మధురం మధురం మద్రాసు సంగీతోత్సవం- 1

16-12cover1ధనుర్మాసానికీ సంగీతానికీ ఏదో అవినాభావ సంబంధం ఉందేమో! చిరుచలి పెద్దపులిగా మారే ఈ కాలంలోనే హరిదాసు శ్రావ్యమైన కంఠం, చిడతల సవ్వడి అలరిస్తాయి. ముగ్గు పెట్టడానికి సైతం భయపడే ముద్దుగుమ్మల్ని మేల్కొలిపేది ఆండాళ్ పాడిన పాశురాలే. ప్రభాత సమయంలో భజన బృందాల నగర సంకీర్తనలు వినిపించేది ఈ మాసంలోనే. ఈ సంగీత స్వరాలన్నీ కలిసి చెన్నైలో మహా ప్రవాహంగా మారుతాయేమో మరి, నెల మొదలు పెట్టిన దగ్గర నుంచి సంక్రాంతి వరకూ ఆ నగరం కర్ణాటక సంగీతానికి కిరీటమై వెలిగిపోతుంది. కచేరీలతో పాటు వజ్రాల మిలమిలలు, కంచి పట్టుచీరల రెపరెపలు, కబుర్ల గలగలలు, పాత పరిచయస్తుల పలకరింపులు – అన్నీ కలిసి చెన్నై నగరమే ఒక పెద్ద పెళ్లివారింటిలాగా సందడి చేస్తుంది. దాదాపు తొంభ య్యేళ్లుగా జరుగుతున్న మద్రాస్ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రపంచంలోనే అతి పెద్ద సాంస్కృతిక కార్యక్రమంగా ఘనమైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ సంగీతోత్సవం గురించే ఈవారం కవర్‌స్టోరీ.

డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకూ చెన్నై సంగీత సముద్రమైపోతుంది. నాట్యానికి పట్టుగొమ్మయిపోతుంది. వందల మంది కళాకారులు, సుమారు రెండు వేల కార్యక్రమాలు, లక్షలాది మంది శ్రోతలు / వీక్షకులు – వెరసి ఎటు విన్నా సంగీతమే, ఎక్కడ చూసినా నాట్యమే. నాట్య – సంగీత కళాకారులై ఉండి, ఆ రంగంలో ఉండి ఇక్కడ కనిపించలేదంటే వారి ప్రతిభను అనుమానించాల్సిందే అన్నంత బలంగా ఉంటుందీ సంస్కృతి. కులం, మతం, ప్రాంతం – ఇవేవీ అడ్డుకావు. ‘ప్రతిభ ఉందా, రండి, ప్రదర్శించండి… రసికుల మన్ననలు పొందండి’ అదొక్కటే ముఖ్యం. వారికి నచ్చిందంటే సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తిగా అభిషిక్తమయినట్టే. జూనియర్లకు తమ ప్రతిభా ప్రదర్శనకు ఇలాంటి వేదికలు మరోచోట దొరికే అవకాశమే లేదు. విదేశాల నుంచి వచ్చిన నిర్వాహకుల కంట్లో పడితే పంట పండినట్టే. సీనియర్లు శభాషంటే పది మెట్లెక్కేసినట్టే. రసికులకైతే వీనుల విందే. ఉదయం పూట వివిధ అంశాలపై సీనియర్లు ఇచ్చే సోదాహరణ ప్రసంగాలు (లెక్చర్ డిమాన్‌స్ట్రేషన్లు) విద్యార్థులకు, పరిశోధకులకు ఎంతగానో ఉపయోగకరం. మధ్యాహ్నం జూనియర్ల కార్యక్రమాలు, సాయంత్రాలు సీనియర్ల కచేరీలు. ఇలా నెలంతా సంగీతోత్సవమే. దేశంలో మరెక్కడా ఇటువంటిది లేదు.

