నేనేం చెయ్యాలి? మీరయితే ఏం చేస్తారు?

ఆరేళ్లు నిండిన మా అబ్బాయి ఒక ఇంగ్లిష్‌ మీడియమ్‌ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఈమధ్యే ఒకరోజు సాయంత్రం నాలుగున్నరకు ఇంటికొచ్చేసరికి కుడికన్నంతా భయంకరమైన ఎరుపు రంగులోకి మారి ధారాపాతంగా నీరు కారుతోంది. కంగారు పడుతూ ‘ఏమైంది నాన్నా’ అని అడిగితే వాడు చెప్పుకొచ్చాడు. ‘ఉదయం స్కూలు బస్సు దిగి క్లాస్‌రూమ్‌లోకి వెళుతున్నప్పుడు ఏదో రెక్కల పురుగు ఎగురుతూ వచ్చి నా కంట్లో దూరి కుట్టేసి బయటకు పోయింది. అప్పటి నుంచీ చాలా నొప్పిగా ఉంది. ఇలా నీరు వస్తూనే ఉందమ్మా. నేను కన్ను తెరిచి చూడలేకపోతున్నాను. ఎవరైనా డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లమ్మా. చాలా నొప్పేస్తోందమ్మా’ అంటూ బావురుమన్నాడు. యూనిఫామ్‌ కూడా మార్చకుండానే ఒకసారి మొహం కడిగి దగ్గర్లోని పిల్లల వైద్యుడి దగ్గరకు తీసుకెళితే ఆయన కంట్లో వేసే చుక్కల మందొకటి, వేరే టాబ్లెట్‌ ఇచ్చారు. ఇంటికొస్తూ వాడినడిగాను – ‘నాన్నా, ఉదయం నుంచీ నొప్పిగా ఉండి, నీరొస్తూ  ఉంటే నువ్వు టీచర్‌కెందుకు చెప్పలేదు? ఆవిడకు చెబితే స్కూల్లోనే ఏదో మందు వేసుండేవాళ్లు. లేదంటే  నాకు ఫోన్‌ చేస్తే ఉదయమే నిన్ను స్కూలు నుంచి తీసుకొచ్చేసి డాక్టర్‌కు చూపెట్టేదాన్ని కదా…’ అప్పుడు ఆ పసివాడు చెప్పిన సమాధానం వినండి – ‘ఉదయం టీచర్‌ చూశారమ్మా. వై ఆర్యూ క్రైయింగ్‌ బేటా? గో అండ్‌ వాష్‌ యువర్‌ ఫేస్‌’ అంటూ టాయిలెట్‌కు పంపించారు. రెండుమూడుసార్లు వాష్‌ చేసుకున్నా నొప్పి తగ్గలేదు. ఆవిడేమో వాట్‌ హేపెండ్‌ అని తర్వాత బిజీగా అయిపోయారు. నాకేమో పురుగు కుట్టిందని ఇంగ్లిష్‌లో ఎలా చెప్పాలో తెలియలేదమ్మా. అమ్మా, నువ్వు చెప్పు, ‘నా కంట్లో పురుగు కుట్టి పారిపోయింది, చాలా నొప్పెడుతోంది’ అని ఇంగ్లిష్‌లో ఎలా చెప్పాలి? ఇప్పుడు నువ్వు చెబితే నేర్చుకుంటాను, మరోసారెప్పుడైనా అలా అయినప్పుడు ఉపయోగపడుతుంది కదా. అయినా స్కూళ్లన్నీ  అమెరికావా అమ్మా? ఎందుకు అన్ని స్కూళ్లలోనూ ఇంగ్లిషే మాట్లాడతారు? ప్లీజమ్మా నన్ను తెలుగు  స్కూల్లో వేసెయ్యమ్మా. అక్కడయితే హాయిగా తెలుగే మాట్లాడుకోవచ్చు’ అని వాడు  చెబుతున్నప్పుడు నాకు దుఃఖం ఆగలేదు.  దాదాపు ఆరేడు గంటలపాటు ఆ పసివాడు అనుభవించిన వేదనను తలచుకుని, సమస్య వికటించి చూపు కోల్పోతాడేమోనన్న భయమూ కలగలిసి నా దుఃఖం వరదగా మారింది. ఆ మునిమాపు వేళ నడిరోడ్డు మీదే నేను దేవుడా అంటూ వెక్కివెక్కి ఏడవడానికి ఏ మీడియమూ అడ్డు రాలేదు. అది తెలుగు కాదు, ఇంగ్లిష్‌ కాదు. ఒక తల్లి  ఆవేదన అంతే. ఆరేళ్ల బాలుడే కాదు, ఈ క్షణాన ఇది చదువుతున్న పాఠకుల్లో ఎంతమంది ‘నా కంట్లో రెక్కల పురుగేదో దూరి పారిపోయింది’ అని ఇంగ్లిష్‌లో చెప్పగలరు? రెండు రోజుల సపర్యల తర్వాత మావాడి కన్ను మళ్లీ మామూలయింది. ఆ రెండు రోజులూ నేనెంత బాధననుభవించి ఉంటానో ఏ తల్లీదండ్రీ అయినా సులువుగానే అర్థం చేసుకోగలరు.

