్‌
“ఫాల్గుణ పౌర్ణమి నాడే లక్ష్మీదేవి సముద్రంలోంచి పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకనే సముద్రం ఒడ్డున ఆమెకు స్వాగ తం చెబుతూ పూజ చేస్తున్నాం” అని చెప్పారు మీనా అగర్వాల్‌. రాజస్థాన్‌ కళ్యాణ్‌పురలో పుట్టి పెరిగిన ఆమె ఈ పూజకు అన్నీ పొందిగ్గా సర్దుకుని వచ్చారు. “హోలికా దహనం అనేది రాజస్థాన్‌లో మాత్రమే కాదు, ఉత్తర భారత రాష్ట్రాలన్నిటా దాదాపు ఇలానే చేసుకుంటారు. బృందావనంలో అయితే ఈ వేడుకను చూసి తీరాల్సిందే మీరు” అంటూ ఊరిస్తూ చెప్పారు సత్యభామ. ఆమాట నిజమే అయుండాలి. ఎందుకంటే ఆ సాయంత్రం అక్కడ కనిపించింది ఎక్కువ రాజస్థానీయులే అయినా, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, బీహార్‌ వంటి ఎన్నో ప్రాంతాలవారు అందరూ కలిసికట్టుగా వేడుకలో పాల్గొన్నారు. ఈ సంరంభానికి తోడు రాజస్థానీ, బీహారీ, పంజాబీ జానపద గీతాలు మైకుల్లో హోరెత్తాయి. వాటికి అనుగుణంగా పిల్లాపెద్దా అందరూ కలిసి చేసిన నృత్యాలు హుషారును పెంచాయి. ఈలోగా ‘మార్వాడీ యువ మంచ్‌’ అక్కడికొచ్చిన ప్రతి ఒక్కరికీ తియ్యని బాదంమిల్క్‌ పంచిపెట్టింది. అది తాగుతూ, సుతారంగా రంగులు రాసుకుంటూ ‘హోలీ హో భాయ్‌’ అని పలకరిస్తూ… సూపర్‌మూన్ని చూసే తీరిక లేకుండా, సునామీ వచ్చినా లక్ష్యపెట్టేది లేదన్నట్టున్న జనాలే బీచ్‌ నిండా. ఈ సంరంభాన్నంతా మీ కళ్లతో చూద్దామనుకుంటే మాత్రం… వచ్చే ఏడాది హోలీ పండుగ వచ్చేవరకూ ఆగాల్సిందే. ఒక వేడుక కోసం వేచి చూడటమూ ఆనందమే కదా.
—————–
“ఈ దారాన్ని అగ్నిహోత్రునికి చూపించి ఇంటికి తీసుకెళతాం. ఏడాది పొడుగునా బంగారు తాడులో మంగళసూత్రాలను ఈ దారంతోనే కట్టుకుంటాం.”
– అర్చన అగర్వాల్‌

3 thoughts on “హోలీ హో భాయ్‌

  1. హోలిక కథ బాగుంది.
    తెలుగువారి పండగలని ఇతర ప్రాంతాలలో ఎవరైనా జరుపుకుంటున్నారాండీ? వాటిని గురించి కూడా తెలియజేస్తే సంతోషిస్తాం!

  2. సూపర్‌మూన్ని చూసే తీరిక లేకుండా, సునామీ వచ్చినా లక్ష్యపెట్టేది లేదన్నట్టున్న జనాలే బీచ్‌ నిండా. ఈ సంరంభాన్నంతా మీ కళ్లతో చూద్దామనుకుంటే మాత్రం… వచ్చే ఏడాది హోలీ పండుగ వచ్చేవరకూ ఆగాల్సిందే. ఒక వేడుక కోసం వేచి చూడటమూ ఆనందమే కదా.///

    🙂

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s