ఈ కథలను తప్పక చదవాలి

కాళ్లు భూమి మీద ఆన్చి నిలబడినప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తాయి. అదే శిఖరాగ్రాలకో, మేఘాలను దాటో వెళ్లినప్పుడు దృష్టి విశాలమవుతుంది. ఇటు నేల మీది ఎరుక, అటు విశాల దృష్టి – రెండూ ఉన్నప్పుడే రచయిత రచనలు విశ్వమానవ అంతరంగాన్ని స్పృశించగలుగుతాయి. ఒక డికెన్స్‌, ఒక మొపాసా, ఒక టాగోర్‌, ఒక శరత్‌, ఒక గురజాడ వంటివారికున్నది ఇలాంటి చూపే కనుక వాళ్లు విశ్వ రచయితలుగా ఎదిగారు. నేటి అస్తిత్వ ఉద్యమాలను తప్పనలేంగానీ, వాటి ఫలితంగా ఎవరి వాచకం వాళ్లదే అయి, ఎవరి కథలు వాళ్లవే అయే విచిత్ర పరిస్థితి నెలకొందిప్పుడు. రకరకాల ముద్రలను రచయితలు తమకు తామే తగిలించుకుని, తామెంచుకున్న ఏదో ఒక చట్రానికే పరిమితమైపోతున్న రోజులివి. ఏవో కొన్ని చిన్నచిన్న సమూహాలకు ప్రతినిధిగా మాత్రమే తమనుతాము పరిగణించుకునే వారు కాకుండా అత్యున్నతమైన మానవ జీవితాన్ని మొత్తంగా చిత్రించే రచయితలు అంతరించిపోతున్నారా, మనిషి మనస్సులాగా సాహిత్యమూ రాన్రానూ సంకుచితమైపోతోందా అన్న సందేహాలు తలెత్తుతున్న విషమ కాలమిది. అయితే రైతుల కష్టాలు, లేదంటే రాష్ట్రవిభజన రాజకీయాలు మాత్రమే కథావస్తువులవుతున్న ఇవేళ్టి సాహిత్య సందర్భంలో – ఏదోక సమూహానికే ప్రాతినిధ్యం వహిస్తూ కాకుండా సమస్త మానవాళి స్వభావాన్ని ప్రతిబింబించిన ప్రతిభారాయ్‌ కథలను చదవడం ఒక గొప్ప పఠనానుభవం. నాలుగ్గోడల గదిలో రెండు బకెట్ల నీళ్లతో అదొక తంతుగా స్నానం ముగించడానికీ, పారే సెలయేటిలో శరీరాన్ని ముంచితేల్చి ఆ నీటి ఉరవడిని తనలోకి ఇంకించుకునే జలకాలాటకీ మధ్య ఉండే తేడా, తాజాదనమేదో అనుభవానికి వచ్చింది ఈ కథలు చదువుతున్నప్పుడు.

సరిగ్గా ఆ కారణం వల్లనే ప్రతిభారాయ్‌ని ఒడియా రచయిత్రి అనీ, ‘ఉల్లంఘన’ అనేది ఇరవయ్యొక్క ఒడియా కథల సంకలనమనీ ఒక సీమకు, ఒక భాషకూ పరిమితం చేసి చెప్పడానికి సాహసించలేం. ఈ కథల్లో ఉన్నవాళ్లు ఎప్పుడైనా, ఎక్కడైనా ఉండొచ్చు. ఇందులో జరిగిన సంఘటనలు ఎప్పుడైనా ఎక్కడైనా జరగొచ్చు. సార్వకాలికమైన, సార్వత్రికమైన మానవ స్వభావంలోని అనేకానేక వర్ణాల్ని చిత్రించిన కథలివి. సాటి మనిషి మీద నమ్మకాన్ని కోల్పోవడమే ఆధునిక జీవిత సంక్షోభానికి అసలు మూలం. అసలు తనమీద తనకు నమ్మకముందో లేదో తెలీదు ఆధునిక మానవుడికి. ఈ సంకలనంలోని అనేక కథలకు ఇదే కేంద్రం. దానిచుట్టూ గీసిన అనేక వృత్తాలు ప్రతిభారాయ్‌ కథలు. ప్రతి కధా ఆ అనుమానాన్ని ఉల్లంఘించి మానవ స్వభావంలోని ప్రేమ, నమ్మకమనే అద్భుతమైన అంశాలు పైకి రావడానికి ఊతమిస్తాయి. అసలు సాహిత్య ప్రయోజనమే అది అయినప్పుడు ఈ ఒడియా కథలన్నీ దాన్ని నూటికి రెండొందలశాతం నెరవేర్చినట్టే. ‘పాచికలాట’, ‘పాదుకాపూజ’, ‘జవాబులేని ప్రశ్న’ ‘సోదరివాటా’ ‘చెప్పులు’ కథల్లో పాత్రలేవైనా కావొచ్చు, అన్నిటిలోనూ ‘అనుమానం’ అనేదే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవలసింది ‘మృష్టాన్నభోజనం’, ‘సొంత చిరునామా’, ‘ఆత్మాభిమానం’ కథల గురించే.

