ప్రత్యేక స్కూలుకు సాయం చెయ్యండి

“ప్రపంచ జనాభాలో మూడు శాతం మంది బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నారు.  వాళ్లకు చేయూతనందించాలనేదే మా లక్ష్యం…” అంటూ చెబుతున్న ఉషాదేవి మాటల మనిషి కాదు. ఆంధ్రా యూనివర్సిటీలో, అమెరికాలోనూ ప్రొఫెసర్‌ గా పనిచేసి, లక్షల రూపాయల సంపాదనను వదులుకొని బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలకోసం అనకాపల్లిలో ‘ఆశ్రయ్‌ధామ్‌ మనోవికాస కేంద్రా’న్ని  నిర్వహిస్తున్న చేతల మనిషి. ఒంటి మీది బంగారాన్ని తాకట్టు పెట్టి, ఉంటున్న ఇంటి మీద అప్పు తెచ్చి మరీ ఆమె ఆ స్కూలును నిర్వహిస్తున్న తీరు గమనిస్తే మన కళ్లలో కన్నీరు తొణుకుతుంది. ఆశయసాధనలో ఆమెకు ఎదురవుతున్న అనుభవాలను తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది.

ఎమ్మెస్సీ మ్యాథ్స్‌, ఎమ్మెస్సీ సైకాలజీ, ఎంబీయే, ఎమ్‌ఈడీ, పీహెచ్‌డీ… ఇన్ని చదివిన ఉషాదేవికి తాను పుట్టిపెరిగిన అనకాపల్లి అంటే అలవిమాలిన అభిమానం. అమెరికాలో పనిచేస్తున్నప్పుడు కూడా సొంతూరికి ఏదైనా చేయాలన్న ఆలోచనే. బంధువుల్లో ఒక పాప బుద్ధిమాంద్యంతో జన్మించడం, ఆమెను పెంచడానికి వారు పడుతున్న అవస్థలూ దగ్గర్నుంచి గమనించాక ‘ఆశ్రయ్‌ధామ్‌ స్కూల్‌ ‘ ఆలోచన ఉషాదేవిలో మొగ్గతొడిగింది. కుటుంబసభ్యుల సహకారంతో అది ఒక రూపానికి వచ్చింది. అలాంటి పిల్లలను తమ స్కూలుకు పంపమని, వారికి తగిన శిక్షణనిస్తామ, అంతా ఉచితమేనని ఊరంతా పోస్టర్లు వేశారు, కరపత్రాలు పంచారు. మొదట్లో స్పందించింది కొద్దిమందే. “స్కూలుకు తీసుకురావడం వరకే వారి పని. మేం చేసేదంతా ఉచితమే. దేనికీ డబ్బులు తీసుకోం. మేం వ్యాను పంపిస్తే పిల్లలను పంపుతాం అన్నారు కొందరు, రోజూ బిడ్డ రానూపోనూ రిక్షా కూడా కుదర్చలేని అశక్తులు మరికొందరు..” అని ఆరేళ్ల కిందట తమ స్కూలు ప్రారంభాన్ని గుర్తు చేసుకున్నారు ఉషాదేవి. కొత్తలో స్కూలువాళ్లే రెండు రిక్షాలు నడిపేవారు. ఇప్పుడు ఈ స్కూల్లో నలభై ఐదుమంది పిల్లలున్నారు. వీరికోసం ముగ్గురు టీచర్లు, ఇద్దరు ఆయాలూ పనిచేస్తున్నారు. మరో పదిహేనుమంది ఇల్లు కదిలి బయటకు రాలేని పిల్లల కోసం మరో ముగ్గురు టీచర్లు సంచార సేవలందిస్తున్నారు.

