వెదురు కంజును వెతుక్కుంటూ…

‘తిన్నమ్మకి తినే కొద్దీ వాపి, కన్నమ్మకి కనే కొద్దీ వాపి’ అని  ఒక సామెతుంది. దాన్ని కొంచెం మారిస్తే ‘రాసే అమ్మ కి (అయ్యలక్కూడాలెండి) రాసే కొద్దీ వాపి’ అని నవ్వుకుంటాం జర్నలిస్టులం. ‘ఓపాలి మనూరివైపు రామ్మా, చీరారవికా పెట్టలేంగానీ రెండో నాలుగో ఫ్పదో స్టోరీలు, స్టోరీ అవిడియాలు ఇచ్చి పంపిస్తా’మని మా ఊరి రిపోర్టర్లు పిలవగానే తెయ్యిమని గెంతి తయారయిపోయి వెళ్లాను. అన్నిటిలోకీ నన్ను ఆకర్షించింది వెదురు కంజు. అంటే ఏమిటంటే… తర్వాత చెప్తాను.

సీతంపేట కొండలు మరీ ఎత్తుగా భయపెట్టేట్టేం ఉండవు. పద్దెనిమిదేళ్ల గిరిజన యువతిలా ఉండే ఆ కన్నెధార పర్వత పాదాలకు నాగావళి నదిని, కొంత నాగరికతను పట్టీల్లాగా అలంకరించే పనిలో బిజీగా ఉంటుంది పాలకొండ టౌన్.

కన్నెధార కొండలను దోచెయ్యాలని చూస్తున్న రాజకీయ కాంట్రాక్టర్లలాగా మబ్బులు కమ్మేశాయి. ‘బేరం కుదిరిపోయింది, మీ ఏడుపులు, ధర్నాలూ మమ్మల్నేం చెయ్యలేవు’ అని బెదిరిస్తున్నట్టు అప్పుడోటీ అప్పుడోటీ చినుకులు. ఎలారా దేవుడా అనుకుంటుంటే ‘మీకేం పర్లేదు అంతా నే చూసుకుంటాగా’ అని అభయమిస్తున్నట్టు పెద్ద ఏసుక్రీస్తు విగ్రహమొకటి కనపడింది ఫాతిమా తల్లి కొండ చర్చి ముందు. ‘రోడ్డీమజ్జినే బాగా ఏశారండి. రయ్యినెలిపోదాం..’ అని కొత్తూరు నుంచి వచ్చిన రిపోర్టర్  ఒక్క తొక్కు తొక్కితే మా బైకు గొయిది గ్రామాన్ని దాటి కుమిలి సెంటర్ దాటి సీతంపేట ఊరు దాటేయబోయింది. ‘ఉండండి, ఇక్కడ కొందర్ని అడుగుదాం, వెదురు కంజు కతేంటో’ అని బండాపి పాలకొండ బస్సుకోసం వెయిట్ చేస్తున్న ఒక గిరిజన ఆసామీని ఆపాం. ‘ఆఁ, ఎదురు కంజంటే వానలొచ్చినప్పుడే దొరుకుతాది. దాన్ని తెచ్చి ఒలిసి కూర సేస్తారు’ అన్నాడాయన మొహమాటంగా నవ్వుతూ. ‘పులుసు కూడా పెడతారని విన్నానే’ అన్నాన్నేను అంతకన్నా అయోమయంగా. ‘అవునే. పెడతారు. ఆడోల్లయితే మీకు బాగా సెపతారు. మాకు ఒండటం వస్తాదేటి’ అన్నాడాయన నవ్వును కొనసాగిస్తూ. ‘బాబ్బాబూ… అది వొండే ఆడోళ్లెక్కడుంటారో కొంచెం చెప్పు’ అని బతిమాలేం. ‘మీది పేపరా, ఛానెలా? మీరెక్కణ్నుంచి ఒచ్చినారు’ అని నా మీద ప్రశ్నల బాణాలు సంధిస్తున్న ఓ కుర్రాణ్ని తప్పించుకుని వెదురు కంజును వెతుక్కుంటూ కొండల్లోకి దూసుకుపోయాం.

కొండవాలులో గట్లుగట్లుగా పొలాలు. నిండా ఎర్రటి నీరు. కొన్నిచోట్ల వత్తుగా వరినారు పోసిన మడులు. మరికొన్ని చోట్ల వరసగా వంగుని ఉడుపులు చేస్తున్న మహిళలు. ఇంకొన్ని పొలాల్లో ఎద్దులను అదిలిస్తూ నాగలి పట్టి దున్నుతున్న రైతులు. మధ్నాహ్నం ఒంటిగంటయిందేమో, తలమీద మూడు సిల్వరు గిన్నెలను ఒకదానిమీదొకటి పేర్చి గంజి అన్నాన్ని పొలంలోకి పట్టుకె ళుతున్న పడుచొకామె కనబడింది. ‘బరువుతో నానేటి సెపుతానుగానీ, ముందుకెల్లండి, అక్కడున్నోల్లు సెపుతారు’ అంది. ముందుకెళితే రోడ్డువార పొలానికి పారతో తవ్వి గెడ్డ నీటిని మళ్లిస్తున్న ముగ్గురు స్త్రీలు కనిపించారు. ‘బోయినం టైమవలేదా’ అని మాట కలిపి రోడ్డు దిగి పొలంలోకి అడుగుపెట్టాను.