‘వంద సంఘటనల్లో తొంభై సంఘటనలకి నువ్వు బాధ పడినప్పటికీ ఇతరుల మీద విశ్వాసం పోగొట్టుకోకు. ఏమంటే నీ అవిశ్వాస గుణం వల్ల పట్టణాలలో ఎంతోమంది మానవీయ గుణాలని కోల్పోతారు. మనుషుల మధ్య ప్రేమ, విశ్వాసమే ఈశ్వరుడు మానవుడికిచ్చిన వరం. ఇతరులని నిందించటం అసహ్యించుకోవటం మానవులకు తగదు. అది వికృతత్వానికి పరాకాష్ఠ. మనిషిని విశ్వసించి, ప్రేమించి ప్రతి అడుగూ వేస్తున్నా నువ్వు మోసపోయావనుకో! శివుడాజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదని భావించి దుఃఖించకుండా ఉండు’

– ఒక కథలో పాత్ర పలికిన మాటలు కావవి. ప్రతిభారాయ్‌ కథల సారాంశమది. ఒక్క ముక్కలో చెప్పాలంటే, సాటి మానవుడి మీద అపనమ్మకాన్ని జయించడానికొక ఊతకర్ర ఈ ‘ఉల్లంఘన’.

ఏమాత్రం వెకిలితనం, అశ్లీలత లేకుండా ద్రౌపది అంతరంగాన్ని చిత్రించిన ‘యజ్ఞసేని’ రచయిత్రి నుంచి వచ్చిన కథలన్నప్పుడు వాటిల్లోని స్త్రీ పాత్ర చిత్రణ పట్ల ప్రత్యేక దృష్టి పెట్టకుండా ఉండలేం. ప్రతిభారాయ్‌ స్త్రీ పాత్రలు మ్యూట్‌లో ఉండవు, అవి తమ భావాలను చక్కగా విశ్లేషించుకుంటాయి, మాటల్లో పెట్టి చెబుతాయి. తాము పాటిస్తున్న విలువలేమిటో వాటికి స్పష్టంగా తెలుసు. తన మనస్తత్వం పట్ల, తమ ఆలోచనల పట్ల ఎరుక కలిగి ఉంటాయి.

సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన పదకొండేళ్లకు తెలుగులోకి వచ్చిన కథలివి. సాహిత్యంలో పొరుగు నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి పొరుగుకూ ఆదాన ప్రదానాలు ఎంత విరివిగా జరిగితే అంత మంచిదన్న సత్యం – ఈ పుస్తకం చదివాక మరొకసారి అర్థమవుతుంది.
——————–
ఉల్లంఘన (సాహిత్య అకాడెమీ పురస్కారం లభించిన ఒడియా కథా సంపుటి)
ప్రతిభారాయ్‌
పేజీలు : 346, ధర : రూ.150.
సాహిత్య అకాడెమీ ప్రచురణ

2 thoughts on “ఈ కథలను తప్పక చదవాలి

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s