హలో, దిసీజ్ పప్పు from బంగాళాఖాతం – ఓవర్

మామూలుగానైతే ఈ ఆర్టికల్‌ను ఇలా మొదలుపెట్టాలి.
ఎనిమిదో నేషనల్‌ హోబీ సెయిలింగ్‌ పోటీలు నిన్న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో ముగిశాయి. ఐదు రోజుల పాటు ఆద్యంతమూ నువ్వానేనా అన్నట్టు సాగిన ఆ పోటీల్లో విజేతలు ఫలానాఫలానా…
ఇది ఒడ్డున కూచొని, దూరాన్నుంచి బైనాక్యులర్స్‌తో చూసి రాసే మాట.
నిండు పున్నమి రోజున.. గర్జిస్తున్న సముద్రంలోకి వెళ్లి… పోటీ పడవలతో పాటు సాగుతూ చూసి ఆ అనుభవాన్ని అక్షరీకరిస్తే ఎలా ఉంటుంది?
ఇదిగో, ఇలా…

మేఘాలు ముసిరిన ఒక మధ్యాహ్నం. సమయం రెండున్నర.

ఎనిమిదో రేసు ప్రారంభమవుతోంది.
జ్యూరీలో ఇద్దరు సభ్యులు. నేవీలో పనిచేసి హోబీ రేసుల్లో దేశానికి అనేక మెడల్స్‌ తెచ్చిపెట్టిన కోచ్‌ నరేశ్‌ యాదవ్‌ ఒకరు. తమిళనాడు సెయిలింగ్‌ అసోసియేషన్‌ సభ్యురాలు నిల్మా షా మరొకరు. ముందున్నది ముగ్గురు కూచోగలిగే జెమిని మోటార్‌ బోట్‌.  ‘లైఫ్‌ జాకెట్లు లేకపోయినా పర్లేదా…’ నేవీ బోట్‌ తీస్తున్న సింగ్‌ హెచ్చరించాడు. అతను ప్రశ్న నరేశ్‌ యాదవ్‌ను చూస్తూ అడిగాడుగానీ, అది నన్నుద్దేశించే అని అర్థమయింది. ఎందుకంటే వాళ్లందరికీ ఈత వచ్చు, నీటిలోనే జీవితం గడపడానికి అలవాటు పడ్డ ప్రాణాలవి. కాళ్లు తడిస్తే చాలు ‘రేపు జ్వరమొస్తుందేమో, అయ్యబాబోయ్‌ ఆఫీసుకెలా’ అనుకునే జీవితం నాది. సాహసానికీ సగటు మనిషికీ పోలికేమిటి? పొంతనెక్కడ?
ఎదురుగా అలలు. తెలతెల్లగా విరిగిపడుతూ ‘వస్తావా రావా’ అన్నట్టు కవ్విస్తూ.
ఈ సవాలును స్వీకరించాలా వద్దా? ఒక ఆర్టికల్‌ కోసం జీవితాన్ని కోరికోరి ప్రమాదం అంచుకు నెట్టాలా?
తెరచాప తిరిగినట్టు ఆలోచన తొంభై డిగ్రీల్లో తిరిగి దిశ మార్చుకుంది.
ప్రాణం పోవడానికి ఒక్క నిమిషం చాలు. అది సముద్రంలోనే, ఇప్పుడే అవాలనేముంది? రోడ్డు మీద అలవాటైన బండి నడుపుతుంటే కావొచ్చు. ఇంట్లో మిక్సీ పెడితే షాక్కొట్టొచ్చు. కాకిలాగా కలకాలం బతకడం దేనికి?
చలో, ఆగే బఢో. మళ్లీ మళ్లీ రాని అవకాశమిది.
అడుగు ముందుకు పడింది. ముగ్గురూ కూచున్నాక మోటర్‌ స్టార్టయ్యి ఒక్క కుదుపుతో బోట్‌ సముద్ర జలాలను చీల్చుకుంటూ ముందుకు కదిలింది. అలల మీదకు ఎగిసి, అంతలోనే కిందకు దూకి…
భారీ కెరటాలు చిన్న పడవను బొమ్మలాగా ఊపేస్తున్నాయి. ఎటుచూసినా అనంతమైన నీలి జలరాశి. బోటు స్పీడందుకోగానే కెరటాలూ విజృంభించాయి… కూచున్న నలుగురినీ నిట్టనిలువునా తడిపేశాయి. ఒక్కసారిగా ఉప్పు నీరు కంట్లో, ఒంటి మీదా పడి మండటం మొదలైంది.
భయం, విపరీతమైన భయం.
అడుగున ఏముందో తెలీదు, మరోవైపు చూస్తే తీరానికి దూరమవుతూ… ఒక్కనిమిషంలో దిగులేసి ఏడుపొచ్చేసింది.