తెలుగు మీడియంలోకి మార్చమని మా అబ్బాయి అడిగినదాన్ని నేను తేలిగ్గా తీసుకోలేదు. ప్రైవేటు తెలుగు మీడియం స్కూళ్లేవీ ఉండవని ఇప్పటికే అనుభవమయింది గనక, ఇంటికి దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలలకు వాణ్ని తీసుకుని వెళ్లాను. రెండు మున్సిపల్‌ స్కూళ్లనూ చూసి ‘ఛీ యాక్‌’ అన్నాడు. అక్కడి పిల్లలతో కలిసి ఒక గంటయినా గడపలేకపోయాడు. ‘ఏంటమ్మా స్కూళ్లిలా ఉన్నాయి’ అంటూ వెనుదిరిగాడు. నేను పదో తరగతి పాసయింది ఒక పల్లెటూరి తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలలోనే. ఊరంతటికీ ఒకటే స్కూలు. ఆర్థిక సామాజిక అంతస్తులతో నిమిత్తం లేకుండా అందరూ అక్కడే చదువుకునేవాళ్లం. ఈ ఆలోచనతో నేను పుట్టిన ఊళ్లో, చుట్టుపక్కల మరికొన్ని ఊళ్లలో తెలుగు మీడియం స్కూళ్ల గురించి వాకబు చేస్తే నాకు పిచ్చేమో అన్నట్టు చూశారు. తెలుగు మాధ్యమంలో మా పిల్లవాణ్ని చదివించాలంటే నాకేపాటి నైతిక – సామాజిక మద్దతు లభిస్తుందో తెలిసొచ్చింది. అంతవరకూ ఎందుకు? ఒక తల్లోతండ్రో తమ పిల్లలను ఇలా చదివిస్తామంటే కుటుంబంలో మిగిలిన సభ్యులు అంగీకరిస్తారా?

ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు లేకపోవడాన్ని, అరకొర సిబ్బందితో విద్యావలంటీర్లతో ఆ  స్కూళ్లు నడుస్తున్న వైనాన్ని, ప్రభుత్వోపాధ్యాయులను ప్రభుత్వమే బోధనేతర కార్యకలాపాల్లో ఉపయోగించడం గురించి, గ్రామాల్లో సైతం వీధికొకటిగా పుట్టుకొస్తున్న ఇంగ్లిష్‌ మీడియమ్‌ బడుల గురించి వివరించి కొందరు గవర్నమెంటు టీచర్లే  ‘పిచ్చి ఆలోచనలు మానుకో’మన్నారు నన్ను. “నువ్వు చదివినప్పుడున్నట్టు లేవు గవర్నమెంటు స్కూళ్లు. ఈ పది పదిహేనేళ్లలో ఆ పాఠశాలల్లో మధ్యతరగతి వాళ్లెవరూ పిల్లలను చదివించని పరిస్థితి ఏర్పడింది. అంతెందుకు, మా టీచర్లే వాళ్ల పిల్లలను పొరుగున ఉన్న పట్నాల్లో పెట్టి చదివిస్తున్నారు. పొట్ట గడవక, కూలీనాలీ చేసుకునే పేదల పిల్లలు మాత్రమే ‘తప్పక’ ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు! మారుమూల పల్లెటూళ్లలో కూడా ఇంగ్లిష్‌ మీడియమ్‌ లేదన్న కారణంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల అడ్మిషన్లు ఏటికేడూ తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితిని నివారించడానికి ప్రభుత్వం ఏ ఆలోచనలు చేస్తోందో తెలియడం లేదు… మొత్తమ్మీద చదువులో రాణించడం విద్యార్థి సొంత బలమే తప్ప, అతనికి సాయపడే పరిస్థితులేవీ లేవు” అంటూ ముగించారు వాళ్లు.

ఇంగ్లిష్‌ మీడియమ్‌ ఒక ప్రవాహం. ఆ వాలుకు పోవడమే తప్ప ఏటికి ఎదురీదడం కుదిరే పని కాదని అర్థమయింది.  ఇంతాచేసి కనీసం పదోతరగతి దాకానైనా తెలుగు మీడియంలో చదువు చెప్పిస్తే రేప్పొద్దున్న  పెద్దవాడయ్యాక ‘తెలియక చిన్నప్పుడేదో అన్నాననుకో. ఎందుకమ్మా నా జీవితంతో ప్రయోగాలు చేశావు’ అంటాడేమో మా అబ్బాయి!

