కాశికాపురి – తెలుగువాళ్ల శివానందలహరి!

జ్యేష్ట మాసపు సూర్యుడు ఉదయం ఆరింటికే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మా కుటుంబమంతా మొఘల్‌సరాయ్ రైల్వేస్టేషన్లో దిగింది. అక్కణ్నుంచి వారణాసికి ఓ ముప్పావుగంట రోడ్డు ప్రయాణం.
‘జీవితంలో కాశీయాత్ర ఒక్కసారైనా చెయ్యాలి…’ అని మా అత్తమామలు తెగ చెబుతుంటారు. ఒక్క వాళ్లనే ఏముంది? మన దేశంలో నూటికి తొంభై మంది నమ్మకమూ అదే.
మా అత్తమామల వంటి సంపూర్ణమైన భక్తిపారవశ్యంతో కాక, ఒక నెమ్మదైన కుతూహలంతో నేనా క్షేత్రానికి బయల్దేరాను.

కాశీలోనూ, చుట్టుపక్కల ఉన్న దేవాలయాలన్నిటినీ చూసెయ్యాలన్న ఆతృతగాని, అక్కడ పేరెన్నికగన్న పట్టుచీరల పట్ల స్త్రీ సహజమైన మక్కువగాని లేకుండా, కేవలం ఒక్క ప్రశ్నకు సమాధానం కనుక్కోవాలన్న కుతూహలం మాత్రమే ఉంది నాలో. అలాగని నేరుగా అడిగి కనుక్కోకుండా, కేవలం అనుభవాల్ని గమనించడం ద్వారా నాదైన సమాధానాన్ని పొందాలని ప్రయాణానికి ముందే నిర్ణయించుకున్నాను.
మొఘల్‌సరాయ్ బొగ్గు మార్కెట్‌లో లోడింగ్ చేసుకుంటున్న లారీల దుమ్ము కాస్త అణగగానే గంగానది దర్శనమిచ్చింది. అది కనిపించగానే నాలో అప్పటివరకూ అణచి ఉంచిన కుతూహలం పైకి ఉబికింది.
ఎందుకు ఈ నదీ, ఈ క్షేత్రమూ ఇన్ని వేల, లక్షల మందిని ఆకర్షిస్తున్నాయి? ప్రతి మనిషికి, వాళ్లు పుట్టిపెరిగిన కాలానికి అనుగుణంగా ఎన్నో ఆకర్షణలుండనే ఉన్నాయి. జీవిక కోసం ఆత్రం ఎటూ తప్పనిదే. వాటన్నిటి మధ్యలోనూ వాళ్లని ఇంత దూరం తీసుకొస్తున్న ఆకర్షణ శక్తి ఏది? దేని కోసం ఇంత దూరం వస్తున్నారు? భయమా, భక్తా? చేసిన పాపాలను కడుక్కోవడం కోసమా? ఇదీ నా లోపలి ప్రశ్న.
జ్యేష్ట శుద్ధ పాడ్యమి రోజున గంగాదేవి భూమ్మీద అవతరించింది. అప్పటి నుంచి దశమి వరకు గంగ దశ పాపహర రోజులు. ఆ దినాల్లో గంగాస్నానం చెయ్యడం వల్ల మనస్సు, మాట, శరీరాలతో చేసే పది రకాల పాపాలు పోతాయని నమ్మకం. ‘దశ పాప హర’ జనాల నోట్లో పడి దసరా అయింది. గంగా దసరా రోజులు కనుక మేం వెళ్లిన ప్పుడు అటు స్నానానికీ, ఇటు దర్శనానికీ కూడా జనసమ్మర్దం ఎక్కువగానే ఉంది.
అయితే గంగ ప్రవాహంలో స్నానం చేస్తున్న వారిలో కాని, విశ్వేశ్వర దర్శనం కోసం ఒకర్నొకరు ఒరుసుకుంటూ క్యూలైన్లలో నిల్చున్నవారిలో కాని… మొక్కులు తీర్చుకోవడానికో, పాపనాశనం కోసమో నేనూహించినలాంటి తొందరేదీ కనిపించ లేదు.
‘ఎంతసేపైంది వచ్చి, బాగున్నారా’ అంటూ పెళ్లిళ్లలో ఇతర శుభకార్యాల్లో ఒకర్నొకరు ఆత్మీయంగా, ఉల్లాసంగా పలకరించుకుంటాం చూడండి, ఆ తరహాలో ఒక వేడుకలో పాల్గొంటున్నట్టు, అభిమానంగా, సంతోషంగా ఉన్నారంతే.
అదే మాట పైకంటే, ‘అదే మరి నువ్వర్థం చేసుకోవలసింది. ఆ తొందరలేని నిదానమే శివసాన్నిధ్యం ప్రసాదించే సుఖం. ఇక్కడకు ఎడతెగకుండా వస్తున్న మానవుల అనుభవంలోకి వచ్చేది శివుడు ప్రసాదించే ఆ ప్రశాంతతే. అదే ఆనాడు ఆదిశంకరుడు అనుభవించి పలవరించిన శివానందలహరి. కాశీకి ఆనందవనం అనే పేరెందుకొచ్చిందో నీకీపాటికి అర్థమై ఉండాలి…’ అన్నారు మా మావగారు.
‘సంసార దోషమును వారించేది వరణ, అదే వారణ. ఇంద్రియదోషములను ఖండించేది అసి – వెరసి వారణాసి’ అని మల్లంపల్లి శరభేశ్వర శర్మగారు శ్రీనాథుని కాశీఖండ కావ్యానికి రాసిన ‘దర్శనం’ గుర్తొచ్చింది ఆయన మాట్లాడుతుంటే.
‘అయితే, ఇక్కడ భ్రమ, విభ్రమ అనే రెండు లింగాలున్నాయి. కాశీపుర వీధుల్లోని చెత్త, గంగలోని మాలిన్యాన్నీ పదేపదే కళ్లపడేలా చేస్తూ ఏముందిక్కడ అనే భావన మనలో కలిగించడానికి భ్రమ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంటికెళ్లాలి, ఆఫీసులో ఇంకా ఇంత పనుంది… అనే తొందర పుట్టించడంలో విభ్రమ కృతకృత్యమవుతూ ఉంటుంది. అందువల్లే నీ వంటివాళ్లు తిరిగి వెళ్లడానికి త్వరపడుతూ ఉంటారు…’ అని కూడా చెప్పారాయన నవ్వుతూ.
ఆయనన్నది నిజమేనేమో. ఏ భ్రమావిభ్రమల్లేని శాంత స్థితిని పొందిన వాళ్లంతా అక్కడ ఉండిపోవడానికే ప్రయత్నిస్తున్నారు మరి.
‘తల్లి గర్భంలో ఉన్నన్ని రోజులు, సుమారు పది నెలల పాటు కాశీ పొలిమేరలు దాటకుండా, పట్టణంలోనే నివాసముంటే, మరణించాక మరోసారి ఏ త ల్లి గర్భంలోనూ పడే పనుండదు. అంటే పునర్జన్మ ఉండదు. దాన్నే గర్భవాసం అంటారు’ అని ఒకావిడ చెప్పారు. ఇదిగాక కొందరు క్షేత్ర సన్యాసాన్ని స్వీకరిస్తుంటారు. అంటే ‘మరణించేవరకు కాశీ వదిలి వెళ్లం’ అని ప్రతిజ్ఞ పూని అక్కడే ఉండిపోవడం. కుటుంబంలో శుభాశుభ కార్యాలు ఏవి జరగనీ, వాళ్లు వెళ్లరు. అలాగని సన్యాసులు కారు. అలా ఉండే దంపతులు, ఒంటరులూ కూడా కాశీలో కనిపిస్తుంటారు.
