సున్నా డిగ్రీల వాతావరణం నుంచి అరుణ పప్పు, ఆంధ్రజ్యోతి :)

రెండు నెలలుగా రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి విశాఖమన్యంలో విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న ప్రాంతంలో ఒక రాత్రి గడిపితే ఎలా ఉంటుంది? చలి పులి అడుగుల్లో అడుగేసుకుంటూ వెళ్లి ప్రయాణిస్తే ఎలా ఉంటుంది? ఆలోచన వచ్చిందే తడవు ఝామ్మంటూ తూర్పు కనుమల్లోకి దూసుకుపోయింది ఆంధ్రజ్యోతి.  ఏజెన్సీని ఆనుకుని ఉన్న చిన్నచిన్న టౌన్ల నుంచి ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లోని అతి ఎత్తైన ప్రదేశం వర కూ… చలిని వెంబడించింది. ఉదయం పదకొండు వరకూ దట్టమైన మంచుతెరల చెరలో ఉండిపోతున్న గిరిపుత్రులు కొందరు, చలిని ఆస్వాదిస్తున్న పర్యాటకులు కొందరు, చిరువ్యాపారులు కొందరు… అందరినీ పలకరిస్తూ సాగిన మా ప్రయాణం, అక్కడి పరిస్థితుల చిత్రణ మీ కోసం.

సాయంత్రం 5, విశాఖ సిటీ :
విశాఖ నగర సరిహద్దులు దాటి చుట్టుపక్కల పల్లెటూళ్ల మీదుగా కారు పరుగులు తీస్తోంది. కోతలయిపోయిన పొలాల మీద నుంచి చల్లటి చలి నెమ్మదిగా తన ఒళ్లు విరుచుకోవడం తెలుస్తోంది. మేట వేసిన కొత్త ఎండు గడ్డి వాసన గాలిలో…

రాత్రి 7, నర్సీపట్నం :
కనుమ తర్వాత చేసుకునే నందీశ్వరుడి పండగ కోలాహలం కనిపిస్తోంది. గంటలు, పట్టుబట్టలతో అలంకరించిన ఎద్దు, వెనకాల తప్పెటగుళ్లు, కోలాటాల బృందాలు సంబరంగా తయారవుతున్నాయి. రోడ్డు వారగా చితుకుల మంట వేసి డప్పులను సరిచేస్తున్నవారు కొందరయితే, పనిలో పనిగా చలి కాగుతున్నారింకొందరు.

రాత్రి 8 గంటలు, చింతపల్లి ఘాట్‌  :
మెలికలు తిరుగుతూ రోడ్డు పర్వతాల మీదికి ప్రయాణిస్తున్నప్పుడు దూరంగా ఒకటీఅరా విద్యుద్దీపాలు. విసిరేసినట్టుండే గిరిజన గుడిసెలకు ఆ వెలుగే ఆధారం. అప్పటిదాకా వెలిగిన చలిమంటలు ఆరిపోయి బూడిద మధ్యలోంచి నిప్పు మాత్రం ప్రకాశిస్తోంది అక్కడక్కడ, రోడ్డు వారగా. నర్సీపట్నం వెళుతున్న బస్సొకటి కిందకు దిగుతూ ఎదురయింది.  మఫ్లర్లు, స్వెట్టర్లు చుట్టుకున్న ప్రయాణికులు నిద్రలోకి జారుకుంటున్నారు.

రాత్రి 9.30, చింతపల్లి గ్రామం :
దుకాణాలన్నీ కట్టేశారు. ‘శ్రీసాయిరామ్‌ టిఫిన్‌ సెంటర్‌’ నడుపుతున్న బేతాళుణ్నడిగితే ‘పాతికేళ్లలో ఇంత సలినెప్పుడూ సూడలేదండి. ఈ ఏడు సాలా ఎక్కువుంది. ఇవేళింకా న యంగానీ, మైనస్‌లోకి ఎళిపోయింది వాతావరణం. మీరు నిన్నోమొన్నో ఒచ్చినట్టయితే మీకు దాని సంగతి ఇంకా బాగా తెలిసేది. సలికి సచ్చిపోయామండీ బావూ. వేడిగా చపాతీలు, సికెన్‌ ఫ్రై సేయిస్తాను తినండి…” అంటూ మర్యాద చేశాడు. మరో అయ్యర్ల కుటుంబమూ ఒక హోటలు నడుపుతోంది. ‘మా అమ్మ గిరిపుత్రిక, నాన్న మధురై నుంచి వచ్చి స్థిరపడిన అయ్యర్‌. నేను పుట్టిపెరింగిందిక్కడే…’ అంటూ చెప్పుకొచ్చిన కళ్యాణి భర్త కీర్తివాసన్‌ చెన్నైలో పెరిగిన వ్యక్తి. ‘ఇక్కడి మనుషులెంతో మంచివారు. బాక్సైట్‌ మైనింగ్‌ను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. పురాణాల ప్రకారం చూసినా, పర్యావరణపరంగా చూసినా అది మంచిది కాదు…’ అన్నారాయన.

