మీరొక్క లైటిచ్చి ఒక విద్యార్థికి సాయపడొచ్చు

చీకటిళ్లకు చిరుదీపాలు

మనిషికి కావలసింది స్వచ్ఛమైన గాలీనీరూ, మంచి తిండీ గుడ్డా. వీటిలో ఏది లేకపోయినా జీవిత ప్రమాణాలు సరిగా లేనట్టే లెక్క. “వీటిలాగే స్వచ్ఛమైన కాంతి కూడా అత్యవసరం. పొద్దు వాటారగానే చీకట్లు అలుముకునే చోట, గుడ్డి దీపాలకూ గతి లేని చోట అభివృద్ధి ఎలా సాధ్యం?” అని ప్రశ్నిస్తున్నారు డాక్టర్ బి. రంగనాయకులు. ప్రశ్నలు వెయ్యడం సులువు. సరైన సమాధానాలను కనుక్కోవడమే కష్టం. ఆ కష్టాన్ని ఇష్టమైన భారంగా నె త్తికెత్తుకున్నారు రంగనాయకులు.

‘ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్లమంది మంచి వెలుగుకు నోచుకోక చీకట్లో మగ్గిపోతున్నారు. కనీసం కొందరి జీవితాల్లోనైనా చక్కటి వెలుగు నింపాలి’ అన్న ధ్యేయంతో కృషి చేస్తున్నారాయన. ‘ఒన్ ఛైల్డ్ ఒన్ లైట్’ నినాదంతో ఆయన ప్రారంభించిన సేవా సంస్థ గడచిన ఐదేళ్లలో ఐదు లక్షల లైట్లను సరఫరా చేసి గ్రామీణ విద్యార్థుల పాలిట వరంగా మారింది. కేవలం వారికే కాదు, అలవిమాలిన విద్యుత్ కష్టాలతో విసిగిపోతున్న సామాన్యులకు, అసలు కరెంటంటే ఏమిటో కూడా తెలియని మారుమూల జీవులకు సౌరశక్తితో నడిచే అందమైన దీపాలనిస్తోందీ సంస్థ.


“ఒకవైపు ఇండియా అనేక రంగాల్లో అగ్రస్థానానికి దూసుకుపోతోంది. మరోవైపు గ్రామీణ భారతం మాత్రం పేదరికంలో మగ్గిపోతోంది. మౌలిక వసతులు కూడా లే ని ప్రాంతాలెన్నో…” అని మొదలుపెట్టి రంగనాయకులు చెప్పే గణాంకాలు వింటే మతి పోతుంది. ఉదాహరణకు మన దేశంలో కిరోసిన్ దీపాల మీద అత్యధికంగా ఆధారపడే రాష్ట్రాలు మధ్యప్రదేశ్, బీహార్! అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో పన్నెండు కోట్ల మంది విద్యార్థులున్నారు. వారిలో దాదాపు 70 శాతం మందికి బుడ్డి దీపాలే గతి.

అలాగని వీరంతా అసలు విద్యుత్ సౌకర్యమే లేని కొండకోనల్లోనో, మరీ మారుమూల ప్రాంతాల్లోనో ఉన్నారనుకుంటే పొరపాటే. కరెంటు తీగలున్నా, కనెక్షన్లున్నా రోజుకు పది పన్నెండు గంటల పాటు కరెంటు కోతలున్న ప్రాంతాల్లో అవి నిరుపయోగమే. అలాంటి చోట చీకటి పడ్డాక చదువుకోవడం, వంట చేసుకోవడం.. ఏదైనా కష్టమే. గోరంత వెలుగుకు నోచుకోని అటువంటి సామాన్యులను మరీ ముఖ్యంగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రంగనాయకులు ‘ఒన్ ఛైల్డ్ ఒన్ లైట్’ సంస్థను ప్రారంభించారు.

ప్రారంభమైందిలా
కొన్నేళ్ల క్రితం ప్రపంచబ్యాంకు ఉద్యోగిగా ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కెన్యా, టాంజానియా వంటి దేశాల్లో పనిచేసే అవకాశం లభించించిందాయనకు. యుద్ధాలు, అంతర్గత విభేదాల్లో అల్లకల్లోలమైపోయిన ఆ దేశాల్లో స్కూళ్లను పునరుద్ధరించడం, అక్కడ విద్యార్థులు చదువుకునే వాతావరణాన్ని కల్పించడం ఆయన విధి. “ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు చూస్తే గుండె చెరువైపోతుంది. ఇరవయ్యేళ్ల వయసులో ప్రాథమిక పాఠశాలలో చేరతారు చాలామంది. ఇంటి దగ్గర కొంత హోమ్‌వర్క్ చేసుకురండి అంటే చెయ్యరు. ఎందుకు అని విచారిస్తే తెలిసింది… ఎక్కువమందికి ఇళ్లలో విద్యుద్దీపాలు లేవని.