నన్నెవరు వెళ్లమన్నారిలా? ఎవరికి చెప్పొచ్చానని అసలు? ఎందుకొచ్చిన సాహసం? కన్నీళ్లు బొటబొటా జారాయి. అంత నీటి ఉధృతిలోనూ నరేశ్‌ యాదవ్‌ కన్నీటి చుక్క జాడ కనిపెట్టేశాడు. ‘యూ ఆర్‌ సేఫ్‌ బేబీ. వీ ఆర్‌ హియర్‌ విత్యూ. కమాన్‌ ఎంజాయ్‌ ద రైడ్‌ ఇన్‌ సీ… యూ ఆర్‌ ఆల్రైట్‌…’ నడిసంద్రంలో అంత భరోసానివ్వగలిగినదెవరు? మరోవైపు నిల్మా షా నవ్వులు. ‘ఇలాగే ఉంటుంది. పౌర్ణమి కదా, సముద్రం బాగా రఫ్‌గా ఉంది. రేపు ఆఫీసుకెళ్లి ఇదంతా రాస్తున్నప్పుడు నీ హృదయంలో నిండే అద్భుతమైన ఫీలింగ్‌ లక్షలిచ్చినా రాదు… నిజం. బిలీవ్‌ మీ’ అంటూ ఊరడిస్తోందావిడ.
మూడు నిమిషాల్లో మామూలు మనిషయ్యాక అదిగో, అప్పుడు సాక్షాత్కరించింది సాగరం అందమేమిటో. సాహసంలోని సంతోషమేమిటో.
ఒక్కముక్కలో చెప్పాలంటే ‘అదొక కిక్‌’.
ఐమ్యాక్స్‌లో కూచుని పాప్‌కార్న్‌ నవులుతూ ‘టైటానిక్‌’ త్రీడీలో చూస్తే వచ్చేది మజానా అది? ఛా…
బీచ్‌లో కూచుని చూస్తే అర్థమవుతుందా సముద్రమంటే ఏమిటో? బొమ్మలో చూస్తే అమ్మ ప్రేమ, వెన్నెల సోనా అర్థమవుతాయా?
వెళ్లాలి, లోపలికెళ్లాలి. చుట్టూ నీరు తప్ప మరేమీ కనిపించని దృశ్యాన్ని అనుభవించాలి. చిన్నపడవలో ఊగిపోతూ, నిలువెల్లా తడిసిపోతూ… పోటెత్తిన అలల మీద ప్రయాణం చెయ్యాలి.  అప్పుడు కలుగుతుంది – మానవ జీవితం మీద అత్యంత అభిమానం. సాటి మనిషి పట్ల ప్రేమ. ప్రకృతి శక్తుల మీద పట్టు సాధించిన మానవ మేధ పట్ల అపారమైన గౌరవం.
ఒకటే మాట. ‘అద్భుతం’.
గాలివాలే పనిముట్టుగా హోబీ బోట్లను సముద్ర జలాల్లో అత్యంత లాఘవంగా నడిపిస్తున్న సెయిలర్లు మమ్మల్ని దాటి ముందుకెళ్లిపోయారు. ఆంగ్లో ఇండియన్‌ మెల్విల్‌, హైదరాబాద్‌ నుంచి వచ్చిన అనిరుధ్‌, యాకోబు, పవన్‌.. ఫ్రాన్స్‌ పౌరుడు సుగీ… సర్రుసర్రున తెరచాపల్ని లాగుతూ రేసులో దూసుకుపోతుంటే అత్యంత సమీపంగా చూడాలి. ఆ ఆత్మవిశ్వాసాన్ని మనలోకీ కాస్త నింపుకోవాలి. ఈ రేసులో హోబీ బోట్లు పల్టీలు కొట్టడం మామూలే. క్షణాల్లో వాళ్లు దాన్ని సరిచేసుకోవడం చూడాలి. చిన్నచిన్న ఇబ్బందులకే డీలా పడిపోవడం మానమని మనసుకు థెరపీనివ్వాలి.
‘దిగితేగానీ లోతు తెలియదన్న’ సామెత అనుభవంలోకి తెచ్చుకోవాలి.
గుండె నిండా నిండిపోయిన విలక్షణ అనుభవాన్ని వర్ణించడానికి ఈ భాష, ఈ అక్షరాలు సరిపోతాయా?
మూడున్నర గంటలు సముద్రంలో గడిపిన తర్వాత అడుగు నేలమీద పెడుతున్నప్పుడు ఎప్పుడో అందుకున్న ఎస్సెమ్మెస్‌ గుర్తొచ్చింది. “సముద్రం ఒక్కటే. కొందరికి ముత్యాలు, పగడాలు దొరుకుతాయి. ఇంకొందరికి చేపలు లభిస్తాయి. మరికొందరు కేవలం పాదాల్ని తడి చేసుకునొస్తారంతే. ప్రపంచం కూడా అలాంటిదే. నువ్వు దేనికోసం శ్రమిస్తావో అదే నీకు లభిస్తుంది” అని.

