ప్రముఖ బ్లాగర్ నెమలికన్ను మురళిగారి మాటల్లో…

మంచి పుస్తక పరిచయాలకు నెలవైన ‘నెమలికన్ను’ బ్లాగంటే ఇష్టం లేనిదెవరికి? ఏ పుస్తకాన్నయినా వెంటనే కొని చదవాలనిపించేలా రాయడం ఈ బ్లాగర్ ప్రత్యేకత. అలాగని అన్నీ పొగడ్తలే ఉండవు, నచ్చని అంశాలనూ సూటిగా చెబుతారాయన. అందుకే నా పుస్తకం రాగానే నెమలికన్ను మురళిగారు ఏమంటారో అని ఆసక్తి పెరిగింది. ఆయన రాసిన టపా ఇక్కడ.

కృతజ్ఞతలు మురళిగారూ

======================

Nemalikannuవర్తమాన తెలుగు కథ అనగానే అయితే అస్థిత్వ, ప్రాంతీయ వాద కథలు, కాకపొతే నాస్టాల్జియా కథలే కనిపిస్తున్న తరుణం ఇది. ఈ ధోరణికి పూర్తి భిన్నంగా వైవిధ్య భరితమైన పది కథలతో వర్ధమాన రచయిత్రి అరుణ పప్పు  వెలువరించిన సంకలనం ‘చందనపు బొమ్మ.’ ఆంధ్రజ్యోతి పత్రికలో ఫీచర్స్ రిపోర్టర్ గా పనిచేస్తున్న అరుణ, ‘అరుణిమ’ బ్లాగర్ గా బ్లాగు ప్రపంచానికి సుపరిచితులు. జనవరి 2009 నుంచి అక్టోబర్ 2011 వరకూ వివిధ పత్రికల్లో అచ్చైన కథలని (ఎక్కువగా ఆంధ్రజ్యోతి లోనే) దాదాపు రాసిన వరుసలోనే సంకలనం చేశారు కడపకి చెందిన రాష్ట్ర కథానిలయం వారు. వీరి తొలి ప్రచురణ ఇది.

ఏకబిగిన కథలన్నీ చదివేసి పుస్తకం పూర్తి చేసేద్దాం అనుకున్న నన్ను, ఆరో కథ ‘చందనపు బొమ్మ’ ఆపేసింది. చందనపు బొమ్మతో ఆడుకునే ఓ చిన్నపిల్ల కథ. చదవడం పూర్తవ్వగానే ఆలోచన మొదలవ్వడంతో, పుస్తకాన్ని ఎప్పుడు పక్కన పెట్టానో కూడా గమనించ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే కదిలించే కథనం. చైల్డ్ సైకాలజీ ఆధారంగా అల్లిన ఈ కథ ముగింపు ఊహించ గలిగేదే అయినప్పటికీ, కథ నడిపిన తీరు కట్టి పడేసింది. కొంత విరామం తర్వాత మిగిలిన కథలు పూర్తి చేశాను.

నిజానికి, ఈ సంకలనం గురించి చెప్పేప్పుడు మొదట ప్రస్తావించాల్సిన కథ ‘వర్డ్ కేన్సర్.’ పేరులాగే, కథ కూడా వైవిధ్య భరితంగా ఉంది. వాక్యాల ప్రవాహం ఈ కథ. క్రమం తప్పకుండా సాహిత్యం చదివే అలవాటు ఉన్న వాళ్ళని బాగా ఆకట్టుకునే కథ.మళ్ళీ మళ్ళీ చదివిస్తుంది కూడా. పుస్తకాలకి సంబంధించిన మరో కథ ‘కరిగిపోయిన సైకత శిల్పం.’ పుస్తకాలనీ, వాటిని చదివే వాళ్ళనీ కూడా ఎంతగానో ప్రేమించే ఓ పుస్తకాల షాపు యజమాని కథ ఇది. కథ చదువుతున్నంత సేపూ నాకు తెలిసిన పుస్తకాల షాపుల యజమానులు అందరూ వరుసగా గుర్తొచ్చారు. కథలో ప్రధాన పాత్ర ‘ఆచార్య’ లో వాళ్ళంతా ఎక్కడో అక్కడ కనిపించారు కూడా.

ప్రయాణాలు అంటే నాకు ఉన్న ఇష్టం వల్ల కావొచ్చు, ‘భ్రమణ కాంక్ష’ కథ బాగా నచ్చేసింది. ప్రదేశాలని కాక, ప్రపంచాన్ని చూడాలని కోరుకునే నవనీత రెడ్డి వెంటాడతాడు పాఠకులని. అంతే కాదు, ‘మనసుంటే మార్గం ఉంటుంది’ అన్న మాటా గుర్తొస్తుంది. ‘ఒక బంధం కావాలి’ ‘లోపలి ఖాళీలు’ కథలు రెండూ మనస్తత్వాన్ని ఆధారం చేసుకున్నవి. మొదటిది మానసికంగా ఎదగని ఓ కుర్రవాడి కారణంగా అతని తండ్రి జీవితంలో వచ్చిన మార్పుని చిత్రిస్తే, రెండోది తలచుకుంటే దేనినైనా సాధించే పట్టుదల ఉన్న విద్యావంతుడికి తన భార్య విషయంలో ఎదురైన సందిగ్ధాన్ని చర్చించింది.