ఘనమైన చరిత్ర…
ఈ ఉత్సవాలు ఒక్క చెన్నైలోనే, అదీ ఈ నెలలోనే జరుగుతున్నాయంటే దానికి చారిత్రక కారణాలు తప్పకుండా ఉండే ఉంటాయి. వాటి గురించి చెన్నైకి చెందిన ప్రముఖ సంగీత చరిత్రకారుడు వి.శ్రీరామ్‌ను అడిగితే ఇలా చెప్పారు. గుజరాత్‌లోని సూరత్, ఆంధ్రాలోని మచిలీపట్నం తర్వాత బ్రిటిష్‌వారు 1839లో వ్యాపారానికి అనువైన ప్రదేశంగా ఎంచుకున్న రేవు పట్టణం మద్రాస్. వారికి వ్యాపార, పాలనాపరమైన వ్యవహారాల్లో సాయపడిన వారు ద్విభాషీ (దుబాసీ)లు. పాలకులు, పాలితులకు భాషాపరమైన అంతరాలు చాలా ఉండటంతో దుబాసీలకు సమాజంలో ప్రముఖ స్థానం లభించింది. దాదాపు సామంతరాజులంత ఐశ్వర్యంతో తులతూగేవాళ్లు వాళ్లు.

వారంతా తమ హోదాను తెలియజెయ్యడం కోసం సంగీత నాట్య కళాకారులను పోషించేవారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని చిన్నచిన్న రాజ్యాలు, సంస్థానాల ప్రాభవం తగ్గిపోతుండటంతో తమకు తగిన ప్రాపకం లభిస్తుందని భావించిన కళాకారులంతా మద్రాసుకు చేరుకోవడం మొదలెట్టారు. పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన ఇద్దరు పండితులు రాసిన ‘సర్వదేవ విలాస’మనే సంస్కృత గ్రంథంలో వీటికి ఆధారాలు లభిస్తున్నాయి. దుబాసీల ప్రాభవం తగ్గిపోయిన తర్వాత వకీళ్ల ప్రాధాన్యం పెరిగింది. న్యాయవాదులు, వ్యాపారస్తులు కలిసి సంగీతం, హరికథా ప్రదర్శనలను ఏర్పాటు చేసేవారు. ఇలా ఏర్పడిన మొదటి సభ ‘మద్రాస్ జూబిలీ గాయన్ సమాజ్’. మద్రాస్ రైల్వే కంపెనీలో ఉద్యోగిగా పూణే నుంచి మద్రాసుకు బదిలీ మీద వచ్చిన మరాఠీ పెద్దమనిషి బలవంత్ త్రయంబక్ సహస్రబుధే అప్పటికే ఏర్పడిన ‘పూణే గాయన్ సమాజ్’ స్ఫూర్తితో ‘మద్రాస్ జూబిలీ గాయన్ సమాజ్’ ను 1887లో ఏర్పరిచారు.
విక్టోరియా రాణి గోల్డెన్ జూబిలీ వేడుకలప్పుడు ఏర్పడింది కనుక పేరులో ‘జూబిలీ’ అని పెట్టారు. దానికి మహారాజ పోషకుడు ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ (విక్టోరియా రాణి రెండో కుమారుడు).

తర్వాత నెమ్మదిగా 1895లో భక్తి మార్గ ప్రసంగ సభ, 1900లో శ్రీపార్థసారధి స్వామి సభ, 1908లో శారదా గాయన్ సమాజ్ ఏర్పడ్డాయి. వీటిలో పార్థసారధిస్వామి సభ ఇప్పటికీ ఉంది. కచేరీలకు టికెట్లమ్మడం మొదలుపెట్టింది తొండైమండలమ్ సభ. ఇది పెద్ద దుమారాన్నే రేకెత్తించింది. ‘నా కళను అమ్ముకొంటానా’ అని ఒక సంగీత విద్వాంసుడు కచేరీని రద్దు చేసుకుని వెళ్లిపోయారట!