  • హోబీక్యాట్‌ – నిలువెత్తు తెరచాపల సాయంతో గాలివాటానికి దూసుకుపోయే ఫైబర్‌ గ్లాస్‌ పడవ. సాహసికులకు ఆరోప్రాణం. వందల ఏళ్ల క్రితం తమిళ జాలర్లు రెండు తాటి దూలాలకు తెరచాపలు క ట్టి తయారుచేసుకున్న ‘కట్ట-మరామ్‌’ పడవ కాస్తా ఇంగ్లిష్‌ దేశాలకు వెళ్లొచ్చి ‘హోబీ’ అనే నావికుడి చేతుల్లో రీమోడలయి ‘హోబీ క్యాట్‌ కెటమరాన్‌’గా ఇప్పుడు సముద్రంలో విహరిస్తోంది. అలాంటి 18 హోబీ బోట్లు, సముద్ర జలాల్లో వాటిని పరుగెత్తించగల సుశిక్షితులయిన సెయిలర్లు ఏప్రిల్‌ మూడో తేదీకల్లా విశాఖకు వచ్చి వాలారు. ప్రతి రోజూ రెండు రేసులు. బెస్ట్‌ ఆఫ్‌ టెన్‌ ఆధారంగా విజేతలను నిర్ణయిస్తారు.  పౌర్ణమి సమీపిస్తుండటం, వాతావరణంలో చోటు చేసుకున్న అనూహ్యమైన మార్పులతో సముద్రం పోటెత్తింది. గాలివాలు క్షణక్షణానికీ మారిపోయేది. అలాంటి పరిస్థితుల్లోనూ ఎనిమిది రేసులు నిర్వహించిన కమిటీ ‘ఇక తొమ్మిది పదీ వద్దు, ప్రాణాలకే ప్రమాదమం’టూ రద్దు చేసిందంటేనే అలల తీవ్రత ఎలా ఉందో అర్థమవుతుంది.
  • యాటింగ్‌, సెయిలింగ్‌ అంటే ఉత్సాహమున్నవారికి శిక్షణనిచ్చే ‘నేషనల్‌ హోబీ క్లాస్‌ అసోసియేషన్‌’ హైదరాబాద్‌లో ఉంది. దాని కార్యదర్శి కేఎస్‌ పాణిగ్రాహి సెల్‌ నెంబర్‌  9391621916.

 

Advertisements

One thought on “హలో, దిసీజ్ పప్పు from బంగాళాఖాతం – ఓవర్

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s