విరసం నాయకులొకాయన ఏమన్నారంటే…

కుందనం అద్దిన ‘ చందనపు బొమ్మ’
 సవ్వడి డెస్క్ – చెరుకూరి సత్యనారాయణ   Sun, 3 Feb 2013, IST

దినపత్రికలు చదివే తెలుగు పాఠకులకు చిరపరిచితమైన పేరు అరుణ పప్పు. లెక్కలు పాఠ్యాంశంగా ఎమ్మెస్సీ చేసిన ఈమె గత పదేళ్లుగా ఈనాడులోనూ, తర్వాత ఆంధ్రజ్యోతిలోనూ పనిచేస్తూ పాత్రికేయాన్ని వృత్తిగా స్వీకరించారు. ఫీచర్స్‌ రిపోర్టరుగా ఆంధ్రజ్యోతి నవ్యలో ఎందరో మంచి మనుషుల్ని పరిచయం చేసిన అరుణ- ‘పాత్రికేయ జీవితంలో మానవీయ కోణాల్ని ఆవిష్కరించా’లనే తపనతో కథలు రాయటం ప్రారంభించి, వివిధ పత్రికల్లో రాసిన పది కథలతో తొలి కథాసంపుటిని వెలువరించారు. నందలూరు కథా నిలయం రాజేంద్రప్రసాద్‌ గారు ఈ సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఒక కథా సంపుటి ప్రచురించాలని నిర్ణయించుకొని, తొలి ప్రయత్నంగా అరుణగారి ‘చందనపు బొమ్మ’ని అచ్చేయించారు. 104 పేజీల్లో కుదురుకున్న 10 కథల ఈ పుస్తకం రూ.120లకు విశాలాంధ్రలోనూ, నందలూరు కథానిలయంలోనూ లభ్యమవుతుంది. ఫీచర్‌ రిపోర్టురుగా ఎదురయ్యే వ్యక్తిగత ఇబ్బందులు- అంటే ఎదుటి వ్యక్తులతో ఎంత ఆచితూచి మాట్లాడాలో అర్థం చేయించిన కథ ‘ఎవరికి తెలియని కథలివిలే!’ తో ప్రారంభమై- మనస్తత్వ శాస్త్రం కోణం నుంచి రాసిన ‘ఒక బంధం కావాలి’, ‘లోపలి ఖాళీలు’ కథలతో ముగించారు.

సాయంత్రం హడావుడి బీచ్‌ సహజ సౌందర్యాన్ని ప్రశాంతంగా ఆస్వాదించాలనే ఆలోచనకు సరిపడక ‘క్షితిజ రేఖ నుంచి భానుడు బంగారు బంతిలాగా ఉదయించే’ సమయాన్ని ఎంచుకున్న సైకాలజిస్టు దీపకి ఎదురైన తండ్రీకొడుకుల విషాదం ఒక కథలో చూస్తాం. సినిమాలను మించిన నాటకీయత జీవితాల్లో ఉంటుంది. కాకుంటే అది అనుభవంలోకి రాని వాళ్ళదే అదృష్టం అని చెప్పే కథ ‘ఒక బంధం కావాలి’. అనుమానంతో భర్తని ఇబ్బంది పెట్టటమేగాక వీళ్ళ కీచులాటలతో ఇంటికి రావటమే మానుకున్న అత్తామామల్తో ‘దేవత’గా కీర్తించబడటానికి మృణ్మయ సంగీతం క్లాసులకెళ్లటమే కారణం. ఈ భార్యాభర్తల సమస్య నుంచి తన సమస్యకు పరిష్కారం చూసుకుంది లాలిత్య ‘లోపలి ఖాళీలు’ కథలో. తెలుగులో ఉన్నన్ని న్యూస్‌ ఛానళ్లు ప్రపంచంలో ఏ ప్రాంతీయ భాషలోనూ లేవనేది నిజం. దానికి తగ్గట్టుగానే పోటీ ఉంది. పోటీకి తగ్గట్టే వాటి పరుగులు, ఆ పరుగుల మధ్య మృగ్యమవుతున్న విలువలు – నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ ఛానళ్లపై మంచి వ్యంగ్యం ’24 × 7 క్రైం ఇప్పుడిదే సుప్రీం’ కథ. అప్పుడే జైలు నుంచి విడుదలై వస్తున్న భయంకర్‌ 24 గంటలు నేరాల థీమ్‌తో ఛానల్‌ నడపటానికి తన మిత్రులను సమావేశపరచటం కథాంశం. ప్రఖ్యాత రౌడీషీటర్లచే ప్రశ్నలకు సమాధానాలు, ఆధారాల్లేకుండా నేరాలు చేయటం ఎలా? చిట్టి చిట్కాలతో పాటు కోడల్ని కాల్చుకు తినటం, అత్తగారి పనిపట్టటం వంటి చర్చలు, నసపెట్టే భర్తని పనస పొట్టులా టుకడాటుకడాల కింద కొట్టి వదిలించుకోవటం ఎలా? వంటి కార్యక్రమాలు … చూస్తూనే ఉండండి ‘నిరంతర హింసా ప్రవాహం’ ప్రతి క్రైంకి మీరే సాక్షి’ లాంటి అర్థవంతమైన సెటైర్లు ఈ కథలో ఉన్నాయి.