1927లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ లాంఛనంగా ఏర్పడింది. ఆ ఏడు డిసెంబర్‌లో కాంగ్రెస్ పార్టీ వార్షిక సభలు జరిగాయి. వాటికి అనుబంధంగా మ్యూజిక్ అకాడమీ మొదటిసారి ఒక సిరీస్‌గా సంగీత కచేరీలను నిర్వహించింది. ఆ సందర్భంలోనే అరుదైన రాతప్రతులు, సంగీత వాద్యాల ప్రదర్శన కూడా డిసెంబర్ 24 నుంచి జనవరి 1 వరకూ జరిగింది. అది క్రిస్మస్ సమయం కావడంతో నాటి బ్రిటిష్ ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, హైకోర్టు అన్నీ సెలవుల్లో ఉన్నాయి. దాంతో సంగీత సభలకు పెద్దపెద్దవారి హాజరు పెరిగి కనీవినీ ఎరుగని రీతిలో అవి విజయవంతమయ్యాయి. అప్పుడు మిగిలిన నిధులతో, సమాజంలోని ప్రముఖుల అండదండలతో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ 1928 ఆగస్టు 28న ఒక ఘనమైన సంస్థగా ఆవిర్భవించింది. నిజానికి ఈస్టర్ పండగ (ఏప్రిల్) సమయమూ సెలవుల పరంగా సంగీతోత్సవానికి అనువైనదే అయినా, హడలెత్తించే మద్రాసు వేడి వల్ల ఎక్కువమంది ఆంగ్లేయులు డిసెంబర్ వైపే మొగ్గుచూపారు.

మన మార్గశిర మాసం లాగానే తమిళ పంచాంగాల ప్రకారం డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకూ మార్గళి మాసం. ఆ రోజుల్లో దైవాన్ని సంగీతంతో అర్చిస్తే మంచిదనే విశ్వాసం దక్షిణాదిన అధికం. ధనుర్మాసం రాగానే హరిదాసుల మధురమైన భజనలు వినిపించడం మనకు కూడా తెలిసిన సంప్రదాయం. ఇదిగాక ఆండాళ్ తన మధురమైన పాశురాలతో విష్ణుమూర్తిని కొలిచిందీ మార్గళి మాసంలోనే. ఇన్నీ కలిసొచ్చి డిసెంబర్ (మార్గళి) మాసమంతా మధురమైన సంగీతోత్సవానికి వేదికైంది. ‘యాంటీ నాచ్ మూవ్‌మెంట్’ ఊపందుకొని దేవదాసీ వ్యవస్థ రద్దు కోసం డాక్టర్ ముత్తులక్ష్మీ రెడ్డి పోరాడి గెలిచిన రోజులవి. 1927లో ఆ వ్యవస్థ రద్దవడంతో సంప్రదాయ నాట్యకళ అంతరించిపోతుందనే భయం సర్వత్రా వ్యక్తమయింది. దాన్ని తొలగించడానికి మ్యూజిక్ అకాడమీ ముందుకొచ్చి 1933 నుంచి మార్గళి ఉత్సవంలో సంగీతంతో పాటు నాట్యానికీ పెద్ద పీట వేసింది. అప్పటివరకూ దేవదాసీలకే పరిమితమనుకున్న నాట్యశాస్త్రం వైపు ఇతర వర్ణాల స్త్రీలు సైతం ఆకర్షితులు కావడం మొదలయిందిక్కడే.

సభలూ సంగతులూ
సెలయేళ్లన్నీ కలిసి ఒక మహానదిగా ఏర్పడినట్టు ఒక్కొక్కటిగా మొదలైన సభ (సాంస్కృతిక సంస్థ)లు ప్రస్తుతం చెన్నైలో దాదాపు 70కి పైగా ఉన్నాయని అంచనా. అవన్నీ కలిసి ఈ ఒక్క నెలలోనే దాదాపు 2000 కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. డెబ్భై సభల్లో ఒకోదానిలో ఏడొందల సీట్లుంటాయనుకుంటే ఒకరోజులో మొత్తం 49,000 వేల మంది కూచొని కార్యక్రమాలను వినే/చూసే అవకాశం ఉంటుంది. ఇంత సంరంభమూ ప్రభుత్వ ప్రమేయమేమీ లేకుండానే సాగడం ఒక విచిత్రం! మార్గళి సంగీత ఉత్సవంలో గొప్ప విషయం ఏమంటే – ఇదంతా పూర్తిగా వ్యక్తుల కృషి ఫలితం.