దుర్గమ పర్వతాలు కావడంతో విద్యుత్ సౌకర్యాలుండవు. ఉన్న కొద్దిపాటీ యుద్ధంలో ధ్వంసమై ఉంటాయి. దాంతో వాళ్లకు కిరోసిన్ దీపాలే గతి. కానీ కిరోసిన్ అన్ని దేశాల్లోనూ సబ్సిడీపై ఇవ్వరు. దాంతో కిరోసిన్ దీపాలను వాడటం వాళ్లకు ఆర్థికంగా భారమవుతుంది. ఎంతో ముఖ్యమనుకుంటే తప్ప రాత్రిపూట దీపాలను వెలిగించ రు. ఇక చదువెలా సాగుతుంది?” ఆఫ్గాన్‌లోనే కాదు, ఆయన తిరిగిన దేశాలన్నిట్లో చీకటి పెద్ద సమస్యగానే కనిపించిందాయనకు. దాంతో గోరంత దీపం వారి జీవితాల్లో కొండంత వెలుగును నింపుతుందన్న నిర్థారణకు వచ్చారు. కరెంటు అవసరం లేకుండా సౌరశక్తితో నడిచే చిన్న దీపాలు పేదలకు సరఫరా చేయాలని నిర్ణయించుకున్నారు. ఉన్న ఉద్యోగంలో ఉంటూ అటువైపు అడుగులు వెయ్యలేరు గనక దానికి రాజీనామా చేశారు.

తప్పడుగులు కొన్ని
సౌరశక్తితో నడిచే దీపాలు ఎక్కడెక్కడ తయారవుతున్నాయో ఆరా తీస్తే చాలా సంస్థలే ఉన్నాయని తేలింది. కాని కొందామని వెళితే వాటి రేట్లు సామాన్యుడికి అందుబాటులో లేవు. “మొదట్లో ఉద్యోగం మానేస్తే వచ్చిన డబ్బులు చేతిలో గలగలమన్నాయి. దాంతో నేను వాటిని కొని ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాల్లో పంచడం మొదలుపెట్టాను. ఆర్నెల్లు గడిచేసరికి నా పరిమితులు నాకు తెలిసొచ్చాయి. దీపాలు అవసరమున్న వాళ్లందరికీ నేను ఉచితంగా ఇవ్వలేనని అర్థమైంది” అన్న రంగనాయకులు వెంటనే చవగ్గా వచ్చేవాటి వైపు దృష్టి పెట్టారు. చైనాలో ఇబ్బడిముబ్బడిగా తయారయ్యే దీపాలు మార్కెట్లో దొరుకుతాయి.

అయితే అవి ‘వాడి పారేసే’ రకం. తక్కువ డబ్బుకే కొనొచ్చుగానీ ఏదైనా కారణంతో ఒకసారి లైటు వెలగలేదంటే ఇక దాన్ని బాగుచేయలేం. ఈ ఆలోచన కూడా విఫలమైన తర్వాత హైదరాబాద్ పారిశ్రామికవాడలో తయారయ్యే సౌరదీపాలతో లక్ష్యాన్ని చేరుకుందామనుకున్నారాయన. “వాళ్ల దగ్గర లైట్లు కొని మారుమూల ఆదివాసీ గూడేల్లో పంచినప్పుడు నాకు భలే సంతృప్తిగా అనిపించేది. అయితే కొన్నాళ్ల తర్వాత వెళ్లి చూస్తే చిన్నచిన్న ఇబ్బందులతో అవి పనిచేసేవి కాదు. అమ్మినవాళ్లను రిపేరు చేసి పెట్టమని అడిగితే వాళ్లు ఆ మారుమూల ప్రాంతాలకు వెళ్లేవారు కాదు. అలా లైట్లు నిరుపయోగమైపోవడం చూస్తే బాధ కలిగేది” అని తొలినాటి అనుభవాలను చెప్పుకొచ్చిన ఆయన ఆ పరిస్థితిని నివారించడానికి తానే స్వయంగా లైట్ల తయారీకి పూనుకున్నారు.

