అద్భుత చిత్రగ్రీవం

మరీ చిన్నప్పుడు,  టీనేజీలో కూడా పుస్తకాల్లోని వర్ణనలు చదవాలంటే చచ్చేంత విసుగొచ్చేది.  ‘సాయంత్రమైంది’ అని చెప్తే చాలదూ, ఆకాశం రంగెలా ఉందో మబ్బులెన్ని రకాలో అవి రచయితకెలా అనిపించాయో చెప్పడం ఎందుకూ నస కాప్పోతే… అనుకునేదాన్ని.  వాటిని ఊహించుకోవాల్సిన స్పేస్ నాకుండాలని, దాన్ని లాక్కుని అంతా వర్ణించెయ్యడానికి వీడెవడు అనిన్నీ అనిపించేది. అందుకని వర్ణనలను దాటేసి నైసుగా తర్వాత పేరాని వెతుక్కుని కథలోకి వెళ్లిపోయేదాన్ని. ఈ పద్ధతి ఎప్పుడు మారిందో గుర్తు లేదుగానీ, ఈమధ్య మాత్రం పుస్తకాల్లో పాత్రలు, సన్నివేశాలు, మిగిలినవాటిని రచయితలు ఎలా వర్ణిస్తున్నారో చాలా శ్రద్ధగా చదువుతున్నాను. వాటి సాయంతో మనోఫలకం మీద ఒక దృశ్యాన్ని చిత్రించుకోవడం సరదాగా కూడా ఉంటోంది. ఈ క్రమంలో నన్ను అమితంగా ఆకట్టుకున్నవి ‘వనవాసి’ ‘చిత్రగ్రీవం’.

హిమాలయాల్లోని అరణ్యాలు, రకరకాల పక్షులు వాటి సంగతులను కళ్లకు కట్టినట్టు వర్ణించే చిన్న నవల చిత్రగ్రీవంలో కథానాయకుడు ఒక పావురం. ఈ పుస్తకం గురించి నా పరిచయం ఇక్కడ చదవొచ్చు. ఆ పుస్తకం చివర్లో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు ఇక్కడ….

మన ఆలోచనలూ, భావాలూ మన ప్రవర్తనను నిర్దేశిస్తాయి. అంత:చేతనలోనయినా సరే – ద్వేషమన్నది మన మనసుల్ని మలిన పరచినట్టయితే మన ప్రవర్తన మీద దాని ప్రభావం ఉండి తీరుతుంది. ఈ రెండు అవలక్షణాలూ ఏదో ఒకనాడు ఏదో ఒక విధంగా మనమీద తమ ప్రభావం చూపిస్తాయి. అంచేత, నా ప్రియ సహోదరులారా ధైర్యంగా జీవించండి, ధైర్యాన్ని శ్వాసించండి. ధైర్యాన్ని మీ పరిసరాల్లో ప్రసరింపజేయండి. ప్రేమశాంతులను గురించి తపించండి. అపుడు పువ్వు తన సుగంధాన్ని పరిసరాల్లో విరజిమ్మినట్టుగా – మీరు మీ చుట్టుపక్కల శాంతి, సమాధానాలను పంచిపెట్టగలుగుతారు.

ఇవేవో ఆధ్యాత్మిక లేదా స్ఫూర్తిదాయక గ్రంధాల్లోని వాక్యాల్లా అనిపించినప్పటికీ, చిత్రగ్రీవం కథ చదివిన తర్వాత వాటి రిలవెన్స్ అర్థమవుతుంది. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన 160 పేజీల ఈ పుస్తకం ధర 30 రూపాయలు. రచయిత ధనగోపాల్ ముఖర్జీ, అనువాదం దాసరి అమరేంద్ర. చిత్రాలు బోరిస్ ఆర్టిజీబషెఫ్. ఇంగ్లిష్లో ఈ పుస్తకం పేరు గే నెక్.

1 thought on “అద్భుత చిత్రగ్రీవం

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి