‘త్రిపురగారి దగ్గరకు వెళ్లావా’ అని ఇక నన్నెవరూ అడగరు

మూడేళ్ల క్రితం మాట. ‘విశాఖపట్నం బదిలీ అయింది’ అని ఎవరికైనా చెప్పడం ఆలస్యం వెంటనే ‘త్రిపురగారిని చూశావా?’ అనడిగేవాళ్లు. మా ఇసికపట్నపు సముద్రానికి యారాడ కొండ మీదున్న లైటవుసు ఎంతో తెలుగు కథా సముద్రానికి త్రిపురగారంతట. అయితే మాత్రం? వెళ్లీ వెళ్లగానే ఆయనను చూడటానికి నావల్లవుతుందా? పోనీ తర్వాత? నా చిన్న ఇల్లు అలుక్కుంటూ నా పేరేమిటో మర్చిపోయిన ఈగను కదా, ఇక త్రిపుర సంగతి నాకెందుకూ? ‘దీనికి చెప్పి లాభం లేద’ని లోకం ఊరుకుంది.

   కానీ నేను త్రిపుర దగ్గరకు వెళ్లాను. ప్రతి ఆదివారం మా ‘నవ్య’ పేజీలో వచ్చే ‘మా ఊరు’ శీర్షిక కోసం ఆయన ఇంటర్వ్యూ తీసుకోమన్నారు మావాళ్లు. ఫోన్ చేస్తే వారమ్మాయి వింధ్య తీసుకుని ‘మీకు తెలీదా? నాన్న ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్నారు. ప్రమాదం ఏమీ కాదనుకోండి, శుక్రవారం (మే 17) ఉదయం ఇంటికొచ్చేస్తారు. అప్పుడు చేస్తారా ఇంటర్వ్యూ?’ అనడిగారు. ఆరోగ్యం బావుండని మనిషిని ఆస్పత్రి నుంచి ఇంటికి రాగానే ఇంటర్వ్యూనా? బాగుంటుందా? ఆలోచించుకుని మళ్లీ ఫోన్ చేశాను. ‘వింధ్యగారూ, ఇంటర్వ్యూ కోసం కాదు, నాకు చూడాలనిపిస్తోంది. విజిటింగ్ వేళలేమిటి?’ అని. ‘సాయంత్రం ఆరు నుంచి ఏడు. కానీ మీరు అక్కడ త్రిపురగారని అడక్కండి. వాళ్లకు తెలీదుగదా. ఆర్వీటీకే రావు అనడగండి’ అన్నారు.

ఎప్పుడూ గడియారం కన్నా వెనకే ఉండే నేను ఆరోజు మాత్రం ఠంచనుగా ఆరింటికల్లా ఐసీయూ ముందు నిలబడ్డాను. ఏదో పనుందని ఆమె అప్పుడే బైటికి వెళ్లారు. ఐసీయూముందున్న సెక్యూరిటీ ఏ ఛత్తీస్‌గడ్ మనిషో. ‘షూ యహాఁ ఛోడియే. థోడీ హీ బాత్ కీజియే. ఔర్ ఇన్‌కా డిస్టర్బ్ కర్నా నై’ అంటూ అలవాటైన సూచనలిచ్చేశాడు. పదినిమిషాల కన్నా ఉండనివ్వడని అర్థమైపోయింది. లోపలికి అడుగుపెడితే ఆకుపచ్చని దుప్పటి మెడ వరకూ కప్పుకున్న త్రిపుర. రెండు నెలల క్రితం నేను చూసిన మనిషికీ ఈయనకీ ఇంత తేడానా? ఒంటి నిండా రకరకాల ట్యూబులు… మగత నిద్రలోకి జారుకుంటున్నారేమో, ‘ఎవరూ…’ అన్నారు.

