Spain సంగతులు కొన్ని

తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి ఇంటర్మీడియెట్‌ వరకూ శ్రీకాకుళంలో చదివిన బీర అశోక్‌ ప్రత్యేకతలు బోలెడన్ని. ఆయన ఫోటో జర్నలిస్టు, ట్రావెల్‌ రైటర్‌, అనువాదకుడు, ఇంగ్లిష్‌ అధ్యాపకుడు… అన్నిటినీ మించి ప్రపంచ యాత్రికుడు. దాదాపు అరవై దేశాల్లో విస్తృతంగా పర్యటించి విశేషమైన యాత్రానుభవాన్ని సొంతం చేసుకున్న అశోక్‌ గడచిన ఇరవయ్యేళ్లుగా స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు. ‘లైఫ్‌ అబ్రాడ్‌’ శీర్షికకు ఆ దేశం విశేషాలు చెప్పమని అడిగి ఇంటర్వ్యూ ముగిశాక అశోక్‌ లైఫ్‌ గురించి రాయాలా…. ఆయన  అబ్రాడ్‌ అనుభవం రాయాలా అన్న సందిగ్ధంలో పడిపోయానంటే నమ్మండి. ముందు ఆయన స్పెయిన్‌ గురించి చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే…

ఢిల్లీ జేఎన్‌యూలో ఎమ్మే స్పానిష్‌ పట్టా పుచ్చుకున్న తర్వాత నాకు స్పెయిన్‌ ప్రభుత్వం స్కాలర్‌షిప్‌ ఇవ్వడంతో 99లో అక్కడికి వెళ్లిపోయాను. స్పానిష్‌ ప్రపంచంలో అత్యధిక దేశాల్లో ప్రజలు మాట్లాడే భాష. యూరోపే కాదు, దక్షిణ అమెరికాలో చాలా దేశాల్లో స్పానిష్‌ అనర్గళంగా మాట్లాడతారు. ఒక్క బ్రెజిల్‌ మాత్రమే దీనికి మినహాయింపు. ఇక స్పెయిన్‌లో అధికార భాష స్పానిషే అయినప్పటికీ, పోర్చుగీస్‌, బాస్క్‌, వేలెన్సియన్‌, గాలిసియన్‌ వంటి భాషలనూ మాట్లాడేవారు కనిపిస్తుంటారు. పారిస్‌ నుంచి మాడ్రిడ్‌కు విమానంలో గంటన్నర ప్రయాణం. ఈక్వెడార్‌, కొలంబియా, మొరాకో, బ్రిటిష్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, డచ్‌, నార్వే దేశాలకు చెందిన వారున్నారుగానీ భారతీయుల సంఖ్య చాలా తక్కువ. మాడ్రిడ్‌ నగరంలో కనిపించే కొద్దిమంది భారతీయుల్లో ఎక్కువమంది సింధీలే. వాళ్లు ఇక్కడ ఎలక్ట్రానిక్‌ దుకాణాలను నిర్వహిస్తున్నారు. బైటకు చిన్న చిన్న షాపులే కనిపిస్తాయిగానీ, అక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. అలాగే వాళ్ల ఇళ్లు చూసినా రాజభవంతుల్లాగే అనిపిస్తాయి. వాళ్లు ‘ఇండియన్‌ అసోసియేషన్‌’ ద్వారా ధార్మిక కార్యక్రమాలకు విపరీతంగా డబ్బు ఖర్చు పెడతారుగానీ, భారతీయులెవరైనా కనిపిస్తే మాట్లాడటానికి మాత్రం కాస్త ముందువెనకాడతారు. ఇప్పుడిప్పుడే బంగ్లాదేశీయుల దుకాణాలు పెరుగుతున్నాయి. వాటినీ ‘ఇండియన్‌ స్టోర్స్‌’ అనే అంటారు వ్యవహారంలో. అక్కడ అన్నీ  దొరుకుతాయి. ఇస్కాన్‌ వాళ్లు కట్టిన కృష్ణ మందిరాలున్నాయి. వాళ్లు వీధుల్లో భజన చేస్తూ, భక్తి పారవశ్యంతో నాట్యం చేస్తూ వెళుతుంటే అక్కడివాళ్లు నిలబడి చూస్తారు, వాటిని సరదాగా ‘ఇండియన్‌ డిస్కో’ అనీ అంటారు. స్పెయిన్‌ 1986లో యూరోపియన్‌ యూనియన్‌లో విలీనమైంది. ఆ తర్వాత కూడా చాలాకాలం కరెన్సీగా పెసెటా ఉండేదిగానీ, 2002 జనవరి 1 నుంచి యూరోనే ఇక్కడకూడా చెలామణీలోకి వచ్చింది.