ఏ భాష అయినా భావవ్యక్తీకరణ కోసమే అని ‘సరిగ్గా  చదువుకున్న’వాళ్లెవరయినా చెబుతారు. ఆ భాషా సామర్థ్యం, భావవ్యక్తీకరణ పటిమ పెరగడానికి కుటుంబం, పాఠశాలా దోహదం చెయ్యాలి. కానీ మన దౌర్భాగ్యవశాత్తూ రెండూ ఆ పని చెయ్యడం లేదనిపిస్తోంది. మీరు గమనించి చూశారో లేదో, ఈమధ్య ఇంటర్మీడియెట్‌ ఆపైన చదువుతున్న విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పుడు వాళ్లు రాస్తున్న లేఖలన్నీ ‘తెంగ్లిష్‌’లోనే ఉంటాయి. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న పరిస్థితుల గురించిన చర్చను పక్కకు పెడితే, చావ బోతున్న దైన్యానికి తోడు, మనసులోని ఆవేదనను మాతృభాషలో అయినవారికి విపులంగా విన్నవించుకోలేకపోవడం మరింత దైన్యం కాదా? పోనీ, ఏ పేరున్న కాలేజీలోనో ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన ఒక కుర్రాణ్నో కుర్రదాన్నో పిలిచి సరదాకి ఒక చక్కని, అందమైన ప్రేమలేఖ రాయమని అడిగి చూడండి. మనసుకు హత్తుకుని, అవతలివారు ముసిముసి నవ్వుల్లో మునిగి తేలగల హృద్యంగా వాళ్లు తెలుగులోనూ రాయలేరు, ఇంగ్లిష్‌లోనూ రాయలేరు. యువతరం ఇచ్చిపుచ్చుకునే ఎస్సెమ్మెస్‌లు, ఈమెయిల్స్‌, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్లు, బ్లాగులు…. వేటిని చూసినా భావ వ్యక్తీకరణకు నేర్చుకున్న భాష ఏదీ ‘సరిపోని’ వైనం సులువుగా అర్థమవుతుంది.

భాష వేరు, మాధ్యమం వేరు అన్న స్పష్టత బాగా చదువుకున్నవారిలోనే లేనప్పుడు సామాన్యులకు ఉండాలని ఆశించడం అత్యాశే కావొచ్చు. అసలు అక్షరమే అందని దీనస్థితిలో ఉన్న బాలలు ఒకవైపు, మాతృభాషలో విద్యాభ్యాసం చేసే హక్కును పోగొట్టుకున్న బాలలు ఇంకొందరు. వెరసి ఈ దేశంలో రేపటి పౌరులు. ఎవరికీ ఏదీ పట్టని విచిత్రమైన వేగంలో కొట్టుకుపోతున్న పెద్దలు.  ఏం చేద్దామంటారు?

17 thoughts on “నేనేం చెయ్యాలి? మీరయితే ఏం చేస్తారు?

 1. నేను ఇలాంటి సందర్భాలు ఎన్నో ఎదుర్కొన్నాను. మా పెద్దబ్బయిని (మొదటి తరగతి) ఎదైన సమస్య ఉండి వాల్ల మేడం తో చెప్పమనప్పుడు, కచ్చితంగ నేను రావలని పట్టుపడుతాడు.. ముక్యంగా ఏదైన అనారోగ్యం నుండి తేరుకొనీ, స్కూల్ కి వెల్లినప్పుడు, అవసరమైన జాగ్రత్తలు చెప్పినప్పుడు (ఒకవేల కడుపు నొప్పి మల్లి వస్తే, ఫివరిష్ గా అనిపిస్తే మీ మేడం కు చెప్పు అన్నప్పుడు) , తను తన మేడం కి చెప్పడానికి ఇబ్బంది పడిపోవడం. కచ్చితంగ మనం తనతో వెల్లడమో, లెటర్ పంపించాల్సివస్తుంది. ఎందుకా అని అలోచిస్తే అర్దమైన విశయం ఏంటంటే వాడు ఇంగ్లిష్ లో చెప్పలేక ఇబ్బంది పడడమే. నా రెండో అబ్బయి తో మరో ఇబ్బంది. తను అపార్ట్మెంట్లో కెల్ల ఎక్కువగా మాట్లాడే వాడు. తన ప్రశ్నలకు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడాల్సిందే. కాని తను స్కూల్ లో అసలు ఎవరితో మాట్లాడడని ఫిర్యాదు. ఎందుకంటే తనకు మొదటి నుండి ఇక్కడ మాట్లాడడం అలవాటు అయిపొయి అక్కడ అల్లగే మాట్లదితే తనను “డిస్కరేజ్” చేసారు. తెలుగు లో మాత్లాడడం తప్పని, తప్పని సరిగా ఇంగ్లిష్ లో నే మాట్లాడాలని హితవు. మమల్ని పిలిచి మరి మాకు “క్లాస్”, ఇంట్లో ఇంగ్లిష్ మాట్లాడమని సలహ. మా వాడి సహజ ఉత్సుకత నాశనం చేయడం ఇష్టం లేక, వాల్ల మేడం చెప్పిన సలహ పక్కన పెట్టాం.

 2. మీ వాడి పరిస్థితి చూసి జాలి వేసింది.

  యు ఎస్ లోనే అనుకుంటా జరిగిన ఒక ఘటన గుర్తుకువచ్చింది. ఆరు ఏడేళ్ళ పాప తన స్కూల్ టీచరుకి తన తల్లి మరణించింది అని చెప్పింది. అలాంటి జోకులు వెయ్యొద్దు అని టీచరు సున్నితంగా మందలించింది. 4,5 రోజులు ఆ పాప స్కూలుకి వస్తూనే వుంది. ఎంత ప్రయత్నించినా ఫోనులో తమ కూతురు అందుబాటులోకి రాకపోయేసరికి వెళ్ళి చూసిన ఆ పాప తాత, అమ్మమ్మలకి అప్పుడు గానీ విషయం తెలియలేదు. ఈ విషయం ఎవరికి ఎందుకు చెప్పలేదు అంటే మా టీచరుకి చెప్పాను కానీ అలాంటి జొకులెయ్యొద్దు అని అన్నదని చెప్పింది. ఆ తరువాత ఆ స్కూల్ యాజమాన్యం ఆ టీచరుకి కౌన్సిలింగ్ ఇచ్చారు.