హ్యేండ్‌బ్యాగ్‌లో అప్పుడే కొన్న జాంకాయల్ని తలోటీ ఇస్తుంటే ‘మాకెందుకమ్మ, బువ్వుంది. నువ్వే తినండి’ అన్నారు మొహమాటంగా. ‘కాదులెండి, తింటూ మాటాడుకోవచ్చని తెచ్చాను. తీసుకోండి, పర్లేదం’టే తీసుకున్నారు. ‘ఇది మొగోళ్లే సెయ్యాలి, కానీ మాంకూడా సేసేస్తాం’ అం టూ పొలంగట్లు వేస్తున్న వాళ్లతో మాట కలిపితే ‘ఎదురు కంజు కూర సేసుకుని నిన్ననే తినీసినాం. నిన్నొచ్చుంటే సూపెడుదుం’ అందామె చెమటతో తడిసిన మొహాన్ని మోచేత్తో తుడుచుకుంటూ. ‘మావూలు ఎదురొండుకొని తింటే సస్తారు. ఈ ఎదురు కొండల్లో దొరుకుతాది. వొర్సాలు పడినప్పుడు ఈ నెల్లోనే పుడతాది. అప్పుడే తీసుకోవాల. లేత సెరుగ్గడలుంటాయికావా, అలాగుంటాది. దాన్ని ఒలవాల, లోపల తెల్లగా ఉన్నదాన్ని గీకాల. అప్పుడు సిన్న ముక్కలు తరుక్కోని బాగా వొండి వార్సాల. దానికి తాలింపు పెట్టాల. అదీ ఎదురు కంజు కూరంటే. గొప్ప రుసి. అదే సారెట్టాలంటే ఆ ముక్కలకే మళ్లీ పులుసు కలపాల, ఉప్పూకారం ఏసుకోవాల’ అని చెప్పింది. ‘ఒక్కసారొండితే కూర మూడ్రోజులుంటాది. కంజుకోసం కొండల్లో నెతకాలి’ అంది.

‘తల్లితల్లి మాయమ్మా ఆ మొక్క ఎలా ఉంటుందో ఒక్కసారి చూపెట్టమ్మా’ – బతిమాలేం. కొంతసేపు ఆలోచించి పొలంలోంచి బయటికొచ్చి సరసరా నడిచి నాగుపాములాగా చులాగ్గా కొండెక్కేసింది. కెమెరా బరువుతో మన్మ«థరావు, అలవాటు లేక నేనూ ఎక్కలేకపోతున్న సంగతిని గమనించిందేమో మరి, ‘ఇక్కడే ఉండిపోండిలే, నాన్తెస్తాను’ అన్నదామె. వెదురు కంజును చూడాలన్న కుతూహలంతో ఎలాగయితేనేం మేవూ చే రుకున్నాం. నీటిలో బుడుంగున మునిగి మూడు గొడ్డళ్లతో ప్రత్యక్షమైన నదీ దేవతలాగా కొండ పచ్చదనంలోకి మాయమై అంతలోనే ఓ వెదురు మొక్కతో ప్రత్యక్షమైందామె. మధ్యలోంచి ములక్కాడలాగా ఉన్న మొగ్గను లాగింది.

చకచకా వొలిచి ‘దీంతో సెయ్యాల కూర’ అంది. ‘ఇంతా తెచ్చేవుకదా, ఇంటికెళ్లి కూర చేసీ, నేను విజువల్ తీసుకుంటా’నంటాడు మన్మధరావు. ‘సీ, ఇవాళ శనోరం కాదా, కంజు కూర సేసుకుంతారా ఎవరైనా’ అని అడ్డం కొట్టేసింది. ‘అదేవైనా నాన్‌వెజ్జేటీ? పోనీ రేపొస్తా’నంటాడీయన. ‘రేపు ప్రార్దన ఉంది. మేం ఇంటికాడుండం’ అనేసింది. ‘మరి సోంవారం’ అంటే ‘మీ పని మీకు, మా పని మాకు’ అని జ్ఞానమిచ్చింది. నేను ఫోటోలు తీస్తుంటే ‘సికు సికు, ఇలాటి బట్టలతో తీస్తావా’ అంటూ సిగ్గుపడింది. పేరేంటంటే ‘తిక్కమ్మ’ అని చెప్పి చటుక్కున నా వెనకే ఉన్న సీతాఫలం చెట్టునుంచి నాలుగు పెద్ద పెద్ద కాయలు తెంపి తెరిచి ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌లో పడేసింది. ‘ముగ్గేస్తే మంచి పండ్లవుతాయి’ అని కూడా చెప్పింది. అప్పటిదాకా సీతాఫలం చెట్టు కిందే ఉన్నానన్న సంగతిని కూడా గుర్తించని నాకు ఆమె పరిసరాల విజ్ఞానాన్ని తెలియజేస్తూ ఎర్రటి కొండ చీమొకటి కటుక్కున కరిచింది. మొత్తానికి వెదురు కంజును చూశాం, ఆ కూర వివరాలు కనుక్కున్నామన్న తృప్తితో కొండ దిగి వచ్చేశాం.

Advertisements

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s