భట్నవిల్లి…’అచ్చు’ పల్లె

గోదావరి తీరాన అందాల పూల మొక్కల్ని పెంచే కడియం నర్సరీల గురించి అందరికీ తెలుసు కాని పుస్తక సుమాలు పూచిన ‘భట్నవిల్లి’ ఊరు గురించి ఎంతమందికి తెలుసో అనుమానమే. కరెంటు సదుపాయం కూడా లేని ఆ కోనసీమ గ్రామంలో ఒకనాడు ఇంటికో ప్రింటింగ్‌ప్రెస్సు ఉండేదని ఊహించగలమా? ఆడవాళ్లు ఉదయం పూట, మగవాళ్లు రాత్రిపూట జట్లుజట్లుగా, రెండు షిఫ్టుల్లో చెయ్యవలసినంత పని ఉండేదంటే ఆశ్చర్యకరంగా అనిపిస్తుందిగానీ అది ‘అక్షరాలా’ నిజం. 1935లో సంస్కృత పుస్తకాలతో మొదలైన భట్నవిల్లి ముద్రణాశాలల ప్రస్థానం తొలుత పంచాంగాల వరకూ, ఆపై ప్రభుత్వ కార్యాలయాల ఫైళ్లు మొదలుకొని పదోతరగతి గైడ్ల వరకూ విస్తరించి, రకరకాల కారణాలతో క్రమంగా క్షీణించిపోయింది. ఆసక్తికరమైన ఆ చరిత్రను తెలియజెప్పేదే ఈ వారం కవర్‌స్టోరీ.. 

అమలాపురానికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉండే భ ట్నవిల్లి – ఇప్పుడు చూస్తే ఒక మామూలు పల్లెటూరిలాగే కనిపిస్తుంది. చుట్టూ కొబ్బరితోటలు, పచ్చని వరిచేల మధ్య దాక్కున్న ఆ ఊరు ప్రధాన రహదారి పక్కనే కాస్త లోపలికి ఉంటుంది. ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాటలో భాగంగా అక్కడికి వెళ్లిన అరుదైన సందర్భాలలో తప్ప సాధారణంగా భట్నవిల్లి వార్తల్లో కనిపించదు. అలాంటి ఊరు ఒకనాడు పుస్తక ప్రచురణ రంగంలో వారణాసితో సమానంగా విలసిల్లిందని ఎవరైనా చెబితే నమ్మడం కష్టం. అంత ఘనమైన చరిత్రను నిశ్శబ్దంగా తనలో దాచుకున్న ఆ గ్రామం డెబ్బయ్యేళ్ల క్రితమే అనేక పుస్తక పుష్పాలను పూయించిన వనం. ఆ ప్రాచీన సౌరభాలను ఇప్పటికీ అంతోఇంతో వెదజల్లుతూనే ఉంది.

కంచిస్వామి బహుమతి..
చెంతనే అమలాపురం, కాకినాడ, రాజమండ్రి వంటి పట్టణాలుండగా ఈ మారుమూల ఊళ్లోకి ముద్రణాలయాలు ఎలా వచ్చాయి, ఎందుకొచ్చాయి అంటే దానికి కారణం “మహామహోపాధ్యాయ బులుసు అప్పన్నశాస్త్రి” అని భట్నవిల్లి ప్రజలు చెబుతారు. ఆయన తర్క పండితులు. గద్వాల, ఆత్మకూరు వంటి సంస్థానాలకు రాజులు ఆహ్వానించి నియమించుకున్న ఆస్థాన విద్వాంసులు.

