అందరివీ సినిమా పెళ్లిళ్లే


‘ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం’ ‘అందమైన భామలు లేత మెరుపు తీగలు…’ ‘గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట’ వంటి హిట్ పాటలు విన్నప్పుడు ఆ పదాల అర్థాల్లో పడి వాటిని రాసిన భువనచంద్ర గురించి కాసేపు మర్చిపోతాం. ‘మంచిమంచి పాటలెన్నో రాయడానికి పునాది వేసింది మా ఊరు చింతలపూడి’ అంటున్నారు భువనచంద్ర. ఏలియ మాస్టారు బడి, పేడ చెప్పులు, చిన్నప్పటి సంపాదన, మొదట చేసుకున్న పెళ్ళిళ్లు, ఊళ్లో కురిసిన వాన మొదలుకొని ఊరివారి నుంచి నేర్చుకున్న విలువైన జీవిత పాఠాలను కూడా వివరిస్తున్నారాయన. భువనచంద్ర చెబుతున్న తన సొంతూరు చింతలపూడి విశేషాలు….

“ఊరి గురించి చెప్పేముందు తమ్మిలేరు గురించి చెప్పాలి. తమ్మిలేటికి ఇవతలవైపు కృష్ణా జిల్లా, అవతలవైపు పశ్చిమగోదావరి జిల్లా. మా పూర్వీకులది, నేను పుట్టిందీ కృష్ణా జిల్లాలోని గుళ్లపూడి గ్రామమే. ఆ ఊళ్లో ఉన్న రెండొందల కుటుంబాలూ మా చుట్టాలూపక్కాలే, అందరూ కరణాలే. మా ఇంటిపేరే ‘ఊరకరణం’. మా తాతగారి సమయంలో పన్నెండొందల ఎకరాలు, మా నాన్నకు వచ్చేసరికి మూడొందల ఎకరాలు ఉండేవని విన్నాను. స్వాతంత్య్రానికి పూర్వం మా నాన్న సుబ్రమణ్యేశ్వర శర్మ ఊరికి సర్పంచ్‌గా పనిచేశారట. దానిలో విశేషమేమీ లేదుగానీ, మా అమ్మ చంద్రమౌళీశ్వరీదేవి కూడా గ్రామపెద్దగా పనిచేయడమే చెప్పుకోవలసిన సంగతి.

అప్పట్లో ఆమె ఐదారు తరగతులు చదువుకున్నదేమో. అయినా మంచి గొంతుతో చక్కగా పాడేది, స్వాతంత్య్ర ఉద్యమ పాటలెన్నో వచ్చావిడకు. మా అమ్మానాన్నా ఒకసారి గాంధీగారిని దర్శించుకున్నారని, మా అమ్మ తన ఒంటి మీదున్న ఏడు వారాల నగలూ తీసి ఆయన జోలెలో వేసిందని గుళ్లపూడిలో చెప్పుకునేవారు. తమ్మిలేటి మీద వంతెన, ఊళ్లో రామాలయం… అన్నీ మా నాన్నే కట్టించారని అంటారు. చెప్పొచ్చేదేమంటే నా తల్లిదండ్రులు వైభవంగా బతికిన రోజులు నేను చూడలేదు. నేను పుట్టేసరికే ఆస్తులన్నీ హరించుకుపోయాయి. నాకు ముగ్గురన్నయ్యలు, నలుగురు అక్కలు. నేను ఎనిమిదోవాణ్ని. ఊళ్లోని సీమచింతచెట్ల కింద నన్నెవరో ఎత్తుకుని తిప్పుతున్నట్లు… గుళ్లపూడి కి సంబంధించి లీలగా నాకు గుర్తున్న జ్ఞాపకం అదే.

పేడ చెప్పులు తెలుసా
నాకు రెండేళ్లు దాటక ముందే మా నాన్న కుటుంబాన్నంతా తీసుకుని తమ్మిలేటి కి అటువైపునున్న చింతలపూడి వెళ్లిపోయారు. ఆ ఊళ్లోని మేడుకొండూరు వేంకటేశ్వరరావుగారు చనిపోతూ దగ్గర్లోని ‘తీగలవంచ నరసాపురం’ గ్రామ కరణీకాన్ని మా నాన్నకు అప్పజెప్పారు. మొత్తానికి నాకు ఊహ తెలియకముందే చింతలపూడి మా ఊరయిపోయింది. ఇంట్లోనే శతక పద్యాలూ, స్తోత్రాలూ వంటివి నేర్పించిన తర్వాత ఐదేళ్లు నిండాక ఏ బడిలో వెయ్యాలి అన్నది ప్రశ్న. మేడ బడి, సుబ్బరాజు బడి అని ఉండేవి. వాటికైతే రెండు వీధులు దాటాలి. కాని మా వీధిలోనే ‘ఏలియ’ అనే క్రైస్తవుడొకాయన బడి నడిపేవారు. అందులో వేశారు నన్ను.

ఆయన నెలకు పావలానో అర్థో – ఎంతిస్తే అంతే తీసుకునేవాడు. బడి అంటే భవనమూ బెంచీలూ ఉన్నాయనుకుంటారేమో. అదొక పశువుల పాక. దాన్లోనే ఒక వారగా మాకు పాఠాలు. మా పలకలు అక్కడ పెట్టి అన్నానికి వెళ్లొచ్చేసరికి పశువులు వాటి పనులవి కానిచ్చేసేవి. అయితే మాకేం అసహ్యం ఉండేది కాదు. పైగా ‘అరేయ్ ఇవాళ సుబ్బరాజు మేస్టారిగారమ్మాయి అమ్ములు పలక మీద గేదెలు పేడ వేశాయిరోయ్’ అని సంబరపడేవాళ్లం. జయలక్ష్మి, విజయలక్ష్మి, పుష్పవతి, అమ్మాజీ, హైమవతి, కాకుండా ఇద్దరు ముగ్గురు భారతులు నాకు సహాధ్యాయులుగా ఉండేవాళ్లు.

అబ్బాయిల్లో నల్లమూరి పాండురంగమూర్తి – ఎన్పీఆర్ అనేవాళ్లం, జిజ్జు అని మేం పిల్చుకునే బర్మా వెంకటేశ్వర్రావు, హరి, ఉపాధ్యాయుల సుబ్బయ్య, కేడీవీఎల్ కాంతారావు, ఘంటా గంగాధర్… ఇదీ మా పిల్ల సైన్యం. వీళ్లలో కొందరు ఇప్పటికీ అక్కడే ఉన్నారు. చిన్నప్పుడు మాకెవరికీ కాళ్లకు చెప్పులుండేవి కావు. హైస్కూలుకెళ్లేప్పుడు కాళ్లు కాలుతుంటే దార్లో ఎక్కడైనా పేడ కనబడితే పరుగెత్తుకుంటూ పోయి దాన్ని తొక్కేవాళ్లం. కాస్త ఆరాక నడుచుకుని వెళుతుంటే కాళ్లకున్న పేడ చెప్పుల్లాగా మమ్మల్ని రక్షించేది. అదే శీతాకాలంలోనో వానాకాలంలోనో నడుస్తున్నప్పుడు పచ్చగడ్డి, దాని చివరన నిలిచిన మంచుబిందువులు, ఏవేవో గడ్డిపూలు కాళ్లకు తగిలి గిలిగింతలు పెట్టి ఒళ్లు పులకరించింది నాకిప్పటికీ జ్ఞాపకమే.

మేమూ కాటన్ దొరలమే
ఆ రోజుల్లో మా నాన్నకు నెలకు ఎనిమిది రూపాయల జీతం అనుకుంటా. విలువైన వస్తువులతో కాకుండా వచ్చిపోయే రైతులు, గ్రామస్తులతో మా ఇల్లు కళకళలాడేది. తాను అనుభవించిన ఐశ్వర్యాన్ని పిల్లలకి ఇవ్వలేకపోయాననే బాధతోనో ఏమో, మా నాన్న ఎక్కువ సమయం మౌనంగా ఉండేవారు. ‘నేను మీకు కష్టపడటం నేర్పుతున్నాను. జీవితంలో అసలైన టీచర్లు కష్టాలే. సుఖపడటం ఎవరూ నేర్పకుండానే వచ్చేస్తుంది’ అన్నారొకసారి. హైస్కూలుకు వెళ్లేప్పటికి నాకున్నవి రెండే నిక్కర్లు. అవీ చిరుగులు పడి కుట్టుకున్నవే. ఒక మేస్టారు ‘సిండరెల్లా’ అని నన్ను గేలిచేశారు. అప్పుడు నాన్న మాటలనే గుర్తు చేసుకున్నాను. ఆ మాటల ప్రభావంతోనే నేనిప్పుడు కోటీశ్వరుడితోనైనా, కూటికి లేనివాడితోనైనా – ఎవరితోనైనా హాయిగా మాట్లాడగలను, భోజనం చెయ్యగలను.

పేద – గొప్ప ఇవి ఈ సమాజానికి రెండు ముఖాలు. ఎన్నాళ్లయినా అవి ఒకదాన్నొకటి చూసుకోవు. ఇదంతా చెబుతున్నానని నా బాల్యమేదో బీదబీదగా గడిచిందని అనుకోకండి. మా ఊరు నాకే కాదు, మా గ్యాంగ్ అంతటికీ అద్భుతమైన బాల్యాన్ని బహుకరించింది. వాటిలో ముందు చెప్పుకోవలసింది చెరువు, దాన్ని ఆనుకుని ఉండే మామిడి తోట, ఆపైన ఉండే బూడిద గుంట (శ్మశానం), తర్వాత మైదానం. వర్షాకాలం వచ్చిందంటే చాలు, మాకు తోచిన దగ్గర ఆనకట్టలు కట్టేసి నీరు నిలవచేసి కాటన్ దొరలా పోజులు కొట్టేవాళ్లం. మా చెరువు ఒడ్డున మేడిచె ట్లు, తుమ్మచెట్లు ఉండేవి. మాకు ఖాళీ దొరికినప్పుడల్లా తుమ్మ చెట్లకు గాటు పెట్టి జిగురు తీసేవాళ్లం. ఆ జిగురును కోమటి కొట్లో ఇస్తే అణాలు, కానీలు ఇచ్చేవారు. అణాకు నాలుగు కానులు. కానీకి రెండు పప్పుండలు, లేదా గిద్దెడు మరమరాలు, వేయించిన శెనగపప్పు వచ్చేవి. ఇక అర్థణాకు రెండు బజ్జీలు వచ్చేవి. అంత గొప్ప ఆదాయ మార్గాన్ని పిల్లలెవరైనా వదులుకుంటారా చెప్పండి?

చింతలపూడే మాకు మద్రాసు
మా ఊరి చెరువు ఒడ్డున నేను పసిరిక పామును చూశాను. గట్టు మీద రాళ్ల కింద చుట్టలు చుట్టుకుని పడుకున్న బురద పాములను చూశాను. వానాకాలంలోనైతే అక్కడ కప్పల సంగీతం మారుమోగిపోయేది. ఊళ్లో చాకలివాళ్లకు గాడిదలుండేవి. వాళ్లు చూడకుండా వాటిని ఎక్కి స్వారీ చెయ్యడం మాకు భలే సరదాగా ఉండేది. అవి ఎక్కనివ్వకుండా తన్నేవి. అయినా సరే, కూర్చున్న ఆ ఒక్క నిమిషమే మేం ప్రపంచానికి రాజుల్లా ఫీలయ్యేవాళ్లం. ఇక గేదె స్వారీలయితే చెప్పక్కర్లేదు. అసలు చింతలపూడి మావరకూ మాకు మరో మద్రాసు కిందే లెక్క. విపరీతంగా వచ్చే జానపద సినిమాల ప్రభావంతో మమ్మల్ని మేం సినిమా తారల్లాగా ఊహించుకునేవాళ్లం.