రాత్రి 10.30,  గూడెంకొత్తవీధి :
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి. బాలరాజు స్వగ్రామమిది. ఆవేళప్పుడు నిర్మానుష్యంగా ఉంది. రెండు నైట్‌హాల్ట్‌ బస్సులున్నాయి. ‘రేపుదయమే నర్సీపట్నం సంతండి. దానికోసం ఉదయాన్నే బయల్దేరతాయివి. మనతో మాట్లాడ్డానికి ఇప్పుడెవరుంటారు? ఇక్కడ కాస్త కలిగినవాళ్లంతా రూమ్‌ హీటర్లు పెట్టుకుంటారు. ఎంతాలేదు, పన్నెండొందల రూపాయలే కనుక ఎక్కువమంది కొనుక్కున్నారు. ఇక మరీ గుడిసెల్లోనయితే చలిని తట్టుకోవడానికి కుంపట్లు పెట్టుకుంటారు గిరిపుత్రులు” అంటూ చెప్పుకొచ్చాడు పత్రిక స్థానిక ప్రతినిధి దయానంద్‌. ఇక్కడికి దగ్గర్లోనే పురాతన పాండవ విగ్రహాలున్నాయి.

రాత్రి 12, సప్పర్ల ఘాట్‌ :
మెలికలుమెలికలుగా ఎత్తైన ఘాట్‌ సీలేరువైపు వెళుతుంది. ఇరుకుల గతుకుల రోడ్డు. ఒకటోరెండో వాహనాలు ఝామ్మని దూసుకుపోతూ ఎదురయ్యాయి. ‘ఇలాంటి రోడ్డులో, ఈ సమయంలో అంత స్పీడేమిటి’ అంటే ‘గంజాయి, రంగురాళ్లు అక్రమ రవాణా చేసే వాహనాలు తిరుగుతుంటాయండి. చింతపల్లిలో పోలీసులు ఆపుతారు. మొన్నొకరోజు సుమో ఒకటి పోలీసుల్ని తప్పించుకోబోయి పల్టీలు కొట్టేసింది..’ దయానంద్‌ చెబుతుండగానే రెయిన్‌గేజ్‌కు చేరుకున్నాం.

రాత్రి 2.30, రెయిన్‌గేజ్‌ :
ఆంధ్రా – ఒరిస్సా సరిహద్దుకల్లా అతి ఎత్తైన ప్రాంతమిది. సముద్ర మట్టానికి 1310 మీటర్ల ఎత్తున ఉన్న ప్రదేశం. వాతావరణ పరిస్థితులను సమీక్షించడం కోసం ఆ శాఖ ఏర్పాటు చేసిన చిన్న స్థావరమొకటి ఉంది. మన్యంలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు గమనించింది చింతపల్లిలో ఐఎమ్‌డీ ఏర్పాటు చేసిన వాతావరణ కేంద్రమే. కొంచెంగా మండుతున్న పెద్ద తాటిదూలం అప్పటిదాకా అక్కడ ఎవరో చలికాచుకున్నట్టు సాక్ష్యమిచ్చింది. చలిగాలుల ప్రతాపం పెరిగిపోయింది.