ఆయన ఇల్లే ఓ గురుకులం. విద్యార్థులకు వేదం, తర్కం పాఠాలు చెబుతూ పండిత సభల్లో పాల్గొనేవారాయన. 1931లో కంచి పరమాచార్య సమక్షంలో ముంబైలో జరిగిన పండిత పరిషత్తులో పాల్గొన్న అప్పన్నశాస్త్రి “భూమ్మీదగాని, స్వర్గపాతాళ లోకాల్లోగాని తర్కంలో నాతో తలపడేవాడుంటే రండి” అని సవాలు చేస్తే జవాబుగా ఒక్కరు కూడా లేచి నిలబడలేదట! అటువంటి పండితుడు తర్కశాస్త్రానికి రాసిన సులువైన భాష్యాన్ని ప్రచురించాలనే ఉద్దేశంతో కంచి స్వామి ఆయనకు ఓ ముద్రణాయంత్రం బహూకరించారు. అది తొలితరం అచ్చు యంత్రం. ఇద్దరు మనుషులు కండబలమంతా ఉపయోగిస్తే రోజుకు కాసిని పేజీలు అచ్చయ్యేవి.

ఉన్నదేమో ఖండలిపి. అంటే మూడు ఇనప ముక్కలు కలిపితేగానీ ఒక్క అక్షరం తయారయ్యేది కాదు. అంత కష్టమైన పరిస్థితుల్లోనూ భట్నవిల్లి నుంచి 1935 నాటికి ‘ముక్తావళీ సుబోధిని’ అచ్చయి వచ్చింది. దాంతో చుట్టుపక్కల ప్రదేశాల్లోని పండితుల దృష్టి ఈ ఊరి మీద పడింది. తాము రాసిన పుస్తకాలను ప్రచురించి, పదిమందికీ చేరువ చేసే మార్గం దొరికిందన్న సంతోషం వాళ్లది. అప్పటి వరకూ దేవనాగరి లిపిలో పుస్తకాన్ని అచ్చు వెయ్యాలంటే అటు ముంబైకో, వార ణాసికో వెళ్లాల్సిందే. హైదరాబాదులోనూ ఒకటి రెండు ముద్రణాలయాలు ఉండేవి కానీ అవి తెలుగు పుస్తకాల ప్రచురణతో తీరిక లేకుండా ఉండేవి. ఈ కారణాల వల్ల సంస్కృతంలో తాము రాసిన పుస్తకాలను దేవనాగరిలో అచ్చువెయ్యడానికి భట్నవిల్లి ఒక సులువైన గమ్యంగా తోచింది అప్పటివారికి.

శారదా ముద్రణాలయం…
మరీ ప్రాథమిక స్థాయి యంత్రంతో ఎక్కువ పుస్తకాలను అచ్చువెయ్యడం సాధ్యం కాద ని ఆలోచించిన అప్పన్నశాస్త్రి మిత్రులను సంప్రదించారు. అప్పటికే ఏలూరులో ‘వేంకట్రామా అండ్ కో’ను స్థాపించిన ఏనుగుల వేంకట్రామయ్య పంతులుగారి సలహా తీసుకుని ఉన్నంతలో ఆధునికమైన యంత్రాన్ని ఇటలీ నుంచి తెప్పించారు. యంత్రాలు, కాగితాలు వచ్చాయిగానీ వాటిని పెట్టడానికి ఆ ఊళ్లో తాటాకుల ఇళ్లు తప్ప పక్కా ఇల్లన్నదే లేదు. దాంతో మొట్టమొదటి పక్కా భవనాన్ని నిర్మించి ఆయన దానికి ‘శారదా ముద్రణాలయం’ అని పేరు పెట్టారు.