మనమే చేసుకుందాం
సులువుగా ఉపయోగించగలగాలి, పర్యావరణానికి హాని చెయ్యకూడదు, వాడుతున్నప్పుడు ప్రమాదకరం కాకూడదు, ఆర్థికంగా భారం పడకూడదు, ఒకచోటి నుంచి ఒకచోటికి ఈజీగా పట్టుకెళ్లాలి – తాను తయారుచెయ్యబోయే దీపాలకు ఈ లక్షణాలుండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు రంగనాయకులు. దాంతో ప్రయోగాలకే చాలా ఖర్చయ్యింది. ఎలాగైతేనేం, హైదరాబాద్ శివార్లలోని చర్లపల్లి పారిశ్రామికవాడలో ‘థ్రైవ్ ఎనర్జీ టెక్నాలజీస్’ సంస్థను స్థాపించి తాననుకున్న తరహాలో దీపాలను ఉత్పత్తి చెయ్యడం మొదలెట్టారాయన. “దానర్థం నేనేదో పారిశ్రామికవేత్త అవతారం ఎత్తాననుకోకండి. నేను సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌ని.

నాకు కావలసింది మార్కెట్లో ఎక్కడా దొరకలేదు గనకే నేను స్వయంగా తయారుచేసుకోవడం మొదలెట్టాను తప్ప లాభాల కోసం కాదు. మేం తయారుచేస్తున్న సోలార్ లైట్ల ధరలు చుక్కలు చూపించవు. కేవలం ఫ్యాక్టరీ నిర్వహణ ఖర్చులు వస్తే చాలనేదే మా ఉద్దేశం. ఏ కాస్త మిగిలినా అది ట్రస్టుకు వెళ్లిపోయేలా వ్యవస్థను రూపొందించాం” అంటున్న ఆయన ‘థ్రైవ్’కు సమాంతరంగా ‘ఒన్ ఛైల్డ్ ఒన్ లైట్’ ట్రస్టునూ మొదలెట్టారు. థ్రైవ్ ఎనర్జీ టెక్నాలజీస్ తయారు చేసే లైట్లకు దేశవ్యాప్తంగా ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు, ఐఐటీలు, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లభించింది. ఉత్పత్తి ఖర్చుకే కొని అవసరమైన వారికి పంచడం మొదలెట్టాయవి.

రాహుల్‌గాంధీ కూడా ‘రంగాజీ’ ప్రయత్నాలకు ఊతమిచ్చారు. తమ కుటుంబం ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో కొన్ని వేల కుటుంబాలకు రంగాజీ రూపొందించిన లైట్లను సరఫరా చే శారాయన. దానికీ ఓ నేపథ్యముంది. మొన్నీమధ్య జరిగిన ఉప ఎన్నికల ముందు రాహుల్‌గాంధీ ఆ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ‘అభివృద్ధి సాధించడానికి మన ముందున్న మార్గాలేమిటంటే….’ అంటూ సాగుతోందాయన ప్రసంగం. మధ్యలో అడ్డుకుని ‘అంధేరే మే వికాస్ కైసా హోతా హై సాబ్… ఆప్ హీ బోలీయే…’ అన్నదొక నిరక్షరాస్య మహిళ. ‘మీరే చెప్పండి, చీకటిలో అభివృద్ధి ఎలా సాధ్యం’ అని సూటిగా నిలదీసిందన్నమాట.

తలో చెయ్యీ వేసి…
మొబైళ్లు, కూల్‌డ్రింకులు దొరుకుతాయిగానీ స్వచ్ఛమైన కాంతికి మాత్రం నోచుకోని పల్లెలు మన దగ్గర ఎన్నో. పది పన్నెండు గ ంటల పాటు కరెంటు లేకపోతే దాని ప్రభావం మొదట పడేది విద్యార్థుల పైనే. అందుకే ‘ఒన్ ఛైల్డ్ ఒన్ లైట్’ ట్రస్టు వారి మీదే దృష్టి పెట్టింది. ఈ ట్రస్టు సాయంతో వివిధ సంస్థలు విద్యార్థులకు లైట్లను పంపిణీ చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ పేపర్ ఇండియా (ఐపీఐ) తన సామాజిక సేవలో భాగంగా ప్రభుత్వ హైస్కూళ్ల విద్యార్థులకు ఈ లైట్లను పంపిణీ చేసింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు – పశ్చిమ గోదావరి, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని వెయ్యి మంది పిల్లలకు దీనివల్ల ప్రయోజనం కలిగింది.