అప్పుడు నేను పోయాననుకున్నారు!
దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత లేనేలేదు గనక స్పెయిన్‌ ప్రత్యామ్నాయ వనరులను రూపొందించుకుంది. సౌరశక్తిని వినియోగించుకోవడంలో ఈ దేశం నెంబర్‌ వన్‌ అంటే నమ్మండి. అలాగే గాలిమరల ద్వారా విద్యుచ్ఛక్తిని తయారుచేయడంలోనూ స్పెయిన్‌ తిరుగులేని దేశమే. మాడ్రిడ్‌ నుంచి అన్ని ప్రధాన నగరాలనూ కలుపుతూ ఆరు హైవేలున్నాయి. మరో రెండేళ్లలో రోడ్ల మీద నడిచే ఎలక్ట్రిక్‌ కార్ల సంఖ్య పది లక్షలకు చేరుకోవాలన్నది స్పెయిన్‌ పెట్టుకున్న లక్ష్యం. అలాగే గంటకు 300 కి.మీ. వేగంతో నడిచే ట్రైన్లున్నాయి. మాడ్రిడ్‌లోని బరజాస్‌ ఎయిర్‌పోర్టు సామర్థ్యంలోనూ అందంలోనూ కూడా గొప్పది. 2004లో ఎన్నికల ముందు మాడ్రిడ్‌ లోకల్‌ రైళ్లలో మొదటిసారిగా ఉగ్రవాదులు బాంబులు పెట్టి దాడులు చేశారు. అందులో 191 మంది చనిపోయారు, దాదాపు రెండువేల మంది గాయపడ్డారు. అప్పుడు నేనక్కడ లేనుగానీ, అది నేనుండే ప్రదేశానికి చాలాదగ్గర. రోజూ నేనక్కడే రైలు పట్టుకుని వెళుతుంటాను. కొన్నాళ్లు నా ఫోను పనిచెయ్యకపోతే పోయినవాళ్ల జాబితాలో కలిపేసి స్నేహితులు కొందరు నాకు సంతాప సభలు కూడా నిర్వహించేశారట.

డిస్కోలకు క్యూలుంటాయి…
ఇక్కడ పిల్లలు ఆరేళ్ల నుంచి పదహారేళ్ల వరకూ చదువుకోవడం తప్పనిసరి, దాన్ని ప్రభుత్వం ఉచితంగానే అందిస్తుంది. ఎక్కువమంది చదువుకుంటారు. చెత్తను శుభ్రం చెయ్యడం వంటి పనులకు, రాత్రి పూట చేసే ఉద్యోగాలకూ ఎక్కువ జీతాలు వస్తాయి.  పంతొమ్మిదో శతాబ్దం తొలిరోజుల్లో ఫ్రాన్స్‌ దురాక్రమణ, సివిల్‌ వార్‌ వంటివాటివల్ల స్పెయిన్‌ ప్రజలు చాలా బాధలను అనుభవించారు. ముఖ్యంగా ఆడవాళ్లు. అప్పుడు తమకు జరిగిన అన్యాయాలకు బదులు తీర్చుకోవాలన్నట్టు ఉంటుంది వారి తీరు. ఆడవాళ్లు సిగరెట్లు తాగడం ఎక్కువగా కనిపిస్తుంది. అలవాటని కాదుగానీ, సమానత్వానికి అదొక చిహ్నంగా భావిస్తారు వాళ్లు. ఆడామగా తేడా లేకుండా అందరూ బాగా మాట్లాడతారు. అపరిచితులతోనయినా మాట కలపడానికి వెనకాడరు. సహజీవనం తక్కువ. అలాగని అదో వింత కూడా కాదు. వారంలో ఐదు రోజులు పని, రెండు రోజులు ఆటవిడుపు. అసలు శుక్రవారం ఉదయం నుంచే అందరిలో హాలిడే మూడ్‌ కనిపిస్తుంటుంది. శనివారం ఉదయం ఏడింటి నుంచే డిస్కోల దగ్గర యువత క్యూ కట్టి మరీ నిలుచుంటారు. ఈమ«ధ్య శుక్రవారం కూడా పూర్తి సెలవుగా ప్రకటించే ఆలోచన చేస్తున్నారు. ఇక ఇక్కడి నైట్‌ లైఫ్‌ ఎంత అద్భుతంగా ఉంటుందో కళ్లారా చూసి అనుభవించాల్సిందే తప్ప మాటల్లో చెప్పలేం. ముఖ్యంగా మాడ్రిడ్‌లో. అంత చిన్న దేశంలో బార్లు, కెఫేలు, రెస్టారెంట్లు అన్నీ కలిపి పద్దెనిమిది వేలున్నాయని అంచనా. మధ్యధరా సముద్రంలోని బాలెరిక్‌ దీవులు, అట్లాంటిక్‌ సముద్రంలోని కానరీ దీవుల సముదాయం స్పెయిన్‌ దేశానికి వింత శోభను ఇస్తాయి. ఇవిగాక ఎత్తైన పీఠభూములు, పర్వతాల పంక్తులు.. వాటినుంచి పల్లానికి ప్రవహించే నదులు – వీటన్నిటి పుణ్యమాని స్పెయిన్‌లో టూరిజమ్‌ పరిశ్రమ బాగా వర్థిల్లుతోంది. ఫ్రాన్స్‌ తర్వాత పర్యాటకులు ఎక్కువమంది వచ్చేది ఈ దేశానికే. ఎన్నో దేశాలు, ఎందరో ప్రభావితం చేసిన నేల గనుక ఇక్కడి సంస్కృతీసంప్రదాయాలు అన్నిటి కలబోతగా కనిపిస్తాయి. ఇటలీ తర్వాత ప్రపంచ వారసత్వ సంస్థ గుర్తించిన చారిత్రక ప్రదేశాలు ఎక్కువగా ఉన్నది స్పెయిన్లోనే.