తాము ప్రచురించే పుస్తకాల సిరీస్‌కు ‘శారదా గ్రంథమాల’ అని నామక రణం చేశారు. అప్పటికి అక్కడ 40 -50మంది దాకా సంస్కృత విద్యార్థులుండేవారు. ఒకవైపు పాఠాలు నేర్చుకుంటూనే మరోవైపు అక్షరాలను అచ్చుకోసం పొందిగ్గా పేర్చడం (కంపోజింగ్) నేర్చుకున్నారు వాళ్లు. దాని వల్ల ఒక రచన ముద్రణ కోసం వస్తే, దాన్ని ముందే పరిష్కరించి, తప్పులను తొలగించగల పండితులుగా తయారయ్యారు వాళ్లు. ఫలితంగా భట్నవిల్లి ముద్రణలకు పెద్ద పేరొచ్చింది. “వచ్చింది వచ్చినట్టు మక్కీకి మక్కీ అచ్చు వేసిచ్చేసి చేతులు దులుపుకోవడం కాదిక్కడి పద్ధతి. వ్యాకరణం మొదలుకొని వాక్యనిర్మాణం వరకూ రచన అంతా సరిగా ఉందో లేదో చూసి సంస్కరించే వారిక్కడి విద్యారులూ, పండితూలూ. ఇక ముద్రణలో అక్షరదోషాలంటే సాక్షాత్తూ సరస్వతీదేవికి అపచారం చేసినట్టే అన్నంత నిష్ఠతో ప్రచురణ సాగేది” అంటూ గుర్తు చేసుకున్నారు భట్నవిల్లి గ్రామస్తులు మారేపల్లి యజ్ఞనారాయణ.

ప్రచురణలో అటువంటి శ్రద్ధ, నాణ్యత ఉండేవి కనుకనే ఎక్కడెక్కడి వారూ తమ పుస్తకాలను ఈ ఊళ్లోనే అచ్చుకిచ్చేవారు. “సంస్కృత పుస్తకాల ముద్రణకు పెట్టింది పేరైన కాశీలో ‘నిర్ణయసాగర్’, ‘చౌకంభా పబ్లిషర్స్’ వంటి సంస్థలు తాము ప్రచురించిన పుస్తకాల పేజీలను ప్రెస్ ఆవరణలో ఒక గోడమీద అతికించి, అందులో తప్పులు పట్టుకున్నవారికి డబ్బులిచ్చేవారు. అదే సంప్రదాయాన్ని మా తాతగారు ఇక్కడ కూడా నెలకొల్పారు. మా శారదా ముద్రణాలయంలో అచ్చయిన పుస్తకంలో తప్పు పట్టుకుంటే ఒక తప్పుకు ఐదు పైసల చొప్పున ఇస్తాననేవారు. దాంతో సంస్కృత విద్యార్థులు, పిల్లలు, ఆడవాళ్లు అందరూ వాటిని శ్రద్ధగా పట్టిపట్టి చూసేవారు. ఆయనిస్తానన్న బహుమతి కోసం మాత్రమే కాదు మా ఆత్రం. ఏదైనా తప్పును పట్టుకుని మా పాండిత్యాన్ని ప్రదర్శించుకోవాలన్న సరదా కూడా ఉండేది. అయితే ఎప్పుడూ తప్పులు దొరక్క నిరాశపడేవాళ్లం లెండి…” అంటూ ఆనాటి సంగతులు చెప్పుకొచ్చారు అప్పన్నశాస్త్రి మనవడు బులుసు వ్యాఘ్రేశ్వరుడు.

ఆడవాళ్లే ఆధారం…
నర్సారావుపేటకు చెందిన బెల్లంకొండ రామరాయకవి బ్రహ్మసూత్రాలకు రాసిన భాష్యంతో పాటు మరో వంద గ్రంథాలను ప్రచురించింది శారదా ముద్రణాలయం. అప్పటికి ఆ ఊళ్లో కరెంటు కూడా లేదు. 1941లో అప్పన్నశాస్త్రి భగవద్గీతకు రాసిన వ్యాఖ్యానాన్ని ‘శ్రీమద్భగవద్గీత శంకరభాష్య తత్వబోధిని’ పేరుతో 5 సంపుటాలుగా ప్రచురించారు. దీంతో భట్నవిల్లి ప్రచురణలు ఊపందుకున్నాయి. మరోవైపు ఇక్కడనుంచి ‘సనాతన మతప్రచారిణి’ అనే మాసపత్రిక 1935లో మొదలైంది. ప్రభుత్వం కాగితం సరఫరాపై నియంత్రణ విధించడంతో కటకటపడి 1940 తర్వాత ఆ పత్రిక ఆగిపోయింది.

అలాగని అన్నీ హైందవ గ్రంథాలే కాదు, నండూరి మూర్తిరాజు రాసిన ‘మహమ్మదు జీవితము’ కూడా ఇక్కడే ప్రచురితమైంది. 1953లో ఊరికి విద్యుత్ సదుపాయం రావడంతో శారదా ముద్రణాలయం కాస్తా ‘శారదా పవర్ ప్రెస్’గా రూపం మార్చుకుంది. అప్పటికల్లా భట్నవిల్లిలోని ఆడవారంతా కంపోజింగ్‌లో నిష్ణాతులయ్యారు. కాగితాలను కలిపి కుట్టే ‘సెక్షన్ కుట్టు’లోనూ ఆరితేరారు. “ఉదయమంతా ప్రెస్సుల్లో ఆడవాళ్లే పనిచేసేవాళ్లు. సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకూ మగవాళ్లు పనిచేసేవారు. అంటే రెండు షిఫ్టుల్లో పని జరిగేది. ఇక్కడ ఆడవాళ్లందరికీ హ్యాండ్ కంపోజింగ్ మొదలుకొని ప్రూఫ్ రీడింగ్ వరకూ ప్రచురణకు సంబంధించిన ప్రతి చిన్న సాంకేతిక మెళకువా తెలుసు.

యంత్రాలు మరమ్మత్తుకొస్తేనే మగవాళ్లని పిలిచేది. మా పిన్నిగారయితే ఆ పనులను కూడా తనే చేసుకోగలిగేవారు. పంచాంగాలు, పాఠ్యపుస్తకాలు వంటి పెద్ద ఆర్డర్లుంటే పెళ్లయి అత్తవారిళ్లలో ఉన్న ఆడపిల్లలకు, అక్కచెల్లెళ్లకు కబురు పెట్టేవారు. వాళ్లూ పిల్లలతో సహా పండక్కొచ్చినట్టే వచ్చి పనంతా చకచకా చేసేవారు. ప్రెస్‌లలో నిత్యం ఒక పండగ వాతావరణం, సందడి ఉండేది… కబుర్లాడుకుంటూ ఆడవాళ్లమంతా హాయిగా చేసేసేవాళ్లం ఎంత పనున్నా…” అంటూ చెప్పుకొచ్చారు ఇక్కడే పుట్టిపెరిగిన మారేపల్లి కామేశ్వరి. “కంపోజింగ్ మేం చేసినంత వేగంగా, తప్పుల్లేకుండా చెయ్యడానికి మగపిల్లలు కిందామీదా పడేవారు, మాకెంత గర్వంగా ఉండేదో. పైగా చేసిన పనికి తగిన సంపాదనా వెంటవెంటనే వచ్చేసేది. దాంతో ఇదొక కుటీర పరిశ్రమగా ఊరుఊరంతా వర్థిల్లింది..” అంటూ జ్ఞాపకాల్లోకి జారిపోయారామె.

ప్రింటింగ్ బూమ్..
శారదా ముద్రణాలయంలో పని నేర్చుకున్న సంస్కృత విద్యార్థులు కొందరు అక్కడే సొంతంగా ప్రెస్సులు పెట్టడంతో భట్నవిల్లిలో ప్రింటింగ్ బూమ్ మొదలయింది. శ్రీసీతారామ ప్రింటింగ్ ప్రెస్, విజయలక్ష్మి ప్రింటింగ్ ప్రెస్ వంటివి వచ్చాయి. సామర్థ్యం పెరగడంతో సంస్కృత గ్రం«థాలే కాకుండా తెలుగు పంచాంగాలు, పదోతరగతి వరకూ వివిధ సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు కూడా అచ్చుకు ఇక్కడికే వచ్చేవి. ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన కాగితాలు, న్యాయస్థానాల తీర్పులు, చిన్నచిన్న గెజిట్లు వెయ్యడం కూడా పెరిగింది. “ఎక్కడయినా పనవకపోతే భట్నవిల్లిలో అడగండి, అయిపోతుంది” అన్న పేరుప్రఖ్యాతులొచ్చాయి.