మనం చాలా రోజులుగా వెతుకుతున్న పుస్తకం ఎవరి టేబుల్‌పైన ఉన్నా ఆ వ్యక్తి పట్ల గౌరవం కలగటం సహజం. జనానికి సొంత పిల్లలంటే ఎంత ఇష్టమో కదంబం యజమాని ఆచార్యకు పుస్తకాలంటే అంత ప్రేమ. అలాంటిది ఆ పుస్తకాల షాపు (కదంబం) రోడ్డు వెడల్పులో పోతుందంటే అంతమంది జనం రావటం వింతే! ప్రాణాధికంగా చూసుకొనే ఆ షాపును కూలగొడుతుంటే గుండెపోటు వచ్చి బతికి బయటపడ్డా చూపు, వినికిడి, జ్ఞాపకశక్తీ .. అన్నీ తగ్గిన స్థితిలో కరాచీ బుక్‌ ఫెస్టివల్‌లో చూస్తే ఒక అద్భుతమైన సైకతశిల్పం కరిగిపోయిన భావన రావటం సహజం. ప్రపంచంలో చూసి తీరాల్సిన మూడొందల ప్రదేశాలు అంటూ ఏదో వారపత్రికలోని జాబితా చూశాక, అందులో కనీసం వందయినా చూడకపోతే నువ్వసలు మనిషివేనా అనిపిస్తుంది. మల్లెపూలను, మామిడిపళ్లను తెచ్చే వేసవికాలాన్ని విసుక్కోవటం నవనీతరెడ్డికి విచిత్రంగా కన్పించినప్పుడు పర్యటనకి, ప్రయాణానికి తేడా తెలియని వాళ్లని చూస్తే నవ్వు తెప్పించటంలో ఆశ్చర్యం ఏముంది? ప్రకృతి అంటే తపన, ప్రయాణం అంటే సరదా ఉన్న అతను విశాఖలో అన్నేళ్లుండి అరకు చూడకపోవటం ఆశ్చర్యం కల్గించి ఆరా తీస్తే- అతను ప్రయాణం పెట్టుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆటంకం. అంతర్జాలంలో తప్ప వాస్తవంలో విశేషాలు చూడలేని కోట్ల మందిలో భ్రమణకాంక్ష కలిగిన అతనూ ఒకడు.

పుట్టినింటి నుంచి బామ్మ గుర్తుగా తను తెచ్చుకున్న చిన్న చందనపు బొమ్మ ఎంత పాతబడినా దానితోనే ఆడుకునే అమ్ములు – కొత్త బొమ్మ కొని పెట్టాలనే తండి తపన కథాంశంగా టైటిల్‌ కథ చందనపు బొమ్మ. ‘మనింట్లో వున్న బొమ్మ నల్లగా వుంది. ఒక చెయ్యి విరిగిపోయింది కొత్త బొమ్మలు కొనుక్కున్నాం కదా! దాన్ని వాచ్‌మెన్‌ పిల్లలకిచ్చేద్దామన్న తండ్రితో- ‘నాన్నా! ఎప్పు డైనా నాకో చెయ్యి ఇరిగితే నన్ను డస్ట్‌బిన్‌లో వేస్తావా? పోనీ వాచ్‌మెన్‌కిచ్చేస్తావా? నేను నల్లగా వుంటానని నన్ను బయట పడెయ్య లేదుగా’ అన్న మాటలతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లారు. ప్రాణం లేని బొమ్మతో పిల్లల అనుబంధాన్ని మానవీయ కోణంలో విశ్లేషించిన మంచికథ చందనపు బొమ్మ.

వర్డ్‌ క్యాన్సర్‌ మరో సైకాలజీ బేస్‌డ్‌ కథ. వంటి నిండా పదాలున్న వ్యక్తి కథనం. వాక్యమెంత ముద్దుగా, మార్దవంగా ఉండాలో నీలంరంగు నిప్పు పువ్వయి ప్రకాశించాలి. వానవిల్లు మీద నడిచి మేఘాల్లో తేలినట్టుండాలి. కాలిగ్రఫి చిత్రాల్లా కళ్లకు కట్టాలి.. పాఠకులకు చెప్పే ఈ సూక్తులన్నీ అరుణగారు పాటిస్తే బాగుంటుంది. కథలు కొద్దిమంది తన స్థాయి వ్యక్తుల కోసం కాకుండా సామాజిక ప్రయోజనం కల్గిగిస్తూ ఎక్కువమంది చదివేలాగా, చదివినవారు సమాజానికి మరింత తోడ్పడే విధంగా అరుణ గారి కథలుండాలి. ఫీచర్స్‌లో పాటించే ఈ స్పృహ కథల్లో కూడా పాటిస్తే మరింత సమాజహితానికి దోహదపడాతారు.

వేల కథలు చదివి పది కథలు రాసిన తర్వాత ‘ఫస్టు పర్సన్‌’ నుంచి కథనరీతిని మార్చుకోవటం అవసరం. ఈ రకమైన కథనాల్లో ప్రతి వాక్యంలోనూ పాఠకుడు రచయిత్రినే చూస్తాడు. ఈ పద్ధతికి అలవాటుపడితే పెద్ద కథలు రాయటం చాలా ఇబ్బంది. అన్ని కథలూ ఈ పద్ధతిలో ఇమడవు. సామాజిక శ్రేయస్సే సాహిత్యానికి పరమావధి.

– చెరుకూరి సత్యనారాయణ

9848664587

Advertisements

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s