  మీ సంఘటన తరువాత మీరు మీ స్కూల్ యాజమాన్యంతో గానీ, ఆ టీచరుతో గానీ మాట్లాడారా? ఏమన్నారు? అలాంటి విషయాలు గమనించే నేర్పు, ఓర్పు టీచర్లకి వుండాలి. ఈ విషయం బ్లాగులోనే కాకుండా పత్రికల్లో, టివిల్లొ వచ్చేలా చూస్తే మిగతావారందరినీ ఎజుకేట్ చేసినట్లు వుంటుంది. నేను ప్రస్థావించిన సంఘటన పత్రికల్లో రావడం వల్ల అది చదివిన ఉపాధ్యాయులందరికీ పిల్లలు అలాంటి విషయాలు చెప్పినప్పుడు పట్టించుకోవాలని తెలిసివచ్చేవుంటుంది.

 3. Aruna- chala baaga raasaru. Maa generation nunche ee confusion start ayndi. Naa thoti vaaru, chaala mandi telugu raadu ante, naaku sigguga untundi. Kaani em chestam. adi fashion! kaani america lo nenoka vichitrm chustunna. pratee telugu vaarintlo, pillalaku, compulsory ga telug nerpistaaru! mari adi emi vichitramo!

 4. మీరడిగిన రెండు ప్రశ్నలకీ నా దగ్గర సమాధానం లేదు…చాలా మంది దగ్గర వుండకపోవచ్చు. మీరు రాసిన దానితో నూటికి నూరుపాళ్ళు ఏకీభవిస్తున్నాను అని చెప్పటం కన్నా చెయ్యగలిగినది ఏవిటోనూ తెలియదు. ఇన్నాళ్ళూ నా తర్వాత తరం లో ఎవ్వరికీ తెలుగు సరిగ్గా మాట్లాడ్డం…(చదవడం రాయటం ఎప్పుడో కొండెక్కిపోయాయి) చూసి తెలుగు భాష అంతరించిపోతోందని బాధపడ్డాను కాని ఈ సమస్యకి ఇంకో రూపం కూడా వుందని ఇవాళే అర్ధమయ్యింది. ఈ సమస్య కేవలం communication problem అని మాత్రం అనిపించటంలేదు. ఆ teacher, ఆ విద్యాసంస్థ నిర్లక్ష్యం కనపడుతోంది. పిల్లాడికి చెప్పటం చేతకాకపోవచ్చు. చిన్నపిల్లల్ని వాళ్ళని నమ్మి పంపిస్తున్నాము అంటే కేవలం చదువు చెప్పామా అన్నదొక్కటేకాదు, వాళ్ళకి వచ్చిన (కనీసం ఇంతలా కనపడుతున్న) ఇబ్బందుల్ని కూడా తెలుసుకుని తగిన సమయానికి జాగ్రత్త తీస్కుంటారనే కదా…

 5. మీరయితే ఏంచేస్తారు అంటున్నారు కదా అందుకే నా అభిప్రాయం చెప్తున్నాను.మా అబ్బాయి L.K.G ఉన్నప్పుడు డిస్‌లెక్సీక్ అవ్వడం చేత అక్షరాలు అనీ తిరగేసి రాసేవాడు.కొద్ది రోజుల తరువాత వాడికి స్కూల్ కి వెళ్ళడానికి భయంవేసి నేను వెళ్ళను అనేవాడు. ఎందుకు నాన్న అని అడిగితే టీచర్ నేను అక్షరాలు సరిగ్గ రాయలేదని కొట్టింది. నాకు సరిగ్గా రాయడం రావడం లేదు నేను పోను అన్నాడు. నేను వాళ్ళ టీచర్ కి చెప్పాను మా పిల్లాడు స్కూల్ కి రావడానికే భయపడుతున్నాదు. ఇంత భయపెట్టి మీరు చదువు చెప్పడం వల్ల ఎంత ఉపయోగముంటుందో నాకు తెలీదు. మీరు భయపెట్టకుండా చెప్పగలిగినంత చెప్పండి, వాడికి అది రాలేదు ఇది రాలేదు అన్న కంప్లైంట్ ఎప్పుడూ చెయ్యను స్కూల్ అంటే భయపపడేట్టు మాత్రం చెయ్యకండి అని చెప్పాను. ఆ రోజు నుండి మావాడు స్కూల్ అంటే భయపడలేదు ఇప్పుడు చాలా ఇష్టంగా వెళ్తాడు.