పది కథల్లోనూ ఆరు కథలు జర్నలిజం నేపధ్యంతో నడుస్తాయి. పాత్రికేయ కోణం నుంచి ప్రపంచాన్ని చూసే ప్రయత్నంగా చెప్పొచ్చు వీటిని. తొలికథ ‘ఎవరికి తెలియని కథలివిలే’ లో ప్రధాన కథతో పాటు, తన వృత్తిలో ఇబ్బందులనీ సందర్భానుసారం ప్రస్తావించారు రచయిత్రి. ఓ రచయితకీ, ఓ మహిళా జర్నలిస్ట్ కీ ఏర్పడ్డ స్నేహం ‘ఏకాంతంతో చివరిదాకా’ కథ. “అనేకమైన వరాలిమ్మని దేవుణ్ణి కోరుకుంటాం. కానీ దేవుడినే కొరుకోం. ఆయనే వచ్చి అకస్మాత్తుగా ఇలాంటి ఆలోచనుందని చెప్పినా తట్టుకోలేం,” లాంటి వెంటాడే వాక్యాలు చాలానే ఉన్నాయి ఈ కథల్లో.

మూడు నాలుగేళ్ల క్రితం వరుసగా జరిగిన కొన్ని సంఘటనలు ఆధారం చేసుకుని రాసిన ‘ఈ కానుక నేనివ్వలేను.’ మృత్యువు నేపధ్యంగా సాగే కథ అవ్వడంతో ఆకర్షించింది నన్ను. అయితే, కాలపరీక్షకి ఎంతవరకూ నిలబడుతుంది అన్నది చూడాలి. ఈకథలో సంభాషణలు ఉపన్యాస ధోరణిలో ఉండడం కొరుకుడు పడదు. అలాగే, మొత్తం సంకలనం చదివాక, ’24/7 క్రైమ్ ఇప్పుడిదే సుప్రీం’ కథని రచయిత్రి ఇంకా చాలా బాగా రాయగలరు అనిపించింది. అంతగా ఆకట్టుకోని కథ ఇది. కథల్లో మొదటగా ఆకర్షించేది రచయిత్రి వాడిన భాష. చక్కని తెలుగు, చదివించే వచనం. కొన్ని కొన్ని వాక్యాలయితే ఆగి, వెనక్కి వెళ్లి మళ్ళీ చదువుకునేలా ఉన్నాయి.

రాసిన క్రమంలోనే సంకలనంలో కథలు అచ్చు వేయడం వల్ల, కాలంతో పాటు రచయిత్రి శైలి పదునెక్కడాన్నిగమనించ గలుగుతాం. అయితే, మనస్తత్వ చిత్రణలో రచయిత్రి మరికొంత పట్టు సాధించాల్సి ఉంది. ఉత్తరాంధ్రకి చెందిన రచయిత్రి సంకలనం అనగానే, ఆ మాండలీకంలో ఒక్క కథన్నా ఉంటుందని ఎదురు చూశాను కానీ, కథలన్నీ నగరాల చుట్టూనే తిరిగాయి. ప్రింటింగ్ బాగుంది, అచ్చు తప్పులు తక్కువే. రానున్న రోజుల్లో అరుణ పప్పు నుంచి మంచి కథలని ఆశించ వచ్చు అన్న నమ్మకాన్ని కలిగించిన సంకలనం ఇది. (‘చందనపు బొమ్మ,’ పేజీలు 104, వెల రూ. 120, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు మరియు కినిగె.కామ్ లో లభ్యం)

సోమవారం, జనవరి 28, 2013

1 thought on “ప్రముఖ బ్లాగర్ నెమలికన్ను మురళిగారి మాటల్లో…

  1. పప్పు,
    శుభోదయం. నీవు ఇప్పుడు పంపుతున్న వన్నీ చదివి చాలా రోజులైంది. నీవుకూడా చదివి,
    నాకు పంపినప్పుడు మాట్లాడదామని ఊరుకున్నా. నీ కథలు విడివడిగా చదవినా, సంకలనంగా
    వచ్చిన తరువాత చదవటానికి మరికొంత సమయం తీసుకుంటాను. మరిన్ని పుస్తక పరామర్శలను
    చదివితన తరువాత చదవితే ఎలా వుంటుందో చూద్దామన్న కొంటె ఆలోచనే దానికి కారణం.
    శుభాభినందనలతో
    సతీష్ బాబు చిగురుపాటి

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి