జెనరేషన్‌ యువ

‘మీరిచ్చే ఒక్క రూపాయి వారిని ఎంత నాశనం చేస్తుందో మీకు తెలుసా? ఒక్క రూపాయి వారిని భవిష్యత్తు గురించి ఆలోచించనివ్వదు. అదే వారిని రేపటికొక దొంగగానో, ఒక మాఫియా సభ్యుడిగానో మారుస్తుంది. ఆ ఒక్క రూపాయివల్లే గాంగ్‌స్టర్స్‌కు వారిని ఒక పావులాగా వాడుకుంటారు..’
ఎవరి గురించి ఈ ఉపోద్ఘాతం?
మన గురించే. బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లలో, సిగ్నల్‌ లైట్ల దగ్గర మురిగ్గా కనిపిస్తూ దీనాతిదీనంగా అడుక్కునే చిన్న పిల్లలను చూసి మనం వేసే ఒక్క రూపాయి గురించి. ‘మీకు నిజంగా కరిగే మనసు, సాయం చెయ్యాలనే ఆలోచన ఉంటే వారికి డబ్బులు ఇవ్వకండి. మీరిచ్చే చిల్లర వారికి ఉపయోగపడదు సరికదా జీవితాంతం వారిని చిల్లర మనుషులుగానే బతికేలా చేస్తాయి…’ అంటున్నారు ‘జెనరేషన్‌ యువ’ సభ్యులు. బాల యాచకులను ప్రోత్సహించవద్దంటూ విశాఖపట్నంలో వారు చేస్తున్న కార్యక్రమాలు గొప్ప స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి.

“మీకు తెలుసా, మన దేశంలో ఏడాదికి దాదాపు ఎనిమిది లక్షల మంది పిల్లలు కనిపించకుండా పోతున్నారు. వీళ్లలో మగపిల్లలు శాశ్వతంగా బిచ్చగాళ్లుగా మారిపోతుంటే ఆడపిల్లలు వ్యభిచార గృహాలకు తరలిపోతున్నారు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మనది కాదా” అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నిస్తున్నారు ‘జెనరేషన్‌ యువ’తరంగాలు. “బాల యాచకులకు మీరు వేసే ఒక్క రూపాయి వారికి సులువుగా బతకడాన్ని అలవాటు చేస్తుంది. పైన చెప్పిన అన్ని అనర్థాలకు మీరే కారణం” అని సూటిగా చెబుతూ వారు పంచుతున్న కరపత్రాలు, చేస్తున్న పాదయాత్రలు సామాన్యుల్లో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. “మేమేదో దీన్ని సేవ అనుకోవడం లేదు. రేపటి పౌరుల పట్ల మనకు ఉండితీరాల్సిన బాధ్యత ఇది” అంటూ కాస్త తీవ్ర స్వరంతోనే పదుగురినీ తట్టిలేపుతున్నారు వాళ్లు.

ప్రారంభం ఇక్కడ
ఒక ఇంజినీరింగ్‌ కాలేజీలో చదువుతున్నప్పుడు రాకేశ్‌కు తనకన్నా రెండేళ్లు సీనియర్‌ అయిన నరేశ్‌తో పరిచయమైంది. ఇద్దరివీ ఒకటే భావాలు. ఆదివారం వ స్తే ఇద్దరూ అనాధాశ్రమాలకు వెళ్లడం, అక్కడ పిల్లలకు పాఠాలు చెప్పడం వారితో మాట్లాడటం వంటివి చేసేవారు. తమలాగే ఇంకా చాలామందికి ఇలా ఏదో ఒకటి చేయాలన్న ఆసక్తి ఉందని గమనించిన వాళ్లిద్దరూ ‘జెనరేషన్‌ యువ’ను ప్రారంభించారు. విశాఖను బాల యాచకులు లేని నగరంగా తయారు చేయాలన్నది వారి లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి ఆదివారం బీచ్‌, రైల్వేస్టేషన్‌, బస్‌ కాంప్లెక్స్‌ వంటి ప్రదేశాల్లో పాదయాత్రలు నిర్వహిస్తూ నినాదాలు చేస్తూ బాల యాచకులను ప్రోత్సహించవద్దని కరపత్రాలు పంచిపెడతారు. వారం పొడుగునా తాము ఎక్కడ ఏ పని మీద తిరుగుతున్నా రోడ్డు పక్కన కనిపించే చిన్నపిల్లలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. వారితో మాట్లాడి, నెమ్మదిగా వివరాలు తెలుసుకుని వారిని ఆ వృత్తి నుంచి తప్పించే ప్రయత్నాలు మొదలుపెడతారు.