వెదురు కత్తులు తయారుచేసుకుని యుద్ధాలు చేసేవాళ్లం. ఆ సమయంలో మేం ఎన్టీయార్, ఏయన్నార్, రాజనాల, కాంతారావుల్లా మారిపోయేవాళ్లం. అలాగే మాకు జోడీలు కూడా ఉండేవారు! ఉదాహరణకు ‘అరేయ్ నీ పెళ్లాం ఎవర్రా’ అని ఏడెనిమిదేళ్లవాణ్ని ఎవణ్ననడిగినా బి.సరోజ, కృష్ణకుమారి, సావిత్రి, జమున… వీటిలో ఏదొక పేరు చెప్పేవాళ్లు. అలాగే అమ్మాయిలు కూడా తమకు నచ్చిన హీరోలను పెళ్లి చేసుకున్నట్టే మాట్లాడేవాళ్లు. వీటివల్ల మాలో మాకు చాలా తగువులొచ్చేవి. ఉదాహరణకు అప్పటికే హరనాథ్ అనే హీరోని ఒకమ్మాయి ఎంచుకుందనుకోండి, మరో అమ్మాయిని ‘నీ మొగుడెవరే’ అనడిగితే హరనాథ్ అందనుకోండి, వెంటనే మేం పరిగెత్తుకుంటూ వెళ్లిపోయి ‘సేయ్, నీ మొగుణ్నే అదీ ఎంచుకుంది’ అని చెప్పేసేవాళ్లం. ఇంక భీకరమైన యుద్ధం మొదలయ్యేది. అలానే కొత్త కుర్రాడెవరైనా వచ్చి ఏ సావిత్రో ‘నా పెళ్లాం’ అన్నాడా, అంతకు ముందే సావిత్రిని కలల్లో ప్రతిష్టించుకున్నవాడి చేతిలో తన్నులు తినాల్సిందే.

అప్పుల అప్పారావులం అవొద్దు
మా ఊరి వైశ్యుల నుంచి నేనొక అద్భుతమైన విషయాన్ని నేర్చుకున్నాను. దాన్ని అమల్లో పెడితే ప్రపంచమే మారిపోతుంది. అదేంటంటే – మా కుటుంబాల్లో ఒకాయన ఇంట్లో పిల్ల పెళ్లికి సరుకులు కావాల్సొచ్చాయి. చిట్టా ఇచ్చి దుకాణానికి నావంటి కుర్రాడొకణ్ని పంపారు. ఆ శెట్టిగారు ఈ పెద్దాయన ఇంటికొచ్చి ‘ఎందుకండే అన్ని సరుకులూ ఇంత ఖర్చూనూ? రేప్పొద్దున ఊళ్లో మరో గొప్ప పెళ్లి జరుగుతుంది, అప్పుడు మీరు పెట్టిన భోజనాన్ని మర్చిపోతారు జనాలు. ఆపైనాడు పక్కూళ్లో అంత కన్నా మంచి భోజనం పెడితే ఈళ్లదీ మర్చిపోతారు. ఆమాత్రం దానికి మీరెందుకండే అప్పులైపోవడం?’ అంటూ అందులో మూడో వంతు సరుకులు పంపించాడు. వాటితోటే పెళ్లి బ్రహ్మాండంగా అయింది. మా శెట్టిగారి మాటల్లో ఎంత గొప్ప ఆర్థిక సూత్రం ఇమిడి ఉందో తెలుసుకున్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను.

అప్పు అంటే అవతలివాడు తీర్చగలిగినంత ఇవ్వాలిగానీ, వాడు ఆస్తులమ్మేసే పరిస్థితికి తీసుకురాకూడదు. అలాగే తాహతును మించి అనవసరమైన ఖర్చులెందుకు అన్నదే అందులోని పరమార్థం. ఇప్పుడు చూడండి, అందరి జేబుల్లోనూ క్రెడిట్ కార్డులే. అందరూ అప్పుల అప్పారావులే. ప్రభుత్వాలు సైతం తిరిగి తీర్చలేనంత అప్పులు చేస్తున్నాయి. నాకు చింతలపూడి మరో విషయం కూడా నేర్పింది. నిత్య జీవితంలో అవసరం లేని వస్తువును చచ్చినా కొనేవారు కాదు మా ఊరివాళ్లు. ఎవరైనా కొంటే ‘ఏంరోయ్ బలే ఎచ్చులకు పోతున్నావ’ని వేళాకోళం చేసేవారు. ఇప్పుడు అవసరం ఉన్నవీ లేనివీ కొనడం, పోగు చెయ్యడం ఫ్యాషనయిపోయింది. నేనిప్పటికీ పూర్వపు పద్ధతిలోనే ఉన్నాను. అత్యవసరమైనవే కొంటాను. పాటకు లక్ష రూపాయలు పారితోషికం అందుకున్నా సరే నా పద్ధతి మారదు.

