ఇల్లేరమ్మ ఇంటర్వ్యూ

‘చిన్న పరిశ్రమలు – పెద్ద కథలు’తో రచయిత్రిగా సాహిత్య రంగ ప్రవేశం చేసిన డాక్టర్‌ సోమరాజు సుశీల ‘ఇల్లేరమ్మ కథల’తో ఇంటింటా పరిచయమయ్యారు. సున్నితమైన హాస్యం, వ్యంగ్యం ఆమె కథలను చదివింపజేస్తాయి. దాదాపు ప్రతికథలోనూ కనిపించే మానవతా స్పర్శ, హృదయావిష్కరణ – వాటిని సజీవంచేసి, ‘మన జీవితానుభవమే’ అని పాఠకులు అనుకునేలా చేస్తాయి. లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చిన డాక్డర్‌ సోమరాజు సుశీలతో ‘నవ్య’ ఇంటర్వ్యూ విశేషాలు.

ఇల్లేరమ్మ కథల్లో బాల్యాన్ని అంతగా వర్ణించారు కదా, చిన్నప్పటి నుంచే రాయడం అలవాటుండేదా?
– అస్సల్లేదు.  పైగా రాయడం అంటే మహా బద్దకం కూడాను. నేను పూనాలోని ఎన్‌సీఎల్‌లో కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు ఆంధ్రపత్రికలో ఓ కథ వచ్చింది. పరిశోధన చేస్తున్న విద్యార్థులను గైడ్లు ఎలా వేధిస్తారో అన్నది సరదాగా రాసిన కథాంశం. రాసిందెవరో ఇప్పుడు గుర్తులేదుగానీ, అది బాగా నచ్చి, మా గతీ ఇంతేనంటూ నేను ఆ పత్రికకు ఓ ఉత్తరం రాశాను. అది అచ్చయింది. అదే అచ్చులో వచ్చిన నా తొలి రచన. రాయాలని కూడా తెలీదు నాకు.
తొలికత కమామిషు చెప్పండి..
– నా తొలి కథ ‘మహాశ్రమ’. అందులో జరిగినవన్నీ ఒకేరోజు నా జీవితంలో జరిగాయి. వాటితో విసిగిపోయి ఆ కథ రాసేశాను. పైగా ఆరోజు కొంచెం ఫ్రీగా ఉన్నాను కూడా. చేతిలో డబ్బుల్లేకపోతే ఖాళీగానే ఉంటాం కదా, అలారాసేనది. మర్నాడు ఏదో సెలవు రోజు, మా చెల్లెళ్లు ఇంటికొచ్చారు. వాళ్లకు చదివి వినిపిస్తే బావుందన్నారు. అబ్బూరి ఛాయాదేవిగారు నా స్నేహితురాలు. ఆవిడకు ఫోన్లోనే చదివి వినిపించాను. బావుంది,  ఆంధ్ర జ్యోతి (వారపత్రిక)కి పంపమని ప్రోత్సహించారు. సరే అని పంపిస్తే ఆ వారమే అచ్చు వేసేశారు. అప్పట్లో మేం ప్రారంభించిన ‘భాగ్యనగర్‌ లాబొరేటరీస్‌’ చిన్న పరిశ్రమ. దానికోసం చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్లం. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఎక్కడెక్కడికో వెళ్లి ‘మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి’ అంటూ సమావేశాల్లో అందర్నీ ఆహ్వానించేవారు. ఇక్కడ పెట్టినవాళ్లకేమో ఏ సాయమూ అందక అల్లాడేవాళ్లం. ‘అయినవాళ్లం మహోప్రభో’ కథ అతనిమీదే. తొలి కథ అచ్చయ్యాక చాలా ఉత్తరాలొచ్చాయి. దాంతో ఆంధ్రజ్యోతి వాళ్లు ఫోన్‌ చేసి మా పరిశ్రమ అనుభవాలతో ఇంకొన్ని కథలు రాయమన్నారు. అలా ఆంధ్రజ్యోతిలో ‘చిన్న పరిశ్రమలు – పెద్ద కథలు’ వారంవారం వచ్చేయి, తర్వాత పుస్తకంగా వచ్చేయి.
అసలు పరిశ్రమ పెట్టాలన్న ఆలోచన మీకెలా వచ్చింది?
