ఠాగూర్ స్మృతిలో…

అశేష జన గణానికి మంగళం కలగాలని ఆశించిన విశ్వకవి రవీంద్రుడి 150 వ జయంతి ఇవాళే. ఆయన జీవితాన్ని, కవిత్వాన్ని, చిత్రలేఖనాన్ని గుర్తు చేస్తూ ‘సంస్కృతి యాత్ర’ పేరుతో ఏడాదిపాటు పట్టాల మీద నడిచిన ‘మ్యూజియమ్’ను మీరు సందర్శించారా? లేకపోతే ఇప్పుడు చూడండి…’కవిగురు రవీంద్రునికి ఇది మా నివాళి’ అంటూ భారతీయ రైల్వే ఒక ప్రత్యేక రైలుకు రూపకల్పన చేసింది. దాని పేరే ‘సంస్కృతి ఎక్స్‌ప్రెస్’.

కిందటేడాది మేలో ఠాగూర్ 150 వ జయంతి వేడుకల సందర్భంగా కోల్‌కతాలో మంత్రి మమతా బెనర్జీ పచ్చజెండా ఊపి దీన్ని ప్రారంభించారు. మొదటి కోచ్ ‘జిబోన్ స్మృతి’లో రవీంద్రుని కుటుంబ సభ్యుల ఫోటోలు, వారితో ఆయన అనుబంధాన్ని తెలిపే చిత్రాలే కాకుండా, శాంతి నికేత న్‌లో ఆయన అనుభవాలను తెలియజేసేవీ ఉంటాయి. ఈ చిత్రాలను తిలకిస్తున్నప్పుడు రవీంద్ర సంగీతం మంద్రంగా వినిపిస్తూ ఉండే ఏర్పాటూ ఈ కోచ్‌లో ఉంది. రెండో కోచ్ గీతాంజలిలో నోబెల్ బహుమతి గెల్చుకున్న గీతాంజలి, వివిధ భాషల్లో వచ్చిన దాని అనువాదాలు వంటివాటిని చూడొచ్చు. మూడో కోచ్ ముక్తధారలో రవీంద్రుని చిన్న కథలు, నవలలు, నాటికలు, వ్యాసాల గురించి తెలుసుకోవచ్చు. మహాత్మాగాంధీ వంటి మహామహులతో విశ్వకవి జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో కొన్నిటిని ఇక్కడ ప్రదర్శించారు. ఇక్కడే తన సహాయకుడు అమియ చక్రవర్తికి ఆయన రాసిన ఉత్తరంలో కొన్ని వాక్యాలు మనల్ని కదిలిస్తాయి. “నా చిన్నతనం నుంచి నేనెంతగానో ఆధారపడిన నా దగ్గరి బంధువొకరు ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో నా కాళ్ల కింది భూమి కదిలిపోయిన ట్టు, ఆకాశంలో వెలుగు మాయమైపోయినట్టు అనిపించింది. ఈ సంఘటన నుంచి నేనొక విషయాన్ని నేర్చుకున్నాను. జీవితాన్నెప్పుడూ మరణమనే గవాక్షం నుంచే వీక్షించాలి. అదే పరమ సత్యం…” అని. నాలుగో కోచ్ చిత్రరేఖ. ఇందులో రవీంద్రుని చిత్రాలు, పోర్ట్రయిట్లు, స్కెచ్‌లు కొలువై ఉన్నాయి. నందలాల్ బోస్, సుధీర్ దస్తగిర్ వంటి ఇతర ప్రముఖ కళాకారుల చిత్రాలనూ చిత్రరేఖ ఇముడ్చుకుంది. చివరి కోచ్ శేషకథ. ఇది రవీంద్రుని కడపటి దినాల గురించి తెలియజేస్తుంది. ఈ ఐదు ఏసీ కోచ్‌లకు తోడు, శాంతినికేతన్‌లో తయారైన హస్తకళా వస్తువులతో కూడిన ‘స్మరణిక’ అనే బోగీని కూడా ఈ రైలుకు తగిలించారు.

మానవాళి పట్ల నమ్మకం
‘దేశమంతా ఏడాది పాటు తిరిగే మొబైల్ మ్యూజియమ్’ అనే ఆలోచనకే దక్షిణపు గాలి మా జీవితంలో ప్రవేశించినట్టయింది. రైల్వే మంత్రి మమతా మాకు అనుమతిచ్చేనాటికి ఇంకొక్క నెలే సమయం ఉంది. ప్రఖ్యాత చిత్రకారులు జోగేన్ చౌధురి దీని రూపకల్పనకు కావలసిన సలహాలనిచ్చారు. ఐదు బోగీల్లో విశ్వకవి వివరాలు ఏమేం పెట్టాలనేది పెద్ద చర్చ. రవీంద్రనాథ్ ఠాగూర్ కేవలం కవి మాత్రమే కాదు. రచయిత, తాత్వికుడు, విద్యాప్రదాత, సామాజిక కార్యకర్త, చిత్రకారుడు… ఇలా ఎన్నో. ఆయనలోని అన్ని ఛాయలనూ పరిచయం చేసేలా ఈ ప్రదర్శన రూపొందింది..” అంటూ చెప్పుకొచ్చారు రైల్వేలో ‘హెరిటేజ్ అండ్ కల్చర్’ విభాగం అధ్యక్షురాలు సవోలీ మిత్రా.

ప్రకృతిని పరిరక్షిస్తూ దాని ఒడిలోనే మానవ జీవితం సాగాలన్న గొప్ప సందేశాన్ని అందించారు రవీంద్రులు. ఆయన తన జీవితకాలంలో రెండు ప్రపంచ యుద్ధాలను చూశారు. అలాగే తన వ్యక్తిగత, సాంఘిక జీవితాల్లోనూ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ‘మనిషి అన్ని అవరోధాలనూ జయించి తన నాగరికతలో స్వచ్ఛతను నిలబెట్టుకుంటాడు. మానవాళి పట్ల నమ్మకాన్ని పోగొట్టుకోవడం పెద్ద నేరం’ అనేదే రవీంద్రుని విశ్వాసం. దాన్ని ఈ రైలు దేశం నలుమూలలా చాటిచెప్పింది.

Advertisements

One thought on “ఠాగూర్ స్మృతిలో…

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s