రాత్రీపగలూ వారితో ఉండాలి….
బాల యాచకులను ఆ పని మాన్పించి సరైన దారిలో నడిపించడం అంత సులువైన పనేం కాదు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మరెక్కడో కొత్త ప్రాంతంలో యాచకులుగా అవతారం ఎత్తుతారు పిల్లలు. రైల్వేస్టేషన్లు, బస్టాండుల్లో ఇలాంటివారు కనిపించగానే తమవైపు తిప్పుకొనే ‘సీనియర్లు’ కొందరుంటారు. యాచన అలవాటు చేయడానికి ముందు వారు బాలలకు మత్తు పదార్థాలను అలవాటు చేస్తారు. కొన్నిసార్లు హింసిస్తారు. నెమ్మదిగా అడుక్కోవడం అలవాటయ్యాక చిన్నపిల్లలకు రోజుకు రెండుమూడొందల రూపాయల సంపాదన ఉంటుంది. దాంతో మూడుపూట్లా బిరియానీ, చికెన్‌ వంటివి తినడం, మత్తు పదార్థాలను సేవించడం, సినిమాలు చూడటం – ఇలా జల్సాగా గడిపేస్తుంటారు. వారిని తీసుకొచ్చి ఏదైనా సంరక్షణ కేంద్రంలో పెడితే అక్కడ క్రమశిక్షణకు, మామూలు ఆహారానికి వారు అలవాటు పడలేక పాత బతుకే బావున్నట్టనిపించి పారిపోతుంటారు. “అలాంటి అనుభవాలు మాకెన్నో ఉన్నాయి. మాతో ఉంచుకుని వారికి మంచీచెడూ చెప్పిన కొన్ని రోజులు పర్లేదు. తర్వాత ఏదైనా హోమ్‌లో చేర్పించగానే పారిపోయారు కొందరు పిల్లలు. అలాంటివారిని మళ్లీ పట్టుకుని అడిగితే – అక్కడ తిండి బాగాలేదని, సంరక్షకులు కొందరు పనిచేయిస్తారు తప్ప బడికి పంపడం లేదని, కొడతారని చెబుతుంటారు…” అంటున్నారు జెనరేషన్‌ యువ రాకేశ్‌రెడ్డి. కొంతమంది తల్లిదండ్రులే తమ పిల్లలను యాచనలోకి ప్రోత్సహిస్తారు. అలాంటివారిని మాన్పించడం ఇంకా కష్టం. “మీరు పనిలోకి తీసికెళితే మహా అయితే మూడు వేలిస్తారు నెలకి. అదే మా బాబు అడుక్కుంటే నెలకు ఎనిమిది వేల పైనే వస్తాయి. మాకిదే బాగుంది…” అంటూ తల్లిదండ్రులే జెనరేషన్‌ యువ సభ్యులను తిప్పి కొట్టేస్తుంటారు. “అలాంటి పెద్దవాళ్లున్నప్పుడు మా పని చాలా కష్టమవుతుంది. ఇక అక్కడక్కడా దొరికిన బాలయాచకులను మామూలు దారిలోకి తేవాలంటే చాలా ఓపిక ఉండాలి. వారిని కొట్టకూడదు, తిట్టకూడదు. ముందు చాలా కథలు చెబుతారు. నిజంగా మనం మంచి చేస్తామన్న నమ్మకం కుదిరేకనే అసలు వారి వివరాలేంటో చెబుతారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా తాము గడిపి వచ్చినది చెడు పంథా అని వారికి అర్థమయేలా చెప్పాలి. మంచి జీవితం కోసం వేరే దారిలో వెళ్లాలన్న స్ఫూర్తి వారిలో కలిగించాలి. ఏదో ఒకసారి మొక్కుబడిగా ఓ గంట మాట్లాడేస్తే వారు మారిపోతారనుకోవడం అవివేకం. కొన్ని వారాలు, నెలల పాటు వారితో సన్నిహితంగా గడపాలి..” అనే నరేశ్‌ బృంద సభ్యులు చెప్పినదాన్ని పాటిస్తారు. తాము ఎంతో ప్రయాస పడి వేరే వసతి గృహాలకు చేర్పించిన పిల్లలు పారిపోవడం గమనించిన వారు స్వయంగా ఒక హోమ్‌ నిర్మాణానికి పూనుకున్నారు.