– నేను విజయవాడ మేరీ స్టెల్లా కాలేజీలో లెక్చరర్‌గా రెండేళ్లు పనిచేశాను. పూనాలోని ఎన్‌సీఎల్‌లో సైంటిస్ట్‌గా 66లో చేరాను. 74 వరకూ అక్కడే. వేరే ఎవరికోసమో పనిచేయడం కన్నా, మన కోసం చేసుకోవడం మంచిదనుకుని నేనూ మావారూ ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇక్కడికొచ్చి భాగ్యనగర్‌ లాబొరేటరీస్‌ ప్రారంభించాం. అప్పటి సరళీకరణ ప్రభావం కూడా కొంత ఉంది.
ఇంతకీ మీ చిన్న పరిశ్రమ ఇన్నేళ్లలో పెద్దదయిందా లేదా?
– మీకో మాట చెబుతాను. ఒక మల్లెతీగనీ, మావిడిమొక్కనీ నాటామనుకోండి. రెండూ పెద్దవుతాయి. అలాగని పెరిగిపెరిగి మల్లెతీగ మావిడి చెట్టంత పెద్దది అవదుగదా! అలాంటివే చిన్న పరిశ్రమలూ, పెద్ద పరిశ్రమలూ. చిన్న పరిశ్రమలు నిలబడతాయి, బాగా నడుస్తాయి. దేశదేశాలకు శాఖోపశాఖలుగా విస్తరించే సంస్థలతో వాటిని పోల్చుకోకూడదు మనం. మా చిన్నపరిశ్రమ (హైదరాబాద్‌ బాలానగర్‌లో ఉంది) ఇప్పుడు బాగా నడుస్తోంది. మా అబ్బాయి చూసుకుంటున్నాడు, మావారు రోజూ వెళతారు. నేను అప్పుడప్పుడూ వెళుతుంటా.
ఇల్లేరమ్మ కథల గురించి…
– మన తెలుగు సాహిత్యంలో చాలామంది అబ్బాయిల బాల్యం ఎలా ఉంటుందో తెలిపేలా కథలు వచ్చాయి. ముళ్లపూడి ‘బుడుగు’ వంటివి. అదే ఆడపిల్లల బాల్యం ఎలా ఉండేదో తెలిపేలా రచనలేమీ రాలేదు. అది చెబుతూ నామిని నా చిన్నతనం గురించి రాయమన్నారు. అలా ప్రారంభమయ్యాయి ‘ఇల్లేరమ్మ కథలు’. మొత్తం 24 వారాలు. మంచి స్పందన వచ్చింది. జీవితాల్లో ఇప్పుడున్నంత టెన్షను మా చిన్నప్పుడు లేదు. ప్రపంచాన్నేదో మార్చేద్దాం అన్న ధోరణి అప్పటి పిల్లలకు లేదు. సమాజం, ఇరుగుపొరుగులు అంతా పిల్లలను సహజంగా పెరిగేలా ఉంచేవారు, అందరూ ప్రేమగా చూసేవారు. అందువల్లనే అప్పటి పిల్లల్లో అమాయకత్వం పాళ్లెక్కువ. ఇప్పుడు అవకాశాలు పెరిగాయి, అలాగే పోటీ కూడా పెరిగింది.
చిన్నప్పుడు సాహిత్యం చదివేవారా?
– ముందునుంచీ సైన్సు స్టూడెంటును కావడం వల్ల సాహిత్యం లోతుగా చదవలేదు. తెలుగు ఫర్లేదుకానీ, ఇంగ్లిషు అస్సలు చదవలేదు. మాలతీచందూర్‌ రాసే నవలా పరిచయాలు మాత్రం తప్పకుండా చదివేదాన్ని. ఎందుకంటే మా చెల్లి చిన్నారి పూర్తి పుస్తకాలే చదివేది. ఆమెతో వాటి గురించి మాట్లాడటానికి నాకీ పరిచయాలు పనికొచ్చేవి.
మీ ప్రతి కథలోనూ సొంత జీవితానుభవం ఉన్నట్టే అనిపిస్తుంది..
– అవును. కథల్లోని ప్రతి సంఘటనా అక్షరం అక్షరం జరిగింది జరిగినట్టుగా రాయలేదుగానీ, కథలకు ప్రేరణ మాత్రం కొన్ని చూసినవి, మరికొన్ని విన్నవి. కొన్నిటిని ఎగ్జాగరేట్‌ చేశాను, కొన్నిచోట్ల నిజాలు చెప్పలేదు. ప్రేరణ మాత్రం జీవితంలోనిదే. నాకు పెద్ద శత్రువు బద్దకం. ఎవడు రాస్తాడులే అన్న బద్దకమే లేకపోతే ఇంకా చాలా రాసేదాన్ని. తప్పనిసరయినప్పుడు తప్ప రాయలేదు నేను.
వీటివల్ల మీ కుటుంబ సంబంధాలేమీ ప్రభావితం కాలేదా?