‘సార్, నేను ఫలానా…’ అంటుండగానే, ‘అవును. చందనపు బొమ్మవి. ఆంధ్రజ్యోతిలో కదా పనిచేస్తావు..? ఈ మందుల వల్ల పోలిక పట్టడం కష్టమైంది’ అంటూ కుడిచేతిని చాచి నా చెయ్యందుకున్నారు. అంతకుముందే నా కథల పుస్తకం ‘చందనపు బొమ్మ’ ఇచ్చానాయనకు. అదీ రిఫరెన్స్. నా చేతిని గట్టిగా పట్టుకుని ‘ఐయామ్ సో హ్యాపీ, ఐ థాట్ యూ వర్ గోయింగ్ టూ హైద్రాబాద్ ఆన్ ట్రాన్స్‌ఫర్… ఇక్కడే ఉన్నావా’ అనడిగారు. ‘లేదు సర్, హైద్రాబాద్ వెళ్లాను. ఒక పది రోజులిక్కడ పనుందని వచ్చాను. మీరిక్కడున్నారని తెలిసీ…’ నసిగాను.

‘గుడ్, ఐయామ్ హ్యాపీ టు సీ యూ నౌ…’ అంటూ నా విషయాలడిగారు. చెప్పాను. ఆయన ఆరోగ్య వివరాలడుగుతూనే ‘ఏమీ ప్రమాదం కాదన్నారు మీ అమ్మాయి. శుక్రవారం ఇంటికి వచ్చేస్తారటగా. అప్పుడొక ఇంటర్వ్యూ పెట్టుకుందామనుకున్నా’ అంటే ‘వై నాట్’ అన్నారు. ‘ఏం ఇంటర్వ్యూ? కథల గురించేనా’ అంటే ‘కాదు సర్, మీరు పుట్టిపెరిగిన ఊరు, అది మీమీద చూపించిన ప్రభావం… వీటి గురించి చెప్పాలి. ఇంటికొచ్చేలోగా గుర్తు చేసుకోండి’ అన్నాను చిన్నగా.  ‘నేను పుట్టింది పర్లాఖిమిడి దగ్గర. అప్పట్లో అది గంజాం ఏరియా. అవునూ, కిందటిసారొచ్చినప్పుడు నువ్వేగదా నన్ను ఒడ్డివాడన్నావూ…’ అని చిన్నగా నవ్వుతూ జ్ఞాపకాల్లోకి జారుకున్నారు త్రిపుర.
 
అంతకుముందు రెండుసార్లు వెళ్లాను వాళ్లింటికి. త్రిపురను చూడాలా వద్దా అన్న సంశయంతోనే గడిపేశాను రెండేళ్లు. ఎర దుకో తెలియని బెరుకు. ‘త్రిపుర అంటే చాలా పెద్ద కథకుడు. జీవితాన్ని చూసినవాడు. జెన్ అంటారు, బౌద్ధం అంటారు, సర్రియలిజం అంటారు… వీటన్నిటి గురించీ ఆయన మాట్లాడితే మనకేం అర్థమవుతుంది?’ అనే భయం. ‘నీకేమైనా పిచ్చా? పొద్దస్తమానం అవన్నీ ఆయన ఎందుకు మాట్లాడతారు’ అన్నారు ఇందిర. ఆవిడ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంగ్లిష్ అధ్యాపకురాలు. త్రిపురతో వాళ్లది కుటుంబ స్నేహం. ఆమె వెంటబెట్టుకుని తీసుకెళ్లారు మొన్న జనవరిలో. ‘ఈ అమ్మాయి మీ దగ్గరకు రావాలనుకుంటూ వెనకాముందాడుతోంది’ అని ఆవిడ పరిచయం చేస్తుంటే ‘నేనేం రాక్షసుణ్ననుకున్నావా’ అని నవ్వారు.

కథల పుస్తకం చేతిలో పెట్టగానే త్రిపురగారూ, ఆయన భార్య లక్ష్మీదేవమ్మా… ఇద్దరూ ఆనందంగా అందుకున్నారు. వెంటనే చదివెయ్యాలన్న ఆతృత ఇద్దరిలోనూ కనిపించింది. చదివే అలవాటు ఎక్కువ ఉండి, వయోభారంతో ఎటూ వెళ్లలేక, కొత్త పుస్తకాలు కనిపిస్తే వచ్చే ఆనందం వాళ్లిద్దరిలోనూ ప్రతిఫలించింది. వారం రోజుల్లోనే ఇందిరగారి నుంచి మెసేజ్. ‘శ్రీకాకుళం పిల్లకాకి కథలు బాగా రాస్తోందని త్రిపురగారు చెప్పమన్నారు’ అని. నాకు ఎంతకీ తెగని ఆశ్చర్యం. ‘నిజంగానా’ అని మెసేజ్ పెడితే ఆవిడ ఫోన్ చేసి ‘ఏం పిల్లా, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఆయనకేంటి, నాకేంటి’ అన్నారు.

భూతద్దం సాయంతో వంద పేజీల పుస్తకాన్ని నాలుగు రోజుల్లో పూర్తి చేయడం నాకు ఆశ్చర్యమనిపించింది! మళ్లీ వెళ్లినప్పుడు ‘నీ పుస్తకాన్ని మా స్నేహితులిద్దరికిచ్చాను. మా అక్కచెల్లెళ్లక్కూడా. ఇప్పుడు రైటర్స్ మంచి తెలుగు రాస్తున్నారు. నాకు అంత తెలుగు రాదు’ అన్నారు త్రిపురగారు. నాకు మళ్లీ ఆశ్చర్యం. ప్రపంచమంతా మెచ్చిన తెలుగు కథకుడు తెలుగు రాదంటారేమిటి? ‘నేను పర్లాఖిమిడి దగ్గర పల్లెటూళ్లో పుట్టాను.

అప్పట్లో అది గంజాం ప్రాంతం. ఒడియా ప్రభావం ఎక్కువ. తర్వాత చదువూ ఉద్యోగం అంతా ఇంగ్లీషులోనే కదా’ అంటూ తన నేపథ్యాన్ని చెప్పుకొచ్చారాయన. ఆయన అభిమానం ఇచ్చిన భరోసాతో ‘అయితే మీరు ఒడ్డివాళ్లన్న మాట…’ అన్నాను పరిహాసంగా. అనేశానేగానీ, ‘ఇంత పెద్దాయన ఎలా స్పందిస్తారో’ అని లోపల పీకుతోంది. వెంటనే వచ్చింది సమాధానం. ‘అవును మేం ఒడ్డివాళ్లమే. అందుకే కదా నాకు తెలుగు బాగా రాదంటున్నది’ అన్నారాయన నవ్వుతూ. ఆ నవ్వుతో ఆ సాయంత్రం వికసించినట్లయిపోయింది.
 
ఐసీయూలో పట్టుకున్న నా చేతిని వదలకుండా అరగంటపాటు ఆపకుండా కబుర్లు చెప్పారు త్రిపుర. చిన్నప్పుడు ఒడియా భాషాసంస్కృతులున్న ఊళ్లో పుట్టడం, తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా ఊళ్లు తిరగడం, దొరల దగ్గర ఇంగ్లీషు నేర్చుకోవడం.. ఇవన్నీ ముక్కముక్కలుగా. ‘మన దేశం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందనిపిస్తోంది. ఇక్కడ సీనియర్ సిటిజెన్లకు సరైన సదుపాయాలు లేవు. కనీసం ఈ మాత్రం వైద్య సదుపాయాలున్నాయి అదే పదివేలు..’ అంటూ ఐసీయూలోకి వచ్చి ముసురుతున్న ఈగను చూపెట్టారు. ‘వేరే దేశాల్లో పెద్దవారిని బాగా చూస్తారు. ప్రభుత్వాలే చాలా చేస్తాయి వారి కోసం. మన దగ్గర అలాంటి సదుపాయాలెప్పుడొస్తాయో. మా పిల్లలిద్దరు విదేశాల్లో ఉంటున్నారు. అక్కడికెళ్లి మేం ఉండలేం. పాపం మా వింధ్య మీదే ఇంత భారం. అలాగని పిల్లలు మనతోనే ఉండాలనుకోవడమూ తప్పే. వాళ్లు ఉద్యోగాల్లో అభివృద్ధి చెందాలనే కోరుకుంటాంగానీ ఈ వయసులో మాతో ఉండి వాళ్లేం సాధిస్తారు? మా నాన్న కూడా ఇలానే అనేవాళ్లు. మేం అగర్తలాలో ఉండే ఇల్లు ఎంత బావుండేదో. నది పక్కనే కుటీరంలాంటి ఇల్లు. రమ్మని ఎంతడిగినా వచ్చేవాళ్లే కాదు. ఆయన డాక్టరు. చివరి వరకూ నెల్లూరి దగ్గర పల్లెటూళ్లోనే వైద్యం చేస్తూ గడిపేవారు. నేను మాత్రం ఆయన కోసం రాగలిగానా చెప్పు? ఇలాంటి ఆలోచనలతోనే వలసపక్షులు కథ రాశాను. నాకు తెలియనిదేమీ కల్పించి రాయలేదు నేనసలు’ అంటూనే ‘నాకిక్కడ ఉండాలని లేదు. ఇంటికెళ్లిపోవాలనుంది. ముఖ్యంగా ఆమెను చూడాలనుంది. చాలా గొప్ప రిలేషన్ మాది’ అంటున్నప్పుడు ఆయన కంటి చివర అశ్రుకణమొకటి నిల్చింది. ఈలోగా గార్డు వచ్చి ‘ఇతనా దేర్ తక్ బాత్ కర్తే క్యా పేషెంట్ సే’ అని గదమాయించాడు నన్ను. ‘ఆమె కాదు మాట్లాడుతున్నది, నేను మాట్లాడుతున్నా. ఇంకెవరూ విజిటర్లు లేరు కదా. ఈమెను ఉండనివ్వు. రూల్సున్నాయని నాకు తెలుసులే’ అంటూ హిందీలో మాట్లాడి అతన్ని వెళ్లగొట్టారు. ఇంతలో వాళ్లమ్మాయి వింధ్య రావడంతో గార్డుకు బలం వచ్చింది. ‘ఇంక నువ్వు బైటికి నడవ’మన్నట్టు చూశాడు నావైపు.

‘శుక్రవారం ఉదయం వస్తాను సార్’ అంటూ నేను తీసుకొచ్చిన ‘నవ్య’ వారపత్రికను ఆయన చేతిలో పెట్టి వచ్చేశాను. ఇంటికెళ్లి లక్ష్మీదేవమ్మగారికి చెప్పాను – ‘ఆయనకు వచ్చెయ్యాలని ఉందట, మిమ్మల్ని చూడాలని ఉందట’ అని. ‘మేమెప్పుడూ దూరంగా లేమమ్మా…’ అంటూ ఆమె నిశ్శబ్దంగా అయిపోయారు. అక్కడ నుంచి వస్తూ బుర్ర పనిచేయక తిరిగిన రోడ్డులోనే ఉన్మాదిలాగా రెండు సార్లు తిరిగాను. ‘నమస్తే అస్తు భగన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ…’ దేవుడా ఈ మనిషిని కనీసం ఇంకొంత కాలం ఉంచవా అన్న ప్రార్థన మనసులో.

 
పర్లేదు ఇకపై విశాఖపట్నం ఎన్నిసార్లయినా వెళ్లొచ్చు చేతులూపుకుంటూ. ఖాళీ తలకాయ్‌తో రావొచ్చు. ‘త్రిపురగారి దగ్గరకు వెళ్లావా’ అని ఇక నన్నెవరూ అడగరు. అయ్యో, నా అజ్ఞానాన్ని మన్నించండి, ఇప్పుడెవరైనా అడగండి, ప్లీజ్.

One thought on “‘త్రిపురగారి దగ్గరకు వెళ్లావా’ అని ఇక నన్నెవరూ అడగరు

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s