పర్యావరణ ప్రియం.. స్వావలంబనం…
ఇటుపై తాము తీసుకొచ్చే బాలలకు వారికి ఎందులో ఆసక్తి ఉంటే ఆ రంగంలో ప్రోత్సహించాలని నరేశ్‌ బృందం అనుకుంటోంది. ‘రోడ్డు పక్కన దొమ్మరి విద్యలు ప్రదర్శించేవారు, సర్కస్‌ కంపెనీల నుంచి పారిపోయి వచ్చిన బాలలకు జిమ్నాస్టిక్స్‌ బాగా వంటపడతాయి. మరికొందరికి క్రికెట్‌ బాగా వస్తుంది. అందరికీ చదువులోనే ఆసక్తి ఉండాలనేం లేదుకదా. ఎవరికి పట్టుబడే విద్యలో వారిని ప్రోత్సహించాలి…” అంటున్నారు సంస్థ సభ్యుడు సాల్మన్‌. జనరేషన్‌ యువలో ప్రస్తుతం పదిహేను వందలమంది సభ్యులున్నారు. అందువల్ల వేరే ఎవరిదగ్గరా విరాళాలు చందాలు స్వీకరించాల్సిన అవసరం లేకుండా గడుస్తోంది. అయినా తమకంటూ ఒక ఆదాయ మార్గం ఉండాలని భావించిన జెనరేషన్‌ యువ విశాఖ శివారు ప్రాంతం పెందుర్తిలో ఒక కుటీర పరిశ్రమగా కాగితం తయారీని నిర్వహిస్తోంది. చేత్తో చేసిన కాగితానికి డిమాండు పెరుగుతుండటంతో ఆర్డర్ల మీద విక్రయాలు ఊపందుకున్నాయి. ఇదిగా, కాగితంతో రకరకాల వస్తువులు తయారుచేసి నగరంలో హైవే మీద ‘గ్రీన్‌ హౌస్‌’ అనే దుకాణంలో పెట్టి అమ్ముతున్నారు. గృహాలంకరణ సామగ్రి, ఆభరణాల పెట్టెలు, మొబైల్‌ స్టాండ్లు… ఎన్నో రకాల వస్తువులు – అన్నీ కాగితంతో చేసినవే కనిపిస్తాయక్కడ. వాటిని  తయారుచేస్తున్నది కూడా యాచక వృత్తి మానేసినవారే. హోమ్‌ నిర్మాణ పనులను కూడా వారు దగ్గరుండి చూసుకుంటున్నారు.ఇదిగాక ‘జెనరేషన్‌ యువ’ సాయంతో ఒక కుర్రాడు ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, గ్రూప్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. మరో అమ్మాయి డిగ్రీ చదువుతోంది. ప్రతి ఊళ్లోనూ విద్యార్థులు తమలాగా బృందంగా ఏర్పడితే బాల యాచక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించవచ్చని, ఎందరో పిల్లల జీవితాలను తీర్చిదిద్దవచ్చని జెనరేషన్‌ యువ సభ్యుల భావన. అది నిజమవాలని కోరుకుందాం.

———————————
“చాలా కాపుకాసి రైల్వే స్టేషన్లో బాలలకు మత్తుపదార్థాలను అలవాటు చేస్తున్న వ్యక్తి ఎవరో తెలుసుకుని పోలీసులకు పట్టించాం. కానీ ఇదంతా పెద్ద మాఫియా అన్న విషయం మాకు అర్థమయింది. పరిస్థితుల కారణంగానో, తప్పిపోయి వేరే ప్రాంతాలకు చేరుకునే పిల్లలను యాచకులుగా మార్చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతుంటాయి. వాటిని ఎదుర్కోవాలంటే మనం కూడా అంతే తీవ్రంగా, కలిసికట్టుగా పనిచేయాలి…”
– రాకేశ్‌, జెనరేషన్‌ యువ.

విశాఖనగరంలో పేరు మోసిన సంపత్‌ వినాయక గుడి ఎప్పుడూ భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. పోలియో కారణంగా చచ్చుబడిన కాళ్లను చూపిస్తూ ఒకప్పుడు అక్కడ బిచ్చమెత్తుకున్న నరసింహ ఇప్పుడు కాగితం తయారీలో చెయ్యి తిరిగిన మనిషిగా మారాడు.

తనకే గుర్తులేని పరిస్థితుల్లో చెన్నై నుంచి తప్పిపోయి ఏడేళ్ల క్రితం విశాఖకు చేరుకున్న విజయ్‌ బిజీ ప్రాంతాల్లో అడుక్కుంటూ చెడు అలవాట్లతో కాలం గడిపేవాడు. జెనరేషన్‌ యువ సభ్యులు నింపిన స్ఫూర్తితో ఇప్పుడు కాగితంతో నిత్యజీవితంలో పనికొచ్చే ఎన్నో రకాల వస్తువులను తయారు చేయడంలో గొప్ప నేర్పు చూపిస్తున్నాడు.

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s