ముఖ్యంగా తెలుగువాళ్లు!
మహాకవి శ్రీనాథుడి కాశీఖండం, ఏనుగుల వీరాస్వామి ‘కాశీయాత్రా చరిత్రం’ మొదలుకొని, ఈమధ్య వచ్చిన ‘ఇంద్ర’ సినిమా వరకు ఏదో ఒక రూపంలో కాశీ గురించిన సమాచారం అందుతూనే ఉంది. శతాబ్దాలు గడిచిపోయినా తెలుగువాళ్లకు కాశీ పట్ల ఆకర్షణ తగ్గడం లేదు.
గంగానది ఘాట్ల వెంబడి ఉన్న చిన్నచిన్న వీధుల నిండా తెలుగువాళ్ల నివాసాలే. యాత్రికులే కాదు, స్థిరనివాసాలు ఏర్పర్చుకున్నవేద పండితులు, వ్యాపారులు, పిండప్రదానాలు చేయించే వైదిక పురోహితులు, సామాన్యులు ఎందరో లెక్క అందేది కాదనిపిస్తుంది. కాశీ వీధుల్లో తెలంగాణ, రాయలసీమ, గుంటూరు, శ్రీకాకుళం – ఒకటేమిటి, అన్ని ప్రాంతాల యాసలూ వినిపిస్తాయి. బంధువులతో, స్నేహితులతో బృందాలుగా వచ్చే తెలుగువాళ్ల సంఖ్య, రాకపోకలు ఎంత ఎక్కువంటే, అక్కడ స్టేషన్లో రిక్షావాళ్లు, నదిలో పడవ నడిపేవారు మొదలుకొని, చీరలు, ఇతరత్రా వస్తువులమ్మే దుకాణదారులు, రెస్టారెంట్ల నిర్వాహకుల వరకూ అందరికీ తెలుగు శుభ్రంగా అర్థమవుతుంది. చాలాచోట్ల దుకాణాల పేర్లు కూడా తెలుగులో రాసి పెడతారు. వాళ్లకు తెలుగు అంకెలు అర్థమవుతాయి. వాళ్లకు తెలియదనుకుని తెలుగులో మాట్లాడుకున్నా, బేరాలాడుకుంటే మాత్రం మన పని గోవిందానే. జట్లుగా వెళ్లే యాత్రికుల కోసం పులిహోరలాంటివి కేజీల్లెక్కన చేసిస్తారు. అక్కడి క్షురకులు సైతం ‘గుండూ కావాలా అమ్మా…’ అని పిలుస్తుంటారు.
శతాబ్దాల చరిత్ర లో ఎడతెగని మానవ నివాసం ఉన్న పట్టణంగా కాశీకి ప్రాధాన్యత ఉంది. అక్కడ ఒకప్పుడు పాతిక వేల దేవాలయాలుండేవని, ఇప్పుడు రెండు వేలే ఉన్నాయని యాదవ్ అనే టిఫిన్ సెంటర్ యజమాని కాస్త కించపడుతూ చెప్పాడుగాని, నా మట్టుకు నాకు కాశీపట్టణం మొత్తం ఒక పెద్ద దేవాలయంలాగా అనిపించింది. నాకు అనిపించడమేం పెద్ద విషయం కాదని, అందరూ విశ్వసించేది దాన్నేనని అక్కడ గర్భవాసం చేస్తున్నవాళ్లు చెప్పారు.

మేం కేదార ఘాట్‌కు దగ్గర్లోని కుమారస్వామి మఠంలో బస చేశాం. ఐదు రోజుల పాటు రోజూ ఉదయం గంగాస్నానం, తర్వాత శివదర్శనం.
మణికర్ణికలో మధ్యాహ్నం 12గంటలు దేవతలంతా వచ్చి స్నానం చేస్తారట, అందువల్ల 12.30నుంచి అక్కడకు యాత్రికుల తాకిడి ఎక్కువ. దాంతో పాటు పంచగంగ, కేదార, అసి వంటి కొన్ని ఘట్టాలోనే స్నానానికి ప్రాముఖ్యతనిస్తారు. తీరం వెంబడి లెక్కకందనన్ని ఘట్టాలున్నా కొన్నిటిలో మానవ సంచారం తక్కువ. హరిశ్చంద్రఘాట్‌లో శవదహనాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి కనుక, మామూలు యాత్రికులు అంతగా దృష్టిపెట్టరు. అలాగే నారద ఘాట్‌లో గంగాస్నానం చేస్తే దెబ్బలాటలు వస్తాయని, అటువైపు కూడా తొంగిచూడరు.
పుస్తకాలుగాని, పుణ్యక్షేత్రాలుగాని, ఏవీ మనలో కొత్త భావాల్ని కలిగిస్తాయని, నూతన ఆలోచనలను ఉద్దీప్తం చేస్తాయని నేననుకోను. అవి మనలో ఉన్నవాటినే, జన్మాంతరాల నుండి అట్టడుగున ఉండిపోయినవాటినే ఆ క్షణాల్లో జాగృతం చేస్తాయి. వెలికి తీసుకొస్తాయి.
జైన తీర్థంకరులు, బుద్ధుడు, భక్తి ఉద్యమానికి తొలి బాటలు వేసిన కబీరు, సంత్ రవిదాస్, గురునానక్, ఆదిశంకరాచార్యుడు వంటి ఎంతోమంది గొప్పవ్యక్తులు మునకలేసిన గంగా ప్రవాహంలోనే నేను కూడా ములుగుతున్నానన్న ఊహ నన్ను వివశురాలిని చేసింది! ఒక నదిలో రెండు సార్లు స్నానం చెయ్యలేమన్న మాట గుర్తుంది కాని, అటు భక్తినీ, ఇటు విజ్ఞానాన్నీ ఉద్దీప్తం చేసిన గంగాజలాల్లో మునకలేస్తున్నామన్న ఎరుక ఎంత గొప్పగా అనిపించిందో మాటల్లో చెప్పలేను.
కాశీలో మరణించిన వారికి పునర్జన్మ ఉండదన్న విశ్వాసం మనవాళ్లలో ఉందన్న మాట నిజమేగాని, నాకు కాశీ ఎల్లెడలా కనిపించింది మాత్రం – ఎడతెగని జీవితేచ్ఛే!
అప్రతిహతమైన మానవ జీవితేచ్ఛ ఎంత బలంగా ఉండకపోతే, అన్నిసార్లు, అందరు విదేశీయులు నేలమట్టం చేసిన నగరం ఎన్నోసార్లు తలెత్తుకుని నిలబడుతుంది? అన్నన్ని దేశాలు, రాష్ట్రాల నుంచి అంతంతమందిని ఆకర్షిస్తుంది?
కొన్ని రోజులో, మాసాలో, సంవత్సరాలో అక్కడ నివసిద్దామన్న సంకల్పంతో వెళుతున్న భిన్న సంస్కృతుల జీవుల్లోగాని, తరాల తరబడి అక్కడే జీవనం సాగిస్తున్న వారిలోగాని నిన్న – నేడు – రేపటి గురించిన దిగులు ఒక్క పిసరూ కనిపించలేదు. దేని గురించిన బెంగా లేకుండా నిష్పూచీగా గడిపే ఆ సచ్చిదానంద స్వరూపమే జనాన్ని కాశీ నివాసానికి ఆకర్షిస్తోందేమో అనిపించింది.
‘శివుడు కానివాడు శివుణ్ని పూజించలేడు’ అని పండితులంటారు. ఆ మాట ప్రమాణంగా చూసినప్పుడు – కులమతజాతిలింగ భేదాలకు అతీతంగా పరమశివుడికి తమకు తోచిన రీతిలో గంగాజలాలతో, పాలతో అభిషేకిస్తున్నవాళ్లలో, ఉమ్మెత్త పూలతో పూజ చేస్తున్న అక్కడి జనాలందరూ మన కంటికి శివస్వరూపులుగానే కనిపిస్తారు!
‘నువ్వూ-నేనూ-వాళ్లూ’ అన్న భేదం లేకపోవడమే శివస్వరూపమైతే, అదే చండాలుడు ఆదిశంకరుడికి చేసిన జ్ఞానబోధ అయితే, ఎవరినైనా ఆదరించి పట్టెడన్నం పెట్టడమే అన్నపూర్ణాదేవి ఇచ్చే సందేశమైతే, ఎదుటివాడిని మనలాగా చూడమనడమే విశాలాక్షీదేవి తత్వమైతే – అది కాశీక్షేత్రంలో ఎవ్వరికైనా అనుభవంలోకి వచ్చే సత్యమే. ఎన్నో గోడలతో చీలిపోతున్న నేటి సమాజానికి కావలసిన అత్యవసర సంస్కారం అదేననడంలో సందేహమేముంది?

– అరుణ పప్పు

గంగమ్మతల్లికి కోటి హారతులు…
ఋగ్వేద కాలం నుంచీ ప్రస్తుతింపబడుతున్న కాశీ క్షేత్రంలో చూడాల్సినవెన్నో ఉండొచ్చు కాని, తప్పక చూడవలసింది మాత్రం దశాశ్వమేధఘాట్‌లో సాయంత్ర సమయంలో జరిగే గంగాహారతి. దీపహారతుల వెలుగులు గంగలో ప్రతిఫలిస్తుంటే చూడటం ఒక అద్భుతమైన అనుభవం. ప్రదోషవేళ, గంటల శబ్దంతో ప్రార్థన శ్లోకాలు పఠిస్తూ లయబద్ధంగా చేసే విన్యాసాలు చూస్తున్నప్పుడు ఆకాశంలో శివశక్తులిద్దరూ నాదశరీరులై సంతోషతాండవం చేస్తున్నట్టే అనిపిస్తుంది.


Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.

Advertisements