మామామియా జంక్షన్

ఐదో గేరులో దూసుకుపోతూ ‘ఆరో గేరు కూడా ఉంటే బాగుండు’నని ఆలోచిస్తుంటారు జెనరేషన్ వై కుర్రకారు. ‘మామ్ అండ్ డాడ్స్ గిఫ్ట్’ అనో ‘క్యాచ్ మీ ఇఫ్ యు కెన్’ అనో బైక్ వెనకాల రాయించుకుని యమాస్పీడుగా దూసుకుపోయే యువతకు అన్నం, నీళ్లు లేకపోయినా రోజు గడుస్తుందేమోగానీ బండి లేనిదే అరపూటయినా గడవదు. అలాంటివారికి ఊరుకాని ఊళ్లో, వేళకాని వేళలో బైక్‌లు అద్దెకిచ్చేవాళ్లుంటే? ‘వారెవా’ అనే ఈ ఐడియాను ఆచరణలో పెట్టి అందరికీ నచ్చేశారు – ఇద్దరు విశాఖపట్నం కుర్రాళ్లు.
యూత్ పల్స్ యూత్‌కే తెలుస్తుందన్నది లేటెస్ట్ సామెత. కోరాడ సంతోష్‌కుమార్, ఆర్. జగదీష్‌కుమార్… లిద్దరికీ ఆ పల్సేంటో తెలుసు. దానికితోడు కొత్తగా ఏదో చెయ్యాలన్న తపన ఒకటి విషం ఎక్కినట్టు సరసరా ఎక్కేసింది ఇద్దరికీ. జెన్ వైకి సరదాలు తీరాలి, అవసరంలో ఉపయోగపడాలి, నలుగురూ వెరైటీగా ఉందని అబ్బురంగా చూడాలి.

అలాంటి ఐడియా ఏముందని తెగ ఆలోచించారు. గోవా వెళ్లినప్పుడు అక్కడి ప్రదేశాలను చూసి రావడానికి బైక్‌లు అద్దెకి దొరికిన వైనం మదిలో మెదిలింది. “మన విశాఖ గోవాకేం తీసిపోయింది? మనం వాళ్లకన్నా ఎందులో తక్కువ?” అనుకున్నారు. అంతే – కోల్‌కతా విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా చేస్తున్న ఉద్యోగానికి చుక్క పెట్టేసి, విశాఖలో బైక్‌లు అద్దెకి ఇచ్చే ‘మామామియా జంక్షన్’కు రెండు నెలల క్రితం రిబ్బన్ కట్ చేసేశారు.

సంతోష్, జగదీష్‌ల ఆలోచన అమల్లోకి రావడం వెనుక తమ ఐడియా పదిమందికీ నచ్చుతుంద నే ధీమా ఉంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది. బ్యాంకులు రుణాలిచ్చాయి. దాంతో వాళ్లకున్నవి కాక మరో పన్నెండు రకాల మోటార్ బైకులు కొన్నారు. రాయల్ ఎన్‌ఫీల్డు, సీబీజెడ్ మొదలుకొని అమ్మాయిలకు అనువైన డియో వరకూ రకరకాల బళ్లున్నాయి మామామియా జంక్షన్‌లో.

అద్దెకు తీసుకునే బైక్‌ను బట్టి రోజుకు మూడొందల నుంచి ఆరు వందల రూపాయల అద్దె కట్టాలి. అడ్వాన్స్‌గా డబ్బు కట్టనవసరం లేదు. ఇంత దూరమే తిరగాలని నిబంధనలేం లేవు. సిటీ లిమిట్స్ అంటూ ఏం లేవు. పర్యాటకులకు, పనుల మీద నగరానికి వచ్చే ఉద్యోగస్తులకు చాలా సౌకర్యంగా ఉండటంతో సంతోష్, జగదీష్‌ల వ్యాపారం ప్రారంభించిన రెండు నెలల్లోనే ఊపందుకుంది.

“సాధారణంగా ఉద్యోగస్తుల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తాం. కానీ మా దగ్గరకు విద్యార్థులు కూడా చాలామంది వస్తున్నారు. మరీ పదో తరగతిలోపు వారికి, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారికి మేం బైక్స్ ఇవ్వటం లేదు. ఎవరికైనా ఇచ్చేముందు వారి చిరునామా, ఫోన్ నెంబర్ ఇతర వివరాలు తీసుకుని జాగ్రత్తగా పరిశీలిస్తాం.

హోటళ్లలో దిగిన పర్యాటకులు అడిగినప్పుడు వారి వివరాలను కూడా హోటల్ యాజమాన్యాల నుంచి సేకరించి సరిచూసుకున్న తర్వాతే ఇస్తాం..” అంటున్నారు సంతోష్. గోవాలోనైతే పదివేల రూపాయల అడ్వాన్స్ కట్టాలి. లేదా పిలియన్ రైడర్‌ను తీసికెళ్లాలి. ఆ ఇబ్బందులేమీ లేకపోవడం మామామియా ప్రత్యేకత.

అన్నీ ఉన్నాయ్!
ఎంతైనా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కదా, ఈ జాగ్రత్తలకు తోడు ఆరొందల కిలోమీటర్ల పరిధిలో బైక్ ఎక్కడున్నా తెలిసేలా వెహికిల్ ట్రాకింగ్ సిస్టమ్ చిప్‌ను ప్రతి బైక్‌లోనూ అమర్చారు. దీనివల్ల బైక్ దొంగతనాలు, విడిభాగాల అమ్మకాలు వంటివి సాధ్యం కావు. కీడెంచి మేలెంచాలన్నట్టు ‘మా బైక్‌లను తీసుకుని వెళ్లి దొంగతనాలు, యాక్సిడెంట్లు ఇతర అక్రమాలు చేసేవారికి మేం బాధ్యత వహించం.

. ఆ మేరకు వారినుంచి ముందే సంతకాలు తీసుకుంటాం’ అని కూడా చెబుతున్నారీ యువకులు. ‘అదృష్టవశాత్తు ఇప్పటిదాకా అలాంటివేం జరగలేదు. చిన్నాచితకా రిపేర్లు వస్తే వాళ్లే చేయించి ఇచ్చేస్తారు..’ అన్నారు జగదీష్. అర్థరాత్రి క్యాబ్ మిస్సయిపోయిన ఉద్యోగినులు, వారాంతాల్లో సరదాగా తిరుగుదామనుకునే విద్యార్థులు, సిటీలో నాలుగయిదు రోజుల పని చక్కబెట్టుకోవాలనుకునే మార్కెటింగ్ ఉద్యోగులు… మొదలైన వారికి మామామియా జంక్షన్ ఎంతో ఉపయోగపడుతోంది.

యువతరానికి నచ్చేలా ట్రెండీ దుస్తులు, స్టైలిష్ యాక్సెసరీలు కూడా కొలువుదీరాయి మామామియా జంక్షన్‌లో. మామూలుగా వచ్చి గొప్ప ట్రెండీగా తయారయివెళ్లేలా అన్ని పెద్ద బ్రాండ్ల షూలు, స్కార్ఫ్‌లు, జీన్స్, టీషర్ట్స్, టాప్స్, బెల్టులు, బ్యాగులు… సమస్తం దొరికే ఈ చోటును యువత తెగ పావనం చేస్తున్నారంటే ఆశ్చర్యం ఏముంది?

Advertisements

One thought on “మామామియా జంక్షన్

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s