గడచిన తొమ్మిది నెలల్లో విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ చొరవతో ఒక్క అనంతపురం జిల్లాలోనే తొమ్మిది వేల దీపాలు వెలిగాయి. మధ్యప్రదేశ్‌లోని ఒక మారుమూల జిల్లా ఖార్గోనె. అక్కడ వంద పాఠశాలల్లో ఒక్కోదానిలోనూ వంద మంది విద్యార్థుల చొప్పున పది వేల మందికి ‘ఎడ్యుకేషన్ పార్క్’ అనే సంస్థతో కలిసి సోలార్ దీపాలను పంపిణీ చేసింది. జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ ద్వారా నాబార్డ్ సబ్సిడీ ఇచ్చి వీటిని కొంటోంది. కేరళలోని త్రిసూర్‌లో ఎవాంజెలికల్ సోషల్ ఏక్షన్ సంస్థతో కలిసి అక్కడి మారుమూల కుగ్రామాల్లో పన్నెండొందల లైట్లను సరఫరా చేశారు. ఒడిస్సాలోని ఆశాకిరణ్, పూణెలోని మరో సంస్థతో కలిసి ఎనిమిది వందల కుటుంబాలకు లైట్లిచ్చారు. గడచిన మూడేళ్లలో ఉత్తరప్రదేశ్‌లోని 198 గ్రామాలు, 45,105మంది వ్యక్తులు సోలార్ ఎల్ఈడీ లైట్ల ద్వారా లాభం పొందారు. రాజీవ్ గాంధీ మహిళా వికాస్ పరియోజనతో కలిసి గ్రామాల్లో నెలకొల్పుతున్న సౌర శక్తి కియోస్క్‌ల ద్వారా ఇది సాధ్యమైంది.

అలహాబాద్ యూపీ గ్రామీణ బ్యాంకు సహకారం వల్ల మరో ఆరొందల గ్రామాల్లో ఎల్ఈడీ వెలుగులు పూస్తున్నాయి. మన దేశంలోనే కాకుండా తూర్పు – దక్షిణ ఆఫ్రికాల్లో, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, కాంబోడియా, హైతీ వంటి దేశాల్లో ఇప్పటి వరకూ ఐదు లక్షల దీపాలకు పైగా సరఫరా చేసింది థ్రైవ్ సంస్థ. కెన్యాలోని టీ తోటల్లో పనిచేసే కార్మికులకు 42321 సౌరదీపాలను అందించింది థ్రైవ్ సంస్థ. ప్రత్యామ్నాయ శక్తివనరుల రంగంలో థ్రైవ్ చేస్తున్న కృషికి బోలెడన్ని అవార్డులు కూడా వచ్చాయి. 2006లో ప్రపంచబ్యాంకు డెవలప్‌మెంట్ మార్కెట్‌ప్లేస్ అవార్డు, 2009లో లైటింగ్ టాంజానియా అవార్డు, 2011లో ఫ్రాస్ట్ సులివాన్ ఎల్ఈడీ ఎక్సలె న్స్ అవార్డు వంటివి అంతర్జాతీయ స్థాయిలో చెప్పుకోదగినవి.

చాలా పెద్ద విషయం
‘ఇంతా చేసి చిన్న లైటే కదా, దానికింత హడావుడా’ అని ఎవరైనా అనుకోవచ్చుగానీ, “వెలుతురు అనేది చాలా పెద్ద విషయం. జీవన ప్రమాణాలు మెరుగుపడటంలో వాటి పాత్ర ఎంతో ఉంది” అంటారు రంగనాయకులు. రెక్కాడితేగాని డొక్కాడనివారు కోట్ల మందున్న చోట – సాయంత్రమవుతూనే చేతిలో పని ఆపెయ్యాలంటే కష్టమే. మరొక్క గంట బజారు నడిస్తే ఎంతోమంది కూరగాయల రైతులకు మేలు. మరొక్క గంట మిషను కుట్టగలిగితే ఇల్లాలికెంతో ఆదాయం. మరొక్క గంట నాలుగు గడ్డి చొప్పలు కొయ్యగలిగితే కూలివాడికి సంపాదన. కాసింత వెలుగుంటే గేదె పాలు తీసుకోవడం సులభం.

ఒక్క గంట చదువుకోగలిగితే మరిన్ని విషయాలు బుర్రకెక్కుతాయి విద్యార్థికి. ఒక్క దీపం కొన్ని గంటలు వెలిగితే చాలు, అందరి అవసరాలూ గట్టెక్కుతాయి. “ఆసియా, ఆఫ్రికాల్లోని చాలా దేశాల్లో చీకటి పడ్డాక వెలుతురు కావాలంటే కిరోసిన్ దీపాలే దిక్కు. వంటకీ అదే. కిరోసిన్ కొనడానికి కిలోమీటర్లు నడిచివెళ్లి నెత్తిమీద మోసుకుంటూ తెచ్చుకుంటారు. సంపాదనలో నాలుగో వంతు కిరోసిన్‌కే ఖర్చయిపోతే బిడ్డల చదువులెట్లా? ఇల్లు గడిచేదెలా? చీకటి అనేది మనం ఊహకు అందనంత పెద్ద సామాజిక సమస్య…” అంటూ వివరిస్తున్నారాయన. నిజంగానే ఇది చిన్న విషయం కాదు. 2030 నాటికి కూడా ప్రపంచంలో 140 కోట్ల మందికి విద్యుత్ సదుపాయం ఉండదని ప్రపంచబ్యాంకు లె క్కలు చెబుతున్నాయి.

‘మరి అంతమందికి వెలుగునివ్వాలంటే నా ఒక్కడి వల్లనేమవుతుంది చెప్పండి? అందుకే నేను యువతను ప్రోత్సహిస్తున్నాను. వచ్చి పని నేర్చుకోండి, మరో పదిమందికి పనిచ్చే స్థాయికి చేరుకోండి. వంద మంది జీవితాల్లో వెలుగు నింపండి’ అంటున్నారాయన. వచ్చే ఏడాదిలో వంద రూపాయలకే నాణ్యమైన లైటునందించాలనే ధ్యేయంతో శ్రమిస్తున్న ‘రంగాజీ’ ప్రభుత్వాలూ, మరికొన్ని స్వచ్ఛంద సంస్థలూ కలిసొస్తే ఐదేళ్లలో ఐదు లక్షలు కాదు, ఏడాదికి ఐదు లక్షల దీపాలను సరఫరా చెయ్యగలమని భావిస్తున్నారు.

ప్రకాశంలో పుట్టిన వెలుగు
ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని తిమిదెడపాడు అనే పల్లెటూరిలో పుట్టిపెరిగారు బోడావుల రంగనాయకులు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీయే పట్టా పుచ్చుకున్న తర్వాత హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలే జీలో ప్రజారోగ్యానికి సంబంధించిన విభాగంలో పనిచేశారు. ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో పీహెచ్‌డీ పట్టానందుకున్న తర్వాత ఆయనకు హార్వర్డ్ యూనివర్సిటీ ఫెలోషిప్ లభించింది. ‘అక్కడ ఏ పట్టా సంపాదించానన్నది కాదు, గొప్పగొప్ప ప్రొఫెసర్ల దగ్గర జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’ అనే రంగాజీకి ఆ తర్వాత ప్రపంచబ్యాంకులో పనిచేసే అవకాశం తలుపుతట్టింది.

మణిపూర్లో పావు వంతు సౌరదీపాలే
ఈశాన్య భారతంలోని 95శాతం పల్లెటూళ్లు ఇప్పటికీ గ్రిడ్ వ్యవస్థకు అనుసంధానం కాలేదు. అక్కడ ఉండే వాతావరణ పరిస్థితుల వల్ల వేసవిలో తొమ్మిది గంటలు, మిగిలిన కాలాల్లో అంతకన్నా తక్కువ వెలుగుంటుంది. దాంతో వారు పూర్తిగా కిరోసిన్, కొవ్వొత్తుల వంటి వాటిమీదే ఆధారపడుతున్నారు. ఇవి ఆర్థికంగా చాలా భారం. 2009 డిసెంబరు నుంచీ అక్కడి స్వయంసహాయక బృందాలతో కలిసి లైట్లను పంపిణీ చేస్తోంది థ్రైవ్. ఇప్పటికి సుమారు లక్షా ఇరవై వేల ఇళ్లలో ఈ చిట్టి దీపాలు వెలుగులు నింపుతున్నాయి. ఈ సంఖ్య మణిపూర్‌లోని ఇళ్లలో పావు వంతన్నమాట.

అమ్మో కిరోసిన్…
ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తమ్మీద రెండొందల కోట్ల మందికి మంచి వెలుతురు అందుబాటులో లేదు. కిరోసిన్ దీపాలు తెచ్చే చిక్కులు అన్నీఇన్నీ కావు. గ్రామాల్లోని పూరి గుడిసెల్లో సంభవించే అగ్ని ప్రమాదాల్లో తొంభై శాతం చమురు దీపాల వల్లనే. దీనివల్ల ఆస్తి నష్టం, ప్రాణనష్టం. ప్రపంచవ్యాప్తంగా 78 కోట్ల మంది మహిళలు, పిల్లలు కిరోసిన్ పొగను పీలుస్తున్నారు. ఇది రోజుకు రెండు పెట్టెల సిగరె ట్లు కాల్చడంతో సమానం. పొగ తాగే అలవాటు లేనప్పటికీ మహిళలు లంగ్ క్యాన్సర్ బారిన పడటంలో కిరోసిన్ పొగ పాత్ర అత్యధికం. నిజానికి విద్యుత్ దీపాలతో పోలిస్తే కిరోసిన్ దీపాలకయ్యే ఖర్చూ విపరీతం. ఒకవైపు వీటితో వచ్చే వెలుగు తక్కువ, మరోవైపు ఇవి గాల్లోకి వదిలే కార్బన్‌డయాక్సైడ్ శాతం ఎక్కువ.

ఇలా పనిచేస్తాయి
థ్రైవ్ తయారుచేసే దీపాలను ఒకసారి కొన్నాక నిర్వహణకు పైసా ఖర్చుండదు. ఎండలో పెట్టి ఛార్జింగ్ చేస్తే సరిపోతుంది. ఛార్జింగ్ పూర్తిగా ఉంటే రోజుకు ఏడెనిమిది గంటల పాటు నిర్విరామంగా కాంతినిస్తాయీ దీపాలు. కిరోసిన్ దీపాల వెలుగు 2-3 లక్సులుంటే, ఈ దీపాల వెలుగు 150 లక్సులుంటుంది. (లక్స్ అంటే వెలుగును కొలిచే యూనిట్) వీటిలో నికెల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీ ఉంటుంది. దీన్ని సౌరశక్తి ద్వారా లేదంటే కరెంటుతో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. లైట్ల నాణ్యతలో ఏమాత్రం తేడా ఉండదు. పొరపాటున ఏ టేబుల్ మీది నుంచో కిందపడినా పాడైపోవు, విరిగిపోవు. మార్కెట్లో దొరికే ఈ తరహా లైట్లతో పోల్చినప్పుడు ఇవి 40శాతం తక్కువకే లభిస్తున్నాయి. వివిధ అవసరాలకు సరిపడా పదమూడు రకాల దీపాలు అందుబాటులో ఉన్నాయి. దీపాలు పంపిణీ చేసి ‘హమ్మయ్య, మనం చెయ్యగలిగిందంతా చేసేశాం’ అనుకోవడం ఒక పద్ధతి.

కానీ థ్రైవ్ అలా అనుకోదు. వెలిగే దీపాలు కొండెక్కి పోకుండా చూసుకోవడమూ తన బాధ్యతగానే భావిస్తుంది. ఎంత సరళమైన సాంకేతికత అయినా సరే, ఎక్కడో దగ్గర చిన్న లోపమేదో తలెత్తక మానదు. అందుకే లైటును ఉపయోగించడమే కాదు, ఏవైనా చిన్నచిన్న సమస్యలు తలెత్తితే బాగుచేసుకోవడమూ నేరుగా వినియోగదారులకే నేర్పిస్తారు. దగ్గర్లోనే సర్వీసింగ్ సెంటర్లు, రిపేరు చెయ్యగలిగే వ్యక్తులు ఉండేలా తగు జాగ్రత్త తీసుకుంటారు. ‘ఒన్ ఛైల్డ్ ఒన్ లైట్’ అందించే దీపాల ధర 350 రూపాయలు. వంద గ్రాముల బరువుండే దీని వంగే గుణం వల్ల మడిచి జేబులోనో, హ్యాండ్‌బ్యాగ్‌లోనో పెట్టుకోవచ్చు. మిగిలిన అవసరాలకు ఉపయోగపడే లైట్లు 350 – 1350రూ రేంజ్‌లో ఉన్నాయి.

సోలార్ లైట్ల తయారీ ఇలా..
“థ్రైవ్‌లో నెలకు 25,000 విద్యార్థుల స్టడీ లైట్లు, 10,000 ఏక్సెండో లైట్లు, మరో రెండు వేలు హోమ్ లైట్లు తయారవుతాయి”

బి. రంగనాయకులు, 9866305772

Advertisements

One thought on “మీరొక్క లైటిచ్చి ఒక విద్యార్థికి సాయపడొచ్చు

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s