నోరు మూసుకుని కళ్లు తెరిచాను
మా చింతలపూడి నాకు ప్రకృతిలోని అందాలను చూపెట్టింది. నక్షత్రాల జల్లెడలోంచి కురిసే చీకటి, పండు వెన్నెల సోనలు, జామచెట్ల మీదకు వచ్చివాలే రామచిలుకలు, ఊరవతల తోటల్లోని పిచ్చుకగూళ్లు, వానకురిసే ముందు ఆకాశం, రాతిలోంచి వచ్చిన కప్ప…. చెప్పుకుంటూ పోతే ఎన్నో. అవే నా పాటలోలనూ ప్రతిఫలిస్తాయి. మా అన్నయ్య డిటెక్టివ్ నవలలు చదువుతూ మధ్యలో ఆపేసి నిద్రపోయేవాడు. తర్వాత కథేమైందో చెప్పరా అంటే ‘నోర్మూసుకోవాయ్’ అనేవాడు. వాడు నోర్మూసుకోమనడం వల్లనే నేను కళ్లు తెరుచుకున్నాను. విపరీతంగా చదవడం మొదలెట్టాను.

మా ఊరి గ్రంథాలయంలో దాశరథిగారని ఉండేవారు, ఆయన నాకు ప్రపంచ సాహిత్యాన్ని పరిచయం చేశారు. ఆ సమయంలోనే మా ఊరివాళ్లంతా కలిసి బోధానందపురి మహరాజ్ అనే సాధువొకరిని తీసుకొచ్చి విశ్వనాథ మఠం నిర్మించారు. ఆయన కూడా శంకరాచార్యలాగానే కేరళలోని కాలడి గ్రామస్తులు, చిన్నవయసులోనే సన్యాసం తీసుకుని హిమాలయాల్లో సంచరించినవారు. బడి, గ్రంథాలయం పోను మిగిలిన సమయమంతా నేను ఆశ్రమంలోనే గడిపేవాణ్ని. ఆయన శిష్యరికం వల్ల, అక్కడికి వచ్చిపోయే పండితుల వల్ల నేను మన సంప్రదాయ సాహిత్యం, తాత్వికతల గురించి బాగా తెలుసుకున్నాను. అప్పుడే గుడిలో రాజేశ్వరీదేవిని ప్రతిష్ఠించారు.

ఉదయం పువ్వులు కోసి పెట్టడం, భక్తులకు ప్రసాదాలు పంచడం ఇలాంటివన్నీ నా పనులన్నమాట. అవి చేస్తున్నప్పుడు నాకు ప్రకృతి అంతా శక్తిమయమని అర్థమయింది. అయినా జీవితమంటే ఏమిటి, మనమంతా ఎవరు, ఎక్కణ్నించి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం… ఇవన్నీ తెలుసుకోవాలని తపనగా ఉండేది. వీటి గురించి ఆలోచిస్తూ నేను సన్యాసి అవాలని తీర్మానించుకున్నాను. ముందుగా భారతీయ వైమానిక దళంలో చేరి పద్దెనిమిదేళ్లు పనిచేశాను. తర్వాత పాదచారినై చాలా కాలం హిమాలయాల్లో ఒంటరిగా సంచరించాను. మనస్సు చేసే అద్భుతాలను చూశాక ఎక్కడున్నా ఒకటే అనిపించి చెన్నైకి చేరుకుని ఇదిగో మీముందిలా పాటల రచయితగా నిలబడ్డాను. మా ఊళ్లో మా అన్నయ్య, అక్క కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. వాళ్లకోసం, మా గుళ్లోని అమ్మవారిని చూడటం కోసం నేను ఏడాదికోసారైనా చింతలపూడి వెళుతుంటాను. అక్కడ చెరువు పూడ్చేసి మరీ ఇళ్లు కట్టేసుకున్నారు. మామిడి తోటల ఆనవాలే లేదు. మైదానం తగ్గిపోయింది. నేను ఊరికేమీ చెయ్యలేకపోవచ్చు, కానీ దాన్ని మరింత చెడగొట్టలేదు.