రాత్రి 3.30, చింతపల్లి ఘాట్‌ :
కన్నుపొడుచుకున్నా ఏమీ కానరాని చిక్కటి అడవి. ప్రశాంత నిశీధి, ఆకాశం నిండా రాసులు పోసినట్టు నక్షత్రాలు. కాలుష్యం అంటని చోట చుక్కల అందాలు ఎంత బాగుంటాయో చూడమని ప్రకృతి పేర్చినట్టే. కారులో హీటర్‌ పనిచేస్తోంది. పొరపాటున విండోగ్లాస్‌ దించామా, అంతేసంగతి. చలి కత్తులు దూస్తోంది. నాలుగున్నరకల్లా నిద్రలేచిన కొందరు గ్రామస్తులు చలిమంటలు వెలిగించే ప్రయత్నంలో పడ్డారు. పాలు, దినపత్రికలు తీసుకుని వ్యాన్‌లు రావడం మొదలయింది. అల్లూరి సీతారామరాజు ఒకప్పుడు పేల్చేసిన పోలీస్‌ స్టేషన్‌ పక్కనే ఉన్న నేటి స్టేషన్‌లో పోలీసులు గస్తీ తిరుగుతున్నారు.

ఉదయం 5.30, లంబసింగి :
చింతపల్లి నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న లంబసింగి మామూలుగానైతే ఏ ప్రత్యేకతా లేని ఓ కుగ్రామం. అయినా మీడియా ఇచ్చిన ప్రాధాన్యంతో అదొక పర్యాటక ప్రాంతంగా మారిపోతోంది. చలి సంగతేదో చూద్దామని తూ.గో.జిల్లా అనపర్తి నుంచి కొందరు యువకులు మూడు కార్లలో వచ్చారు. ‘రాత్రంతా కార్లలోనే పడుకున్నాం. ఓ గంట క్రితం వర్షం పడుతున్నట్టనిపించింది. ఏంట్రా అనిచూస్తే, చెట్ల నుంచి మంచు బిందువులు కురుస్తున్నాయి. రాత్రి తిండి దొరకలేదు. ఫుడ్డుదేవుంది లెండి, ఇంత చక్కటి ప్రకృతిని చూడటమే ముఖ్యం’ అన్నారు స్నేహితులు విజయకుమార్‌, మురళి, రాధాకృష్ణ, మహేంద్ర, నాగిరెడ్డి, ప్రసాద్‌. ‘రెండు అడుగుల దూరంలో ఏముందో కనిపించడం లేదు ఈ పొగమంచు ధాటికి. ఇదో తరహా ప్రయాణం’ అన్నారు అన్నవరం నుంచి వచ్చిన ఇంజినీర్‌ రాజు. అంతదూరం నుంచి తమ ఊరికొచ్చిన వారికి టీనీళ్లయినా ఇవ్వకపోతే ఏం బాగుంటుందని కాసులమ్మ కాస్త టీపెట్టి ఇచ్చింది. ఇంతలో గ్రామస్తులు పెద్ద చలిమంట వెలిగించారు. పొగమంచుకు తడిసి కట్టెలెంతకీ రాజుకోకపోతే కాస్త కిరసనాయిలు తెచ్చి పోసింది కాసులమ్మ. పూర్వమెప్పుడో ఒక దొంగను ఆరుబయట చెట్టుక్కట్టేస్తే ఉదయానికల్లా కొర్రులాగా అయిపోయాడట. అప్పటినుంచీ ఈ ఊరిని కొర్రుబయలని కూడా అంటున్నారు. రాత్రంతా ఉంటేనే కాదు, ఆ సమయంలో అరగంట ఉన్నా చాలు, మనిషి కొర్రయిపోవటానికి.

ఉదయం 6, లంబసింగి :
గిరిజన భాషలో లంబసింగి అంటే పెద్ద కొండ అని అర్థమట. అక్కడున్నవి పట్టుమని నలభై కుటుంబాలు. ‘పొద్దెక్కేదాక ఇంట్లో వెచ్చగా ఉండాలంటే మాకెలా కుదురుతుంది? పొలాల్లో తోటల్లో పనిచేయనిదే బువ్వొస్తాదా? ఈ చలివల్ల మాకెన్ని అవస్థలో’ అంటున్న రోలంగి విజయలక్ష్మి పదివేల మొక్కలున్న కాఫీ తోటకు యజమానురాలు. వంద కేజీల బస్తా కాఫీ పళ్లు ఐదువేలు పలుకుతున్న సమయమిది. ‘ఇజయవాడ నుంచి వ్యాపారస్తులొస్తే రేటు స్థిరపడతాది’ అంటున్న ఆమె చలి వల్ల ఇంటి వెనకాలే ఉన్న తోటలోకి సైతం వెళ్లలేకపోతున్నారు. ‘ఎవరికి తప్పినా మాకు తప్పుతాదేటి’ అంటూనే ఇంటి పనులకు ఉపక్రమిస్తున్నారు మహిళలు. ఇంటి ముందు ఊడ్చుకోవడం, కళ్లాపి జల్లి ముగ్గులు పెట్టుకోవడం, కొంకర్లుపోతున్న చేతులతోనే అంట్లు తోముకోవడం, బోరింగ్‌ కొట్టి నీళ్లు తెచ్చుకోవడం… అన్నీ చేస్తున్నారు. పర్యాటకం పెరిగితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఉద్దేశంతో బయటివారికి తమకున్నదానిలోనే కొన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.

