‘జల్సా’లో టీఎమ్ కృష్ణగారిని చూశాను, మాట్లాడాను

యంగ్ హృదయాలను సంగీత తరంగాలలో ఓలలాడించడానికి కంకణం కట్టుకున్న ‘ఐడియా జల్సా’ అనే కార్యక్రమం విశాఖపట్నం వేదికగా ప్రారంభమైంది. 35ఏళ్ల వయసుకే ప్రపంచ ఖ్యాతినీ, శిష్యప్రశిష్యులనూ సంపాదించుకున్న కర్ణాటక సంగీత విద్వాంసులు టీ.ఎం.కృష్ణ దీనికి శ్రీకారం చుట్టారు. ఆ సందర్భంగా ఆయనతో ‘నవ్య’ మాట కలిపింది.

కేవలం కచేరీలు, బోధనతో ఆగిపోకుండా వివిధ కార్యక్రమాలనూ ముందుండి నడిపిస్తున్నారు మీరు…
మన సంగీతం ప్రపంచంలోని అన్ని మూలలకూ చేరాలనేది నా లక్ష్యం. సంప్రదాయ సంగీత చరిత్ర పరిశోధనకు ‘జ్ఞానార్ణవ’ అనే ట్రస్టును స్థాపించి పని చేస్తున్నా. మొన్నీమధ్యన వరకూ మన దేవాలయాలు అన్ని కళలకూ నిలయాలుగా విలసిల్లేవి. పేదగొప్ప భేదాల్లేకుండా, కులాల కీచులాటలు లేకుండా అక్కడకు అందరూ వచ్చేవారు, అన్ని విద్యలకూ ఆలవాలమయేవి. కేరళలో ఇప్పటికీ అటువంటి వాతావరణం ఉంది. ఆ సంస్కృతి అన్నిచోట్లా మళ్లీ నెలకొంటే గుడికి వెళ్లే ప్రతిఒక్కరికీ మన సంప్రదాయ సంగీతం, కళల పట్ల ఆసక్తి పెరుగుతుందనే ఆలోచనతో ‘కలాచార మరుమలార్చి’ అనే కార్యక్రమం చేపట్టాను. దీనిద్వారా తమిళనాట అన్ని ఊళ్లలోనూ దేవాలయాలు మళ్లీ కళలకు నిలయాలయ్యేలా కృషి చేస్తున్నాం. మన సంగీతాన్ని ఎవరైనా అర్థం చేసుకునేందుకు వీలుగా ‘రసికత్వమ్’ అనే పుస్తకాన్ని రాసి, సీడీలతో పాటుగా విడుదల చేశాను.

వయసులో చిన్నవారే అయినా, పెద్ద పనులు చేస్తున్నారు…
ప్రతిభకు పెద్దాచిన్నా అనేమీ లేదు. సంగీత రంగంలో ఎంతో ప్రతిభ ఉన్నా సరైన వయసులో సరైన అవకాశాలు దొరక్కపోతే నిలబడటం ఎంతో కష్టం. అది నాకు అనుభవపూర్వకంగా తెలుసు. అందుకే సంగీతంలో ప్రతిభ కనబరుస్తున్న టీనేజ్ బాలబాలికల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నా. దీనికి నేను పెట్టిన పేరు ‘సుమనస’. దీనిద్వారా ఎంపిక చేసిన సంగీత విద్యార్థులను చెన్నై తీసుకొచ్చి, వాళ్ల ఖర్చులన్నీ భరిస్తూ గొప్ప గురువుల దగ్గర చేర్చి వాళ్లను విద్వాంసులుగా తీర్చిదిద్దుతాం. ఇలా ఇప్పటికి ఐదారుగురు గొప్ప యువ ప్రతిభావంతులు నాదగ్గరున్నారు. అలాంటి చేయూత అవసరమైన వారు ఇంకా బోలెడంత మంది ఉండొచ్చు. కానీ నా పరిధిలో చెయ్యగలిగినదిది. వర్థమాన కళాకారులకు పెద్దవాళ్ల అనుభవమూ, జ్ఞానమూ ఉపయోగపడతాయన్న ఆలోచనతో ‘స్వానుభవ’ అనే కార్యక్రమం కూడా తరచుగా చేస్తుంటా. ఐదారేళ్లుగా చేస్తున్న ఈ పని వల్ల చాలామంది విద్యార్థులు లాభపడ్డారు.

మీకు తంబురాల సేకరణ అలవాటనుకుంటా….
(చిన్నగా నవ్వుతూ) మీక్కూడా తెలిసిందా…. అవును. అద్భుతమైన తంబురాలను సేకరించడం నాకు చాలా ఇష్టం. అలాగని సేకరించి ఓ మూల పడేసి ఉంచుతానుకుంటారేమో, అదేమీ కాదు. ప్రతి కచేరీకీ రెండు చొప్పున వాటిని వాడుతూ ఉంటాను. మంచి చెక్కతో, చక్కటి పనివాడితనంతో చేసి అద్భుతమైన శృతిలో పలికే తంబురాలను ఎవరైనా వాడనప్పుడు నా మనస్సు కలుక్కుమంటుంది. వీలైనంతమటుకు వాటిని తెచ్చుకుని చక్కగా వాడుకుంటాను. నిజానికి ఒకప్పటి తంబురాల్లో కనిపించే అందమూ, నాదమూ… ఇప్పుడు దొరకడమే అరుదు!

తెలుగువాళ్లకేమైనా చెబుతారా?
తెలుగువాళ్లకు నా విన్నపం ఒకటుంది. మీకు అద్భుతమైన సంగీత, సాహిత్య, సాంస్కృతిక వారసత్వం ఉంది. దయచేసి దాన్ని కాపాడుకోండి. ఆ పెన్నిధిని పిల్లలకు అందించండి. సినిమాలొక్కటే ప్రపంచం కాదు. అవొక్కటే మనోరంజన సాధనాలు కావు. రోజుకు కనీసం ఐదు పది నిమిషాల సేపైనా వేరే రంగాల మీద దృష్టి పెట్టండి. సెలవు.

Photos : వై. రామకృష్ణ

Advertisements

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s