– ఇల్లేరమ్మ కథలు వస్తున్నప్పుడు బంధువులు కొందరు మా చెల్లి చిన్నారితో ‘చూడు, నిన్నో విలన్లా చిత్రీకరిస్తోంది సుశీల’ అని చెప్పేవారు. కానీ వాటివల్ల మా ఇద్దరి అనుబంధంలో ఇబ్బందులే ం రాలేదు. ఇక రచనలో మా అత్తగారి ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. జీవితంలో నాకే కష్టమూ తెలియకుండా కాచుకున్నారావిడ. దేశంలో అత్తగార్లందరూ ఆవిడలాగా ఉంటే అసలు ఇబ్బందులే రావు.
మీరు ఆధ్యాత్మిక రచనలు కూడా చేశారు, వాటి నేపథ్యం ఏమిటి?
– లక్ష్మీబాయ్‌ కేళ్కర్‌ అనే మహిళ  మరాఠీలో రామాయణాన్ని ప్రవచనాలుగా చెప్పేవారు. ఆ శైలి ఎంతో బాగుంటుంది. అందుకే వాటిని తెలుగులో ‘పథదర్శిని శ్రీరామకథ’ అని రామాయణాన్ని రాశాను. లోకమాన్య బాలగంగాధరతిలక్‌ మునిమనవరాలు ప్రొఫెసర్‌ సింధు నవలేకర్‌ తర్కం, తత్వజ్ఞానాల్లో పండితురాలు. ఆమె ప్రవచనాలను అనువదిస్తూ ‘ధర్మ విజయం’ అంటూ మహాభారత కథను రాశాను. భారతీయులందరూ భారత, రామాయణాలు ఒక్కసారైనా చదవాలి.
ఇప్పుడొస్తున్న కథల మీద మీ అభిప్రాయం? మీ భవిష్యత్‌ ప్రణాళికలు?
– మంచి సాహిత్యం సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తుంది. ఇప్పుడొస్తున్న మంచి కథలు ఆ పనే చేస్తున్నాయి. కె. వరలక్ష్మి, గంటి భానుమతి వంటి వారి కథలు చదువుతుంటాను. చాలాకాలం బద్దకించిన తర్వాత ‘దీపశిఖ’ కథల పుస్తకాన్ని తీసుకొచ్చాను. బద్దకించకుండా మరిన్ని కథలు రాయాలనుకుంటున్నా.
మీకున్న వ్యసనం ఏమిటి?
– తిరగడం. ప్రతిఏటా దాదాపు యాభైమంది స్నేహితులం, అంతా ఆడవాళ్లమే కలిసి విహారయాత్రకు వెళుతుంటాం. ఒకోసారి ఒకొక్క రాష్ట్రం చొప్పున చూస్తుంటాం. అలా చాలానే చూశాం. అంతా దాదాపు ఒకటే వయసులో ఉంటాం కనుక సమస్యలేవీ రావు.
ఇల్లేరమ్మ కాస్తా ఊళ్లేరమ్మ అయిందన్న మాట.
– అవును. అదే నా హాబీ, వ్యసనం. నేను కాలు బైటపెట్టకుండా ఇంట్లో ఉండగలిగే మ్యాక్జిమమ్‌ సమయం 24 గంటలు. ఇదిగాకుండా సంస్కృతి పరిరక్షణ గురించి మాట్లాడటానికి కూడా చాలా ఊళ్లు, ప్రదేశాలు తిరుగుతుంటాను.
కొన్ని విచిత్రమైన అలవాట్లు?
– నాకు షాపింగ్‌ అంటే అసహ్యం. దేనికోసమూ ఎప్పుడూ బజారుకు వెళ్లను. నా చీరలన్నీ ఇంటిదగ్గరకు వచ్చినవాళ్ల దగ్గర కొన్నవే. కంచి పట్టుచీరలు మొదలుకొని ఏ రకమైనా మా గుమ్మానికే వస్తుంది.

నచ్చినవి
సినిమా : మిస్సమ్మ (పాతది)
హీరో : సిద్దార్థ, రవితేజ
హీరోయిన్‌ : జెనీలియా
సంగీతం : ఆహ్లాదంగా అనిపించేదేదైనా
గాయని : కిశోరీ అమోంకర్‌, పర్వీన్‌ సుల్తానా
గాయకులు : బాలకృష్ణప్రసాద్‌
ప్రదేశం : గుజరాత్‌లోని సోమనాధ్‌ దేవాలయం, ద్వారక
ఆహారం : పిజా
నవల : విశ్వనాధ సత్యనారాయణ గారి సప్తపర్ణి, అడవి బాపిరాజు హిమబిందు
కథ : కొ.కు. రాసిన అనుభవం
కథకులు : కొడవటిగంటి కుటుంబరావు
రచయిత : రావిశాస్త్రి
స్నేహితులు : మా ఆయనే

1 thought on “ఇల్లేరమ్మ ఇంటర్వ్యూ

  1. Pingback: 2011- నా తెలుగు పుస్తక పఠనం | పుస్తకం

మీ అభిప్రాయాన్ని తెలియజెయ్యండి