అత్యుత్తమ పోర్క్‌….
సాధారణంగా స్పానిష్‌ ప్రజల ఆహారంలో సముద్ర ఉత్పత్తుల వాటా ఎక్కువ.రకరకాల మాంసం ఎక్కువగా తింటారు. తమ దేశంలో దొరికినంత శ్రేష్ఠమైన పందిమాంసం ప్రపంచంలో మరెక్కడా దొరకదని వారి విశ్వాసం. పోర్క్‌తో ఎన్ని రకాల వంటకాలు చేస్తారో వాళ్లు. బీఫ్‌ వినియోగమూ ఎక్కువే. అక్కడ శాకాహారం అంటే అన్నీ పచ్చివి తినెయ్యడమే అని అర్థం. అయితే సేంద్రియ పద్ధతుల్లో పండించే కూరగాయలన్నీ నవనవలాడుతూ ఉంటాయి. బీర్లు విపరీతంగా లాగిస్తారు. కాఫీ మనలానే పాలు కలుపుకుని తాగుతారు. అయితే వీరికి కాఫీ పంట లేదు, కొలంబియా నుంచి దిగుమతి చేసుకుంటారు. సూప్‌, శాండ్‌విచ్‌, ఏదో ఒక మాంసపు వంటకం, తర్వాత తీపి పదార్థం… సాధారణ భోజనం ఈ రకంగా ఉంటుంది. ప్రత్యేక సందర్భాల్లో బోలెడన్ని వంటకాలు చేసుకుంటారు. స్పానిష్‌ జనాల్లో ఎక్కువమంది క్రిస్టియన్లే, ఇప్పుడిప్పుడే ముస్లిముల సంఖ్య పెరుగుతోంది. కమ్యూనిస్టులమని, చాలా అభ్యుదయ దృక్పథం ఉందని బాహాటంగా చెప్పుకొనేవారు కూడా బాప్టిజమ్‌, కన్ఫర్మేషన్‌, పెళ్లి సందర్భాల్లో చర్చి మెట్లెక్కకుండా ఉండరు. దేశంలో ఎక్కడా జాతి, రంగు వివక్ష కనిపించదు. జిప్సీల జీవన శైలి మాత్రం వేరేగానే ఉంటుంది.