“మొదట్నుంచీ నిజాయితీ, శ్రద్ధ – ఇవే భట్నవిల్లికి పెట్టుబడిగా నిలబడ్డాయి. మా ఇంట్లో, మా క్లాసు ప్రశ్న పత్రాలు అచ్చవుతున్నా కూడా మాకెవ్వరికీ తెలిసేది కాదు. ఎక్కడా లీకులుండకూడదని వాటి చిత్తుప్రతులు, ప్రూఫులు కూడా వెంటవెంటనే తగలబెట్టేసేవారు” అని చెప్పుకొచ్చారు భట్నవిల్లిలోనే పెరిగిన మధురానాథ్. “నిజానికి డబ్బు కోసం ప్రచురణ అనేది భట్నవిల్లి ఉద్దేశం కానేకాదు. మొదట్లో సంస్కృతం, తర్వాత తెలుగు మీద అభిమానంతో, అంకితభావంతో పనిచేసేవాళ్లు. పగలూరాత్రీ అంత పని చేసినా.. ఇక్కడెవరూ దానిమీద తెగ లాభాలు సంపాదించిన ఉదాహరణ ఒక్కటి కూడా లేదు మరి. కరెంటు సదుపాయం వచ్చి ఒకటికి మూడు ప్రెస్సులైనా పోటీ ఉండేది కాదు. ఎవరికి వాళ్లు శ్రద్ధగా చేసుకునేవాళ్లు…” అని చెప్పారు మారేపల్లి యజ్ఞనారాయణ.

సీను మారింది….
1970లకల్లా దేశంలోని విద్యావిధానం సమూలంగా మారిపోయింది. సంస్కృతాన్ని కొత్తగా అభ్యసించడం మాట అటుంచి, కాస్తోకూస్తో చదవగలిగిన పరిజ్ఞానమూ, చదవాల్సిన అవసరమూ కూడా ప్రజల్లో క్రమంగా అంతరించిపోయాయి.
భట్నవిల్లి ముద్రణాలయాల ప్రాభవం క్రమంగా తగ్గిపోవడానికి మొట్టమొదటి కారణం అదే. దీన్ని తట్టుకోవడానికి తెలుగు ముద్రణలు, ఆ తర్వాత ఇంగ్లీష్ కంపోజింగు చేయడం కూడా అలవాటు చేసుకున్నారు. కాలేజీ మ్యాగ జైన్లను కూడా ముద్రించేవారు. అయితే 80లకల్లా తెలుగులో దినపత్రికలు ఊపందుకున్నాయి. భట్నవిల్లిలో కంపోజింగ్ మొదలైన పనుల్లో నిష్ణాతులైన యువతరమంతా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి పట్టణాలకు వలసపోయి దినపత్రికల్లో మంచి వేతనాలకు ఉద్యోగులుగా కుదురుకున్నారు. భట్నవిల్లిలోని కొత్తతరానికి ప్రెస్ పనులు బోర్ అనిపించి ఇందులోకి రాకుండా వేర్వేరు ఉపాధి మార్గాలను ఎన్నుకున్నారు.