  నా ఉద్దేశంలో టీచర్ల మీద కూడా తల్లిదండ్రుల వత్తిడి బాగా ఉంటుంది. మా పిల్లలకు ఫలానా సబ్జెక్ట్ రావడం లేదు, ఇంగ్లిష్ లో మాట్లాడడం రాదు ఇలా ఏవేవో కంప్లైంట్స్ ఉంటూనే ఉంటాయి. ఈ వత్తిడితోనే స్కూల్లు కూడా పిల్లల మీద వత్తిడి పెడుతుంటాయి. అలాగని నేను స్కూల్లను సమర్థించడం లేదు.ఎక్కువ శాతం స్కూల్లు ఇలాగే ఉంటాయి. స్కూల్లలో మార్పు రావాలంటే తల్లిదండ్రులుగా మనం ప్రశ్నించడం నేర్చుకోవాలి. డబ్బు కట్టేది మనం అయినప్పుడు మనకు కావలసిన విధంగా ఉండాలని అడగడంలో తప్పు లేదు కదా?
  మీరు స్కూల్లో మీ అబ్బాయి జరిగినదాన్ని గురించి మాట్లాడారా? మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు?

 6. ఏం చెప్పాలో తెలియట్లేదండీ….మీరన్న ప్రతి మాటా నూటికి నూరుపాళ్ళు నిజం…
  హైదరాబాద్ విమానాశ్రయంలో ఒక్క తెలుగు బోర్డూ కనబడదు “హైదరాబాదు విమానాశ్రయము” అని తెలుగులో రాయటానికే మనవాళ్ళకు నామోషీ అయిపోయింది !

 7. హ్మ్ నాకు భయం లాంటి బెంగేదో కలుగుతోంది…భవిష్యత్తులో ఏమేమి చూడాలో, ఏమేమి పడాలో :((((

  మీరు ప్రస్తావించిన అంశం బావుంది. పిల్లలు అటు ఇంగ్లీషులోనో, ఇటు తెలుగులోనో సరి అయిన భావ వ్యక్తీకరణ చెయ్యలేకపోతున్నారన్నది సత్యం. పోనీ ఇంగ్లీషులో వారి మనసులో మాటలను సవ్యంగా చెప్పగలిగితే బానే ఉంటుంది, అదీ కుదరట్లేదు. ఈ భాషా సామర్ధ్యాన్ని (వీలైతే రెండు భాషల్లోనూ) పెంపొందించడంలో తల్లిదండ్రులే ఎక్కువ కృషి చెయ్యాలేమో అనిపిస్తున్నాది. స్కూల్లో టీచర్లకి సాధ్యం కాకపోవచ్చు. ఉరుకుల పరుగులతో ఇంజనీరింగ్, IIT కోచింగుల వెంట పడకుండా చక్కని భాషని వారి సొంతం చేసేందుకు తల్లిదండ్రులు చిన్నప్పటినుండీ కృషి చెయ్యాలి. వారికి తెలుగు, ఇంగ్లీషు రెంటి యొక్క మాధుర్యం, అవసరం తెలిసేలా ఎక్కువ పుస్తకాలు చదివే అలవాటు చెయ్యాలి. ఇది ఏమంత పెద్ద కష్తమేమీ కాదు కాస్త వారితో సమయం గడపగలిగితే చాలు. మొదట్లో కొంత ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. వారికి రుచి తెలిసాక ఇక మనం వద్దన్నా వారు వదలరు. మనకున్న ఒకే ఒక్క పిల్ల/పిల్లాడి కోసం ఆ మాత్రం మనం చెయ్యలేమా! ఇది తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయం. ఇది నా అభిప్రాయం మాత్రమే!

 8. అరుణా..చదువుతుంటే కళ్ళవెంట నీళ్ళొచ్చేసాయండి…
  చెప్పలేని అసక్తత మీ బాబుదయితే..
  అంత చిన్న పిల్లవాడు అసలు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసుకునేంత తీరికలేని టీచరమ్మ!
  ప్రభుత్వ స్కూల్సు అలా తయారవటానికి తిలా పాపం తలా పిడికెడు లాగా..వాటి గురించి ఆలోచించటం కూడా అనవసరం. మనం ఏమన్నా చేద్దామన్నా అందరం ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న వాళ్లమే..ప్రవాహానికి ఎదురీదలేం.
  ఇంటి దగ్గర మీరే చక్కగా తెలుగు నేర్పండి. అంతకన్నా ఇప్పటి పరిస్థితులల్లో మనం చేయకలిగిందేమీ లేదు.
  స్కూలులో కనీసం సెకండ్ లాంగ్వేజ్ అన్నా తెలుగు ఉండేట్టు చూసుకోండి.
  ఇంట్లో ఖచ్చితంగా పూర్తిగా తెలుగులోనే మాట్లాడాలన్న నిబంధన పెట్టుకోండి.
  బాబు చేత అమ్మమ్మ, నాయనమ్మ.. తాతలకి..దగ్గర బంధువులకి తెలుగులో ఉత్తరాలు వ్రాయించండి.
  తెలుగు పుస్తకాలు చదివించండి.
  చిన్న చిన్న పదాలు ఇచ్చి కథలు..వ్యాసాలు వ్రాయమనండి.
  ఇవన్నీ మీకు తెలియదని కాదు కానీ గాయపడ్డ మీ మనస్సుకి కాస్త స్వాంతన అంతే!