ఆటలూ పాటలూ
స్పానిష్‌ జనాలకు ఫుట్‌బాల్‌ అంటే ఇష్టం కాదు, పిచ్చి. ముఖ్యంగా మాడ్రిడ్‌ – బార్సిలోనా జట్ల మధ్య ఫుట్‌బాల్‌ ఉందంటే చాలు – మైదానమంతా నిండిపోతుంది. ఇదివరకు ఇండియా పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరుగుతున్నప్పటి వాతావరణం ఉంటుంది దేశంలో. రెండు జట్ల అభిమానులూ ఫలితం కోసం చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తారు. మొన్న ఫిఫా వరల్డ్‌ కప్‌ను గెల్చుకున్నది స్పెయినే కదా. ఇక్కడ జరిగే ఎడ్లు, దున్నపోతుల పోరాటాలను చూసి తీరాల్సిందే. 1992 ఒలింపిక్స్‌కు బార్సిలోనా వేదికయినప్పటి నుంచీ దేశంలో వివిధ ఆటల పట్ల ఆసక్తి పెరిగింది. బాస్కెట్‌బాల్‌, టెన్నిస్‌, సైక్లింగ్‌, హ్యాండ్‌బాల్‌, మోటార్‌సైక్లింగ్‌ వంటివాటితో పాటు ఈమధ్యే ఫార్ములా వన్‌ రేసింగ్‌ పట్ల కూడా జనాలు మొగ్గు చూపుతున్నారు.   అప్పట్నుంచే ప్రభుత్వాలు కూడా జలక్రీడలు, గోల్ఫ్‌, స్కీయింగ్‌ వంటివాటికి ప్రత్యేకంగా సదుపాయాలు కల్పించాయి. చెప్పడం మర్చిపోయా, ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్‌ స్టార్‌ రఫెల్‌ నాదల్‌ స్పెయిన్‌ దేశస్తుడే. 2010లో అతను వింబుల్డన్‌ విజేతగా నిలబడిన తీరును క్రీడాభిమానులెవరైనా మరిచిపోగలరా? ఒక్కమాటలో చెప్పాలంటే స్పెయిన్‌ ఒక ఆటల కేంద్రంగా తయార యింది. మన దగ్గర గడ్డం పెంచుకుంటే పిచ్చాడిలాగా చూస్తారేమోగానీ, స్పెయిన్‌లో గడ్డం ఉందంటే ‘మీరు ఆర్టిస్టా’ అని అడుగుతారు. పికాసో ఇక్కడివాడే కదా. స్పెయిన్‌లో దాదాపు నూటయాభై ప్రొఫెషనల్‌ ఆర్కెస్ట్రా – సింఫనీ బృందాలున్నాయి. యూరప్‌లో వచ్చిన అనేక కళా ఉద్యమాలకు స్పెయిన్‌ పుట్టినిల్లంటే అతిశయోక్తి కాదు. సంగీత పరికరం గిటార్‌ ఇక్కడే పుట్టిందని ఒక నమ్మకం. ప్రాంతాన్ని బట్టి రకరకాల జానపద సంగీతాలు వినిపిస్తాయి. అన్నిటిలోనూ ‘ఫ్లెమెంకో’ ఎక్కువ పేరు తెచ్చుకుంది. పాప్‌, రాక్‌, హిప్‌హాప్‌… అన్నిటినీ ఆదరిస్తారు యువత. స్పెయిన్‌లో ప్రతియేటా వేసవిలో నిర్వహించే సంగీత ఉత్సవాలకు దేశదేశాల నుంచి సంగీతాభిమానులు వస్తుంటారు. మిగేల్‌ దె సెర్వాంతెస్‌ రాసిన ‘డాన్‌ కి హోటే’ మొదటి ఆధునిక నవలగా పేరు గడించిన సంగతి సాహిత్యాభిమానులకు గుర్తు చేయనవసరం లేదు. రాయల్‌ స్పానిష్‌ అకాడమీ ప్రపంచవ్యాప్తంగా స్పానిష్‌ భాషకు చెందిన వ్యవహారాలను చూస్తుంటుంది.”

————————————————–

బహుముఖ ప్రజ్ఞ….
స్పెయిన్‌లో మరో పీజీ కూడా పూర్తి చేసిన అశోక్‌ స్పానిష్‌ నుంచి ఇంగ్లిష్‌కూ, ఇంగ్లిష్‌ నుంచి స్పానిష్‌కూ కూడా అలవోకగా అనువాదాలు చేయగలరు. స్పానిష్‌లో చిన్న కథలు రాస్తున్నారు. ‘ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా’ పేరిట టూరిజం శాఖ చేపట్టిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ఫోటోలతో ఆయన రూపొందించిన కాఫీటేబుల్‌ పుస్తకం పేజీలను అలాఅలా తిప్పి చూడండి…. తెలుగుదనంలో అప్పటివరకూ దాగున్న అందమేదో అకస్మాత్తుగా మనకు పరిచయమవుతుంది. విదేశాల్లో భారతీయతను పరిచయం చేస్తూ ఆయన నిర్వహించే ఫోటో ప్రదర్శనలకు ప్రత్యేక అభిమానులున్నారు. అరవైకి పైగా దేశాల్లో పర్యటించి అశోక్‌ రాసిన యాత్రా కథనాలు దేశవిదేశీ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. స్పానిష్‌, ఇంగ్లిష్‌ వంటి పది పన్నెండు భాషలను అనర్గళంగా మాట్లాడగలిగిన చాతుర్యమూ ఆయన సొంతం.

2 thoughts on “Spain సంగతులు కొన్ని

  1. బాగుంది పరిచయం….

    చిన్న ప్రశ్న – ఆయనకు స్కాలర్షిప్పు ఇచ్చాక 99లో అక్కడికి వెళ్లిపోయారని అన్నారు…..మరి పైన పేరాలో గత ఇరవై ఏళ్ళుగా మాడ్రిడ్లో స్థిర నివాసం అంటున్నారు…..అర్థం కాలా…..స్కాలరుషిప్పు ఇవ్వక ముందు నుంచీ అక్కడే ఉన్నారా అన్నది తెలియలా….

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s