శాపగ్రస్తుల పట్ల చిన్నచూపా?
“బుద్ధిమాంద్యులైన పిల్లల పట్ల సమాజ ధోరణి చాలా అవమానకరంగా ఉంటుంది. ‘పిచ్చి పిల్లలు’ అని ముద్ర వేసి వెక్కిరిస్తారు. పోషించలేని తల్లిదండ్రులను అర్థం చేసుకోవచ్చు. కానీ కొందరు మంచి ఉద్యోగస్తులు, ఆస్తిపరుల ఇళ్లలో కూడా ఇటువంటి పిల్లలకు సరైన ఆదరణ లభించదు. తమ బిడ్డలకు బుద్ధిమాంద్యం ఉందని నలుగురికీ తెలియకూడదని వాళ్లను ఒక గదిలో పెట్టి తాళం వేసుకుని ఉద్యోగాలకు వెళ్లిపోయేవారున్నారు. వాళ్లను ఏమనాలో తెలియదు. ఇక చదువులేని తల్లిదండ్రులు, సంపాదన అంతంతమాత్రమే అయినవారికి ఇలాంటి బిడ్డలుంటే ఎలా చూస్తారో ఊహించండి. ఒక బిడ్డ మామూలుగా ఉండి, మరో బిడ్డకు బుద్ధిమాంద్యమున్న ఒక కుటుంబంలో మంచి పిల్లవాడికి అన్నం, ఆమ్లెట్‌ అన్నీ పెట్టిన తల్లి… బుద్ధి ఎదగని పిల్లవాడికి పాచిపోయిన అన్నం పెట్టి క్యారేజీ ఇచ్చిన సంఘటనలు మేం చూశాం….” అంటూ చెబుతున్నప్పుడు ఉషాదేవి ముఖం జేవురించింది. “పేర్లు రాస్తే మామీదకు తగువుకొస్తారమ్మ. అంచేత రాయకండిగానీ, ఈ ఊళ్లోనే ఇద్దరు అన్నాచెల్లెళ్లున్నారు. ఇద్దరూ ఇటువంటి బిడ్డలే. ఎనిమిదేళ్లుంటాయేమో. ఇంట్లోనే రెండు తలుపులకూ ఇద్దర్నీ కట్టేస్తారు. దగ్గర్లో అన్నం పెట్టేసిన రెండు గిన్నెలు, నీళ్ల చెంబులూ. వాటికి అటువైపే రెండు గోతాలు పరిచేస్తారు. ఒకటీరెండూ… ఏటి చేసినా ఆటి మీదే. ఈళ్లకి బట్టలేసినా దండగేనని అవి కూడా ఎయ్యరు. ఆ పిల్లలిద్దరూ అలాగే వీధి వరండాలో పడి ఉంటారు. అక్కడే తిండీ, అక్కడే అన్నీ. పొద్దున పనుల్లోకెళ్లిన అమ్మానాన్నా సాయంత్రం తిరిగొచ్చేదాకా అదే సీను. మనిళ్లలో కుక్కలు నయవమ్మ… ఆ పిల్లల్ని సూస్తే కళ్ల నీళ్లు తిరుగుతాయి…” అంటూ చెప్పుకొచ్చింది ఆశ్రయధామ్‌ స్కూల్లో పిల్లల సంరక్షణ చూస్తున్న ఆయా. “ఎంతెంత జీతాలిచ్చినా వీళ్ల ఋణం తీరదండీ. అన్నీ చక్కగా ఉన్న పిల్లలను చూడటానికే తల్లిదండ్రులు, టీచర్లువిసుక్కుంటున్న రోజులివి. అయినా మా ఆయాలు విసుక్కోకుండా పిల్లల అవసరాలన్నీ చూసుకుంటారు. వాళ్లను పువ్వుల్లాగా ఉంచుతారు. టీచర్లు కూడా అంతే. పిల్లలకు పాఠాలను ఎంత ఓపిగ్గా నేర్పిస్తారో చెప్పలేను. డబ్బులిచ్చి వారిలో సేవాదృక్పథాన్ని పెంచలేం. అది ఉన్న టీచర్లు, ఆయాలను మరింత బాగా చూసుకోవడానికి నాకు శక్తి ఉంటే బాగుండును….” అనుకుంటున్నారు ఉషాదేవి.

సేవను కొనలేం…
ఆమాట నిజమే. ఆశ్రయ్‌ధామ్‌లో ఇద్దరు టీచర్లు, ఇద్దరు ఆయాలు పడుతున్న శ్రమ ఆ పిల్లల తీరులో ప్రతిఫలిస్తూ మనకు కనిపిస్తూనే ఉంటుంది. సుప్రియ, శ్రీదేవి, యదునందన్‌, ఆకాశ్‌, నితిన్‌, ప్రభు మహేశ్‌, జ్యోతి… ఇలా ఎందరో శుభ్రంగా, చెప్పినవన్నీ నేర్చుకుంటూ ముచ్చటగా కనిపిస్తారక్కడ. పిల్లలు అనుకోవడమేగానీ, నిజానికి వీళ్లలో కొందరి వయసు ముప్ఫైకి పైనే. నోటినుంచి చొంగ కారడాన్ని ఆపడం, ఒంటి మీద దుస్తులుంచుకోవడాన్ని నేర్పించడం, మలమూత్రాదులను విడిగా చేసేలా శిక్షణనివ్వడం, శారీరక శుభ్రతను పాటించేలా చూడటం, తిండి సరిగా తినేలా శిక్షణనివ్వడం వంటివి చెయ్యడానికే స్కూలు సమయంలో ఎక్కువ సరిపోతుంది. కొందరికి ఫిజియోథెరపీ కూడా అవసరమవుతుంది. తర్వాత కొన్ని నెలలకు రంగులను, ఆకారాలను గుర్తించడం, తోటివారితో మెలగడం వంటివి చెబుతారు. తర్వాత అంకెలు, అక్షరాలను నేర్పిస్తారు. కొందరు పిల్లలు పాటలకు అనుగుణంగా డ్యాన్సులు కూడా చెయ్యగల స్థాయికి చేరుకున్నారు. ఆశ్రయ్‌ధామ్‌ తన కాళ్ల మీద తాను నిలబడ్డం కోసం కాస్త పెద్ద పిల్లలు, టీచర్లు కలిసి ఫినాయిల్‌, డిటర్జెంట్‌ పొడి, కొవ్వొత్తులు వంటివి తయారుచేస్తున్నారు.