 9. అరుణ గారు,

  మీ టపా చదివాక చాలా చాలా కాలం తర్వాత, ఒక పది నిమిషాలు ఆలోచిస్తూ గడిపాను. కొద్ది సేపు నోట మాట రాలేదు. మా పిల్లలు కూడా ఈ విధం గా కొద్దిగా కష్టపడ్డారు. (ముఖ్యం గా రెండో అమ్మాయి. దానికి ఊహ తెలిసేటప్పటికి ఇండియా లో ఉంది. ఇంట్లో మేమంతా తెలుగే మాట్లాడటం.. ) చుట్టూ పిల్లలంతా ఆంగ్లం వాడతారు. కాకపొతే.. బెంగుళూరు లో ఉన్నాం కాబట్టి మాకు పెద్దగా చాయిస్ లేదు.

  బెంగుళూరు లో ఒకసారి ఒక పాష్ మాల్ లో మూడేళ్ల పిల్లవాడు తప్పిపోతే, కన్నడ మాట్లాడుతాదుట. సేక్యూరిటీ రూమ్ లో ఏ ఒక్కరికీ కన్నడ రాలేదని తల్లి దండ్రుల వివరాలు కనుక్కోలేకపోయారుట. సిగ్గు చేటు.

  సరస్వతీ శిశు మందిర్ లు ఒక చాయిస్. (కాకపోతే RSS/VHP భావాలు నేర్పుతారు అన్నది దృష్టి లో పెట్టుకోవలసింది). నేనూ హైదరాబాద్ లో అవే స్కూల్స్ లో చదివాను. మొన్న సత్తెనపల్లి బ్రాంచ్ ప్రధానోపాధ్యాయుడిని కలవటం జరిగింది.
  ఆయన మాటల్లో..

  ‘తెలుగు మాధ్యమం గా ఉన్న స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య ఈ మధ్య గణనీయం గా పడిపోతున్నా, మా బ్రాంచ్ లో రెండు వేలకి పైగా విద్యార్థులు ఉన్నారు. మంచి రాంకులు సాధిస్తున్నారు.. అలాగే విద్య తో పాటు, అన్ని రకాలు గా అభివృద్ధి పొందుతున్నారు..’

  మీరడిగిన ప్రశ్న చాలా కష్టమైన ప్రశ్న. నేను నా పిల్లలని తెలుగు మీడియం లో చేరుస్తానా? బహుశా.. ఇటువంటి పరిస్థితి వస్తే పిల్ల అడిగితే.. తప్పక చేరుస్తాను.

  నేను పని చేస్తున్న సంస్థ లోకి వచ్చే కొత్త ఇంజనీర్లు చాలా చాలా మంది తెలుగు మాధ్యమంగా చదివిన వారు ఉన్నారు. కొద్దిగా కమ్యూనికేషన్ కి ఇబ్బంది పడినా నెగ్గుకు వచ్చి మంచి స్థాయికి ఎదుగుతున్నారు. కాకపోతే మీరన్నట్టు చాలా వరకూ వాళ్ల పిల్లలతో ఇంట్లో కూడా ఆంగ్లం లోనే మాట్లాడుతున్నారు.

 10. నేనేం చెయ్యగలనో, మీరేం చెయ్యాలో నేను చెప్పలేను కానండీ. మీ పోస్ట్ చదివిన తరువాత “గవర్నమెంట్ దుంపలబడి” లో చదువుకున్నందుకు చాలా ఆనందపడుతున్నాను.

  నిజమే.. గవర్నమెంట్ తెలుగు మీడియం స్కూల్స్ లో చదివించడానికి ఏ తల్లితండ్రులకీ ధైర్యం సరిపోదు.

  సర్కారీ బళ్ళలో జనాభాలెక్కలూ, ఎలక్షన్ డ్యూటీలూ, జన్మభూమీ, సర్వేలూ, (ఆఖరికి ఇళ్ళకి నంబర్లు రాయడం కూడా )లాంటి గొప్ప గొప్ప ముఖ్యమయిన పనులతో పాటూ, పిల్లలకి పాఠాలు చెప్పడం అనే పెద్ద ప్రాముఖ్యత లేని పని చేసే మా తల్లితండ్రులు మొండిగా నన్ను గవర్నమెంట్స్ స్కూల్ లో జాయిన్ చేశారు.

  మా బంధువలంతా “మీ పిల్లల జీవితాలని మీరే నాశనం చేస్తున్నారు” అని తిట్టినా గానీ “మా పిల్లల్ని ఇక్కడ చదివించకపోతే మా వృత్తికీ, మాకూ అవమానం” అన్నారు.

  తెలుగుమీడియం లో చదివి నేను కోల్పోయిందయితే ఏమీ లేదండీ. ఇంగ్లీష్ మీడియం లో చదివి “నాకు తెలుగు చదవటం రాదురా” అని స్టైల్ గా చెప్పే మా ఫ్రెండ్స్ ని చూసి నా కయితే జాలేస్తుంది. బాధేస్తుంది. చాలా మిస్సవుతున్నారనీ.
  మా అదృష్టం బాగుండి అంకిత భావం గల టీచర్లున్నారు నేను చదువుకునేటపుడు. ఇప్పుడు ట్రయిన్ టైం అవుతుందని స్కూల్ ముయ్యడానికి గంట ముందే బ్యాగ్ పట్టుకుని రెడీ అయిపోయే టీచర్లే ఎక్కువ. కానీ నిజాయితీ గా నిబద్ధత తో పని చేసే వాళ్ళు ఇప్పటీకీ ఉన్నారండీ గవర్నమెంట్ స్కూల్స్ లో.. కాకుంటే చాలా తక్కువ.