పేరు మారిందిలా!
ఇంతకూ నా అసలు పేరు శేష పూర్ణానంద ప్రభాకర గురురాజు. మా అమ్మ పేరులోని చంద్ర, చెన్నైలో నన్ను తల్లిలాగా చూసుకున్న భువనేశ్వరమ్మ పేరులోని సగం తీసుకుని నేను ‘భువనచంద్ర’నయ్యాను.

మా తిండి పురాణం
ఊళ్లోని చెరువులో దొరికే తామరాకులను ఎండబెట్టి దాచుకునేవాళ్లు అందరూ. హోటల్లో ఇడ్లీలు, బజ్జీలు వంటివన్నీ వాటిలోనే పెట్టిచ్చేవారు. మిరపకాయ బజ్జీలను తినడానికో పద్ధతి ఉంది. మిరపకాయ బజ్జీలను చిన్న ముక్కలుగా కోసి, అందులో ఉల్లిచెక్కు, నిమ్మకాయ పిండి కాస్త ఉప్పూకారం వేసి బాగా కలిపి తింటే నా సామిరంగా… అసలు రుచి బజ్జీల్లో ఉందో ఎండిన తామరాకులో ఉందో ఇప్పటికీ అర్థం కాదు. అలాగే వేసవి కాలం వచ్చిందంటే చాలు, పిల్లల జేబుల్లో బ్లేడు, ఉప్పూకారం ఉండాల్సిందే. అది చాలా పెద్ద రహస్యం. నైపుణ్యాల ఆధారంగా ప్రతి బ్యాచ్‌లోనూ ఆరేడుగురు ఉండేవారు.
ఇద్దరు కాపలా ఉండటానికి, ఒకరు చెట్టెక్కడానికి, ఒకరు కోసిన కాయలను క్యాచ్ పట్టడానికి. కాయలు చేతుల్లోకి రావడమే ఆలస్యం, వాటిని బ్లేడుతో చెక్కి, చిన్నచిన్న ముక్కలుగా కోసి ఎండిపోయిన కొబ్బరి చిప్పల్లో పోసి ఉప్పూకారం కలిపి లొట్టలేసుకుంటూ తినేవాళ్లం. ఇక ఊళ్లో ఎవరింట్లో అరటి గెల కాసినా పిల్ల సైన్యానికి ఉప్పందేది. గెల మొత్తం ఎత్తుకెళితే తన్నులు పడతాయని తెలుసుగనక చాలా నేర్పుగా పళ్లు దొంగిలించేవాళ్లం. ఇక పంపరపనస కాయలు ఒలిచి వాటి డిప్పలను నెత్తిమీద పెట్టుకొని ఊరేగేవాళ్లం. వామన చింతకాయలను బచ్చలితో కలిపి పచ్చడి చేసుకుని తింటే అబ్బో ఇది చింతలపూడి కాదు, స్వర్గం అన్నట్టుండేది.

ఊళ్లో మరీ విసుగు పుడితే నాలుగు కిలోమీటర్ల దూరంలోని తమ్మిలేరు దగ్గరకు నడిచి వెళుతూ అడవి కరివేపాకు, జామకాయలు ఏరుకునేవాళ్లం. అన్ని కాలాల్లోనూ అన్ని రకాల ఆహారపదార్థాలు దొరికేవి కాదు. అందుకని ఇళ్లలో కొన్ని నిలవ చేసేవారు. ఆ పనిలో పిల్లల భాగస్వామ్యం చాలానే ఉండేది. ఉదాహరణకు కొబ్బరి, నువ్వులు వంటివి మిల్లుకిచ్చి నూనె తీసి తేవడం, అవసరమైనప్పుడల్లా ధాన్యాన్ని ఆడించడం, కూరగాయల ఒరుగులు పెడుతుంటే సాయం చెయ్యడం, ఆవకాయలు పెడుతున్నప్పుడు కారం, పసుపు, ఆవపిండి వంటి వాటిని వస్త్రకాయితం చెయ్యడం (జల్లెడ పట్టడం) ఇవన్నీ మా పనులే.
– అరుణ పప్పు
ఫోటోలు : గోపి, కేఎస్ఎస్ వీరయ్య

Advertisements

2 thoughts on “అందరివీ సినిమా పెళ్లిళ్లే

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s