ఉదయం 7, లంబసింగి :
సంక్రాంతి సెలవుల తర్వాత మళ్లీ కాలేజీకి వెళ్లడానికి తయారయి నిల్చున్నాడు ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మే తెలుగు చదువుతున్న ఎస్వీఎన్‌ రాజు. సంత కోసం ఉదయాన్నే బయల్దేరిన బస్సులు అతన్నెక్కించుకుని నిష్క్రమించాయి.

ఉదయం 8, జల్లూరుమెట్ట :
బోయ్స్‌ హాస్టల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న కృష్ణ లెక్కల పుస్తకాన్ని ముందేసుకుని వెచ్చని దుస్తుల్లో ముడుచుకుని కూచున్నాడు. ‘చలి అని ఊరుకుంటే చదువు సాగొద్దా…’ అన్నాడు నవ్వుతూ. ‘మీ పండుగ బోగి అవుతాది కదా, ఆ తర్వాతే సలి తగ్గిపోద్ది. ఈసారే ఇంకా ఎక్కువ అయిపోయింది’ అంది అతని నాయనమ్మ గెమ్మలి రాజం.

ఉదయం పది దాటినా పొగమంచు తగ్గలేదు. మంచు ధాటికి చెట్లలోంచి సూర్యుడు చందమామలాగా కనిపిస్తున్నాడు. మధ్యాహ్నం పన్నెండు దాటిన తర్వాతే ఎండపొడ తగులుతున్న మన్యాన్ని విడిచి రావడానికి మనసొప్పదు. అడవి అందాన్ని కెమెరాలో కొంత, మనసులో కొంత భద్రపరచుకుని ఘాట్‌ దిగిరావాలి తప్పదు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ‘ఎచటి నుంచి వీచెనో ఈ చల్లని గాలి… ఊయలపై ఊగుతూ, తీవెలపై తూగుతూ….’  కారు స్టీరియోలోంచి పాట మంద్రంగా వినిపిస్తోంది. హేమంత వాతావరణమూ అలాగే ఉండటాన్ని ఆస్వాదిస్తూ మళ్లీ నగర జీవితంలోకి వచ్చి పడ్డాను.

Advertisements

3 thoughts on “సున్నా డిగ్రీల వాతావరణం నుంచి అరుణ పప్పు, ఆంధ్రజ్యోతి :)

  1. Arunaa…

    your artistic tinge is not so much visible in this travelogue. some soul thing is missing. i am so excited after seeing the title as i could guess it’s about lammasingi. however, may be it’s because of my over-expectation, but i wanted some poetic expressions from u. any way the documentation of journey is crisp n cool.

  2. అరుణగారు
    విశాఖ నుండి అరకు,అరకు నుండి విశాఖ!ఇదీ నా బాల్యపు సంబరాల పయనం! మంచు మబ్బులు మనల్నిపట్టి మీటుతాయి.పక్షుల కిలకిలారావాలు మనసు పాటకు వాయిద్యమవుతాయి.పచ్చదనపు తివాచీ పరచిన వాలుకొండలు,దేవుడి ప్రేమధార ప్రవహింపచేసే జలపాతాలు!నాగరికత ప్రబలని ఆ రోజుల్లో కొండలవాసులు బంగారుకొండలే.నా అనుభవాల అనుభూతులను మరోమారు గుర్తుకు వచ్చేలా మీరు అందించిన ప్రయాణపు సరిగమలకు అభినందనలు.

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s