  ఈ రోజుల్లో “ఇంగ్లీష్ మీడియం లో చదవక పోతే పిల్లలు నిల్ అయిపోతారు, కమ్యునికేశన్ స్కిల్స్లేకా ఉద్యోగాలు రావు. కెరియర్ నాశనమే” అనే అపోహ అందరికీ బలంగా నాటుకు పోయింది గాబటీ, స్కూల్ లో తెల్గు లో మాట్లాడ్డం నేరం కాబట్టీ, ఇంగ్లీష్ మీడియం లో చదివించడం తప్ప వేరే దారి లేదు కాబట్టీ అక్కడే చదివీంచండీ.

  సిరిసిరి మువ్వ గారు చెప్పినట్టూ..
  >>ఇంటి దగ్గర మీరే చక్కగా తెలుగు నేర్పండి. అంతకన్నా ఇప్పటి పరిస్థితులల్లో మనం చేయకలిగిందేమీ లేదు.
  స్కూలులో కనీసం సెకండ్ లాంగ్వేజ్ అన్నా తెలుగు ఉండేట్టు చూసుకోండి.
  ఇంట్లో ఖచ్చితంగా పూర్తిగా తెలుగులోనే మాట్లాడాలన్న నిబంధన పెట్టుకోండి.
  బాబు చేత అమ్మమ్మ, నాయనమ్మ.. తాతలకి..దగ్గర బంధువులకి తెలుగులో ఉత్తరాలు వ్రాయించండి.
  తెలుగు పుస్తకాలు చదివించండి.
  చిన్న చిన్న పదాలు ఇచ్చి కథలు..వ్యాసాలు వ్రాయమనండి.>>

  గొప్ప పోస్ట్ రాశారండీ.. మనసు భారం అయిపోయింది. పే ద్దా కమెంట్ రాసేశాను.

 11. మీ ఫస్ట్ పారాగ్రాఫ్ నన్ను ఎంత వేదనకి గురిచేసిందో నాకే తెలుసు. అంత చిన్న బాబుని ఆ పరిస్థితిలో…గుండె కరిగిపోయింది.

  ఏమిటో ఈ తెలుగు/ఇంగ్లీష్ ప్రాబ్లం. నేను బి.టెక్ లోకెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి ఇంగ్లీష్ కి ఎక్స్ పోజ్ అయ్యి, నేను మాట్లాడాల్సి వచ్చి, అవతలివాళ్ళు మాట్లాడేది ఒక్కముక్కా అర్ధం కాకా, చాలా ఆత్మన్యూనతా భావంతో, మిగతా కాంప్లెక్సెస్ తో మూడు, నాలుగేళ్ళు ఎట్లాగో అట్లాగా నెట్టుకొచ్చాను. కాని ఓ సమస్య, అందునా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవటానికి లేనంత వాతావరణం ఎప్పుడూ తారసపడలేదు.

  నిజమే కదా, అంత ముఖ్యమైన సమస్యలు కూడా చెప్పలేని వాతావరణంలో మన పిల్లలు పెరగటం ఎంత బాధాకరం. ఇట్స్ అ కలెక్టివ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద సొసైటీ.

  మీరు పైన చెప్పిన సమస్యని మా బాబుకు ఊహించుకుని భయపడుతున్నాను నేను. “‘నా కంట్లో పురుగు కుట్టి పారిపోయింది, చాలా నొప్పెడుతోంది’ అని అంత స్పష్టంగా తెలుగులో చెప్పలేడు తను. కన్ను, పెయిన్ అని గొణగగలడేమో. మస్ట్ గా తెలుగులోనే చెప్పాలి లేదంటే ఆ బాధ అనుభవించాలి అన్న సిట్యుయేషన్ లో తనని ఊహించుకుంటే నా గుండె ఇంకా భయపడుతోంది.

  మొట్ట మొదటిసారి అనుకుంటున్నా…నేను పెరిగిన రోజులే బెటరేమో అని.

 12. మా తరం వాళ్ళకి ఏ భాష సరిగ్గా రాదు అనడం లో ఏమాత్రం అతిసయోక్తి లేదు అనుకోండి. చాలా బాగా వ్రాసారు 🙂

 13. పిల్లలు భావాల్ని వ్యక్తీకరంచడం ముఖ్యం అంతే కానీ భాషా, యాస మూక్యం కాదు ఇది ఒక స్టేజ్ వ్యాచ్ వరకు అంతవరకు ప్రతి ఉపాధ్యాయురాలు తల్లి పాత్ర వహించాలి.

 14. సాటి పేరెంట్‌గా, ఒక తెలుగు టీచరుగా, మీకు, మీ అబ్బాయికీ నా సానుభూతి, మనస్ఫూర్తిగా. మీరు రెండు వేరే వేరే సమస్యలని ఒకే గాటికి కట్టేయడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది.

  బడిలో మాట్లాడే భాష, ఇంట్లో మాట్లాడే భాష ఒకటి కాకపోవడం ఇక్కడ ఉన్న మొదటి సమస్య/విషయం. ప్రవాసుల పిల్లలుగా పాశ్చాత్య దేశాలలో పెరిగే పిల్లలు ఇది ఎప్పుడో ఒకప్పుడు అనుభవించకుండా ఉంటారనుకోను. ఎటొచ్చీ మీరు ప్రవాసులు కాక నివాసులుగా ఉన్నారు– అదీ సమస్య. నివాసంలోనే నివాస భాష మాట్లడకూడదన్న నియమం పెట్టడం. మీరు ఏ ఢిల్లీలో ఉన్నా మీ అబ్బాయికి ఇదే సమస్య వచ్చి ఉండేది. (మీవాడు ధారళంగా హిందీ మాట్లాడలేడని అనుకుంటాను.)

  కానీ, అంతకన్నా పెద్ద అసలు సమస్య పిల్లలని పట్టించుకోకుండా ఉన్న ఉపాధ్యాయులు బడిలో ఉండడం. ఆ నిర్లక్ష్యానికి కారణం ఏదైనా సరే క్షమించరానిది. వాడిని పట్టించుకోకపోవడానికి కారణం టీచరు తీరికగా లేకపోవడం అని మీరు రాసినదాన్ని బట్టి నాకు తోస్తోంది. పిల్లవాడు బాధతో ఏడుస్తోంటే ఇంగ్లీషు మాట్లాడలేదని వాడిని నిర్లక్ష్యం చేసినట్లు మీరు చెప్పలేదు. “నీ ఏడుపేదో ఇంగ్లీషులో ఏడువు” అని టీచరు అన్నట్టూ మీరు చెప్పలేదు. మరి ఇంగ్లీషు మీడియం బడిని ఎందుకు నిందించడం?

  మీరు “నేనేం చెయ్యాలి” అని అడిగారు కాబట్టి చెబుతున్నాను, ముందు మీ అబ్బాయిని ఆ బడినించి తొలగించండి. (మీ చుట్టాల్లో లాయర్లెవరైనా ఉంటే వాళ్లని సంప్రదించండి, బడి మీద “proceed”అవచ్చేమో!). మూడో సంవత్సరం నించే ఇంగ్లీషు మీడియం ప్లేస్కూల్‌కి దానికీ వెళ్ళే పిల్లవాడు (ఈ రోజుల్లో అందరూ మూడేళ్లకే ఏదో ఒక ఇంగ్లీషు మీడియం బడికి వెళుతున్నారు కదా!) ఆరేళ్ళు వచ్చినా ఇంగ్లీషులో “నా కన్ను నొప్పిగా ఉంది” అని చెప్పలేకపోతున్నాడంటే అది ఖచ్చితంగా ఆ బడి బోధనలో లోపమే. వెంఠనే ఇంకో బడి వెతకండి.

  మాతృ భాషలో బోధన అత్యుత్తమమైనదని ఇప్పటికి ఎంతోమంది రీసెర్చి చేసి కనుక్కున్నారు. అలాగే పిల్లలు చిన్నప్పుడు సాధ్యమైనన్ని ఎక్కువ భాషలకి expose (తెలుగు?) అయితే మంచిదని కూడా కనుక్కున్నారు.

  తెలుగు నశించిపోతోందని ఆక్రోశించడం సమంజసమే, కానీ అనవసరంగా అన్ని సమస్యలనీ ఇంగ్లీషు మీద రుద్దడం అన్యాయం. ఒక 20-25 ఏళ్లక్రితం తెలుగు మాధ్యమంలో చదువుకున్న వాళ్లకి లేనన్ని అవకాశాలు ఇప్పటి పిల్లలకి (ముఖ్యంగా వేరే భాషకి expose అవడం అనే అవకాశం) ఉన్నాయి. అవకాశాన్ని గుర్తించి ఉపయోగించుకోవడం వివేకం.

  సెలవు.

 15. Aruna
  Beautifully written. I just came across your blog through a facebook friend. I am sorry I don’t have the Telugu fonts on my computer to respond in Telugu. My children didn’t know a word of English when we first migrated to Australia. it took them 6 weeks to learn English, they were 3 & 2 yrs old. And then they forgot to speak Telugu (in our eagerness to settle and assimilate into a new society, we did not enforce to talk in Telugu at home) When my mother-in-law joined us to live with us, my two kids started understanding Telugu again but never made an effort to speak let alone read and write. My third child who was born here never had a chance even to understand fully because English became the first language at home.

  I often wonder that with mass migration that is currently prevalent world wide, if there is a danger that many languages will be lost permanently. If my kids cannot speak properly, read or write their mother tongue, what hope would their children have to do the same? My doubt might and will become a reality within my own family – unless I do something about it. Mmmmmmmmm, food for thought and time to act.

  Regards
  Padma Ayyagari
  http://www.areyouchanging.wordpress.com

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s