కార్యక్రమాల నిర్వహణకు నడుం బిగించినవారంతా ఎక్కువ భాగం స్వచ్ఛందంగానే పనిచేస్తారు తప్ప, జీతభత్యాలేమీ ఉండవు. అలాగే కొన్ని వందల మంది విద్యార్థులకు, యువతరంగాలకు సంగీత నాట్య రంగాల్లో తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం వేరే ఎక్కడా ఇంతగా ఉండదు. ఇప్పుడున్న మొదటి శ్రేణి విద్వాంసులైన సంజయ్ సుబ్రమణ్యం, సుధా రఘునాథన్ వంటివారంతా కొన్నేళ్ల కిందట చిన్నపిల్లలుగా బెరుకుబెరుగ్గా వేదికలెక్కినవారే. ఈ నెల రోజులూ టీవీ ఛానెళ్లూ, సినిమా థియేటర్లూ, క్రికెట్ మ్యాచ్‌లూ ఆకర్షణని కోల్పోతాయని చెప్పడం అతిశయోక్తేమీ కాదు.

ఈ కార్యక్రమాలకు విరగబడే జనం వల్ల ఈ నెలలో చెన్నైలో ట్రాఫిక్ జామ్ నిత్యకృత్యమైపోతుంది. ఇంత కోలాహలానికి కారణమైన సభల మధ్య సహజంగానే తీవ్రమైన పోటీ ఉంటుంది. తాము నిర్వహించే కచేరీలు, ఆహ్వానించే విద్వాంసులు, వారికిచ్చే పారితోషికాలు, ప్రదానం చేసే బిరుదులు, సొంత ఆడిటోరియమ్ కలిగి ఉండటం, ఆఖరికి క్యాంటీన్ల నిర్వహణ వరకూ… అన్నిటా ఈ సంస్థలు ఒకదానితో ఒకటి తీవ్రంగా పోటీ పడుతుంటాయి. ఇది కూడా ఈనాటిది కాదు. తమిళ్ ఇసై సంఘానికి కళాకారుల్లో ఎమ్మెస్ సుబ్బులక్ష్మితోపాటు నగరంలో ఐశ్వర్యవంతులయిన చెట్టియార్ల అండదండలుండేవి. మ్యూజిక్ అకాడమీకి ముందు నుంచీ గవర్నర్లు, మంత్రులు, ప్రముఖులు కొమ్ముకాసేవారు. వారిలో అప్పటి పరిశ్రమల మంత్రి టీటీ కృష్ణమాచారి ముందువరసలో ఉండేవారు.

క్యాంటీన్ కబుర్లు…
దాదాపు అన్ని సభలకూ అనుబంధంగా క్యాంటీన్లున్నాయి. వీటిలోని కాఫీ పొగలు, దోసెల రుచులు సంగీతంతో పోటీ పడుతుంటాయి. కచేరీల మధ్య విరామాల్లో ఇడ్లీ, దోసెలు లాగిస్తూ సంగీతానికి సంబంధించిన కబుర్లను నంచుకుంటుంటే వాటి రుచి రెట్టింపయినట్టు అనిపిస్తుందంటే నమ్మండి. కర్ణాటక సంగీతమా, కాఫీ పరిమళమా… దేన్ని ఎంచుకోవాలో తెలియక మనసు ఆరోహణకూ అవరోహణకూ మధ్యనెక్కడో స్వరాల్లో ఊగిసలాడుతుంది. రసికుల ఈ అవస్థను క్యాంటీన్ మేనేజర్లూ క్యాష్ చేసుకుంటారు. ఈ నెలలో ఏదో లాభాలు వచ్చిపడిపోతాయని కాదు వాళ్లు ఆరాటపడేది, ఇప్పుడు సంపాదించిన పేరును పెట్టుబడిగా పెట్టి ఏడాదంతా ఆర్డర్లు చేజిక్కించుకోవడానికే వాళ్ల తాపత్రయం.

కొంతమంది క్యాంటీన్ మేనేజర్లకు సినిమా స్టార్లకున్నంత ఆదరణ ఉంటుందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఉదాహరణకు – ఏళ్ల తరబడి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఇంట్లో వంటమనిషిగా ఉన్న ‘కాశీ హల్వా కృష్ణమూర్తి’ ఆ తర్వాత పెద్ద కేటరర్‌గా అవతారమెత్తాడు. అలాగే క్యాంటిన్ మేనేజర్లు అయిన’అరసు నటరాజన్’ ‘జ్ఞానాంబిక జయరామన్’ వంటివారు కూడా అందరికీ సుపరిచితులు. సభలు సైతం క్యాంటీన్ నిర్వహణను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తాయి. ఈ పోటీ ఇప్పుడు ఎంతవరకూ వచ్చిందంటే ‘ఫలానా సభలో కచేరీ వినకపోయినా పర్లేదుగానీ, అక్కడి క్యాంటీన్లో కాఫీ తాగకపోతే వేస్టు’ అనుకునే వరకూ! నిజానికి కచేరీలో కూర్చుని వినడం కన్నా, క్యాంటీన్లో కూర్చుని కబుర్లాడేవారే ఎక్కువమంది. ఎడతెగని చర్చలు వాళ్ల మధ్య. ఈ సీజన్లో ఎవరు బాగా పాడారు, కిందటేడుతో పోలిస్తే మెరుగయిందెవరు… ఈ తరానికీ, వెనకటి తరానికీ ఉన్న తేడాలేమిటి, ఇవన్నీ వేడి వేడి చర్చనీయాంశాలవుతుంటాయి. ల్యాప్‌టాప్‌లూ, ఎలక్ట్రానిక్ తంబురాలూ, శృతిపెట్టెలూ వచ్చి సంగీతాన్ని పాడు చేసేస్తున్నాయని బాధ పడటమూ కనిపిస్తుంది. పనిలో పనిగా పెళ్లి సంబంధాలు ఆరాతీయడమూ మామూలే.

విమర్శలూ ఉన్నాయి…
మ్యూజిక్ ఫెస్టివల్‌లో జరిగే కార్యక్రమాల సంఖ్య ఏటికేడు పెరుగుతూనే ఉంది. కచేరీస్ డాట్ కామ్ లెక్క ప్రకారమైతే ఈసారి జరగబోయే కార్యక్రమాలు 2,566. ఇందులో సింహభాగం కచేరీలదే. అవిగాక 84 సోదాహరణ ప్రసంగాలు, 9 హరికథలు, 10 కూచిపూడి, 192 భరతనాట్యం, 28 డ్యాన్స్ డ్రామాలు, ఇతర భారతీయ నృత్య కార్యక్రమాలు జరుగుతాయి.

2004 – 2005 సీజన్‌లో అయితే సుమారు 700 గాత్రకచేరీలు, 250 వాద్యకచేరీలు, 200 నాట్యప్రదర్శనలు, 50 నాటక ప్రదర్శనలు- వెరసి 1200 ప్రదర్శనలు జరిగాయి. ఇది సీజన్ విస్తారాన్ని సూచిస్తున్నా కొందరు విమర్శకులు పెదవి విరుస్తున్నారు. ఇన్నిన్ని కార్యక్రమాలు ఒక జాతరలాగా జరగడం వల్ల సంగీతానికి ఒనగూడుతున్న మేలేమీ లేదని వాళ్ల వాదన. “ఒక్క నెలలో పదిహేను ప్రద ర్శనలివ్వడమంటే కళాకారుడికి కత్తి మీద సామే. దానివల్ల వాళ్ల మీద ఒత్తిడి పెరిగి వాళ్లు అలిసిపోతారు. ప్రతిభను సరిగా ప్రదర్శించలేరు. సంగీతం వినడానికి, నాట్యం చూడటానికి వెళ్లే మామూలు జనాలకీ ఇది ఇబ్బందే. ఒకదానికి వెళితే మరొకచోట జరుగుతున్న మరో మంచి ప్రదర్శనకు వెళ్లలేరు. నిర్వాహకులు కూడా ఈ సీజన్‌లో సర్కస్ చేసినంత కష్టపడతారు. ఎందుకిదంతా…” అని చిరాకు పడేవాళ్లు కూడా ఉన్నారు.

సంగీత ఐపీఎల్
కానీ ఈ సీజన్లో కార్యక్రమాలకు ఏటాటా పెరుగుతున్న సంఖ్యను చూసినా, కిటకిటలాడుతున్న సభలను చూసినా, కార్పొరేట్ స్పాన్సరర్ల జోరును గమనించినా ఇదంతా తప్పని తేలిపోతుంది. ఇది అందరికీ వాణిజ్య సమయమే. సంగీత సభలకు మధ్య, ఎగువ మధ్యతరగతి జనాలే వస్తారు గనుక కార్పొరేట్ స్పాన్సరర్లు విజృంభించి ప్రకటనలిస్తారు. 1935లో నిధుల కోసం మ్యూజిక్ అకాడమీ సావనీర్‌ను ప్రచురించడం ప్రారంభించాక, సభలన్నీ ఆ సంప్రదాయాన్ని కొనసాగించాయి. వీటిలో మహామహులు రాసిన వ్యాసాలుండడంతో అవి సంగీత చరిత్రను తెలియజెప్పే విలువైన నిధిగా రూపొందాయి. చెన్నైలో ఈ సమయంలో ప్రభావితం కాని రంగమే ఉండదు. మామూలుగానైతే డిసెంబర్లో డైరీలు, క్యాలెండర్లను అచ్చు వెయ్యడంలో ప్రెస్సులన్నీ బిజీగా ఉంటాయి. చెన్నైలోని ముద్రణాలయాలకు మాత్రం డిసెంబర్ ముందు నుంచే పనుల ఒత్తిడి మొదలయిపోతుంది.

కచేరీల వివరాలు తెలిపే కరపత్రాలు, సీజన్ క్యాలెండర్లు, ఆహ్వానపత్రికలు, కీర్తనల పుస్తకాలు….అన్నిటికీ మించి సభల సావనీర్ల ప్రచురణతో వాటికి ఊపిరి సలపని పని. పూర్వం గ్రామఫోన్ కంపెనీలు వాటి రికార్డులను ఈ సీజన్‌లోనే రిలీజ్ చేసేవి. సరస్వతి స్టోర్స్, హెచ్ఎంవీ వంటి సంస్థలు కూడా రిలీజ్‌లకు సంబంధించి దినపత్రికల్లో పెద్దపెద్ద ప్రకటనలిచ్చేవి. అప్పుడు రిలీజయిన రికార్డులపై సమీక్షలను ఈ సీజన్ వార్తల పక్కనే ప్రచురించేవి పత్రికలు. సీజన్‌లో జరిగిన కచేరీని యథాతథంగా రికార్డు చేసి రెండు రోజులు తిరిగేసరికల్లా రికార్డులు విడుదల చేసే ఏవీఎం సంస్థంటే సంగీతప్రియులు పడిచచ్చేవారు. మొన్న తొంభైల వరకూ క్యాసెట్లన్నీ ఈ సీజన్లోనే రిలీజయ్యేవి. ఇప్పుడు ఆ స్థానాన్ని సీడీలు ఆక్రమించాయి. దినపత్రికలు, రేడియో, టీవీ ఛానెళ్లన్నీ సీజన్ వార్తలతో, విశ్లేషణలతో నిండిపోతాయి. హోటల్లో గది దొరకడమే గగనమైపోతుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే – క్రికెట్లో ఐపీఎల్ ఎలాగో కర్ణాటక సంగీతానికి ఈ సీజన్ అటువంటిది.

ప్రవాసుల పదనిసలు…
ఈ సమయానికల్లా వచ్చి చెన్నైలో వాలిపోయే ప్రవాసులకూ కొదవేం లేదు. వణికించే చలిని, గడ్డకట్టించేసే మంచు కష్టాలనూ వదిలించుకోవడం ఒకటి, పుట్టిపెరిగిన చోట బంధాలను, ఆప్యాయతలను పంచుకోవడం మరొకటి – ఒక్క దెబ్బకు రెండు పిట్టలు. అందుకే యూరప్, అమెరికా, ఆస్ట్రేలియాల నుంచి వచ్చే వీళ్ల కోసం ప్రత్యేకంగా పేయింగ్ గెస్ట్ సౌకర్యాలు, సర్వీస్ అపార్ట్‌మెంట్లు, బడ్జెట్ హోటళ్ల వంటివి పుట్టుకొచ్చాయి. మొదట్లో కేవలం వినడానికే వచ్చే ప్రవాస కళాకారులు ఇప్పుడు ఇక్కడ తామూ ఒక కార్యక్రమాన్ని దక్కించుకుంటే మేలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. విదేశాల్లో తమ దగ్గర విద్య నేర్చుకుంటున్న శిష్యులతో కలిసి పెద్ద బృందాలుగా వచ్చి ఆ నెల రోజులూ నగరంలో మకాం వేస్తున్నారు. దీనితో బోలెడు ప్రయోజనాలు. అటు విద్యార్థులకు సంగీత సంప్రదాయాలూ తెలుస్తాయి, ఇటు గురువులకు పేరూ వస్తుంది. అలాగే ఎక్కడ ఉన్నా మూలాలను మరిచిపోని యువతరం ఇక్కడ పెద్దవారి ‘దృష్టి’లో పడుతుంది. అమెరికాలో మృదంగ విద్వాంసుడైన తిరుచి శంకరన్‌కు రెండేళ్ల క్రితం మ్యూజిక్ అకాడమీ ‘సంగీత కళానిధి’ బిరుదు లభించడం ఇందువల్లనే.

సంక్రాంతి ముందు తిరువాయూరులో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలతో ఈ వేడుక పరిసమాప్తమవుతుంది. ఆ తర్వాత సభలు బోసిపోతాయి. కళాకారులు, శ్రోతలు ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయాక సభలన్నీ – పెద్ద పండగకొచ్చిన పిల్లలు వెళ్లిపోయిన తర్వాత పల్లెటూరి ఇళ్లు ఎలా ఉంటాయో అలా ఉంటాయి.
======================
ఈసారి స్టార్లు ఎవరంటే….
హైదరాబాద్‌కు చెందిన వైజర్సు బాలసుబ్రమణ్యం మ్యూజిక్ అకాడమీలో అనుస్వరాల మీద సోదాహరణ ప్రసంగం చేస్తారు. అన్నమయ్య, క్షేత్రయ్య, సారంగపాణి పదముల గురించి వీఏకే రంగారావు, నృత్యంలో లయ గురించి రాజేశ్వరీ సాయినాథ్, శ్రీపాద పినాకపాణి సంగీతం గురించి నేదునూరి కృష్ణమూర్తి ఆయన శిష్యులు మల్లాది సోదరుల ప్రసంగాలున్నాయి. బోంబే జయశ్రీ, టీఎం కృష్ణ, సుధా రఘునాథన్, సంజయ్ సుబ్రమణ్యం, ప్రియా సిస్టర్స్, మన హైదరాబాద్ బ్రదర్స్, పంతుల రమ, మండా సుధారాణి, మల్లాది సోదరుల వంటి వారివి బోలెడన్ని కచేరీలున్నాయి.

సరస్వతీదేవి ప్రత్యక్షమైనట్టే…
గాత్రం, వయొలిన్, మృద ంగం, వీణ, మాండలిన్… ఒకటేమిటి సంగీతానికి సంబంధించిన ప్రతి అంశంలోనూ పాండిత్యం ఉన్న శ్రోతలు, విద్వాంసులు, పండితులు, విద్యార్థుల సంగమస్థలిగా ప్రతి సభా, ప్రతి కచేరీ సాక్షాత్తూ సరస్వతీదేవి కొలువులాగా అనిపిస్తుంది. “మద్రాస్ మ్యూజిక్ సీజన్‌లో గొప్ప విశేషం అదే. సంగీత శిఖరాల వంటి పెద్దల కచేరీలకు ముందు యువతరానికి అవకాశాలిస్తారు. దానివల్ల తరాల అంతరాలు సమసిపోతాయి. పెద్దవారు చిన్నవారిని సరిదిద్దుతారు, వాళ్లని చూసి విద్యార్థులు నేర్చుకుంటారు. అక్కడి రసికుల మెప్పు పొందడమే కష్టం, ఒకసారి ఆ స్థాయినందుకున్నామంటే ఇక వాళ్లు నెత్తిమీద పెట్టుకుంటారు. ప్రసంశల జల్లు కురిపిస్తారు, గొప్ప అవకాశాలిస్తారు. సంగీతపరమైన ప్రగతి సాధించడానికి తగిన సలహాలూ సూచనలూ ఇస్తారు. ప్రొఫెషనల్‌గా రాణించడానికి తగిన వాతావరణం ఉంటుందక్కడ…” అంటున్నారు విశాఖపట్నానికి చెందిన భార్యాభర్తలు పంతుల రమ, ఎమ్మెస్సెన్ మూర్తి. ఆమె గాత్ర సంగీతం, ఆయన వాయులీన విద్వాంసులు. ఈ జంట 90లనుంచి దాదాపు ప్రతిఏటా సీజన్‌లో పది కచేరీలిస్తారు మద్రాసులో. “దశాబ్దాల నుంచి సాగవుతున్న సంగీత సుక్షేత్రం చెన్నై. అందుకని అక్కడ సంగీతస్వరాలు విరగపండుతాయి. తెలిసి వినే శ్రోతల మధ్య ప్రదర్శనలివ్వడం వల్ల కళాకారులకు మేలు జరుగుతుంది. ఏటికేడూ మన విద్యలో ఎంత అభివృద్ధి సాధిస్తున్నామో అక్కడి రసికులు జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు” అంటున్నారు అంతర్జాతీయ పర్యటనలతో నిత్యం బిజీగా ఉండే మృదంగ విద్వాంసుడు వంకాయల రమణమూర్తి. ముప్పయ్యేళ్ల క్రితం మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో ‘అత్యుత్తమ విద్యార్థి’గా తొలి కితాబు లభించిన చోటే కిందటి సీజన్‌లో ‘బెస్ట్ సీనియర్ మృదంగ విద్వాన్’ అవార్డునూ అందుకున్నారాయన.

తెలుగా – తమిళమా?
సంగీతోత్సవం ఊపందుకుంటున్న తొలి ఏళ్లలోనే భాషాపరమైన భేదాలు భగ్గుమన్నాయి. 1940ల్లో సంగీతంలో తమిళానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని జస్టిస్ పార్టీ ఉద్యమించింది. మద్రాసు మ్యూజిక్ అకాడమీ వంటి సంస్థలేవీ దానికి మద్దతివ్వకపోవడంతో 1943లో ‘తమిళ ఇసై సంఘమ్’ ఏర్పడింది. అది నిర్వహించే తమిళ్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో తమిళ కీర్తనలు తప్ప వేరే ఏమీ పాడరు. ‘దక్షిణాదిన తెలుగు రాజుల పాలన ఎక్కువ కాలం కొనసాగింది గనుక ప్రభుత్వ, కోర్టు వ్యవహారాలు వాటితో పాటూ సహజంగానే సంగీతంలోనూ తెలుగుకు పెద్ద పీట వేశారు. కర్ణాటక సంగీతానికి ఆద్యులుగా త్రిమూర్తులుగా కొలిచే త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు – ముగ్గురూ తెలుగువారే. విశాల దృష్టి ఉన్నవారు సంగీతంతో ప్రపంచాన్ని ఏకం చేస్తారుగానీ, చిన్నచిన్న తేడాల జోలికి పోరు’ అంటున్నారు నేటి తరం విద్వాంసులు.

Advertisements

3 thoughts on “మధురం మధురం మద్రాసు సంగీతోత్సవం- 1

  1. aruna garu namaste,

    ur articles are good n enlightening.

    pl see my articles also. they are published in various news papers and then posted in my blog: telanganatours.blogspot.in

    …dr. d. satyanarayana

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s