వీటికితోడు కంప్యూటర్ల వెల్లువతో డీ టీపీ వచ్చి ప్రచురణలను సులభతరం చేసింది. ఒకసారి కూర్చిన విషయాన్ని కంప్యూటర్లలో భద్రపరిచి ఎన్నిసార్లయినా, ఎప్పుడు కావాలన్నా చిటికెలో ముద్రించుకోవచ్చు. పవర్ ప్రెస్సుల్లో ఈ సౌలభ్యం లేదు. కంపోజ్ చేసిన సెటప్‌ను అచ్చయిన తర్వాత ఏ అక్షరానికా అక్షరంగా మళ్లీ విడగొట్టెయ్యాల్సిందే. దీంతో ముద్రణ ఖర్చు పెరుగుతుంది. వ్యాపారకోణంలో చూసినప్పుడు ఇదంత లాభసాటి వ్యవహారం కాదు. వీటన్నిటికీ మించి అన్నీ క్షణాల్లో అమర్చగల స్పీడును భట్నవిల్లి అందుకోలేకపోయింది. ఎందుకంటే వాళ్లకది వ్యాపారం కాదు. కొంత సేవాదృష్టి, కొంత భాషాభిమానంతో ఆ పనికి పూనుకున్న తరమంతా కాలనాళికలో కలిసిపోయింది. గుప్పుమనే ఇంకు వాసనలూ, యంత్రాల టకటకలూ, పోటీలు పడుతూ పని చేసిన నిష్ణాతులూ.. అన్నీ గతమనే ప్రవాహంలో కనుమరుగై పోయాయి.
——————————–
ఒక్కటి మిగిలింది…
సంస్కృతంలో బాగా పేరున్న మధుసూదన సరస్వతీవ్యాఖ్య, శంకరానందీయము, భాష్యోత్కర్షదీపిక, సదానందీయము, నీలకంఠీయము, శ్రీధరీయము మొదలైన వ్యాఖ్యా విశేషాలను తెలుగులోకి అనువాదం చేసి పుస్తకాలుగా ప్రచురించారు భట్నవిల్లి పండితులు. అలాగని అన్నీ సంస్కృత/సనాతన గ్రంథాలే కాదు, నండూరి మూర్తిరాజు రాసిన ‘మహమ్మదు జీవితము’ కూడా ఇక్కడే ప్రచురితమైంది. అయితే అవేవీ ఇప్పుడక్కడ దొరకవు. భట్నవిల్లిలో ప్రచురించిన పుస్తకాల్లో ఎక్కువ భాగం కంచి కామకోటి పీఠ గ్రంథాలయంలో భద్రంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. బులుసు అప్పన్నశాస్త్రి రాసిన ‘శ్రీమద్భగవద్గీతా శంకరభాష్య తత్వబోధిని’ మాత్రం ఇంటర్నెట్‌లోని కొన్ని డిజిటల్ లైబ్రరీల్లో లభిస్తోంది. అది ఇప్పటికీ భగవద్గీత ప్రేమికులకు ఉపయోగకరంగా ఉండే పుస్తకమని విమర్శకులు చెబుతున్నారు.

 ఫోటోలు: శ్రీవెంకటేశ్వర 

Advertisements

3 thoughts on “భట్నవిల్లి…’అచ్చు’ పల్లె

  1. అచ్చు పల్లెకు ఆద్యులు శీర్షిక బాగుంది.
    మీ ప్రాంతంలోనే మరో ఊరు కూడ చలనచిత్ర ప్రదర్శన శాలలకి, నిర్మాతలకి, పంపిణీదారులకి చాల ముఖ్యమైనది..ముద్రణలకి సంభందించినదే! తెలుసా! 😉

  2. చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఈ సమాచారం ఏదైనా ప్రఖ్యాత దినపత్రికలో వచ్చేలా చూడవలసినది.

  3. అరుణ గారు,

    ఒక చారిత్రిక గ్రామం, దాని విశేషాలు అందించినందుకు కృతఙ్ఞతలు. ఇలాంటివి చదివినప్పుడు త్యాగరాజ కీర్తనలో అన్నట్లుగా ” ఎందరో మహానుభావులు, అందరికి వందనములు ” అని అనుకోకుండా ఉండలేము. అయితే మా మామయ్య విశ్వేశ్వర రావు గారు చెప్పే వారు, అలాంటి మారుమూల గ్రామాలకు అంతంత పెద్ద ప్రింటింగ్ మెషిన్ లు ఎలా చేరవేసేవారో …!

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s