అడ్డుకునేది అవినేతే…
ఆశ్రయధామ్‌ను విస్తరించే ఆలోచన లేదా? “ఉంది. అయితే ప్రతి పనికీ లంచాలు అడ్డు తగులుతున్నాయి. కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లోనే కాదు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ కింద ఒక పెద్ద సంస్థ కొన్ని నిధులు ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడి హెచ్‌ఆర్‌ మేనేజర్‌ తనక్కొంత వాటా ఇస్తే ఆ డబ్బు మా స్కూలుకిచ్చేలా చూస్తానని బేరం పెట్టాడు. మేం ఆశ్చర్యం నుంచి తేరుకునేలోగా మరో సంస్థకు అవి మంజూరైపోయాయి.. ఇదేకాదు, కేంద్రం నుంచి నిధులు రావాలన్నా లాబీయింగ్‌ చెయ్యడం, చేతులు తడపడం తప్పవని మాకు అర్థమయింది… అనకాపల్లిలో పిల్లల బాగోగులు చూస్తానా, ఢిల్లీ వెళ్లి ఇలాంటి వ్యవహారాలు చేస్తానా?” అని అడుగుతున్న ఉషాదేవి అనుభవాల నుంచి అవినీతి విశ్వరూపం అర్థమవుతుంది. అలాగని ఆమె నిరాశ పడటం లేదు. నెలకు ఈ స్కూలు నడపడానికి పాతిక వేలు ఖర్చవుతుంది. ‘నెలకు వెయ్యి ఇవ్వడం నాకు కష్టం కాదు’ అంటూ ఉద్యోగి ఒకరు ముందుకొచ్చారట. అలా పాతికమంది వస్తే గట్టెక్కిపోతాం కదా..’ అంటున్నారు ఆశ్రయధామ్‌ ఉద్యోగులు. ఇగ్నో విశ్వవిద్యాలయానికి పాఠాలు రాయగా వచ్చే మొత్తాన్నంతా స్కూలు నిర్వహణకే వెచ్చిస్తున్నారు ఉషాదేవి. అది సరిపోక తల్లి నుంచి వచ్చిన బంగారం తాకట్టు పెట్టారు, ఉంటున్న ఇంటి మీద అప్పు చేశారు. ఎన్నాళ్లిలా… అంటే “ఇప్పటివరకూ నేను ఎవర్నీ నిధుల కోసం అడగలేదు. ఇకపై మాత్రం సాయం స్వీకరించాలనే అనుకుంటున్నాను. ఎవరు చేసినా చెయ్యకపోయినా నేనున్నంత వరకూ ఈ స్కూలు నడుస్తుంది. నడిపిస్తాను. దీన్ని వదిలేసి వెళ్లలేను…” అనే దృఢమైన సమాధానం వచ్చింది ఆమె నుంచి. చిన్నచిన్న సాయాలతో సామాన్యులే ఇప్పటివరకూ చేయూతనందించి నిలబెట్టిన ఈ స్కూలు ఇంకొంతమంది బుద్ధిమాంద్య బాలలకు ఆసరా కావాలంటేమనలాంటివారే సాయం చెయ్యాలి.

For Complete details click here

If you want to donate :

Name of the Bank : State Bank of India
A/c Holder Name : Sreya Foundation
A/c Number : 30284245738
Payable at Branch : Pedda Waltair
City : Visakhapatnam
Advertisements

One thought on “ప్రత్యేక స్కూలుకు సాయం చెయ్యండి

  1. అరే, ఇది లేటుగా చూసాను నేను. నిజం. దేవుడు మాత్రం దేవుడా చెప్పు, అని నిట్టూర్చే క్షణాలు, నాకీ జీవితాలు.

    మీక్కానీ, ఈ సంస్థకి కానీ, ఐ సి ఐ సి ఐ బ్యాంకు అకౌంట్ ఏమన్నా ఉందా అండీ? అదయితే నాకు సులువుగా ఉంటుందీ, లేదూ అంటే వాళ్ళు డిడి పంపుతారనుకుంటాను. అది సమ్మతమయితే చెప్పండి. నెలకు పాతికవేలు ఖర్చవుతుందని అన్నారు. అంతివ్వలేనేమో ఇప్పుడు కానీ, పదివేలివ్వగలను. అది ఎలా పంపాలో నా ఈమెయిల్ ఐడి మీ బ్లాగులో వస్తుందనుకుంటాను, దానికి ఈమెయిల్ చేయగలరు.

    మీ కృషి కూడా ప్రశంసనీయం.

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s